టాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ జోడీలు.. మళ్లీ రిపీట్‌.. | Here's The List Of Actors Who Reuniting With These Actress After Years Gap For Upcoming Movies In Tollywood | Sakshi
Sakshi News home page

Tollywood: జోడీ రిపీట్‌.. ఒకరు 18 ఏళ్ల తర్వాత.. మరొకరు 38 ఏళ్ల తర్వాత..!

Published Sun, Mar 2 2025 12:28 PM | Last Updated on Sun, Mar 2 2025 1:18 PM

Tollywood: These Actors Reunite With These Actress

చిత్ర పరిశ్రమలో హిట్‌ జోడీకి ఉన్న క్రేజే వేరు. ఓ హీరో, హీరోయిన్‌ కాంబినేషన్‌లో సినిమా విజయం సాధిస్తే మళ్లీ ఆ కాంబో ఎప్పుడు రిపీట్‌ అవుతుందా? అనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఉంటుంది. హిట్‌ జోడీ రిపీట్‌ అవుతోందంటే ట్రేడ్‌ వర్గాల్లో, బిజినెస్‌ సర్కిల్స్‌లో ఫుల్‌ క్రేజ్‌తో ΄ాటు అంచనాలు ఉంటాయి. అందుకే అలాంటి హిట్‌ జోడీని రిపీట్‌ చేసేందుకు దర్శక–నిర్మాతలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఇందుకు ఒక్కోసారి కొన్నేళ్లు కూడా పట్టొచ్చు. ప్రస్తుతం తెలుగులో రిపీట్‌ అవుతున్న జోడీలపై ఓ లుక్కేద్దాం...

పద్దెనిమిదేళ్ల తర్వాత..
హీరో చిరంజీవి, హీరోయిన్‌ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్‌ అవుతోంది. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్‌’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జోడీగా నటించారు. 2006 సెప్టెంబరు 20న విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి ‘విశ్వంభర’ కోసం స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ‘బింబిసార’ వంటి హిట్‌ మూవీ తీసిన మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ చేయనున్నట్లు తొలుత ప్రకటించింది చిత్రయూనిట్‌. కానీ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ హీరోగా రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం ‘విశ్వంభర’ సినిమా విడుదలని వాయిదా వేశారు. అయితే మళ్లీ ఎప్పుడు రిలీజ్‌ చేస్తారనే విషయంపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వేసవిలో సినిమా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది.  

షష్ఠిపూర్తి కోసం 38 ఏళ్ల తర్వాత... 
నటుడు రాజేంద్ర ప్రసాద్, నటి అర్చనల జోడీ 38 ఏళ్ల తర్వాత రిపీట్‌ అవుతోంది. వీరిద్దరూ ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రెండో సారి కలిసి నటించారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన జోడీగా డైరెక్టర్‌ వంశీ తీసిన చిత్రం ‘లేడీస్‌ టైలర్‌’. 1986 నవంబరు 26న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించలేదు. 

తాజాగా పవన్‌ ప్రభ దర్శకత్వం వహించిన ‘షష్ఠిపూర్తి’ కోసం వీరు 38 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా నటించారు. ఈ చిత్రంలో రూపేష్, ఆకాంక్షా సింగ్‌ మరో జంట. అయితే ఈ కథ మొత్తం రాజేంద్ర ప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ‘షష్ఠిపూర్తి’ అనే టైటిల్‌ పెట్టారట. రూపేష్‌ నిర్మించిన ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అనే విషయంపై స్పష్టత లేదు.  

మధ్యతరగతి యువకుడి ప్రేమకథ  
హీరో ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తొలి చిత్రం ‘బేబి’. సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 జూలై 14న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో ఆనంద్, వైష్ణవి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ప్రత్యేకించి యువతరం ఈ సినిమాకి ఫుల్‌ ఫిదా అయ్యారు. ‘బేబి’ తర్వాత వీరు మరోసారి జోడీగా నటిస్తున్నారు. ‘90స్‌’ (ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌) వెబ్‌ సిరీస్‌తో మంచి విజయం అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో 32వ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడియోలో ‘మీరు టీవీలో మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్‌ క్లాస్‌ బాయ్‌ లవ్‌ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు.. మన స్టోరీ. మోస్ట్‌ రిలేటబుల్‌ లవ్‌ స్టోరీ’ అంటూ ఆనంద్‌ దేవరకొండ చెప్పిన డైలాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మాస్‌ జాతర 
రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. 2022 డిసెంబరు 23న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అందులోనూ ప్రత్యేకించి రవితేజ–శ్రీలీల డ్యాన్సులు, భీమ్స్‌ సంగీతం ఈ సినిమాకి ప్లస్‌గా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి హిట్‌ జోడీ రెండేళ్ల తర్వాత ‘మాస్‌ జాతర’ సినిమాతో రిపీట్‌ అవుతోంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 

రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా రూపొందుతోన్న ‘మాస్‌ జాతర’పై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. అందులోనూ రవితేజ–శ్రీలీల హిట్‌ జోడీ రిపీట్‌ అవుతుండటం కూడా ఈ సినిమాకి మరింత క్రేజ్‌ తీసుకొచ్చింది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘మాస్‌ జాతర’ సినిమాకి కూడా భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తుండటం మరో విశేషం. వేసవి కానుకగా మే 9న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌.  

నాలుగోసారి...
నటుడు శివాజీ, నటి లయది హిట్‌ జోడీ. ‘మిస్సమ్మ’ (2003), ‘అదిరిందయ్యా చంద్రం’ (2004), ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ (2006) వంటి సినిమాల్లో జంటగా నటించి, హిట్స్‌ అందుకున్నారు. తాజాగా వీరి జోడీ నాలుగోసారి రిపీట్‌ అవుతోంది. వివాహం తర్వాత సినిమాలకు కొన్నేళ్లు విరామం ఇచ్చిన లయ ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించారు. ప్రస్తుతం లయ, శివాజీ జోడీగా కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో సుధీర్‌ శ్రీరామ్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్‌ పతాకంపై శివాజీ నిర్మిస్తున్నారు. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. హ్యాట్రిక్‌ హిట్స్‌ అందుకున్న ఈ జంట నటిస్తున్న నాలుగో చిత్రంపై ప్రేక్షకుల్లో క్రేజ్‌ నెలకొంది.  

బ్యాక్‌ టు బ్యాక్‌
హీరో నితిన్, హీరోయిన్‌ శ్రీలీల కాంబినేషన్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ రిపీట్‌ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్‌’ సినిమాలో నితిన్, శ్రీలీల తొలిసారి జంటగా నటించారు. 2023 డిసెంబరు 8న విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. కానీ, నితిన్‌–శ్రీలీల జోడీ బాగుందనే టాక్‌ వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ‘రాబిన్‌హుడ్‌’ సినిమాలో జంటగా నటించారు. ‘భీష్మ’ వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. 

మంచి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ఇదని, నితిన్‌ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందినట్లు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రాబిన్‌హుడ్‌’లో తన పాత్ర, నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారంటూ శ్రీలీల కూడా స్పష్టం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్‌ కానుకగా 2024 డిసెంబరు 25న విడుదల కావాల్సి ఉంది. అయితే ముందుగా ప్రకటించిన తేదీకి విడుదలకాలేదు. మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్‌. 

అప్పుడు వినోదం.. ఇప్పుడు థ్రిల్లర్‌  
వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన కెరీర్‌లో విజయవంతమైన చిత్రాల్లో ‘సామజవరగమన’ ఒకటి. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్‌ నటించారు. 2023 జూన్‌ 29న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ‘మృత్యుంజయ్‌’ మూవీ కోసం మరోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్‌.

ఈ చిత్రానికి హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘సామజవరగమన’తో వినోదం పంచిన శ్రీవిష్ణు, రెబా జాన్‌ ‘మృత్యుంజయ్‌’తో ప్రేక్షకులను ఏ మేర భయపెడతారో చూడాలి.  

మరికొన్ని జోడీలు
‘సీతా రామం’ సినిమాతో సూపర్‌ హిట్‌ జోడీ అనిపించుకున్న దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్‌ రెండోసారి నటించనున్నారట. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా పవన్‌ సాధినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమాలో సాయిపల్లవి లేదా మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలకృష్ణ– ప్రగ్యాజైస్వాల్‌ జోడీ కూడా రిపీట్‌ కానుందని సమాచారం. ‘అఖండ, డాకు మహారాజ్‌’ వంటి సినిమాల తర్వాత ‘అఖండ 2’లో వీరిద్దరూ కలిసి నటించనున్నారట. అయితే ‘అఖండ 2’లో హీరోయిన్‌గా సంయుక్తని ప్రకటించారు మేకర్స్‌. మరి ప్రగ్యా జైస్వాల్‌ సెకండ్‌ హీరోయిన్‌గా కనిపిస్తారా? లేదంటే ముఖ్యమైన పాత్ర చేయనున్నారా? అనేది వేచి చూడాలి.  
ఇదిలా ఉంటే..  మరికొన్ని జోడీలు కూడా రిపీట్‌ కానున్నాయని సమాచారం.  
– డేరంగుల జగన్‌ మోహన్‌ 

చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్‌ రెడ్డి వంగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement