నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మైకెల్ క్రేమెర్‌తో కమిషనర్ సురేశ్‌కుమార్, శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మైకెల్ రాబర్ట్ క్రేమెర్ ప్రశంసించారు. ఆయన గురువారం చికాగో యూనివర్సిటీలోని డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమిలీ క్యుపిటో బృందంతో కలిసి రాష్ట్రానికి వచ్చారు. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్ణింగ్ (పాల్) ప్రాజెక్టు అమలు చేస్తున్న పాఠశాలలను ఈ బృందం పరిశీలించనుంది.
సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఈ బృందం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావుతో విద్యాసంబంధ అంశాలపై చర్చించింది. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఆ బృందానికి వివరించారు. ఈ బృందం మూడురోజుల పాటు ఏలూరు జిల్లాలో వివిధ పాఠశాలలను సందర్శించనుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఏపీ విద్యావ్యవస్థపై చికాగో యూనివర్సిటీ బృందం పరిశోధించడం అభినందనీయమన్నారు.
ఇలాంటి పరిశోధనలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మరింత దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్ణింగ్ (పాల్) బాగుందని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డాక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి, శామో జాయింట్ డైరెక్టర్ బి.విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment