రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా
‘‘మేం ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమా చేస్తున్నప్పుడు ఇండస్ట్రీల్లో బయోపిక్స్ తక్కువ. కానీ ప్రస్తుతం ఆ జానర్ తప్ప మరో సినిమాలు లేవన్నట్టుగా సినిమాలు చేస్తున్నారు. కథలు చెప్పడం మంచిదే. టూమచ్‌గా ఏది చేసినా మంచిది కాదు’’ అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా. ‘రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించారాయన. లేటెస్ట్‌గా ‘మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రాన్ని రూపొందించారు. అంజలి పాటిల్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఇవాళ విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఓంప్రకాశ్ మెహ్రా మాట్లాడుతూ – ‘‘ఆరు బయట మలమూత్ర విసర్జన, దాని ద్వారా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ చిత్రం తీశాం. మానభంగాలు ఎక్కువగా జరిగేవి మలమూత్ర విసర్జన బయట ఉన్న ప్రాంతాల్లోనే అని రికార్డ్స్ చెబుతున్నాయి. ఈ సినిమా ద్వారా మార్పు తీసుకొస్తాం అని చెప్పడం లేదు. కానీ ఇలా ఉంది పరిస్థితి అని చెబుతున్నాం. ఫిల్మ్‌మేకర్ పని సమస్యను చేరవలసిన వాళ్ల దృష్టికి తీసుకెళ్లడమే అనుకుంటున్నాను. అంజలి పాటిల్ ‘నా బంగారు తల్లి’ అనే తెలుగు సినిమా చేసింది. తనో కంప్లీట్ యాక్ట్రెస్. ఈ సినిమాలో తన లైఫ్‌టైమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
చిన్నప్పుడు ఏదైనా అనారోగ్యానికి గురైతే అమ్మ మనకు మందు బిళ్ల ఇస్తుంది. కానీ అది చేదుగా ఉంటుందని, దానికి ఏదైనా షుగర్ కోటింగ్ ఇస్తుంది. నా సినిమాలు కూడా అలానే ఉండాలనుకుంటాను. బయట షుగర్ కోటింగ్‌లా చెప్పినా మందు మాత్రం ఉంటుంది. ఉత్తి షుగర్ సినిమా అంటే ఏమో నా వల్ల కాదేమో? నెక్ట్స్ నా ‘భాగ్ మిల్కా భాగ్’ హీరో ఫర్హాన్ అక్తర్‌తో ‘తుఫాన్’ అనే బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీ తీస్తున్నాను. మళ్లీ మేం కలుస్తున్నాం అంటే అంచనాలు ఉంటాయి. మన అంచనాలు. మన పోటీ ఎప్పుడూ మనతోనే ఉండాలి. ఒకటి నుంచి తొంభై వరకూ వెళ్లడం ఒక ఎత్తు. 90 నుంచి 91 వరకూ వెళ్లాలంటే మళ్లీ ఒకటి నుంచి మొదలుపెట్టాలి. అప్పుడు 92. మళ్లీ సున్నా నుంచి మొదలెట్టి 93. ఇలా కష్టపడుతూనే ఉండాలి. నాకు, హైదరాబాద్‌కు మంచి కనెక్షన్ ఉంది. మా ఆవిడది హైదరాబాదే. ఓ రకంగా నేను హైదరాబాద్ అల్లుణ్ణే’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment