Anjali Patil
-
కేటుగాళ్ల దెబ్బకు మోసపోయిన అవార్డ్ విన్నింగ్ తెలుగు హీరోయిన్
ప్రముఖ నటి మోసపోయింది. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి, నిమిషాల్లో లక్షలు పోగొట్టేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. సామాన్యులు, దీనిపై పెద్దగా ఐడియా లేనివాళ్లు మోసపోయారంటే అనుకోవచ్చు. కానీ మంచి సినిమాలు చేస్తూ అవార్డులు గెలుచుకున్న ఈ నటి కూడా కేటుగాళ్ల వలలో పడి బోల్తా కొట్టేసింది. ఇంతకీ ఏం జరిగింది? తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి పాటిల్. తెలుగులో 'నా బంగారు తల్లి' సినిమాలో లీడ్ రోల్ చేసి చాలా పేరు తెచ్చుకుంది. నంది అవార్డు కూడా గెలుచుకుంది. దీని తర్వాత టాలీవుడ్లో మరో మూవీ చేయలేదు. ప్రస్తుతానికి హిందీ, మరాఠీలో చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. అయితే తాజాగా ఈమెకి డిసెంబరు 28న దీపక్ శర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫెడ్ ఎక్స్ ఉద్యోగి అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఈమె పేరుతో ఉన్న ఓ పార్సిల్, డ్రగ్స్‌తో తైవాన్‌లో పట్టుబడిందని అన్నాడు. పార్సిల్‌లోనే ఆధార్ కార్ట్ కాపీ ఉందని చెప్పాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) లక్షలు నష్టపోయింది! తన ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయ్యే అవకాశముందని భయపడిన అంజలి పాటిల్.. ముంబయి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని సంప్రదిస్తానని సదరు వ్యక్తితో చెప్పింది. ఇలా జరిగిన కాసేపటికే సైబర్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నానని బెనర్జీ అనే వ్యక్తి.. అంజలికి కాల్ చేశాడు. మీ ఆధార్ కార్డ్.. మూడు బ్యాంక్ ఖాతాలకు కనెక్ట్ అయ్యిందని, అవి మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కుని ఉన్నాయని కాస్త భయపెట్టాడు. ప్రొసెసింగ్ ఫీజ్ అని చెప్పి రూ.96,525 పంపాలని అంజలికి చెప్పగా, ఆమె వెంటనే ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం రూ.4,83,291 డబ్బు పంపాలని అన్నాడు. అలా డబ్బులు పంపేసిన కాసేపటికి నటి అంజలి పాటిల్.. తాను మోసపోయాననే విషయాన్ని గ్రహించింది. మొత్తంగా రూ.5.79 లక్షల వరకు అంజలి నష్టపోయింది. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా పేరున్న నటి.. సైబర్ కేటుగాళ్ల వలలో పడి మోసపోవడం హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: షూటింగ్లో గొడవ.. తెలుగు యంగ్ హీరో కారుని అడ్డుకున్న కూలీలు) -
యాక్సిడెంటల్ యాక్ట్రెస్.. శ్రీలంకన్ చిత్రంలో తొలి ఛాన్స్
ఈ ఫొటోలోని నటిని చూడగానే ఓ తెలుగు సినిమా గుర్తొచ్చుండాలి కదా! అవును..మీరనుకుంటున్నది కరెక్టే.. ‘నా బంగారు తల్లి’ సినిమానే! ఆమె పేరు అంజలి పాటిల్. నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ఆమే ఓ చిరునామా! ఇటు సిల్వర్ స్క్రీన్.. అటు వెబ్ స్క్రీన్.. రెండింటిలోనూ తన అప్పియరెన్స్‌ను స్థిరం చేసుకుంది. మరిన్ని వివరాలు.. ► అంజలి పుట్టింది, పెరిగింది మహారాష్ట్రలోని నాసిక్‌లో. పుణె యూనివర్సిటీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో గోల్డ్‌మెడల్ అందుకుంది. తర్వాత ఢిల్లీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్నెస్డీ)లోనూ చేరి దర్శకత్వంలో శిక్షణ పొందింది. ► మన దేశంలో ఆమెకు మొదటి అవకాశం ఇచ్చిన సినిమా ‘డెల్హీ ఇన్ ఎ డే’. దీంతో ఆమెకు ఎనలేని గుర్తింపు వచ్చింది. ► అయితే కమర్షియల్ సక్సెస్‌ను ఇచ్చిన చిత్రం మాత్రం ప్రకాశ్ ఝా ‘చక్రవ్యూహ్’. ఇందులో ఆమె మావోయిస్ట్ నేత జుహూగా నటించింది. ఈ సినిమా తర్వాత వరుసగా అన్నీ అలాంటి పాత్రలే రావడంతో అన్నిటినీ తిరస్కరించింది. ► ఎన్నెస్డీలో ఉన్నప్పుడే అంజలి నటనా కౌశలం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తొలి సినిమా అవకాశం కూడా విదేశాల నుంచే వచ్చింది. అది శ్రీలంకన్ చిత్రం.. విత్ యూ.. వితవుట్ యూ (దర్శకుడు ప్రసన్న విథంజే). అన్నట్టు అంజలి బౌద్ధమతాన్ని పాటిస్తుంది. ► అంజలి నటే కాదు.. నిర్మాత కూడా..‘గ్రీన్ బ్యాంగిల్స్’ అనే మూవీతో. ► సినిమా తెర మీదే కాదు ‘మై డియర్ ప్రైమ్ మినిస్టర్’, ‘మై క్లయింట్ వైఫ్’, ‘మేరీ నిమ్మో’, ‘కౌన్ ప్రవీణ్ తాంబె’ వంటి వెబ్ మూవీస్‌లోనూ తన అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ► పుస్తకాలు, ప్రయాణాలంటే ఇష్టం. నిజానికి నేను నటిని కావాలని అనుకోలేదెప్పుడు. నేను శిక్షణ తీసుకుంది కూడా దర్శకత్వంలో. యాక్సిడెంటల్‌గా యాక్ట్రెస్నయ్యాను. – అంజలి పాటిల్ -
అవమానపడాల్సింది అమ్మకాదు
నలుగురు చులకన చేశారు..ఓ దుర్మార్గుడు తప్పు చేశాడు..అవకాశం ‘సిస్టమ్’ ఇచ్చింది..సిగ్గుపడాల్సింది సమాజం.. రక్షణ కట్టాల్సింది పరిరక్షకులే!ఇదీ ఓ కొడుకు రిక్వెస్ట్.. ‘‘ప్రియమైన ప్రధానమంత్రిగారూ.. అవమాన పడాల్సింది మా అమ్మ కాదు.. టాయ్‌లెట్ ఇవ్వాల్సింది మీరు..’’న్యూ ఢిల్లీ.. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్..‘‘ఎవరు మీరు?’’ ‘‘నా పేరు కన్హయ్య..’’ ‘‘నా పేరు రింగ్‌టోన్’’‘‘ఆ..’’ ఎవరు మీరు అని అడిగిన వ్యక్తి మొహంలో ఆశ్చర్యం!అదేమీ పట్టించుకోకుండా రింగ్‌టోన్ పక్కనున్న పిల్లోడు చెప్పాడు తన పేరును ‘‘నిరాలా’’ అని.‘‘ఇక్కడ మీకేం పని?’’ అదే ఆశ్చర్యంతో ఆ వ్యక్తి. ‘‘ప్రైమ్‌మినిస్టర్ సర్ని కలవాలి’’ కన్హయ్య. ‘‘ఎందుకు?’’‘‘ఈ లెటర్ ఇవ్వాలి’’ ఓ కాగితం అతని చేతిలో పెడుతూ కన్హయ్య. ‘‘మీరు ప్రైమ్మినిస్టరా?’’ అడిగాడు నిరాలా.. అతణ్ణి.కాదన్నట్టుగా అడ్డంగా తలూపాడు అతను. ‘‘అయితే ఇది ప్రైమ్మినిస్టర్కే ఇవ్వాలి’’ టక్కున అతని చేతిలోంచి ఆ ఉత్తరం లాక్కున్నాడు నిరాలా. అతను నవ్వుతూ.. ‘‘చూడండి... ఏదైనా సిస్టమ్ ప్రకారం వెళ్లాలి’’ అంటాడు.‘‘ఎక్కడ దొరుకుతాడు?’’ నిరాలా. ‘‘ఎవరు?’’ ‘‘అతనే.. మిస్టర్ సిస్టమ్’’చాలా కాన్ఫిడెంట్‌గా నిరాలా. ఆ అమాయకత్వానికి ఏం జవాబు చెప్పాలో తెలియదు అతనికి. ఆ ఉత్తరం తీసుకొని అది ప్రైమ్‌మినిస్టర్‌కు అందేలా చూస్తానని భరోసా ఇస్తాడు ఆ పిల్లలకు. ‘‘మా పని అయిపోతుందా?’’ ఆత్రంగా కన్హయ్య. ‘‘ప్రైమ్‌మినిస్టర్‌కు మీదొక్కటే సమస్య కాదుకదా.... అలాంటివి బోలెడు ఉంటాయి. అన్నీ చూడాలి.. చూస్తారు’’అని సర్దిచెప్పి పంపించేస్తాడు ఆ పిల్లలను. ‘‘మేరే ప్యారే ప్రైమ్‌మినిస్టర్’’ లోనిది ఆ సన్నివేశం. ముంబై స్లమ్స్‌లోని టాయ్లెట్ల సమస్య మీద తీసిన సినిమా. వినగానే ‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథా’, ‘హల్కా’ మూవీస్ గుర్తొస్తాయి. చూస్తే మాత్రం వాటికి డిఫరెంట్ ఈ సినిమా అని అనిపిస్తుంది. స్లమ్స్‌లోని మహిళల భద్రత, రక్షణలేమిని ఫోకస్ చేసింది. విడుదలైన విషయం తెలిసేలోపే రీల్ చుట్టేశాయి థియేటర్లు. కాని నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. చూడొచ్చు. కథలోకి వద్దాం... ఎనిమిదేళ్ల పిల్లాడు కన్హయ్య. తల్లి సర్గమ్తో కలిసి ఉంటూంటాడు.. ముంబైలోని ఒక స్లమ్‌లో. పదహారేళ్లకు ప్రేమలో పడి.. ప్రేమించిన వాడిని నమ్మి.. ముంబై వచ్చేస్తుంది సర్గమ్. ఆమె గర్భవతి కాగానే అతను అడ్రస్ చెప్పకుండా వెళ్లిపోతాడు. మోసపోయానని అర్థమైన సర్గమ్ ముంబైలోనే ఉండిపోతుంది. కొడుకును కంటుంది. బట్టలు కుడుతూ.. ఎంబ్రాయిడరీ చేస్తూ కొడుకును పెంచుకుంటూంటుంది. కన్హయ్య కూడా సర్కారీ బడిలో చదువుతూ.. ఆ స్లమ్‌కి దగ్గర్లోని ఫుట్‌పాత్ మీద న్యూస్ పేపర్స్ స్టాల్ పెట్టుకున్న పప్పూ దగ్గర పనిచేస్తూంటాడు. స్లమ్స్ వాళ్ల ఆరోగ్యం మీద పనిచేసే ఈవా అనే స్వచ్ఛందసేవా కార్యకర్తకు సాయం చేస్తుంటాడు. కన్హయ్యతోపాటు ఆ పిల్లగ్యాంగ్లో రింగ్‌టోన్, నిరాలా, మంగళా ఉంటారు. ఈ ముగ్గురు అబ్బాయిల కంటే మంగళ కొంచెం పెద్దది. నలుగురూ కలిసి బాల్యాన్ని ఆస్వాదిస్తుంటారు. అల్లరి చేస్తారు.. తమ భవిష్యత్ గురించి కలలు కంటూంటారు. బాగుంది.. మరి ప్రైమ్‌మినిస్టర్ ఎందుకొచ్చాడు వీళ్ల జీవితాల్లోకి? ఆ బస్తీలోని చాలామంది మగాళ్ల కళ్లు ఒంటరి తల్లి అయిన సర్గమ్ మీదే. భార్యలేని సాయినాథ్ (మంగళ తండ్రి) కూడా సర్గమ్ను చూస్తూంటాడు.. అవకాశం ఎప్పుడొస్తుందా అని. అతను ఆ బస్తీలో కంప్యూటర్లో సినిమాలు ప్రదర్శిస్తూ థియేటర్లాంటిది నడిపిస్తూంటాడు. చూపులతోనే బెదిరిస్తూ జాగ్రత్త పడ్తూంటుంది సర్గమ్. అయితే ఆ స్లమ్‌లో పర్సనల్ టాయ్లెట్ల మాట స్వచ్ఛభారత్ ఎరుగు.. కనీసం పబ్లిక్ టాయ్‌లెట్లూ ఉండవు. వాటర్ బాటిల్ పట్టుకొని బయటకు వెళ్లే అవస్థే అందరిదీ. సర్గమ్ కూడా ఏ అర్ధరాత్రో.. తెల్లవారు జాము నాలుగింటికో లేచి బహిర్భూమికి వెళ్తూంటుంది. అలా వెళ్లిన ఒకరాత్రి ఆమె మీద లైంగికదాడి జరుగుతుంది. ముందు మంగళ తండ్రి సాయినాథ్ ఆమె చేయి పట్టి లాగడానికి ప్రయత్నిస్తూంటే అతని చెంప పగలగొడ్తుంది. తప్పించుకొని ముందుకు వెళ్తూన్న క్రమంలో బస్తీ శివారులోని పోలీసు ఎదురుపడ్తాడు. భయపడుతూ.. బాధపడుతూ జరిగింది చెప్తుంది సర్గమ్. ‘రిపోర్ట్ ఇవ్వు... మరిదా.. ’ అని అదోరకంగా అంటూ ఆమె చేయిపట్టుకొని స్టేషన్‌కు లాక్కెళ్లబోతాడు. ప్రమాదం గ్రహించిన సర్గమ్ ‘‘రిపోర్ట్ ఇవ్వను సర్.. మా బస్తీలో అతనే.. బెదిరిస్తే సరిపోతుంది’’ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. అయినా వినకుండా ఆమెను బలవంతం చేస్తాడు. ఆ అవమానంతోనే తెల్లవారి బస్తీకి చేరుకుంటుంది. అందరూ గుమిగూడి సర్గమ్కు జరిగిన అన్యాయాన్ని విచారిస్తూంటారు. సాయినాథ్‌ను తిడ్తూంటారు. అతను ఇబ్బంది పెట్టాడు తప్ప ఏమీ చేయలేదని సర్గమ్కు తెలుస్తుంది కాని అసలు విషయాన్ని బయటపెడితే ఇన్స్పెక్టర్ బతకనివ్వడనే భయంతో నోరు విప్పదు. సాయినాథ్ కూడా తాను ఆ తప్పు చేయకపోయినా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటాడు. ‘‘నా వల్ల తప్పు జరిగింది కాబట్టి సర్గమ్ను పెళ్లి చేసుకుంటా’ అంటాడు. ఛీత్కారంగా చూసి ఇంటికి వెళ్లబోతుంటే అక్కడ నిలబడి ఈ పంచాయతీ అంతా చూస్తున్న, వింటున్న కొడుకు కనపడతాడు సర్గమ్కు. తల్లికి జరిగిన అన్యాయం.. దానికి కారణమూ అర్థమవుతుంది కన్హయ్యకు. మరుసటి రోజు... వాళ్లుంటున్న ఇంటి కొండ మీద.. పై అంచుకి కొన్ని వెదురు బొంగులు మోసుకెళ్తాడు కన్హయ్య. అక్కడ ఓ గుంట తవ్వి.. దాని మీద రెండు బండలు వేసి.. చుట్టూ కొన్ని వెదురు బొంగులు పాతి.. మళ్లీ వాటి చుట్టూ వాళ్లమ్మ పాత చీరను కట్టి టాయ్‌లెట్‌ను ఏర్పాటు చేస్తాడు. వాళ్లమ్మను తీసుకెళ్లి.. ఆ టాయ్‌లెట్‌ను చూపిస్తూ.. ‘‘అమ్మా .. ఇది నీ కోసమే. ఇప్పటి నుంచి చీకట్లో నువ్వు బయటకు వెళ్లొద్దు. దర్జాగా ఇక్కడికే రా.. నిన్ను ఎవరూ ఏమీ అనరు’’ అంటాడు. విన్న అమ్మ కళ్లల్లో నీళ్లు. కొడుకును దగ్గరకు తీసుకొని ఏడుస్తుంది. తమ బతుకుల మీద జాలి పడ్తుంది. అయితే ఆ టాయ్‌లెట్‌ను వాళ్లమ్మ ఉపయోగించుకునేలోపే బస్తీలో వాళ్లంతా వాడి కంగాళీ చేసేస్తారు. ఊసురోమంటాడు కన్హయ్య. ‘‘ఇలా కాదు.. గవర్నమెంట్‌ను అడగాలి టాయ్‌లెట్ కట్టమని’’ అని ఎవరో సలహా ఇస్తే.. ముంబై మున్సిపాలిటీ సిబ్బందినీ అడుగుతారు ఈ పిల్లగ్యాంగ్. ‘‘ స్వచ్ఛభారత్ స్కీమ్‌లో మీ బస్తీ లేదు కాబట్టి టాయ్‌లెట్ కట్టలేం’’ అని చెప్తారు వాళ్లు. తమ తక్షణ కర్తవ్యం ఏంటని అడుగుతాడు కన్హయ్య. ప్రైమ్‌మినిస్టర్‌కు దరఖాస్తు చేసుకోవడమే అని నిర్దేశిస్తారు. మేరే ప్యారే ప్రైమ్‌మినిస్టర్ జీ.. ‘‘ప్రియమైన ప్రధానమంత్రి గారికి.. నా పేరు కన్హయ్య. మీరు నన్ను ప్రేమగా కన్నూ అని పిలవొచ్చు. మా బస్తీలో టాయ్‌లెట్ లేకపోవడం వల్ల మా అమ్మ రోజూ చీకట్లో బయటకు వెళ్లేది. ఒకరోజు ఆమెను రేప్ చేశారు. మా అమ్మకు జరిగినట్టుగా మా బస్తీలో ఇంకెవరికీ జరక్కూడదు. అందుకే మీరు మా బస్తీలో టాయ్లెట్లు కట్టించాలి. మా అమ్మకు జరిగినట్టు మీ అమ్మకు జరిగితే మీకు నా బాధ అర్థమయ్యేది. అయినా అర్థం చేసుకొని మా బస్తీలో టాయ్లెట్లు కట్టించండి.. ప్లీజ్.. ఇట్లు మీ కన్నూ’’ అంటూ ఉత్తరం రాస్తాడు. ఆ లేఖను పట్టుకొని ఇంట్లో చెప్పకుండా మంగళ సూచన మేరకు కన్హయ్య, రింగ్‌టోన్, నిరాలా ఢిల్లీ వెళ్తారు. ప్రధానమంత్రి ఆఫీస్‌లో ఉత్తరం అందజేస్తారు. ప్రధానమంత్రి ఆఫీస్‌లో వీళ్లతో మాట్లాడి, ఉత్తరం తీసుకున్న ఆఫీసర్ (అతుల్ కులకర్ణి)కి ఒకసారి ఫోన్ కూడా చేస్తాడు కన్హయ్య. మొత్తానికి ఆ అబ్బాయి కృషి ఫలించి ఆ బస్తీలో నాలుగు టాయ్లెట్లు వెలుస్తాయి. కన్హయ్య చేతే ప్రారంభోత్సవం చేయిస్తారు. కన్హయ్య ఆనందానికి అవధులుండవు. వాళ్లమ్మకు భద్రత దొరికిందనే భరోసా.. ఇంక ఎవరి అమ్మలు.. అక్కలు.. చెల్లెళ్లకు ఏం కాదనే నమ్మకం ఆ పసికళ్లల్లో! ఈ సినిమాకు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించారు. సర్గమ్గా అంజలీ పాటిల్, కన్హయ్యాగా ఓం కనోజియా నటించారు.– సరస్వతి రమ -
నేను హైదరాబాద్ అల్లుణ్ణే
‘‘మేం ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమా చేస్తున్నప్పుడు ఇండస్ట్రీల్లో బయోపిక్స్ తక్కువ. కానీ ప్రస్తుతం ఆ జానర్ తప్ప మరో సినిమాలు లేవన్నట్టుగా సినిమాలు చేస్తున్నారు. కథలు చెప్పడం మంచిదే. టూమచ్‌గా ఏది చేసినా మంచిది కాదు’’ అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా. ‘రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారాయన. లేటెస్ట్గా ‘మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రాన్ని రూపొందించారు. అంజలి పాటిల్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఇవాళ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓంప్రకాశ్ మెహ్రా మాట్లాడుతూ – ‘‘ఆరు బయట మలమూత్ర విసర్జన, దాని ద్వారా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ చిత్రం తీశాం. మానభంగాలు ఎక్కువగా జరిగేవి మలమూత్ర విసర్జన బయట ఉన్న ప్రాంతాల్లోనే అని రికార్డ్స్ చెబుతున్నాయి. ఈ సినిమా ద్వారా మార్పు తీసుకొస్తాం అని చెప్పడం లేదు. కానీ ఇలా ఉంది పరిస్థితి అని చెబుతున్నాం. ఫిల్మ్‌మేకర్ పని సమస్యను చేరవలసిన వాళ్ల దృష్టికి తీసుకెళ్లడమే అనుకుంటున్నాను. అంజలి పాటిల్ ‘నా బంగారు తల్లి’ అనే తెలుగు సినిమా చేసింది. తనో కంప్లీట్ యాక్ట్రెస్. ఈ సినిమాలో తన లైఫ్‌టైమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చిన్నప్పుడు ఏదైనా అనారోగ్యానికి గురైతే అమ్మ మనకు మందు బిళ్ల ఇస్తుంది. కానీ అది చేదుగా ఉంటుందని, దానికి ఏదైనా షుగర్ కోటింగ్ ఇస్తుంది. నా సినిమాలు కూడా అలానే ఉండాలనుకుంటాను. బయట షుగర్ కోటింగ్‌లా చెప్పినా మందు మాత్రం ఉంటుంది. ఉత్తి షుగర్ సినిమా అంటే ఏమో నా వల్ల కాదేమో? నెక్ట్స్ నా ‘భాగ్ మిల్కా భాగ్’ హీరో ఫర్హాన్ అక్తర్‌తో ‘తుఫాన్’ అనే బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీ తీస్తున్నాను. మళ్లీ మేం కలుస్తున్నాం అంటే అంచనాలు ఉంటాయి. మన అంచనాలు. మన పోటీ ఎప్పుడూ మనతోనే ఉండాలి. ఒకటి నుంచి తొంభై వరకూ వెళ్లడం ఒక ఎత్తు. 90 నుంచి 91 వరకూ వెళ్లాలంటే మళ్లీ ఒకటి నుంచి మొదలుపెట్టాలి. అప్పుడు 92. మళ్లీ సున్నా నుంచి మొదలెట్టి 93. ఇలా కష్టపడుతూనే ఉండాలి. నాకు, హైదరాబాద్‌కు మంచి కనెక్షన్ ఉంది. మా ఆవిడది హైదరాబాదే. ఓ రకంగా నేను హైదరాబాద్ అల్లుణ్ణే’’ అన్నారు. -
జరీనా ఆగయా
ప్రశాంతంగా కనిపిస్తోన్న జరీనా కళ్లలో మాత్రం ఏదో కథ ఉంది. మరి ఆమె గురించి పూర్తీగా తెలియాలంటే మాత్రం ‘కాలా’ సినిమా చూడాల్సిందే. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో దర్శక–నటుడు, నిర్మాత ధనుష్ నిర్మించిన సినిమా ‘కాలా’. హ్యూమా ఖురేషి, అంజలిపాటిల్ కథానాయికలు. నానా పటేకర్, ఈశ్వరీ రావ్, సముద్రఖని కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాలో 45ఏళ్ల జరీనా పాత్ర చేశారు హ్యూమా ఖురేషి. ఆమె లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.‘‘రజనీకాంత్‌గారి ‘కాలా’ సినిమాలో జరీనా క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’అన్నారు హ్యూమా. ‘‘జరీనా పాత్రకోసం చాలా మంది కథానాయికలను పరిశీలించాం. కానీ ‘గ్యాంగ్ ఆఫ్ వస్పేయపూర్’లో హ్యూమాను చూసినప్పుడు జరీనా క్యారెక్టర్‌కు ఆమె కరెక్ట్ అనిపించింది. రజనీ, ధనుష్‌లు కూడా హ్యూమాను ఓకే చేశారు’’ అన్నారు రంజిత్. ‘కాలా’ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. -
అందుకే సూపర్ స్టార్ అయ్యారు
రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’ వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను నిర్మించారు. హ్యూమా ఖురేషీ, అంజలీ పాటిల్ కథానాయికలు. ఈ చిత్రం టీజర్లో చూపించిన రైన్ ఫైట్ షాట్స్ గుర్తుండే ఉంటాయి. ఆ రైన్ ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనుందట. ఈ ఫైట్ సీన్స్ చిత్రీకరణ గురించి, రజనీకాంత్ డెడికేషన్ గురించి చిత్రబృందం చెబుతూ – ‘‘ఐదు రోజుల పాటు ఈ రైన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం. రజనీకాంత్ ఒక షాట్ చేసి వచ్చి అలా తడిబట్టలతోనే కూర్చుని ఏదైనా బుక్ చదువుతూ ఉండేవారు. నెక్ట్స్ షాట్ రెడీ అయ్యేవరకూ కొంచెం డ్రై అవ్వండి అని చెబితే మళ్లీ ఎలాగూ తడవాలి కదా.. ఏం ఫర్లేదు అని నవ్వేసేవారు. రజనీకాంత్‌లో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రతీ సినిమాను తన ఫస్ట్ సినిమాలాగా ట్రీట్ చేయడమే. తన కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ తలుచుకుంటే సీన్ తనకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. కానీ అలా ఒప్పుకోరు. సీన్ డిమాండ్‌కు తగ్గట్టుగానే రజనీకాంత్ తనని అడాప్ట్ చేసుకుంటారు. రజనీసార్ అలా ఉండటం వల్ల టీమ్‌లో ఉన్న అందరికీ బూస్ట్‌లా అనిపించింది’’ అని పేర్కొంది చిత్రబృందం. రజనీకాంత్ సూపర్‌స్టార్‌గా ఇంత స్టార్‌డమ్‌ను సంపాదించగలిగారంటే అది కేవలం నటుడిగా ఆయనకున్న డెడికేషన్ వల్లే అని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కానుంది. -
యమ గ్రేటు.. కాలా సేఠు
‘కాలా’ ముంబై మాఫియా డాన్. కలర్ బ్లాక్ అవ్వొచు కానీ క్యారెక్టర్ మాత్రం ఫుల్ వైట్. మరి అలాంటి డాన్ ఇంట్రో సాంగ్ అంటే ఎలా ఉండాలి? తన గొప్పతనాన్ని పొగుడుతూనే, తన గుణాన్ని వివరించాలి. ఈ స్టైలిష్ డాన్‌కు అలాంటి పాటనే కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’. వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హ్యూమా ఖురేషీ, అంజలీ పాటిల్ కథానాయికలు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ని మే డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘‘కాలా ఫస్ట్ సాంగ్ మీ అందరి కోసం. మాస్ డార్లింగ్‌తో అందరం కలిసి ర్యాప్ పాడదాం రండి’’ అని ధనుష్ పేర్కొన్నారు. ఈ పాటలోని కాలా గురించి వర్ణిస్తూ.. ‘‘యమ గ్రేటు.. కాలా సేఠు. భయము ఎరుగని వన్నె తరగని.. ఎంత ఎదిగినా ఒదిగినవాడు. మనము తలవగా మనసు పిలవగా కలత తీర్చడానికి ఇటు వచ్చినాడు చూడు. నలుపే మన శ్రమ జీవుల వర్ణం, గెలుపే కరికాలుడి సొంతం’’ అంటూ ర్యాప్‌తో సాగే ఈ పాటలోని లైన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో హీరోగా నటించనున్న నెక్ట్స్ సినిమాకు రెమ్యునరేషన్‌గా రజనీకాంత్ 65 కోట్లు తీసుకోనున్నారని సమాచారం. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. -
మేక్ వే ఫర్ ది కింగ్
ఈసారి రంజాన్‌కు వారం ముందే పండగ స్టార్ట్ కానుంది. ఎందుకంటే రజనీకాంత్ వారం ముందే థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అవును.. జూన్ 7న ‘కాలా’ రిలీజ్ కానుంది. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాలా’. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించారు. అంజలీ పాటిల్, హ్యూమా ఖురేషీ కథానాయికలు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాను తొలుత ఈ నెల 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, కోలీవుడ్ ఇండస్ట్రీ స్ట్రైక్ వల్ల ‘కాలా’ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యిందని ఊహించవచ్చు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ‘కాలా’ సినిమాను జూన్7న రీలీజ్ చేయబోతున్నామని చెప్పడానికి ఆనందంగా ఉంది. మేక్ వే ఫర్ ది కింగ్(రాజుకి దారి ఇవ్వండి)’’ అని పేర్కొన్నారు ధనుష్. నానా పటేకర్, సముద్రఖని తదితరులు నటించిన ‘కాలా’ చిత్రానికి సంతోష్ నారాయణ్ స్వరకర్త. -
డాన్ ఆఫ్ ది డాన్స్!
డాన్స్ చాలామంది ఉండొచ్చు. కానీ డాన్స్‌నే డామినేట్ చేసే డాన్ ‘కాలా’. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో వండర్‌బార్ పతాకంపై దర్శక–నిర్మాత–నటుడు ధనుష్ నిర్మించిన చిత్రం ‘కాలా’. ఇందులో హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్, సముద్రఖని, నానా పటేకర్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా చిత్రబృందం ఎనౌన్స్ చేసింది. ‘బాషా’, ‘కబాలి’ సినిమాల్లో డాన్ రోల్ చేసిన రజనీ ‘కాలా’ చిత్రంలోనూ డాన్ పాత్ర చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా లుక్ ఇప్పటికే బాగా ఆకట్టుకుంది. ‘కాలా’ రిలీజ్ డేట్ ప్రకటించారు కాబట్టి రజనీ ‘2.0’ ఈ సమ్మర్లో రిలీజ్ అవ్వడం లేదన్నది ఫిక్స్ అన్నమాట. ఈ ‘2.0’ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్నారు. ఈ వార్త వచ్చి రెండు రోజులైందో లేదో ఇప్పుడు వేరే డేట్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారట. -
డబ్బింగ్ షురూ
కాలా స్టార్ట్ చేశాడు. డబ్బింగ్ షురూ చేశాడు. ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం ‘కాలా’. హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్ కథానాయికలు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ రీసెంట్గా స్టారై్టన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని తన క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పడానికి చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చారు రజనీ. ‘కాలా’ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందిన ‘2.0’ రిలీజైన రెండు నెలల తర్వాత రిలీజ్ చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ టాక్. ‘2.0’ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. పొలిటికల్ ఎంట్రీపై రజనీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేసిన తర్వాత రజనీ సినిమాలకు గుడ్‌బై చెబుతారన్న వార్తలు కోలీవుడ్‌లో ఊపందుకున్నాయి. మరోవైపు రజనీ సినిమాలను తగ్గిస్తారేమో కానీ పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టరన్న వాదనలూ వినిపిస్తున్నాయి. రజనీ అధికారికంగా ప్రకటన ఇస్తే గానీ ఇలాంటి వార్తలకు ఫుల్స్టాప్ పడదని అభిమానులు అనుకుంటున్నారట. -
ఓ నిజజీవిత స్త్రీ మూర్తి కథ
