అమరావతి: పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా భారత విదేశాంగశాఖ సమన్వయంతో ఆగస్టు 9 న విజయవాడలో భారీ సదస్సు నిర్వహించనుంది. 30-40 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్ జనరళ్లు హాజరు కానున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల ద్వారా 4.01 లక్షలకు పైగా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలను కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి పెండింగ్ లో పెట్టిన ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే రాష్ట్రంలో పరిశ్రమల్లో 75 శాతం స్ధానికులకే రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ ప్రయత్నాలు ఒకవైపు చేస్తూనే మరోవైపు మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంతో పరిశ్రమల స్ధాపనకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆగస్టు 9న నిర్వహించబోయే ఈ సదస్సులో మొదట ఆయా దేశాల రాయబారులు, కాన్సులేట్ జనరళ్లతో సీఎం సమావేశమవుతారు. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు పారిశ్రామిక రంగానికి ఏవిధంగా లాభపడతాయో వివరిస్తారు.
నవరత్నాల పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల పెంపు, తద్వారా రాష్ట్రంలో ఉత్తమ సమాజ నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలను ఆయన విశదీకరిస్తారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాథిరంగాల్లో చేపడుతున్న అనేక కార్యక్రమాలను వారికి తెలియజేస్తారు. లంచాల్లేని వ్యవస్థలు, అవినీతిలేని పాలన, పారదర్శక విధానాలకోసం తీసుకొచ్చిన ముందస్తు న్యాయసమీక్ష ద్వారా ఏవిధంగా ప్రభుత్వం స్వచ్ఛమైన పరిపాలనకు కట్టుబడి ఉందో తెలియజెప్తారు. ముఖ్యంగా పరిశ్రమలకు సానుకూలంగా తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రభుత్వం రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్‌జనరళ్లకు వివరించనుంది.
రాష్ట్రంలో వివిధ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటుచేయనున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాలద్వారా నాణ్యమైన మానవనరులను అందుబాటులోకి తీసుకురానున్న అంశాన్నికూడా ఈ సదస్సులో వివరించనుంది. విద్యుత్ శాఖలో తీసుకొస్తున్న పలు సంస్కరణలు కారణంగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యుత్‌ను తీసుకొస్తామని వారికి వివరిస్తుంది. రాష్ట్రంలో ఉన్న వనరులు, తీరప్రాంతం, రవాణా, సర్వీసు, వైద్యం, సాంకేతిక రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను కూడా వారికి వివరిస్తుంది.
ఆగస్టు 8న కియా నుంచి కొత్త కారుకు సన్నాహాలు
దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ తన కొత్త కారును ఆగస్టు 8 నుంచి విడుదలకు సన్నాహాలు చేస్తోంది. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో తన కొత్తకారును మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సీఎం వైఎస్ జగన్‌ను కియా కంపెనీ కోరింది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమైన కియా కంపెనీ ప్రతినిధులు సీఎం పర్యటనపై చర్చించారు. తమ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం వెనుక దివంగత మహానేత వైయస్సార్ గారి పాలనలోనే బీజం పడిన విషయాన్ని వారు ఇదివరకే వెల్లడించారు. కియా కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ హన్–వూ–పార్క్ జూన్ 13న వైఎస్ జగన్‌కు లేఖ కూడా రాశారు. దివంగత మహానేతతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment