ఒకే పరీక్షతో.. చదువు, శిక్షణ, ఉద్యోగం.. | NDA And NA Examination ational Defence Academy in Pune | Sakshi
Sakshi News home page

ఒకే పరీక్షతో.. చదువు, శిక్షణ, ఉద్యోగం..

Published Thu, Jun 26 2014 2:53 AM | Last Updated on Fri, Oct 19 2018 7:10 PM

ఒకే పరీక్షతో.. చదువు, శిక్షణ, ఉద్యోగం.. - Sakshi

ఒకే పరీక్షతో.. చదువు, శిక్షణ, ఉద్యోగం..

 ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ ఎగ్జామినేషన్ ద్వారా పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో ప్రవేశం పొందొచ్చు. తద్వారా ఒక చేత్తో డిగ్రీ పట్టా.. మరో చేత్తో కమిషన్డ్ ర్యాంకు అధికారిగా అపాయింట్‌మెంట్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ఎన్‌డీఏ 134వ కోర్సు, ఇండియన్ నావల్ అకాడమీ 96వ కోర్సులోకి ప్రవేశం కల్పిస్తారు. ఇవి 2015, జూలై 2 నుంచి ప్రారంభమవుతాయి.  మొత్తం ఖాళీలు: 375 ఎన్‌డీఏ: 320 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-70)
 నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 55
 
 ప్రవేశ విధానం:
 రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్(ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ) దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు 1800 మార్కులు కేటాయించారు. ఇందులో రాత పరీక్ష 900 మార్కులకు, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ 900 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరయ్యేందుకు అనుమతిస్తారు.
 
 రాత పరీక్ష:
 రాత పరీక్షను మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్/హిందీ భాషల్లో రూపొందిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. అవి..
 పేపర్    ప్రశ్నలు    మార్కులు    సమయం
 మ్యాథమెటిక్స్    120    300    150 ని.
 జనరల్ ఎబిలిటీ టెస్ట్    150    600    150 ని.
 
 మొత్తం    900
 జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు పేపర్లు ఉంటాయి. పార్ట్-ఎ ఇంగ్లిష్ పేపర్, పార్ట్-బి జనరల్ నాలెడ్జ్ పేపర్. రెండు పేపర్లలో కలిపి అడిగే 150 ప్రశ్నల్లో ఇంగ్లిష్ నుంచి 50, జనరల్ నాలెడ్జ్ నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. పార్ట్-ఎ ఇంగ్లిష్ పేపర్‌కు 200 మార్కులు, పార్ట్-బి జనరల్ నాలెడ్జ్ పేపర్‌కు 400 మార్కులు కేటాయించారు.
 
 క్లిష్టత మేరకు మార్కులు:
 సబ్జెక్ట్ క్లిష్టత మేరకు ప్రశ్నలకు మార్కులను కేటాయిస్తారు. ఈ క్రమంలో సరైన సమాధానాలకు మ్యాథమెటిక్స్‌లో 2.5 మార్కులు, ఇంగ్లిష్‌కు 4 మార్కులు, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు 4 మార్కులు ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ఇందులో కూడా ఆయా సబ్జెక్ట్‌లను బట్టి నెగిటివ్ మార్కింగ్ ఇస్తారు. తప్పు సమాధానాల విషయంలో మ్యాథమెటిక్స్ విభాగంలో 0.83 మార్కులు, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ విభాగాల్లో 1.33 మార్కు కోత విధిస్తారు.
 ప్రిపరేషన్ ప్లాన్
 
 మ్యాథమెటిక్స్:
 మ్యాథమెటిక్స్‌లో అర్థమెటిక్, మెన్సురేషన్, ఆల్జీబ్రా, జ్యామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఇంటిగ్రల్ కాలిక్యులస్- డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ప్రొబబిలిటీ, స్టాటిస్టిక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థిలోని అవగాహన స్థాయిని, ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. ప్రతిసారీ ప్రశ్నల క్లిష్టత 12వ తరగతి, సీబీఎస్‌ఈ స్థాయిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఆయా అంశాల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో సమస్యలను వేగంగా సాధించే చిట్కాలను నేర్చుకోవాలి. సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. కాబట్టి ప్రాక్టీస్‌లో అన్ని అంశాలపై దృష్టి సారించడం ప్రయోజనకరం. ముఖ్యంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ప్రతి సారి ప్రశ్నలు ఇస్తున్నారనే విషయాన్ని గమనించాలి. ఆల్జీబ్రా, జ్యామెట్రీ అంశాలు చక్కని స్కోరింగ్‌కు దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలకు ప్రాక్టీస్‌లో ప్రాధాన్యతనివ్వాలి. మరో ముఖ్య విషయం.. గత పేపర్లను విధిగా ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా అందులోని ప్రశ్నలను నిమిషంలో సాధించేలా ప్రిపరేషన్ సాగించాలి.
 
 జనరల్ ఎబిలిటీ టెస్ట్:
 ఇంగ్లిష్ (పార్ట్-ఎ): ఇంగ్లిష్ భాషపై కనీస పరిజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలనే ఎక్కువగా అడుగుతారు. ఈ క్రమంలో ఎక్కువగా యూసేజ్, వొక్యాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి రోజు కొత్తగా 15 నుంచి 20 పదాలు నేర్చుకోవడం, షార్ట్ స్టోరీస్ చదవడం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ అభ్యసనం, చిన్నపాటి ప్యాసేజ్‌లను చదివి వాటిలో ప్రశ్నలు అడగటానికి ఆస్కారం ఉన్న వాటిని గుర్తించడం ద్వారా ఈ విభాగంలో రాణించవచ్చు. చాలా మంది యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ విషయంలో తప్పులు చేస్తుంటారు. కాబట్టి ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఎర్రర్ ఫైండింగ్, అన్ జంబ్లింగ్ అంశాల నుంచి ప్రతి సారీ ప్రశ్నలు ఉంటున్నాయనే విషయాన్ని గమనించాలి.
 
 జనరల్ నాలెడ్జ్ (పార్ట్-బి): ఈ విభాగం పలు సబ్జెక్ట్‌ల కలయికగా ఉంటుంది. ఇందులో ఫిజిక్స్ (సెక్షన్-ఎ), కెమిస్ట్రీ (సెక్షన్-బి), జనరల్ సైన్స్ (సెక్షన్-సి), ఇండియన్ హిస్టరీ-భారత స్వాతంత్య్రోద్యమం-సివిక్స్ (సెక్షన్-డి), జాగ్ర ఫీ (సెక్షన్-ఈ), కరెంట్ ఈవెంట్స్ (సెక్షన్-ఎఫ్) అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. వీటికి మొత్తం 400 మార్కులు కేటాయించారు. ఇందులో వేర్వేరు సబ్జెక్ట్‌లకు వేర్వేరు మార్కులను నిర్దేశించారు. ఈ క్రమంలో ఫిజిక్స్ నుంచి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. కెమిస్ట్రీ నుంచి 60 మార్కులు, జాగ్రఫీ నుంచి 80 మార్కులు, జనరల్ సైన్స్ నుంచి 40 మార్కులు,
 
  హిస్టరీ, స్వాతంత్య్రోద్యమం అంశాల నుంచి 80 మార్కులు, కరెంట్ ఈవెంట్స్ నుంచి 40 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. జనరల్ నాలెడ్జ్ పేపర్‌ను పరిశీలిస్తే మొత్తం మీద.. 50 శాతం ప్రశ్నలు సైన్స్ విభాగం నుంచే వస్తాయి. ఈ విభాగంలో ప్రశ్నలు.. ఆయా అంశాలపై అభ్యర్థుల ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ఉంటాయి. మ్యాథ్స్/సైన్స్ అభ్యర్థులు జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, కరెంట్ ఈవెంట్స్ అంశాలను నిర్లక్ష్యంచేస్తుంటారు. అలా కాకుండా వీటిపై కూడా దృష్టి సారిస్తే  స్కోర్‌ను మరింత పెంచుకోవచ్చు.మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాలకు సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ 8 - 12వ తరగతి పుస్తకాలను చదవాలి.బయాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ కోసం ఎన్‌సీఈఆర్‌టీ 10వ తరగతి పుస్తకాలను చదవాలి.
 జనరల్ సైన్స్‌లో బయాలజీ, పర్యావరణం వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిని సమకాలీన సంఘటనలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి.
 
 హిస్టరీ, సివిక్స్ అంశాల ప్రిపరేషన్‌లో భారతదేశ సంబంధిత అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. భారత రాజ్యాంగంపై ప్రాథమిక అవగాహన ఉండాలి. భారత స్వాతంత్య్రోద్యమానికి సంబంధించి కీలక నాయకులు, ముఖ్య సంఘటనలు, సమావేశాలు- అధ్యక్షులు, సంవత్సరాలు వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. జాగ్రఫీలో ప్రధానంగా భూమి లక్షణాలు, భారతదేశ వాతావరణ పరిస్థితులపై ప్రశ్నలు ఉండొచ్చు.  కరెంట్ ఈవెంట్స్ విషయానికొస్తే.. గత రెండేళ్ల వరకు అన్ని రంగాల్లోని కీలక సంఘటనలను తెలుసుకోవాలి. ఇందుకోసం ప్రతి రోజూ ఏదైనా ఒక ప్రామాణిక దినపత్రికను లేదా ఫ్రంట్‌లైన్ వంటి మ్యాగజీన్లు, ఇండియా ఇయర్ బుక్ వంటి పుస్తకాలను చదవాలి.
 
 ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ:
 రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్వీసెస్ సెలక్షన్ బోర్‌‌డ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఐదు రోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో అభ్యర్థికున్న మానసిక ధ్రుడత్వాన్ని పరిశీలిస్తారు. మొత్తం 900 మార్కులకు  వివిధ రకాల పరీక్షలను నిర్వహిస్తారు. అవి.. ఇంటెలిజెన్స్ టెస్ట్, వెర్బల్ టెస్ట్, నాన్ వెర్బల్ టెస్ట్: అభ్యర్థిలో సామాజిక అంశాలపై అవగాహనను, తార్కిక విశ్లేషణ శక్తిని ఈ పరీక్షల్లో పరిశీలిస్తారు.పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్: ఈ విభాగంలో ఒక ఇమేజ్(పటం)ను చూపించి దానికి సంబంధించిన సముచిత స్టోరీని రాయమంటారు. ఇందులో రాణించడానికి ప్రధాన మార్గం కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ థింకింగ్‌ను పెంచుకోవడమే.సైకలాజికల్ టెస్ట్: ఈ టెస్ట్ మరో నాలుగు విభాగాల్లో జరుగుతుంది. అవి.. వర్డ్ అసోసియేషన్, పిక్చర్ స్టోరీ టెస్ట్, సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్, సెల్ఫ్ డిస్క్రిప్షన్. మెడికల్ టెస్ట్: మొదటి రెండుదశల్లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఫిట్‌నెస్ నిరూపించుకున్న అభ్యర్థులకు ఎన్‌డీఏలో ప్రవేశం లభిస్తుంది.
 
 కెరీర్
 విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధదళాల్లో... వరుసగా లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ కేడర్‌తో ఆఫీసర్ స్థాయి కెరీర్ ప్రారంభమవుతుంది. పూర్తి కాలం సర్వీస్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ  సంబంధిత విభాగంలో మేజర్ జనరల్/రేర్ అడ్మిరల్/ ఎర్ వైస్ మార్షల్ స్థారుుకి తప్పకుండా చేరుకుంటారు. విభాగాల వారీగా పరిశీలిస్తే..ఆర్మీ: లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ ప్రారంభించి అత్యున్నత స్థానమైన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ వరకు చేరుకునే అవకాశం ఉంది. సర్వీసు ప్రకారం వీరు కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడ్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హోదాలు లభిస్తాయి.
 
 నేవీ: ప్రారంభ స్థాయి అయిన సబ్‌లెఫ్టినెంట్ నుంచి విశిష్ట హోదా అయిన అడ్మిరల్ వరకు చేరుకునే అవకాశం ఉంది. సర్వీసు నిబంధనలకనుగుణంగా లెఫ్టినెంట్,లెఫ్టినెంట్ కమాండర్,కమాండర్,కెప్టెన్,కమడోర్, రేర్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్(వీసీఎన్‌ఎస్) హోదాలను చేరుకొవచ్చు.ఎయిర్‌ఫోర్స్: ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభమవుతంది. తర్వాత అవకాశాన్ని బట్టి అత్యున్నత హోదా ఎయిర్ చీఫ్ మార్షల్ స్థాయిని కూడా చేరుకోవచ్చు. సర్వీసుకు అనుగుణంగా ఫ్లైయింగ్ లెఫ్టినెంట్, స్క్వాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్, గ్రూప్ కెప్టెన్, ఎయిర్ కమాండర్, ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ మార్షల్, ఎయిర్ మార్షల్ (వీసీఎన్‌ఎస్) హోదాలను చేరుకొవచ్చు.
 
 వేతనాలు:
 ఎన్‌డీఏ శిక్షణ సమయంలో నెలకు రూ. 21,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత జీతం రూపంలో నెలకు రూ. 35,000 వరకు లభిస్తాయి. వీటికి అలవెన్సులూ కలుపుకుంటే రూ. 45,000 జీతంతో కెరీర్ మొదలవుతుంది. క్యాంటీన్, వసతి, ఆహార సామగ్రి, ఉచిత భోజనం, ఉచిత రైలు, విమాన ప్రయాణాలు, పిల్లలకు ఉచిత చదువులు, ఇన్సూరెన్స్ కవరేజ్...వంటి సదుపాయాలు అదనం. ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్ ఏ విభాగంలో చేరిన వేతనాల్లో వ్యత్యాసాలుండవు.
 
 శిక్షణ ఇలా
 ఎన్‌డీఏలో అడుగుపెట్టిన విద్యార్థులకు రెండున్నరేళ్లపాటు క్లాస్ రూం ట్రైనింగ్.. ఫీల్డ్ ట్రైనింగ్ ఇస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు వారి సబ్జెక్టులకు అనుగుణంగా ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బీఎస్సీ, బీఏ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. ఇందుకోసం ఎన్‌డీఏలో ప్రవేశ సమయంలోనే విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న డిగ్రీని తెలియజేయాలి. ఎయిర్‌ఫోర్స్, నేవీ, నావల్ అకాడమీ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులు బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్/కెమిస్ట్రీ) కోర్సును ఎంచుకోవచ్చు. ఆర్మీ గ్రూప్ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులు బీఏలో హిస్టరీ/జాగ్రఫీ/ ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్‌ల్లో నచ్చిన మూడు ఆప్షన్లను తీసుకోవచ్చు.
 
 అకాడమీలో అన్ని విభాగాల వారికీ శిక్షణ ఒకే పద్ధతిలో ఉంటుంది. రక్షణ దళాల అవసరాలకనుగుణంగా శారీరక శిక్షణతోపాటు వర్క్‌షాప్, ఏరియూ స్టడీ, మిలిటరీ హిస్టరీలను సిలబస్‌తోపాటు బోధిస్తారు. ఎయిర్‌ఫోర్స్ వింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్)లో ఏడాది, ఆర్మీ వింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు (ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్)లో ఏడాది, నావల్ అకాడమీ ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలాలో శిక్షణనిస్తారు. దరఖాస్తు సమయంలో నావల్ అకాడమీ (ఎజిమలా) ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌కు తొలి ప్రాధాన్యమిస్తే.. ఆ అభ్యర్థులకు విడిగా ఎజిమలాలో నాలుగేళ్ల శిక్షణనిస్తారు. ఆ శిక్షణ పూర్తి చేసుకుంటే బీటెక్ డిగ్రీ కూడా అందజేస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత త్రివిధ దళాల్లో క్లాస్-1 కమిషన్డ్ అధికారి హోదాలో కెరీర్ ప్రారంభించవచ్చు.
 
 నోటిఫికేషన్ సమాచారం
 అర్హత:ఆర్మీ వింగ్: ఇంటర్మీడియెట్ లేదా 10+2/తత్సమానం ఎయిర్‌ఫోర్స్-నావల్ వింగ్స్: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లుగా ఇంటర్మీడియెట్ లేదా 10+2/తత్సమానంచివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. అయితే నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీ నాటికి సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి. వయసు: 1996, జనవరి 2-1999 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 21, 2014.
 రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 28, 2014
 వివరాలకు: www.upsc.gov.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement