ప్రతి తండ్రి చూడాల్సిన చిత్రమిది: చిరంజీవి
‘‘ఇది మనసుని ఎడ్యుకేట్ చేసే సినిమా. మహిళలతో ఎలా నడుచుకోవాలో కూడా తెలియజేస్తుందీ సినిమా’’ అన్నారు చిరంజీవి. అంజలి పాటిల్, సిద్ధిఖీ, లక్ష్మీమీనన్, రత్నశేఖర్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘నా బంగారు తల్లి’. ఎం.ఎస్.రాజేశ్‌తో కలిసి ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేశ్ టచ్‌రివర్ దర్శకుడు. బాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డెరైక్టర్ శంతన్ మొయిత్రా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
బిగ్ సీడీని, ఆడియో సీడీని ఆవిష్కరించి చిరంజీవి మాట్లాడారు. ‘‘స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలను ఇతివృత్తంగా తీసుకొని, అశ్లీలత లేకుండా దర్శకుడు ఈ సినిమాను మలిచాడు. అంజలి పాటిల్‌ను చూస్తుంటే స్మితాపాటిల్ గుర్తొచ్చారు. ఆమె ఎక్కడా నటించలేదు. బిహేవ్ చేశారు. ఇది స్త్రీల చిత్రం కాదు. పురుషుల చిత్రం. ప్రతి తండ్రీ చూడాల్సిన చిత్రం. ‘స్టాలిన్’లో నేను చెప్పినట్లు, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మరో ముగ్గురికి చూడమని చెప్పండి’’ అని కోరారు. ‘‘ఇది నేను చూసిన కథ. నన్ను చలించిపోయేలా చేసిన కథ. దీనికి తెరరూపమివ్వాలని పలువురు నిర్మాతల్ని కలిశా. ఎవరూ స్పందించకపోవడంతో నేనే తీశా. రిలీజ్ కోసం చాలామందిని కలిశాను. కానీ.. సహకారం అందలేదు. దాంతో ఇంట్లో ఫర్నీచర్ కూడా అమ్ముకున్నాం.
సినిమా తీయడం కంటే విడుదల చేయడమే కష్టమని తెలిసింది. అయితే, అల్లు అరవింద్, అక్కినేని అమల దైవదూతల్లా వచ్చి సినిమా విడుదలకు సహకరించారు. వీరితో పాటు నిమ్మగడ్డ ప్రసాద్‌గారికి, రిలయన్స్ సంజయ్‌గారికి రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ నెల 21న వంద థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని సునీత కృష్ణన్ చెప్పారు. ఇది లక్షలమంది ఆడపిల్లల కథ అనీ, ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి తెరకెక్కించానని దర్శకుడు చెప్పారు. ‘‘సునీతకు నేను చేసిన సాయం.. చిరంజీవిగారికి ఈ సినిమా చూపించడమే. నా మాటపై నమ్మకంతో ఈ వేడుకకు విచ్చేసిన ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు అల్లు అరవింద్. ఇంకా అమిత్ మిశ్రా, మహేశ్ భగవత్, మధుశాలిని, భరత్‌భూషణ్, వెంకటరత్నం, సునీల్, రత్నశేఖర్, వరుణ్‌జోసఫ్, రఘు, అనంతరామ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Follow @sakshinews