
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పలు శాఖల అధికారులను ఆదేశించారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం జాతర ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాలని, విదేశీ యాత్రికుల కోసం అత్యున్నత సదుపాయాలతో ప్రత్యేక నివాసాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సాంస్కృతిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, జాతర కార్యక్రమాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వాకాటి కరుణను జాతర కోసం ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, గిరిజన ఎంపీలను ఆహ్వానించాలని ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అత్యాధునిక మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. జాతర ఏర్పాట్లపై సాంస్కృతిక దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా శాఖల వారీగా సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. యాత్రికులకు హెలికాప్టర్ సేవలను కల్పించాలన్నారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి వెంకటేశం, దేవాదాయ శాఖ కమిషనర్ శివ శంకర్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, నాగిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment