
కష్టజీవికి అటూ ఇటూ ఉన్నవాడు
యూదు జాతీయులలో ఒక దళితకవి.. అమెరికాలోని వర్తక వ్యాపారాల ద్వారా నిరంతరం లాభాపేక్షతో జీవిస్తున్న సంపన్న యూదుల మధ్య సొంత గొంతుతో స్వతంత్ర శక్తితో ప్రతిభా సంపన్నుడైన ఒక దళితకవి పుట్టి పెరగడమే నమ్మలేని నిజం.
రెండో మాట
‘అప్పటిదాకా శూన్యంలో విహరిస్తున్న నా కళ్ల పొరలు తొలగాయి. రచయిత నడవవలసింది శూన్యంలో కాదు, సరైన రాస్తా వెంట నడవాలి. జీవితంలోకి తొంగిచూడాలి. జీవితం వైపుగా సాగిపోవాలి. రాజకీయాలకు దూరదూరంగా ఉండే రచయిత ఒక పెద్ద మోసగాడు మాత్రమే. అలాంటి మోసాన్ని సృష్టించి, వ్యాప్తి చేస్తున్నది పెట్టబడిదారీ విధానం. మహాకవి డాంటే కాలంలో అలాంటి రచయితలు లేరు. కళ కళకోసమేనన్న సిద్ధాంతం బడా వ్యాపారుల ప్రబోధగీతం’ - పాబ్లో నెరూడా (చిలీ దేశపు మహాకవి)
యూదు జాతీయులలో ఒక దళితకవి.. అమెరికాలోని వర్తక వ్యాపారాల ద్వారా నిరంతరం లాభాపేక్షతో జీవిస్తున్న సంపన్న యూదుల మధ్య సొంత గొంతుతో స్వతంత్ర శక్తితో ప్రతిభా సంపన్నుడైన ఒక దళితకవి పుట్టి పెరగడమే నమ్మలేని నిజం. ఆయన తొలి జానపద కళాకారునిగా, ఆట పాటల మేల్కలయికగా, నర్తకునిగా ఈ యేటి నోబెల్ పురస్కారానికి ఎంపిక కావడం ఇంకా విశేషం. యూదులలో అణగారిన వర్గానికి చెందిన బాబ్ డిలాన్ కిశోరప్రాయం నుంచి జానపద కళాకారునిగా దూసుకురావడానికి ప్రధాన కారణం- అదిగో, నెరూడా మహాకవి ఆశించిన తోటి కష్టజీవుల కన్నీటిగాథలకూ, జానపదుల జీవన సమరానికీ రాగం, తానం, పల్లవి కట్టి ముందుకు సాగడమే. అంతకు ముందు నోబెల్ సాహిత్య పురస్కారాలు అందుకున్న యూదులు లేకపోలేదు. మిన్నిసోటా (అమెరికా)లో ఉదయిం చిన యూదు దళిత బిడ్డ మిన్ను తాకగల శక్తిని పొందడానికి సుమారు అరవై సంవత్సరాల వ్యవధి ఎందుకు పట్టింది?
బడుగుల బాధలకు గొంతు ఇచ్చి...
ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన బాబ్ డిలాన్ అమె రికాలోని అట్టడుగు ప్రజల బాధలతో గొంతు కలిపినవాడు. అమెరికన్ ప్రజాస్వామిక, నీగ్రో అభ్యుదయకర శక్తులతో చేతులు కలిపి ఇన్నేళ్లుగా ముందుకు నడుస్తూ ఒక యువ కెరటంలా దూసుకువచ్చిన డెబ్బయ్ ఏళ్ల వృద్ధుడు. వీధి గాయకునిగా అమెరికా సామాన్య ప్రజలను అలరించిన బాబ్, ఒకనాటి పాల్ రాబ్సన్ వంటి కొద్దిమంది కవి, కళాకారులకు వారసుడు. సీగర్ వంటి సుప్రసిద్ధ వాద్యకారుడు గిటార్‌ను తన ఆయుధంగా ప్రకటించు కున్నాడు. బాబ్ కూడా తన చేతి గిటార్‌ను ప్రగతిశీల అభ్యుదయ ఉద్యమా లకు మద్దతుగా నిలిచే శక్తిగా ప్రకటించుకున్నాడు. బాబ్‌కు స్థానిక మహా కవులలో సుప్రసిద్ధుడు డిలాన్ థామస్ ప్రోత్సాహక శక్తి. అందుకే తన అసలు పేరు రాబర్ట్ అలెన్ జిమ్మర్‌మాన్‌ను బాబ్ డిలాన్‌గా మార్చుకున్నాడు.
ఆఫ్రికన్ నల్లజాతి కవి వోలే సోయెంకా నోబెల్ అందుకున్నప్పుడు పెదవులు విరిచిన బాపతు (వీఎస్ నైపాల్ వంటివారు) కొందరు లేకపోలేదు. ఇప్పుడు బాబ్ విషయంలో కూడా కళ్లు కుట్టిన బాపతు లేకపోలేదు. కానీ అదే సమ యంలో వాగ్గేయకారుడైన డిలాన్ వాడవాడలా గిటార్ వాద్యం మాధ్య మంగా జానపద సాహిత్యంతో ప్రేక్షకులను మత్తిల్ల చేస్తూ ఉద్యమ సందే శాలతో, సంగీత బాణీలతో అలరించిన ఘడియలని శ్రోతలు మరవలేరు. అయితే అనంతర కాలాలలో బాబ్ జానపదాలను పక్కన పెట్టి బీట్, రాక్ మ్యూజిక్ వైపు ఆకర్షితుడు కావడాన్ని శ్రోతలు జీర్ణించుకోలేకపోయారు. కానీ, బీట్ తరానికి ముందున్న జానపద కళారూపాలను, పాటలను కవి తాత్మకంగా ప్రదర్శించిన డిలాన్ గురించి సురేశ్ మీనన్ వంటి విశ్లేషకులు చేసిన వ్యాఖ్య గమనించదగినది. ‘బాబ్ డిలాన్ ఆదర్శంగా మా తరమంతా ఎదుగుతూ వచ్చింది. షేక్‌స్పియర్ నుంచి లేదా బైబిల్ హీరోల నుంచి వాక్యాలను ఉదహరించడం కన్నా బహు సునాయాసంగా డిలాన్ పాటలనే ఉటంకించగలం!’ అన్నారాయన.
ఆయనలోని మనిషి
నాటి థామస్ డిలాన్ అభ్యుదయ కవితలలో కొన్ని (వీటిలో కొన్ని శ్రీశ్రీ అనువదించారు) వింటే, నేటి బాబ్ డిలాన్ మార్గం మనకు అవగతమవు తుంది. ‘గ్రంథాల మీద పడి వాళ్లేడ్చే / కాలం ఒకటుండేది/ కాలం అయితే వాళ్ల మీదకి / కాష్టాన్నే ఉసికొల్పింది.... ఆకాశపు సౌజ్ఞల కింద/ హస్తాలు లేని వాళ్లవే/ అతి శుభ్రమైన చేతులు/ గుండెల్లేని శవానికి/ గాయాల బాధ లేనట్టు/ గుడ్డివాడు మాత్రమే జాస్తీగా చూస్తాడు’. దాదాపు ఇలాంటి చమత్కార పదాలతోనే తన గుండెలో ఉన్న సామాన్యుల ఆవేదనకు అక్షర రూపం ఇచ్చినవాడు బాబ్. 1960 నుంచి 2001 దాకా వాగ్గేయకారునిగా బాబ్ అల్లిన కవితలను సిమన్ షూస్టర్ ప్రచురణ సంస్థ సంకలనపరిచింది. 27 అధ్యాయాలలో ఒక్కో అధ్యాయానికి 15 పాటల చొప్పున లయబద్ధంగా, అంత్యప్రాసలతో 405 కవితలను 600 పేజీలలో సంపుటీకరించారు. అసమ సమాజ పరిస్థితులపై కవి హృదయంలో మరుగుతున్న రుధిరజ్వలనం గీతంగా, జానపద సంగీతంగా ఈ కవితలలో జాలువారిందని వ్యాఖ్యాతలు భావిస్తారు.
ఫ్రెంచి కవి పాల్ ఎలార్డ్ ‘ద్వేషగీతం’ ప్రభావం కూడా బాబ్‌పై లేకపోలేదు. పాటలూ, గీతాలూ వేరు. శుద్ధ కవితలు వేరు. ‘ప్రధానంగా నీవు పాటగాడివా లేక కేవల కవి కుమారుడివా’ అన్న కొందరు సమకాలికుల ప్రశ్నకు బాబ్ ‘నేను ప్రధానంగా ప్రజా వాగ్గేయకారుడ్ని, నాట్యకారుణ్ణి’ అని చెప్పాడు. ఇక్కడ ‘నాది ప్రజా ఉద్యమం. ఎవరినో సంతోష పెట్టడం కోసం దాన్ని వదలుకోలేనన్న’ గురజాడ తెగింపు గుర్తుకు వస్తుంది. బహుశా ఈ దృష్ట్యానే బాబ్ డిలాన్‌ను జానపద వాగ్గేయకారునిగా గుర్తించిన స్వీడిష్ నోబెల్ అకాడమీ ‘అమెరికన్ జానపద గేయ సాహిత్య సంప్రదాయంలో వినూత్నమైన కవితాత్మకమైన భావనా సృష్టికర్త’ అని కీర్తించింది. ‘సేవింగ్ గ్రేస్’ అన్న గీతంలో బాబ్ ‘కుచ్చితపు మనిషికి జీవితంలో శాంతి ఉండదు/ఆ కుచ్చి తనపు మనస్సును వంచించడం కష్టం’ అంటాడు. అంతేగాదు, ‘శత్రువువల్ల ఏదైనా విధ్వంసకాండ మీదకొచ్చినప్పుడు/ఎదుటనున్నవారికి వీడ్కోలు చెప్పిరాలేను/నా సహోదరుల రక్షణ కోసం నేను నా ప్రాణాలు కోల్పోవడా నికైనా సిద్ధమవుతాను - అందుకు నేను సదా సిద్ధం, మీరూ అందుకు సిద్ధమేనా’ అని ప్రశ్నిస్తాడు బాబ్.
‘ఒక్క స్త్రీమూర్తి మాత్రమే నాలోని మానవుడ్ని, మానవతను అంచనా వేయగలదని’ చాటి చెప్పాడు. ఇంతకూ ‘నీ హృదయం రాతిగుండా లేక ప్రాణం లేని గండశిలా’ అని మరో కవితలో ప్రశ్నిస్తాడు. ‘నాలోని మనిషి’ (‘ది మాన్ ఇన్ మి’) అన్న కవితలో ‘నాలోని మనిషి ఏ కర్తవ్యాన్నయినా నెరవేర్చగలడు/కాని అందుకు పరిహారం కోరడు’ అని మానవీయ దృక్పథం ఎలా ఉండాలో చెప్పాడు. అందుకే శ్రీశ్రీ అంటాడు : ‘మాట చేతగా మారి/మనిషి మనిషితో చేరి/స్వప్నం సత్యం ఐతేనే స్వర్గం’ అని. ‘ఒక శబ్దం శక్తివల్ల/నా బతుక్కి పునర్జన్మ’ అని బాబ్‌కు మరో ఇష్టుడైన కవి పాల్ ఎలార్ ప్రకటిస్తే; డిలాన్ తన జన్మ సార్థకత కోసం తన ‘గిటార్’ వాద్య పరికరం ద్వారా జనతకు చైతన్యపు మేలుకొలుపులు పాడాడు. ఆశ యాలు సంఘర్షిస్తున్నవేళ తన గిటార్ కూడా తటస్థంగా ఉండలేక ఆయు ధంగా మారింది.
శుభ సూచకం
ఈ ప్రజా చైతన్యయాత్రలో భాగస్వామి కాదలచిన బాబ్‌తో పాటు తెలుగు నాట కూడా సుప్రసిద్ధ జానపద వాగ్గేయకారులను ఆటపాటల, నృత్య సంకేత కళల్లో ఆయనకు సమఉజ్జీలు లేకపోలేదు. భారతదేశ స్థాయిలో డిలాన్‌ను ప్రేమించే రహ్మాన్ లాంటివారుండగా, మన ఉమ్మడి తెలుగుసీమలోని అన్ని ప్రాంతాలలోనూ లెక్కకు మిక్కుటంగానే ఉన్నారని చెబితే అతిశయోక్తి కాబోదు : సుద్దాల హనుమంతు, నాజర్, గద్దర్, వంగపండు ప్రసాద్, పాణి గ్రాహి, సత్యమూర్తి, గోరటి వెంకన్న, అంద్శై అశోక్ తేజలు.. పదిమంది బాబ్‌డిలాన్‌లకు సరిజోడులు. ‘ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ’ లాంటి మోసపూరిత సుద్దులతో నెత్తురోడుతున్న పల్లెల, పట్టణ, నగర జీవి తపు ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న సగటు సామాన్యుల వ్యథాభరిత గాథలను జానపద బాణీల ద్వారా, ‘సంచార’ కవితల ద్వారా తన గుండె గొంతుకలో వినిపిస్తున్న గోరటి వెంకన్న లాంటి చేతనా స్వరాలకు ఖరీదు కట్టే షరాబులు లేరు.
మన జానపద సాహిత్యంలోని తెలుగుదనాన్ని తరతరాలుగా నాలుకల మీద నర్తింపచేస్తున్నవి ఎన్నో! కోతపాటలు, కాపు పాటలు, నాటు పాటలు, మోట పాటలు, కాపరి పాటలు, ఇసుర్రాయి పాటలు, పెళ్లి పాటలు, దిష్టి పాటలు, పండుగ పబ్బాల పాటలు, రోడ్డు కూలీల పాటలు, వృత్తి పాటలు కోటి బాణీలతో జన సామాన్యంలో నేటికీ ప్రచరితమవుతూనే ఉన్నాయని మరచిపోరాదు. సామ్రాజ్య పెట్టుబడిదారీ సంస్కృతిలో పుట్టి పెరిగిన నోబెల్ అకాడమీ పెద్దలు నోబెల్ పురస్కార ప్రదానాలలో చూపే వివక్ష రాజ కక్షలకు, కార్పణ్యాలకూ అతీతం కాదని సోషలిస్టు దేశాలలో పుట్టి పెరిగి, ‘తల్లి రొమ్మునే గుద్ది’ దేశద్రోహులుగా మారిన పాస్టర్‌నాక్ లాంటి రచయితలకు నోబెల్ పురస్కారాలు లభించిన ఉదంతాలు కూడా మరవలేం. కొన్నేళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్న పూర్వ రంగంలో స్వీడిష్ అకాడమీలో చలనం కలుగడం, బాబ్ లాంటి వారిని ఎంపిక చేయవలసి రావటం శుభ సూచకమే. డిలాన్ మాదిరిగానే సామాన్య ప్రజాబాహుళ్యం బాధలకు ఆర్ద్రతతో
బాణీలు కట్టిన ‘అలచంద్రవంక’ గోరటి వెంకన్న మాటల్లో - ‘రాములయ్య’ ‘ఇల్లు చూస్తే మూరెడంత/బాడిగేమో బాండంత/కార్పొరేటు ఊడలాయె/ గాడి కింద నీడవాయె’ లాంటి పరిస్థితులు తాండవిస్తున్నకొద్దీ... ‘అప్పులోళ్ల తిట్లకదిరి/అయ్యప్పమాలలేసు’కునే స్థితి దాపురించినంత కాలం.. విదేశీ సామ్రాజ్యవాద గుత్త పెట్టుబడులకి అంగలార్చి దేబరిస్తూ కాలక్షేపం చేసినంత కాలం.. ఆ ‘సంస్కృతి’కి పాలకులు బానిసలయినంత కాలం - రచయితలను లొంగదీసుకునే ‘పురస్కారాల’ కోసం కవి, గాయక నట, జాన పద కళాకారులు, చైతన్యంగల సంస్కృతీపరులు పురస్కారాల కోసం ఎదురు చూడకూడదు.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in