‘‘లైంగిక వేధింపులకు గురవుతూ నరకప్రాయంగా జీవితాన్ని సాగిస్తున్న పన్నెండు వేల మంది స్త్రీలను ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకొచ్చాన్నేను. ఆ క్రమంలో నేను చూసిన ఓ స్త్రీ జీవితం ఆధారంగా ‘నా బంగారు తల్లి’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇది అవార్డుల కోసం తీసిన సినిమా కాదు’’ అని నిర్మాతల్లో ఒకరైన సునీతా కృష్ణన్ అన్నారు. ఎం.ఎస్.రాజేశ్‌తో కలిసి, రాజేశ్ టచ్‌రివర్ దర్శకత్వంలో ఆమె నిర్మించిన చిత్రం ‘నా బంగారు తల్లి’. అంజలీ పాటిల్, సిద్ధిఖీ, లక్ష్మీమీనన్, రత్న శేఖర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీతా కృష్ణన్ మాట్లాడుతూ -‘‘మూడు జాతీయ అవార్డులు, అయిదు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న సినిమా ఇది. చిరంజీవి ఈ సినిమా చూసి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని మాట ఇచ్చారు. ఈ సినిమా విడుదలకు ఇబ్బంది పడుతుంటే, అమల ‘క్రౌడ్ ఫండింగ్’ ద్వారా ప్రయత్నించమని సలహా ఇచ్చారు. దాంతో రూ. 32 లక్షలు పోగయ్యాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఏకంగా 12 లక్షల రూపాయలు ఇచ్చారు’’ అని తెలిపారు. -
ప్రతి తండ్రి చూడాల్సిన చిత్రమిది: చిరంజీవి
‘‘ఇది మనసుని ఎడ్యుకేట్ చేసే సినిమా. మహిళలతో ఎలా నడుచుకోవాలో కూడా తెలియజేస్తుందీ సినిమా’’ అన్నారు చిరంజీవి. అంజలి పాటిల్, సిద్ధిఖీ, లక్ష్మీమీనన్, రత్నశేఖర్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘నా బంగారు తల్లి’. ఎం.ఎస్.రాజేశ్‌తో కలిసి ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేశ్ టచ్‌రివర్ దర్శకుడు. బాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డెరైక్టర్ శంతన్ మొయిత్రా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బిగ్ సీడీని, ఆడియో సీడీని ఆవిష్కరించి చిరంజీవి మాట్లాడారు. ‘‘స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలను ఇతివృత్తంగా తీసుకొని, అశ్లీలత లేకుండా దర్శకుడు ఈ సినిమాను మలిచాడు. అంజలి పాటిల్‌ను చూస్తుంటే స్మితాపాటిల్ గుర్తొచ్చారు. ఆమె ఎక్కడా నటించలేదు. బిహేవ్ చేశారు. ఇది స్త్రీల చిత్రం కాదు. పురుషుల చిత్రం. ప్రతి తండ్రీ చూడాల్సిన చిత్రం. ‘స్టాలిన్’లో నేను చెప్పినట్లు, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మరో ముగ్గురికి చూడమని చెప్పండి’’ అని కోరారు. ‘‘ఇది నేను చూసిన కథ. నన్ను చలించిపోయేలా చేసిన కథ. దీనికి తెరరూపమివ్వాలని పలువురు నిర్మాతల్ని కలిశా. ఎవరూ స్పందించకపోవడంతో నేనే తీశా. రిలీజ్ కోసం చాలామందిని కలిశాను. కానీ.. సహకారం అందలేదు. దాంతో ఇంట్లో ఫర్నీచర్ కూడా అమ్ముకున్నాం. సినిమా తీయడం కంటే విడుదల చేయడమే కష్టమని తెలిసింది. అయితే, అల్లు అరవింద్, అక్కినేని అమల దైవదూతల్లా వచ్చి సినిమా విడుదలకు సహకరించారు. వీరితో పాటు నిమ్మగడ్డ ప్రసాద్‌గారికి, రిలయన్స్ సంజయ్గారికి రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ నెల 21న వంద థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని సునీత కృష్ణన్ చెప్పారు. ఇది లక్షలమంది ఆడపిల్లల కథ అనీ, ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి తెరకెక్కించానని దర్శకుడు చెప్పారు. ‘‘సునీతకు నేను చేసిన సాయం.. చిరంజీవిగారికి ఈ సినిమా చూపించడమే. నా మాటపై నమ్మకంతో ఈ వేడుకకు విచ్చేసిన ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు అల్లు అరవింద్. ఇంకా అమిత్ మిశ్రా, మహేశ్ భగవత్, మధుశాలిని, భరత్‌భూషణ్, వెంకటరత్నం, సునీల్, రత్నశేఖర్, వరుణ్జోసఫ్, రఘు, అనంతరామ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. Follow @sakshinews -
అవకాశాలు వెల్లువెత్తొచ్చు..!
న్యూఢిల్లీ: భవిష్యత్తులో మంచి మంచి ప్రాజెక్టులు తనకు వచ్చేందుకు మార్గం సుగమమైనట్టేనని ‘ఫైండింగ్ ఫ్యానీ’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన నటి అంజలి పాటిల్ భావిస్తోంది. తనను కొత్త కోణంలో ప్రేక్షకులు చూసే అవకాశం ఈ సినిమాతో లభించిందంది. కొత్త అవకాశాలకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నానంటూ కొన్ని కలల సంఘటనలతోపాటు సినిమా చివరిలో కనిపించిన ఈ 27 ఏళ్ల వర్ధమాన తార తన మనసులో మాట బయటపెట్టింది. ‘ఈ సినిమాలో నేను గ్లామరస్ పాత్రలో కనిపించా. గతంలో ఇటువంటి పాత్ర దొరకనే లేదు. ‘ఫైండింగ్ ఫ్యానీ’లో సినిమాలో నటించిన కారణంగా మున్ముందు నాకు గ్లామరస్ పాత్రలు దొరికే అవకాశముంది’ అని అంది. హోమి అడజానియా తీసేసినిమాల్లో అతిథి పాత్ర దొరికినా చేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదంది. పైగా సంతోషిస్తానంది. ‘ఫైండింగ్ ఫ్యానీ’ సినిమాలో చిన్న పాత్ర అయినా అభ్యంతరం చెప్పేందుకు తనకు ఎటువంటి కారణమూ దొరకలేదంది. ‘ ఈ సినిమా ఎంతో బాగుంది. ఈ సినిమాలో అవకాశం కోసం నన్ను అప్పట్లో సంప్రదించడం ఇప్పుడు ఎంతో సంతోషం కలిగిస్తోంది. హోమి.. ఓ అద్భుతమైన దర్శకుడు. ఇక ఫైండింగ్ ఫ్యానీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఈ సినిమాలో నటించాలంటూ నన్ను అప్పట్లో సంప్రదించాడు. ఆ తర్వాత నజీరుద్దీన్ షాతో కలసి షూటింగ్లో పాల్గొన్నా’ అని అంది. కాగా ‘ఢిల్లీ ఇన్ ఏ డే’ అనే అంతర్జాతీయ ప్రాజెక్టుతో అంజలి ... సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో అంజలి నటనకు విమర్శకులు సైతం మంచి మార్కులు వేశారు. ‘నా బంగారు తల్లి’ అనే తెలుగు సినిమాలో నటించిన అంజలికి జాతీయ పురస్కారం దక్కింది. -
అవకాశాలు వెల్లువెత్తొచ్చు..!
న్యూఢిల్లీ: భవిష్యత్తులో మంచి మంచి ప్రాజెక్టులు తనకు వచ్చేందుకు మార్గం సుగమమైనట్టేనని ‘ఫైండింగ్ ఫ్యానీ’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన నటి అంజలి పాటిల్ భావిస్తోంది. తనను కొత్త కోణంలో ప్రేక్షకులు చూసే అవకాశం ఈ సినిమాతో లభించిందంది. కొత్త అవకాశాలకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నానంటూ కొన్ని కలల సంఘటనలతోపాటు సినిమా చివరిలో కనిపించిన ఈ 27 ఏళ్ల వర్ధమాన తార తన మనసులో మాట బయటపెట్టింది. ‘ఈ సినిమాలో నేను గ్లామరస్ పాత్రలో కనిపించా. గతంలో ఇటువంటి పాత్ర దొరకనే లేదు. ‘ఫైండింగ్ ఫ్యానీ’లో సినిమాలో నటించిన కారణంగా మున్ముందు నాకు గ్లామరస్ పాత్రలు దొరికే అవకాశముంది’ అని అంది. హోమి అడజానియా తీసేసినిమాల్లో అతిథి పాత్ర దొరికినా చేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదంది. పైగా సంతోషిస్తానంది. ‘ఫైండింగ్ ఫ్యానీ’ సినిమాలో చిన్న పాత్ర అయినా అభ్యంతరం చెప్పేందుకు తనకు ఎటువంటి కారణమూ దొరకలేదంది. ‘ ఈ సినిమా ఎంతో బాగుంది. ఈ సినిమాలో అవకాశం కోసం నన్ను అప్పట్లో సంప్రదించడం ఇప్పుడు ఎంతో సంతోషం కలిగిస్తోంది. హోమి.. ఓ అద్భుతమైన దర్శకుడు. ఇక ఫైండింగ్ ఫ్యానీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఈ సినిమాలో నటించాలంటూ నన్ను అప్పట్లో సంప్రదించాడు. ఆ తర్వాత నజీరుద్దీన్ షాతో కలసి షూటింగ్లో పాల్గొన్నా’ అని అంది. కాగా ‘ఢిల్లీ ఇన్ ఏ డే’ అనే అంతర్జాతీయ ప్రాజెక్టుతో అంజలి ... సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో అంజలి నటనకు విమర్శకులు సైతం మంచి మార్కులు వేశారు. ‘నా బంగారు తల్లి’ అనే తెలుగు సినిమాలో నటించిన అంజలికి జాతీయ పురస్కారం దక్కింది.