అవమానపడాల్సింది అమ్మకాదు | Mere Pyare Prime Minister Review | Sakshi
Sakshi News home page

అవమానపడాల్సింది అమ్మకాదు

Published Sat, Jun 15 2019 9:35 AM | Last Updated on Sat, Jun 15 2019 9:54 AM

Mere Pyare Prime Minister Review - Sakshi

నలుగురు చులకన చేశారు..ఓ దుర్మార్గుడు తప్పు చేశాడు..అవకాశం ‘సిస్టమ్‌’ ఇచ్చింది..సిగ్గుపడాల్సింది సమాజం.. రక్షణ కట్టాల్సింది పరిరక్షకులే!ఇదీ ఓ కొడుకు రిక్వెస్ట్‌.. ‘‘ప్రియమైన ప్రధానమంత్రిగారూ.. 
అవమాన పడాల్సింది మా అమ్మ కాదు.. టాయ్‌లెట్‌ ఇవ్వాల్సింది మీరు..’’న్యూ ఢిల్లీ.. ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫీస్‌..‘‘ఎవరు మీరు?’’ ‘‘నా పేరు కన్హయ్య..’’ ‘‘నా పేరు రింగ్‌టోన్‌’’‘‘ఆ..’’ ఎవరు మీరు అని అడిగిన వ్యక్తి మొహంలో ఆశ్చర్యం!అదేమీ పట్టించుకోకుండా రింగ్‌టోన్‌ పక్కనున్న పిల్లోడు చెప్పాడు తన పేరును ‘‘నిరాలా’’ అని.‘‘ఇక్కడ మీకేం పని?’’ అదే ఆశ్చర్యంతో ఆ వ్యక్తి. ‘‘ప్రైమ్‌మినిస్టర్‌ సర్‌ని కలవాలి’’ కన్హయ్య. 
‘‘ఎందుకు?’’‘‘ఈ లెటర్‌ ఇవ్వాలి’’  ఓ కాగితం అతని చేతిలో పెడుతూ కన్హయ్య. ‘‘మీరు ప్రైమ్‌మినిస్టరా?’’ అడిగాడు నిరాలా.. అతణ్ణి.కాదన్నట్టుగా అడ్డంగా తలూపాడు అతను. ‘‘అయితే ఇది ప్రైమ్‌మినిస్టర్‌కే ఇవ్వాలి’’ టక్కున అతని చేతిలోంచి ఆ ఉత్తరం లాక్కున్నాడు నిరాలా. అతను నవ్వుతూ.. ‘‘చూడండి... ఏదైనా సిస్టమ్‌ ప్రకారం వెళ్లాలి’’ అంటాడు.‘‘ఎక్కడ దొరుకుతాడు?’’ నిరాలా.

‘‘ఎవరు?’’ ‘‘అతనే.. మిస్టర్‌ సిస్టమ్‌’’చాలా కాన్ఫిడెంట్‌గా నిరాలా. ఆ అమాయకత్వానికి ఏం జవాబు చెప్పాలో తెలియదు అతనికి. ఆ ఉత్తరం తీసుకొని అది ప్రైమ్‌మినిస్టర్‌కు అందేలా చూస్తానని భరోసా ఇస్తాడు ఆ పిల్లలకు. ‘‘మా పని అయిపోతుందా?’’ ఆత్రంగా కన్హయ్య.

‘‘ప్రైమ్‌మినిస్టర్‌కు మీదొక్కటే సమస్య కాదుకదా.... అలాంటివి బోలెడు ఉంటాయి. అన్నీ చూడాలి.. చూస్తారు’’అని సర్దిచెప్పి పంపించేస్తాడు ఆ పిల్లలను. 
‘‘మేరే ప్యారే ప్రైమ్‌మినిస్టర్‌’’ లోనిది ఆ సన్నివేశం. ముంబై స్లమ్స్‌లోని టాయ్‌లెట్ల సమస్య మీద తీసిన సినిమా. వినగానే ‘టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథా’, ‘హల్కా’ మూవీస్‌ గుర్తొస్తాయి. చూస్తే మాత్రం వాటికి డిఫరెంట్‌ ఈ సినిమా అని అనిపిస్తుంది. స్లమ్స్‌లోని మహిళల భద్రత, రక్షణలేమిని ఫోకస్‌ చేసింది. విడుదలైన విషయం తెలిసేలోపే రీల్‌ చుట్టేశాయి థియేటర్లు. కాని నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. చూడొచ్చు.

కథలోకి వద్దాం...
ఎనిమిదేళ్ల పిల్లాడు కన్హయ్య. తల్లి సర్‌గమ్‌తో కలిసి ఉంటూంటాడు.. ముంబైలోని ఒక స్లమ్‌లో.  పదహారేళ్లకు ప్రేమలో పడి.. ప్రేమించిన వాడిని నమ్మి.. ముంబై వచ్చేస్తుంది సర్‌గమ్‌. ఆమె గర్భవతి కాగానే అతను అడ్రస్‌ చెప్పకుండా వెళ్లిపోతాడు. మోసపోయానని అర్థమైన సర్‌గమ్‌ ముంబైలోనే ఉండిపోతుంది. కొడుకును కంటుంది. బట్టలు కుడుతూ.. ఎంబ్రాయిడరీ చేస్తూ కొడుకును పెంచుకుంటూంటుంది. కన్హయ్య కూడా సర్కారీ బడిలో చదువుతూ.. ఆ స్లమ్‌కి దగ్గర్లోని ఫుట్‌పాత్‌ మీద న్యూస్‌ పేపర్స్‌ స్టాల్‌ పెట్టుకున్న పప్పూ దగ్గర పనిచేస్తూంటాడు. స్లమ్స్‌ వాళ్ల ఆరోగ్యం మీద పనిచేసే ఈవా అనే స్వచ్ఛందసేవా కార్యకర్తకు సాయం చేస్తుంటాడు. కన్హయ్యతోపాటు ఆ పిల్లగ్యాంగ్‌లో రింగ్‌టోన్, నిరాలా, మంగళా ఉంటారు. ఈ ముగ్గురు అబ్బాయిల కంటే మంగళ కొంచెం పెద్దది. నలుగురూ కలిసి బాల్యాన్ని ఆస్వాదిస్తుంటారు. అల్లరి చేస్తారు.. తమ భవిష్యత్‌ గురించి కలలు కంటూంటారు. 

బాగుంది.. మరి ప్రైమ్‌మినిస్టర్‌ ఎందుకొచ్చాడు వీళ్ల జీవితాల్లోకి?
ఆ బస్తీలోని చాలామంది మగాళ్ల కళ్లు ఒంటరి తల్లి అయిన సర్‌గమ్‌ మీదే. భార్యలేని సాయినాథ్‌ (మంగళ తండ్రి) కూడా సర్‌గమ్‌ను చూస్తూంటాడు.. అవకాశం ఎప్పుడొస్తుందా అని. అతను ఆ బస్తీలో కంప్యూటర్‌లో సినిమాలు ప్రదర్శిస్తూ థియేటర్‌లాంటిది నడిపిస్తూంటాడు. చూపులతోనే బెదిరిస్తూ జాగ్రత్త పడ్తూంటుంది సర్‌గమ్‌. అయితే ఆ స్లమ్‌లో పర్సనల్‌ టాయ్‌లెట్ల మాట స్వచ్ఛభారత్‌ ఎరుగు.. కనీసం పబ్లిక్‌ టాయ్‌లెట్లూ ఉండవు. వాటర్‌ బాటిల్‌ పట్టుకొని బయటకు వెళ్లే అవస్థే అందరిదీ. సర్‌గమ్‌ కూడా ఏ అర్ధరాత్రో.. తెల్లవారు జాము నాలుగింటికో లేచి బహిర్భూమికి వెళ్తూంటుంది. అలా వెళ్లిన ఒకరాత్రి ఆమె మీద లైంగికదాడి జరుగుతుంది. ముందు మంగళ తండ్రి సాయినాథ్‌ ఆమె చేయి పట్టి లాగడానికి ప్రయత్నిస్తూంటే అతని చెంప పగలగొడ్తుంది. తప్పించుకొని ముందుకు వెళ్తూన్న క్రమంలో బస్తీ శివారులోని పోలీసు ఎదురుపడ్తాడు. భయపడుతూ.. బాధపడుతూ జరిగింది చెప్తుంది సర్‌గమ్‌.

‘రిపోర్ట్‌ ఇవ్వు... మరిదా.. ’ అని అదోరకంగా అంటూ ఆమె చేయిపట్టుకొని స్టేషన్‌కు లాక్కెళ్లబోతాడు. ప్రమాదం గ్రహించిన సర్‌గమ్‌ ‘‘రిపోర్ట్‌ ఇవ్వను సర్‌.. మా బస్తీలో అతనే.. బెదిరిస్తే సరిపోతుంది’’ అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంది. అయినా వినకుండా ఆమెను బలవంతం చేస్తాడు. ఆ అవమానంతోనే తెల్లవారి బస్తీకి చేరుకుంటుంది. అందరూ గుమిగూడి సర్‌గమ్‌కు జరిగిన అన్యాయాన్ని విచారిస్తూంటారు. సాయినాథ్‌ను తిడ్తూంటారు. అతను ఇబ్బంది పెట్టాడు తప్ప ఏమీ చేయలేదని సర్‌గమ్‌కు తెలుస్తుంది కాని అసలు విషయాన్ని బయటపెడితే ఇన్‌స్పెక్టర్‌ బతకనివ్వడనే భయంతో నోరు విప్పదు. సాయినాథ్‌ కూడా తాను ఆ తప్పు చేయకపోయినా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటాడు. ‘‘నా వల్ల తప్పు జరిగింది కాబట్టి సర్‌గమ్‌ను పెళ్లి చేసుకుంటా’ అంటాడు. ఛీత్కారంగా చూసి ఇంటికి వెళ్లబోతుంటే అక్కడ నిలబడి ఈ పంచాయతీ అంతా చూస్తున్న, వింటున్న కొడుకు కనపడతాడు సర్‌గమ్‌కు. తల్లికి జరిగిన అన్యాయం.. దానికి కారణమూ అర్థమవుతుంది కన్హయ్యకు. 

మరుసటి రోజు...
వాళ్లుంటున్న ఇంటి కొండ మీద.. పై అంచుకి కొన్ని వెదురు బొంగులు మోసుకెళ్తాడు కన్హయ్య. అక్కడ  ఓ గుంట తవ్వి.. దాని మీద రెండు బండలు వేసి.. చుట్టూ కొన్ని వెదురు బొంగులు పాతి..  మళ్లీ వాటి చుట్టూ వాళ్లమ్మ పాత చీరను కట్టి టాయ్‌లెట్‌ను ఏర్పాటు చేస్తాడు. వాళ్లమ్మను తీసుకెళ్లి.. ఆ టాయ్‌లెట్‌ను చూపిస్తూ.. ‘‘అమ్మా .. ఇది నీ కోసమే. ఇప్పటి నుంచి చీకట్లో నువ్వు బయటకు వెళ్లొద్దు. దర్జాగా ఇక్కడికే రా.. నిన్ను ఎవరూ ఏమీ అనరు’’ అంటాడు. విన్న అమ్మ కళ్లల్లో నీళ్లు. కొడుకును దగ్గరకు తీసుకొని ఏడుస్తుంది. తమ బతుకుల మీద జాలి పడ్తుంది. అయితే ఆ టాయ్‌లెట్‌ను వాళ్లమ్మ ఉపయోగించుకునేలోపే బస్తీలో వాళ్లంతా వాడి కంగాళీ చేసేస్తారు. ఊసురోమంటాడు కన్హయ్య. ‘‘ఇలా కాదు.. గవర్నమెంట్‌ను అడగాలి టాయ్‌లెట్‌ కట్టమని’’ అని ఎవరో సలహా ఇస్తే.. ముంబై మున్సిపాలిటీ సిబ్బందినీ అడుగుతారు ఈ పిల్లగ్యాంగ్‌. ‘‘ స్వచ్ఛభారత్‌ స్కీమ్‌లో మీ బస్తీ లేదు కాబట్టి టాయ్‌లెట్‌ కట్టలేం’’ అని చెప్తారు వాళ్లు. తమ తక్షణ కర్తవ్యం ఏంటని అడుగుతాడు కన్హయ్య. ప్రైమ్‌మినిస్టర్‌కు దరఖాస్తు చేసుకోవడమే అని నిర్దేశిస్తారు. 

మేరే ప్యారే ప్రైమ్‌మినిస్టర్‌ జీ.. 
‘‘ప్రియమైన ప్రధానమంత్రి గారికి.. నా పేరు కన్హయ్య. మీరు నన్ను  ప్రేమగా కన్నూ అని పిలవొచ్చు. మా బస్తీలో టాయ్‌లెట్‌ లేకపోవడం వల్ల మా అమ్మ రోజూ చీకట్లో బయటకు వెళ్లేది. ఒకరోజు ఆమెను రేప్‌ చేశారు. మా అమ్మకు జరిగినట్టుగా మా బస్తీలో ఇంకెవరికీ జరక్కూడదు. అందుకే మీరు మా బస్తీలో టాయ్‌లెట్లు కట్టించాలి. మా అమ్మకు జరిగినట్టు మీ అమ్మకు జరిగితే మీకు నా బాధ అర్థమయ్యేది. అయినా అర్థం చేసుకొని మా బస్తీలో టాయ్‌లెట్లు కట్టించండి.. ప్లీజ్‌.. ఇట్లు మీ కన్నూ’’ అంటూ ఉత్తరం రాస్తాడు. ఆ లేఖను పట్టుకొని ఇంట్లో చెప్పకుండా మంగళ సూచన మేరకు కన్హయ్య, రింగ్‌టోన్, నిరాలా ఢిల్లీ వెళ్తారు. ప్రధానమంత్రి ఆఫీస్‌లో ఉత్తరం అందజేస్తారు. ప్రధానమంత్రి ఆఫీస్‌లో వీళ్లతో మాట్లాడి, ఉత్తరం తీసుకున్న ఆఫీసర్‌ (అతుల్‌ కులకర్ణి)కి ఒకసారి ఫోన్‌ కూడా చేస్తాడు కన్హయ్య. మొత్తానికి ఆ అబ్బాయి కృషి ఫలించి ఆ బస్తీలో నాలుగు టాయ్‌లెట్లు వెలుస్తాయి. కన్హయ్య చేతే ప్రారంభోత్సవం చేయిస్తారు. కన్హయ్య ఆనందానికి అవధులుండవు. వాళ్లమ్మకు భద్రత దొరికిందనే భరోసా.. ఇంక ఎవరి అమ్మలు.. అక్కలు.. చెల్లెళ్లకు ఏం కాదనే నమ్మకం ఆ పసికళ్లల్లో! ఈ సినిమాకు రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా దర్శకత్వం వహించారు. సర్‌గమ్‌గా అంజలీ పాటిల్, కన్హయ్యాగా ఓం కనోజియా నటించారు.– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement