ఓ నిజజీవిత స్త్రీ మూర్తి కథ
‘‘లైంగిక వేధింపులకు గురవుతూ నరకప్రాయంగా జీవితాన్ని సాగిస్తున్న పన్నెండు వేల మంది స్త్రీలను ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకొచ్చాన్నేను. ఆ క్రమంలో నేను చూసిన ఓ స్త్రీ జీవితం ఆధారంగా ‘నా బంగారు తల్లి’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇది అవార్డుల కోసం తీసిన సినిమా కాదు’’ అని నిర్మాతల్లో ఒకరైన సునీతా కృష్ణన్ అన్నారు. ఎం.ఎస్.రాజేశ్‌తో కలిసి, రాజేశ్ టచ్‌రివర్ దర్శకత్వంలో ఆమె నిర్మించిన చిత్రం ‘నా బంగారు తల్లి’. అంజలీ పాటిల్, సిద్ధిఖీ, లక్ష్మీమీనన్, రత్న శేఖర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సునీతా కృష్ణన్ మాట్లాడుతూ -‘‘మూడు జాతీయ అవార్డులు, అయిదు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న సినిమా ఇది. చిరంజీవి ఈ సినిమా చూసి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని మాట ఇచ్చారు. ఈ సినిమా విడుదలకు ఇబ్బంది పడుతుంటే, అమల ‘క్రౌడ్ ఫండింగ్’ ద్వారా ప్రయత్నించమని సలహా ఇచ్చారు. దాంతో రూ. 32 లక్షలు పోగయ్యాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఏకంగా 12 లక్షల రూపాయలు ఇచ్చారు’’ అని తెలిపారు.