ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్‌ నోబెల్‌ | Machine learning pioneers win Nobel physics prize | Sakshi
Sakshi News home page

ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్‌ నోబెల్‌

Published Wed, Oct 9 2024 4:57 AM | Last Updated on Wed, Oct 9 2024 6:12 AM

Machine learning pioneers win Nobel physics prize

జాన్‌ హాప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లకు పురస్కారం 

మెషీన్‌ లెర్నింగ్‌ను కొత్త పుంతలు తొక్కించిన ఘనులు

స్టాక్‌ హోం: వైద్య శాస్త్రం మాదిరిగానే ఫిజిక్స్‌లో కూడా ఈ ఏడాది నోబెల్‌ అవార్డు ఇద్దరు సైంటిస్టులను వరించింది. మెషీన్‌ లెరి్నంగ్‌ను కొత్త పుంతలు తొక్కించి.. కృత్రిమ మేధ వికాసానికి మార్గదర్శకులుగా నిలిచిన సైంటిస్టులు జాన్‌ హాప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లు అత్యున్నత పురస్కారం అందుకోనున్నారు. రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. గతేడాది ఫిజిక్స్‌ నోబెల్‌ను ముగ్గురు సైంటిస్టులకు అందించడం తెలిసిందే.  

హింటన్‌.. ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ 
హింటన్‌ ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)గా ప్రసిద్ధుడు. కెనడా, బ్రిటన్‌ పౌరసత్వమున్న ఆయన టొరంటో వర్సిటీలో పని చేస్తున్నారు. హాప్‌ఫీల్డ్‌ది అమెరికా. ప్రిన్స్‌టన్‌ వర్సిటీలో పని చేస్తున్నారు. వారు రూపొందించి, అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్ర నియమాలు, పనిముట్లు నేటి శక్తిమంతమైన మెషీన్‌ లెర్నింగ్‌కు పునాదులని నోబెల్‌ కమిటీ కొనియాడింది. ‘వారు అభివృద్ధి చేసిన ఆర్టిఫీషియల్‌ న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ సహాయక మెమరీలుగా ఎన్నో రంగాల్లో కీలక సేవలు అందిస్తున్నాయి.

ఫేషియల్‌ రికగ్నిషన్‌ మొదలుకుని, యాంత్రిక అనువాదం దాకా అన్నింటా అవి మన జీవితంలో భాగంగా మారాయి‘ అని ప్రశంసించింది. అయితే, ఈ సాంకేతిక ప్రగతి మన భవిష్యత్తుపై ఎన్నో సందేహాలను లేవనెత్తిందని అభిప్రాయపడింది. మానవాళికి మేలు జరిగేలా దీన్ని సురక్షిత, నైతిక పద్ధతుల్లో వాడటం చాలా ముఖ్యమని పేర్కొంది. ఈ ఆందోళనలు సహేతుకమేనని హింటన్‌ తరచూ చెబుతుంటారు. వీటిపై మరింత స్వేచ్చగా మాట్లాడేందుకు వీలుగా ఆయన గూగుల్‌లో ఉన్నతోద్యోగాన్ని కూడా వదులుకోవడం విశేషం. ఈ నేపథ్యం దృష్ట్యా తనకు అత్యున్నత పురస్కారం రావడం నమ్మశక్యంగా లేదని చెప్పారాయన. మానవాళిని ఏఐ కనీవినీ ఎరగని రీతిలో ప్రభావితం చేయడం ఖాయమని ఆయన ఇప్పటికే జోస్యం చెప్పారు. దీన్ని ఏకంగా పారిశ్రామిక విప్లవంతో పోల్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement