
జిల్లా ప్రాజెక్టులపై కేంద్రం కరుణించేనా?
గతేడాది యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.
- నేడు కేంద్ర బడ్జెట్
- పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు దక్కేనా
- గ్యాస్ ధరపై ప్రజల ఆసక్తి
విజయవాడ సిటీ : గతేడాది యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయికి ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లతో విస్తరణ, ఆధునిక హంగులు కల్పిస్తామని తెలిపారు. ఆ నిధులు రాలేదు. విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి చేరలేదు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. బంటుమిల్లి, కృత్తివెన్ను ప్రాంతాల్లో సముద్రపు కరకట్టను జాతీయ విపత్తుల నివారణ కింద అభివృద్ధి చేయాలని గతంలో యూపీఏ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్ర ఏర్పాటు ప్రతిపాదన పెండింగులో ఉంది. ఈ కేంద్రానికి యూపీఏ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన 361ఎకరాల అటవీ భూములను సేకరించారు. కేంద్ర బడ్జెట్‌లో నిధులు మంజూరు కాకపోవటంతో ఇదీ కాగితాలకే పరిమితమైంది.
జిల్లాలో అతి ముఖ్యమైన ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ నుంచి నిధులు రాకపోవడం వల్లే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడిన ఎన్‌డీఏ ప్రభుత్వం తొలిసారిగా గురువారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. పన్నుల భారం లేకుండా, నిత్యావసర సరకుల ధరలను అదుపు చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉండాలని జనం ఆశిస్తున్నారు. జిల్లాలో మూడు పెండింగు ప్రాజెక్టులకు కూడా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
ముందుగానే వాతలు..
అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మోడీ సర్కారు రైల్వే చార్జీలు, పెట్రోలు డీజిల్, కిరోసిన్ ధరలను పెంచింది. గ్యాస్ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్ ఎలా ఉంటుందోనని ప్రజలు హడలెత్తిపోతున్నారు.
రుణమాఫీ వైపు అందరి చూపు..
గత ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని టీడీపీ ఇచ్చిన హామీ ఇచ్చింది. ఎన్‌డీఏలో టీడీపీ భాగస్వామపక్షం కావడంతో రుణమాఫీపై కేంద్ర బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు ఉంటాయనే దానిపైనా రైతన్నలు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో లక్షలాది మంది రైతులకు సంబంధించి దాదాపు రూ.9,137 కోట్లు రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాల ధరలను నియంత్రించాలని రైతులు కోరుతున్నారు. ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపుపైనా జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ధరలు అదుపుచేసేనా..
ఇప్పటికే మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రకం బియ్యం కిలో రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. పప్పు, వంట నూనెల ధరలు కూడా పెరిగిపోయాయి. ఉల్లి, అల్లం ధరలు కూడా అడ్డూ అదుపులేకుండా పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో వివిధ వస్తువులపై పన్నులు విధిస్తే ఆ భారం మళ్లీ నిత్యావసర సరకులపై పడే ప్రమాదం ఉంది. ఎన్నికల సమయంలో అధిక ధరలను నియంత్రిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేతలు ప్రస్తుతం ఏ మేరకు చర్యలు తీసుకుంటారని ప్రజలు ఎదురుచూస్తున్నారు.