‘కాంట్రాక్ట్ థియరీ’కి ఆర్థిక నోబెల్
ఓలివర్, హోమ్‌స్ట్రామ్ కృషికి పురస్కారం
స్టాక్‌హోమ్: ప్రముఖ ఆర్థికవేత్తలు ఓలివర్ హార్ట్(బ్రిటన్-అమెరికా), బెంట్ హోమ్‌స్ట్రామ్(ఫిన్‌లాండ్)లను ఈ ఏడాది ఆర్థిక శాస్త్ర నోబెల్ పురస్కారం వరించింది. ‘కాంట్రాక్ట్ థియరీ’లో చేసిన విశేష కృషికి గానూ వీరిని సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్యూరీ సోమవారం ప్రకటించింది. బీమా పాలసీల రూపకల్పన, అధికారుల వేతనంతో పాటు జైళ్ల నిర్వహణ వంటి వాటికి ఈ సిద్ధాంతం ఎంతో ఉపయోగపడుతుందని నోబెల్ జ్యూరీ చెప్పింది. అత్యున్నత స్థాయి అధికారులకు పనితీరు ఆధారిత వేతనం, ఇన్సెంటివ్‌లు, బీమాలో మినహాయింపులు, పాలసీదారుల క్లెయిమ్‌లు, ప్రభుత్వ సంస్థల కార్యకలాపాల ప్రైవేటీకరణ, ఒప్పందాల రూపకల్పనలో లోటుపాట్ల వంటి విభిన్న అంశాలెన్నింటినో సమగ్రంగా విశ్లేషించడం ద్వారా కాంట్రాక్ట్ థియరీని ఓలివర్, హోమ్ స్ట్రామ్‌లు అభివృద్ధి చేసినట్టు తెలిపింది.
అద్భుత సాధనం...
వాస్తవిక ఒప్పందాలు, సంస్థల గురించిన అవగాహన, సమస్యల పరిష్కార మార్గాలతో పాటు టీచర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు, జైలు గార్డులు నిర్దేశిత లేదా పని ఆధారిత వేతనం పొందేందుకు ఈ సరికొత్త సైద్ధాంతిక ఉపకరణాలు సహాయపడతాయని నోబెల్ కమిటీ సభ్యుడు పర్ స్ట్రాంబర్గ్ చెప్పారు. దివాలా చట్టం నుంచి రాజకీయ రాజ్యాంగం వరకు సంస్థలు, విధానాల రూపకల్పనకు ఇది మేథో పునాది వేసినట్టు పేర్కొన్నారు. సమస్యేమిటో తెలుసుకోవడానికే కాకుండా, వాస్తవ పరిస్థితులను విశ్లేషించే అవకాశం కాంట్రాక్ట్ థియరీ వల్ల కలుగుతుందని, తద్వారా షేర్‌హోల్డర్లు, కార్పొరేట్ బోర్డులు మరింత మెరుగైన ఒప్పందాలు రూపొందిం చుకోవడానికి అద్భుత సాధనంగా సహాయపడుతుందని తెలిపారు.
హార్ట్... హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యుడిగా సేవలందిస్తున్నారు. ఈయన 1948లో జన్మించారు. హోమ్‌స్ట్రామ్ (67) మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అర్థశాస్త్రం, మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్. విడివిడిగానూ, కలిసి పనిచేసిన వీరు నోబెల్ అవార్డు కింద ఇచ్చే సుమారు రూ.6.14 కోట్ల (924 వేల డాలర్లు) నగదు బహుమతిని పంచుకోనున్నారు. గత ఏడాది అర్థశాస్త్ర నోబెల్ అమెరికా-బ్రిటన్ పరిశోధకుడు అంగస్ డేటన్‌కు దక్కింది. ఏటా ఇచ్చే ఆరు నోబెల్ పురస్కారాల్లో ఐదింటిని ఇప్పటికే జ్యూరీ ప్రకటించింది. చివరిదైన సాహిత్య పురస్కార గ్రహీతెవరన్నది గురువారం తెలుస్తుంది. డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో జరిగే వేడుకలో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. హార్ట్, హోమ్‌స్ట్రామ్‌లు ఈ గౌరవానికి అర్హులంటూ 2008 ఆర్థిక నోబెల్ పురస్కార గ్రహీత పాల్ క్రుగ్‌మన్ అభినందించారు.
ఆనందం కుటుంబంతో...
‘నోబెల్ బహుమతి వచ్చిందని తెలియగానే మొట్టమొదట నా భార్యను ఆలింగనం చేసుకున్నా. చిన్నబ్బాయిని నిద్రలేపి ఆనందం పంచుకున్నా. సహచరుడికి ఫోన్ చేసి మాట్లాడా..’ అంటూ హార్ట్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యా. ప్రతిష్టాత్మక అవార్డు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని హోమ్‌స్ట్రామ్ చెప్పారు.