భారతీయుడికి  ఆర్కిటెక్చర్‌ ‘నొబెల్‌ ’..! | Balkrishna Doshi Wins Pritzker Architecture Prize 2018 | Sakshi

భారతీయుడికి  ఆర్కిటెక్చర్‌ ‘నొబెల్‌ ’..!

Published Mon, May 21 2018 10:58 PM | Last Updated on Fri, May 25 2018 10:08 AM

Balkrishna Doshi Wins Pritzker Architecture Prize 2018 - Sakshi

నిర్మాణ, వాస్తు శాస్త్ర రంగం (ఆర్కిటెక్చర్‌) లో నోబెల్‌ బహుమతి అంత స్థాయిగా పరిగణించే ప్రిజ్‌కర్‌ అవార్డును ఇటీవల టోరొంటోలో  91 ఏళ్ల ప్రొ. బాల్‌కృష్ణ విఠల్‌దాస్‌ దోషి అందుకున్నారు. ఆర్కిటెక్టులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ గౌరవాన్ని సాధించిన తొలి భారతీయుడిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఆర్కిటెక్చర్‌ రంగంలో కృషి చేస్తున్న ఆయన తనదైన సొంత శైలితో పొందిన గుర్తింపుతో దక్షిణాసియాలోనే ప్రముఖ ఆర్కిటెక్ట్‌గా పేరుగడించారు. 1989లో ఇండోర్‌లోని ‘అరణ్య లోకాస్ట్‌ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌’ ప్రాజెక్టు’ కోసం జోషి రూపొందించిన డిజైన్‌కు ఆగాఖాన్‌ అవార్డ్‌ ఫర్‌ ఆర్కిటెక్చర్‌ అవార్డు లభించింది.

వివిధ సౌకర్యాలు, వసతులు అందుబాటులోకి వచ్చేలా అల్పాదాయ వర్గాలు మొదలు ఇతర వర్గాల వారి కోసం  నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 80 వేల మంది లబ్దిపొందారు.  రాయల్‌ ఇనిసిట్యూట్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఆర్కిటెక్ట్స్‌ ఫెలోగా ఉన్నారు.  బెంగళూరులోని ఇండియన్‌ ఇనిసిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)  డిజైన్లు ఇప్పటికీ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. అహ్మదాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్, టెక్నాలజీ, టాగోర్‌ మెమోరియల్‌ హాల్, ద ఇనిసిట్యూట్‌ ఆఫ్‌ ఇండోలజీ డిజైన్లకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. తాను ‘వాస్తు శిల్ప’ పేరిట అహ్మదాబాద్‌లో  ప్రారంభించిన కన్సల్టెన్సీ సంస్థలో దోషి నేటికి చురుకుగా పనిచేస్తున్నారు. 


జీవనసాఫల్య పురస్కారం...
‘ఈ అవార్డును అందుకోవడం అత్యంత సంతృప్తి కలిగించింది. జీవితంలో ఇలాంటి పురస్కారం వస్తుందని ఊహించలేము.  ఇంత కంటే ఇంకా ఏమి కోరుకోవాలి ?ఈ వయసులో ఇలాంటి అవార్డును స్వీకరించడం ఎంతో సాధించామన్న  అనుభూతిని కలిగిస్తోంది’ అంటూ ఈ అవార్డును అందుకున్నారు.  ‘ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో పట్టణీకరణ, ప్రణాళికలు, గ్రామీణాభివృద్ధి, ఆర్థికరంగం, ఉపాధి వంటి కీలక అంశాల గురించి చర్చిస్తున్నాం. వీటి గురించి ఇతర దేశాలు ఎప్పుడో ఆలోచించి, మార్గదర్శకత్వంతో ముందుకెళ్లాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు దేశీయ ఆర్కిటెక్టులను (అన్నింటికి విదే«శీ ఆర్కిటెక్టులపైన ఆధారపడకుండా) కూడా విశ్వాసంలోకి తీసుకుని, వారిని ప్రజల అవసరాల కోసం పనిచేసేలా చేయాలి’ అని దోషి సూచించారు. 

ఆ డిజైన్లు జ్ఞాపకాల దొంతరలు...
1927 ఆగస్టు 26న పుణెలో జన్మించారు. ఫర్నీచర్‌ తయారీ, అమ్మకం వ్యాపార కుటుంబానికి చెందిన ఆయన అనుకోకుండా ఆర్కిటెక్చర్‌ రంగంలోకి అడుగుపెట్టారు. దేశం స్వాతంత్య్రం సాధించిన  కాలంలో జోషి ఆర్కిటెక్చర్‌ చదువుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సృజనాత్మక ఆర్కిటెక్ట్‌ చార్లస్‌ ఎడ్వర్డ్‌ జీనెరెట్‌ ( లే కోర్‌బుసియర్‌గా ప్రసిద్ధులు) ఆయన గురువుగా పరిగణిస్తారు. తన వినూత్న డిజైన్లతో ఆధునిక నగరాలుగా ఛండీగఢ్, అహ్మదాబాద్‌లను తీర్చిదిద్దిన కోర్‌బుసియర్‌కు మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన ‘ ఒకే కన్మని’ తమిళ సినిమా, ‘ఒకే జాను’ పేరిట తీసిన హిందీ రీమేక్‌లోనూ ఆయన నటించారు.  

దోషి ముఖ్యమైన భవనాల్లో కొన్ని...
–1969–71లో హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) టౌన్‌షిప్‌
–1979–80 అహ్మదాబాద్‌లో బీవీ దోషి కార్యాలయం ‘సంగత్‌’
–1972లో అహ్మదాబాద్‌లోని  సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ టెక్నాలజీ
–1962–74 మధ్యలో బెంగళూరులోని ఇండియన్‌ ఇనిసిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌
–1989 ఢిల్లీలోని నేషనల్‌ ఇనిసిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌
–1990 అహ్మదాబాద్‌లో అమ్‌దావద్‌ ని గుఫా
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement