విద్యార్థులపై ఒత్తిడి తగదు | Sakshi special interview with ashok sen | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై ఒత్తిడి తగదు

Published Wed, Aug 8 2018 2:16 AM | Last Updated on Wed, Aug 8 2018 2:16 AM

Sakshi special interview with ashok sen

భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని మించినది ‘ఫండమెంటల్‌ ఫిజిక్స్‌ అవార్డు’. శాస్త్ర పరిశోధన రంగంలో విశిష్ట గుర్తింపు కలిగిన ఈ అవార్డును రష్యన్‌ నోబెల్‌గా పరిగణిస్తారు. దీని కింద ఇచ్చే నగదు బహుమతి నోబెల్‌ బహుమతికి రెట్టింపు ఉంటుంది. ఈ అవార్డు సాధించిన భారతీయుడు, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ అశోక్‌సేన్‌. ఆయన ప్రతిపాదించిన తీగ సిద్ధాంతానికి(స్ట్రింగ్‌ థియరీకి) ఫండమెంటల్‌ ఫిజిక్స్‌ అవార్డు దక్కింది. సేన్‌ను ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ స్వయంగా ‘రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌’కు నామినేట్‌ చేశారు. సేన్‌కు పలు జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి.

భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. దేశ విదేశాల్లో పరిశోధనలు చేసిన ఆయన కాన్పూర్‌ ఐఐటీలో ఎంఎస్సీ (ఫిజిక్స్‌) చేశారు. అమెరికాలోని ‘స్టోనీ బ్రూక్‌’ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)తో పాటు పలు దేశాల్లో పనిచేసిన తర్వాత స్వదేశానికి వచ్చి టాటా ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో పనిచేశారు. ప్రస్తుతం అలహాబాద్‌లోని హరీష్‌–చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలు సాగిస్తున్నారు.


మల్లు విశ్వనాథరెడ్డి – సాక్షి, అమరావతి బ్యూరో :  ఓ విద్యార్థి విజ్ఞానానికి, చదివే మాధ్యమానికి (మీడియం) సంబంధం లేదని ప్రముఖ భౌతిక శాస్త్ర వేత్త, ఫండమెంటల్‌ ఫిజిక్స్‌ అవార్డు గ్రహీత ప్రొఫె సర్‌ అశోక్‌సేన్‌ పేర్కొన్నారు. కాలేజీలో చేరే వరకూ తాను బెంగాలీ మాధ్యమంలో చదువుకున్నానని చెప్పారు.

ప్రాథమిక విద్యకు చాలా ప్రాధాన్యం ఉందని, అందుకు తగినట్లుగా బడ్జెట్‌ కేటాయింపులు పెరగాలన్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో సీటు సాధించాలనే లక్ష్యంతో పిల్లలపై తీవ్ర ఒత్తిడి పెంచడం తగదని తల్లిదండ్రులకు సూచించారు. ఎక్కువ జీతం లభించే ఉద్యోగం వైపు కాకుండా ఆసక్తి ఉన్న వైపు ప్రయాణిస్తేనే విజయం వరిస్తుందని తెలిపారు. ‘చుక్కపల్లి పిచ్చయ్య 6వ స్మారక ఉపన్యాసం’కోసం విజయవాడ వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ..

సాక్షి: ప్రతిష్టాత్మక ఫండమెంటల్‌ ఫిజిక్స్‌ అవార్డు అందుకున్నందుకు అభినందనలు. అవార్డులో భాగంగా వచ్చిన నగదు తీసుకోవడానికి ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చిందా?
సేన్‌: లేదు. అవార్డు కింద 3 మిలియన్‌ డాలర్ల నగదు బహుమతి వచ్చింది. ట్రస్టు ఏర్పాటు చేశా. విద్యారంగంలో ఈ ట్రస్టు పనిచేస్తోంది.

సాక్షి: మీ బాల్యం గురించి చెప్పండి. మీరు భౌతికశాస్త్రం వైపు రావడానికి స్ఫూర్తి ఎవరు?
సేన్‌: మా నాన్న ఫిజిక్స్‌ టీచర్‌. అందువల్ల ఫిజిక్స్‌ మీద ఆసక్తి కలిగింది. నేను +2 పూర్తి చేసిన సమయంలో బెంగాల్‌లో ఫిజిక్స్‌ మోస్ట్‌ పాపులర్‌ సబ్జెక్ట్‌. బోర్డు పరీక్షల్లో నేను టాప్‌ 10లో లేను. టాప్‌ టెన్‌లో ఐదుగురు ఫిజిక్స్‌ తీసుకున్నారు. అప్పట్లో ఫిజిక్స్‌కు బాగా క్రేజ్‌ ఉండేది.

సాక్షి: పరిశోధన రంగం పట్ల ఆకర్షితులు కావడానికి కారకులెవరు?
సేన్‌: ఒకరని చెప్పలేను. నేను డిగ్రీ చదివిన కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో అమల్‌ రాయ్‌చౌధురి, కాన్పూర్‌ ఐఐటీలో చాలా మంది ప్రొఫెసర్లు, టీచర్లు చాలా మంది నా జీవితంలో ఉన్నారు.  
సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ పట్ల విపరీతమైన ఆకర్షణ ఉంది. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలు ఐఐటీల్లో చదవాలని ఉబలాటపడుతున్నారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని కొన్ని కార్పొరేట్‌ కాలేజీలు పెద్ద వ్యాపారం చేస్తూ రూ. కోట్లు సం పాదించుకుంటున్నాయి. పాఠశాల స్థాయిలోనే ఐఐ టీ ఫౌండేషన్‌ కోర్సులు నిర్వహిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనిపై మీ సలహా ఏమిటి?
సేన్‌: పిల్లలు ఎలా ఎదగాలి? ఏం కావాలి? అనే విషయాలను వారికే విడిచిపెట్టాలి. పాఠశాలల్లో ఉన్న పిల్లలకు తమ ఆసక్తి ఏమిటనే విషయం పూర్తిగా తెలియకపోవచ్చు. పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తగదు. ఐఐటీలో సీటు రాకపోతే జీవితం లేదనే భావన మంచిది కాదు. పాఠశాల స్థాయి నుంచే ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సులంటే పిచ్చి అనుకోవాలి.

సాక్షి: టెన్త్‌ తర్వాత ఎక్కువ మంది ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వైపు వెళ్తున్నారు. ఏటా లక్షలాదిగా ఇంజనీర్లు తయారవుతున్నారు. కోర్‌ సైన్స్‌ వైపు రావట్లే దు. పరిశోధన రంగం మీద దీని ప్రభావం ఉండదా?
సేన్‌: అందరూ ఇంజనీర్లు కావాలనే ఆలోచన మంచిది కాదు. కోర్‌ సైన్స్‌లోనూ మంచి భవిష్యత్‌ ఉంది. సైన్స్‌ పట్ల ఆసక్తి ఉంటే తప్పనిసరిగా అటు వైపు రావాలని నేను విద్యార్థులకు సూచిస్తా. ఆసక్తి ఉన్న వైపు ప్రయాణిస్తేనే విజయం వరిస్తుంది.

సాక్షి: మీరు పలు దేశాల్లో పరిశోధన రంగంలో పని చేశారు. విదేశాలకు, ఇక్కడకు ఉన్న తేదా ఏమిటి?
సేన్‌: థియరిటికల్‌ రీసెర్చ్‌లో పెద్దగా ఉండదు. నేను అందులోనే పరిశోధనలు చేస్తున్నా. సైద్ధాంతిక పరిశోధనకు ల్యాబ్‌ కూడా అక్కర్లేదు. విదేశీ వర్సిటీల్లో పరిశోధన కార్యకలాపాలు బాగా ఎక్కువ. ప్రయోగాత్మక పరిశోధనకు మంచి అవకాశాలున్నాయి. మనకు బ్యూరోక్రసీ పెద్ద అడ్డంకి. ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నాయి కానీ వ్యయం చేయడంలోనే సమస్యలున్నా యి. శాస్త్ర పరిశోధన రంగంలో ఉన్న వారికే వ్యయం చేసే అధికారం ఇవ్వాలి. లోయస్ట్‌ బిడ్డర్‌ విధానం పనికిరాదు. బ్యూరోక్రసీ దాన్నే అనుసరిస్తోంది.  

సాక్షి: విద్యలో నాణ్యత పెరగడానికి మీరిచ్చే సలహా?
సేన్‌: ప్రాథమిక విద్య చాలా ముఖ్యం. కాలేజీల్లో, వర్సిటీల్లో మాత్రం టీచర్ల మీద మరీ ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదు. కొంత గైడెన్స్‌ ఉంటే సరి పోతుంది. ప్రాథమిక స్థాయిలో అలా కాదు. టీచర్‌ గైడెన్స్‌ మీద పిల్లల భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. వర్సిటీ ప్రొఫెసర్లకు ఇస్తున్న స్థాయిలో ప్రైమరీ టీచ ర్లకు జీతాలు ఇవ్వాలి. తద్వారా మంచి ప్రతిభ ఉన్న వారిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement