Bob Dylan
-
బాబ్రే.. నీ పెయింటింగ్స్ అద్భుతం!
అర్ధ శతాబ్దం పాటు.. అమెరికా మేధావుల్ని అదిలించి, కదిలించిన జానపదబాణి.. వాణి బాబ్ డిలాన్. సంగీత ప్రపంచాన్ని ఏలిన ఈ అమెరికా దిగ్గజం, నోబెల్ బహుమతి పొందిన తొలి పాటల రచయితగా రికార్డు సృష్టించిన బాబ్ డిలాన్ అద్భుతమైన చిత్రకారుడు కూడా. ఆశ్చర్యపోవడం అందరి వంతు. 2007లో ఒకసారి జర్మనీలో ‘ద డ్రాన్ బ్లాంక్ సిరీస్’ పేరిట బాబ్ డిలాన్ పెయింటింగ్స్‌ను ప్రదర్శిచడంతో ఆయనలోని మరో కళాత్మక కోణం అబ్బురపరిచింది. ఆ పెయింటింగ్స్‌ను చూసిన వారంతా..‘‘బాబ్ డిలాన్ పాటలు ఎంత మధురమో.. ఆయన చిత్రాలూ అంతే రమణీయం’ అని అభినందించారు. ఆతరువాత లండన్‌లోని నేషనల్ పోర్టరేట్, డెన్మార్క్‌లోని ద నేషనల్ గ్యాలరీ ఆఫ్ డెన్మార్క్, మిలాన్, షాంఘైలలో డిలాన్ పెయింటింగ్‌లను ప్రదర్శించారు. ఇప్పటిదాకా ఎవ్వరూ చూడని బాబ్ పెయింటింగ్స్‌ను తొలిసారి అమెరికాలో ప్రదర్శించనున్నారు. తన అరవైఏళ్లు్లలో డిలాన్ వేసిన చిత్రాలు అధికారికంగా ప్రదర్శనకు రానున్నాయి. ఫ్లోరిడాలోని మియామి నగరంలో ‘ప్యాట్రీషియా అండ్ ఫిలిప్ ఫ్రాస్ట్ ఆర్ట్ మ్యూజియం’ ఇందుకు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్ 30న ‘రెట్రోస్పెక్ట్రమ్’ పేరిట ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బాబ్ డిలాన్ వేసిన 120కి పైగా పెయింటింగ్స్, డ్రాయింగ్స్, శిల్పాలను ఉంచుతారు. అయితే ‘రెట్రోస్పెక్ట్రమ్’ ఎగ్జిబిషన్‌ను 2019లో చైనాలోని షాంఘైలోనూ ఏర్పాటు చేశారు. దాన్నే ఇప్పుడు అమెరికాలో పెట్టబోతున్నారు. ‘ఇప్పటిదాక ఎవ్వరూ చూడని కొత్త వస్తువులను ప్రదర్శించడం అనే సరికొత్త వెర్షన్‌తో ఈసారి రెట్రోస్పెక్ట్రమ్ను ఏర్పాటు చేయనున్నాం. దీనిలో వివిధ రకాల కొత్త బ్రాండ్లు, వాటి సిరీస్‌లను ‘అమెరికన్ పాస్టోరల్స్’ పేరుతో ప్రదర్శిస్తారు. ఇది 2021 నవంబర్ 30న మొదలై 2022 ఏప్రిల్ 17 వరకు కొనసాగుతుంది. బాబ్ డిలాన్.. అమెరికాలోని వివిధ ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆయన చూసిన ప్రాంతాలు, ఎదురైన సన్నివేశాలు, సంఘటనలు పెయింటింగ్స్‌గా ప్రతిబింబిస్తాయ’ని ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెప్పారు. ఈ ఏడాది మే 24న బాబ్ డిలాన్ 80వ జయంతి. ఆ సందర్భంగా ఆయన పెయింటింగ్స్ ప్రదర్శనకు రావడం విశేషం. డిలాన్ 80వ పుట్టినరోజును పురస్కరించుకుని బీబీసీ రేడియో–4, ఇంకా అమెరికాలో వివిధ రేడియోల్లో ఆయనపై ప్రత్యేక కార్యక్రామలను ప్రసారం చేయనున్నాయి. – పి. విజయా దిలీప్ చదవండి: ద బాబ్రే... నిత్య యవ్వనం నీ స్వరం! -
బాబ్రే... నిత్య యవ్వనం నీ స్వరం!
బాబ్ డిలాన్ ఆరువందలకు పైగా పాటల హక్కులను యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ బ్లాక్‌బస్టర్ అగ్రిమెంట్ ద్వారా మూడువందల మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వస్తుందట. వాళ్లెవరో సొంతం చేసుకోవడం ఏమిటి? ఆ పాటలను ప్రపంచంలో ఆబాలగోపాలం ఎప్పుడో సొంతం చేసుకుంది అనుకుంటే అది కూడా అక్షరాల నిజమే! బాబ్ పాట మీద హక్కు సాంకేతిక విషయం మాత్రమే. అది అందరి పాట. ఎందుకంటే.. మాస్టర్స్ ఆఫ్ వార్ (1963) ఇప్పుడు యుద్దాలు ఆత్మరక్షణ కోసం జరగడం లేదు, ప్రజల దృష్టిని మళ్లించి పాలనను సుస్థిరం చేసుకోవడానికి జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్దం అంటే హింస మాత్రమే కాదు అనేక కుట్రసిద్దాంతాల సమహారం. అందుకే ఒక కళాకారుడిగా బాబ్ డిలాన్ గళం విప్పాడు. యుద్దోన్మాదాన్ని నడివీధిలో నగ్నంగా నిలబెట్టాడు. ప్రపంచాన్ని ఆటబొమ్మగా చేసుకుని ఆడుకునే మాస్టర్స్ ఆఫ్ వార్ని ఇలా నిలదీశాడు... ‘యూ ప్లే విత్ మై వరల్డ్ లైక్ ఇట్స్ యువర్ లిటిల్ టాయ్ యూ పుట్ ఏ గన్ ఇన్ మై హ్యాండ్ అండ్ యూ హైడ్ ఫ్రమ్ మై ఐస్’ న్యూ మార్నింగ్ (1970) స్వప్నించే హృదయం ఉండాలేగానీ ప్రతి ఉదయం ఒక కొత్త ఉదయాన్ని పరిచయం చేస్తుంది. ‘ఆ..ఏముంది లే. అన్ని రోజుల్లాగే ఈరోజు కూడా’ అనుకునే నిత్య నిరాసక్తవాదులకు ఈ పాట సరికొత్త మేలుకొలుపు. సింప్లీ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ విలువ ఏమిటో చెబుతుంది. ‘సో హ్యాపీ జస్ట్ టు బీ అలైవ్’ ‘సో హ్యాపీ జస్ట్ టు సీ యువర్ స్మైల్’ సేవ్డ్ (1980) భగవంతుడు మన కోసం ఎన్నో చేశాడు. అతడి కోసం ఏం చేయగలం? రుణాన్ని ఎలా తీర్చుకోగలం? కనిపించని భగవంతుడు నిత్యం మనకు కనిపించే మనుషుల్లో దానం, ధర్మం, త్యాగం...రకరకాల రూపాల్లో ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటాడు. ‘యూ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ యూ హ్యావ్ గివెన్ మీ ఐస్ టు సీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ’ అండర్ ది రెడ్ స్కై (1990) గబ్బీ గూగూ (ముద్దుపేరు) అనే అమ్మాయికి అంకితం ఇచ్చిన ఈ పాట సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సాగుతుంది. పిల్లలకు నచ్చే జానపదకథలాంటి పాట ఇది. కాల్పనిక ప్రపంచంలో మనల్ని ఊరేగించే పిల్లల పెద్దల పాట. అంతేనా! కానే కాదు అంటారు విశ్లేషకులు. పర్యావరణానికి మన చేటును గురించి హెచ్చరించి పాట అంటారు. ‘లెట్ ది బర్డ్ సింగ్...లెట్ ది బర్డ్ ఫ్లై’ షాడోస్ ఇన్ ది నైట్ (2015) నిన్ను చూడడం తప్పేమో తెలియదు. చూస్తూనే ఉంటాను. నిన్ను పలకరించడం తప్పేమో తెలియదు. పలకరిస్తూనే ఉంటాను. నిన్ను ధ్యానించడం తప్పేమో తెలియదు. ధ్యానిస్తూనే ఉంటాను. నిన్ను ప్రేమించడం తప్పేమో తెలియదు. ప్రేమిస్తూనే ఉంటాను.... ‘ఐ లవ్ యూ ఐ నీడ్ యూ...ఐ నో ఇట్స్ రాంగ్...ఇట్ మస్ట్ బీ రాంగ్ బట్ రైట్ ఆర్ రాంగ్ ఐ కాంట్ గెట్ ఎలాంగ్ విత్ఔట్ యూ’ -
బాబ్ డిలాన్ పాటలన్ని కొనేసిన యూజీ
న్యూయార్క్: ప్రఖ్యాత రచయిత బాబ్ డిలాన్ పాటలు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. ఆయన రాసిన మొత్తం 600 పాటలను యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్ తన సొంతం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. అంటే ఇకపై ఆయన పాటలపై పూర్తి హక్కులన్ని తమకే ఉంటుందని సదరు మ్యూజిక్ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఇందుకు సంబంధించి ఒప్పందం కూడా ముగిసినట్లు యూఎంపీజీ తెలిపింది. ఇందుకోసం యూఎంపీజీ ఆయనకు ఎంత మొత్తం చెల్లించిందనేది మాత్రం పేర్కొనలేదు. అయితే ఆయన పాటలకు ఎంత ప్రాముఖ్యత ఉంతో తెలిసిన విషయయే. ఇందుకోసం యూఎంపీజీ ఆయనతో భారీగానే ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం. ఆయన పాడిన పాటల క్యాట్‌లాగ్‌ను విలువను బట్టి కనీసం రూ. 100 మిలియన్ డాలర్లు ఉండోచ్చని స్థానికి మీడియా అంచనాలు. (చదవండి: బాబ్ డిలాన్ 'నోబెల్'ను అంగీకరించినట్లేనా?) అయితే యూఎంపీజీ తన ప్రకటనలో బాబ్ డిలాస్ 1962 నుంచి ఇప్పటి వరకు పాడిన మొత్తం క్యాట్‌లాగ్ పాటల జాబితాను తమ సంస్థ కనుగోలు చేసినట్లు వెల్లడించింది. కాగా ఈ సంస్థ ప్రస్తుతం అమెరికాలోని డిలాస్ మ్యూజిక్ కంపెనీతో పాటు సోనీ, ఏటీవి మ్యూజిక్ పబ్లిసింగ్ నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఈ ఒప్పందం ముగిసే వరకు అమెరికా వెలుపల జరిగే పలు మ్యూజిక్ షోలను యూఎంపీజీనే నిర్వహిస్తుందని సోనీ, ఏటీవీ అధికారులు స్పష్టం చేశారు. కాగా బాబ్ డిలాన్ 2016లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం పొందారు. నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న తొలి పాటల రచయితగా ఆయన రికార్డు సృష్టించారు. -
నోబెల్ స్వీకరణకు రాలేను: బాబ్ డిలన్
స్టాక్‌హోం: నోబెల్ సాహిత్య బహుమతి-2016కి ఎంపికైన అమెరికాకు చెందిన పాటల రచరుుత, గాయకుడు బాబ్ డిలన్ పురస్కారాల ప్రదానోత్సవానికి రావడం లేదని స్వీడీష్ అకాడమీ తెలిపింది. ‘అవార్డును వ్యక్తిగతంగా వచ్చి తీసుకోవాలని అనుకున్నాను. కానీ కొన్ని ఇతర పనులు ఉన్నందున వల్ల హాజరు కాలేకపోతున్నాను’ అని డిలన్ నుంచి లేఖ అందినట్లు పేర్కొంది. ఆల్ఫెడ్ర్ నోబెల్ వర్ధంతి అరుున డిసెంబరు 10న ప్రతి ఏడాది స్టాక్‌హోంలో పురస్కారాలను ప్రదానం చేస్తారు. డిలన్ రాకపోరుునా ఇబ్బందేమీ లేదనీ, డిసెంబరు 10 నుంచి ఆరు నెలలలోపు ఆయన తన ఉపన్యాసాన్ని అందిస్తే చాలని స్వీడన్ అకాడమీ తెలిపింది. -
నోబెల్ స్వీకరిస్తా: డిలన్
స్టాక్‌హోం: నోబెల్ సాహిత్య బహుమతి ప్రకటించినా మౌనంగా ఉన్న అమెరికా గేయరచయిత, గాయకుడు బాబ్ డిలన్ ఎట్టకేలకు పెదవి విప్పారు. స్టాక్‌హోంలో డిసెంబరు 10న ఈ అవార్డు అందుకోవాలని అనుకుంటున్నట్లు శుక్రవారం చెప్పారు. మరోవైపు డిలన్ నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవానికి రాకపోయినా ఇబ్బందేమీ లేదనీ, ఆయన తరఫున ఏదైనా ఉపన్యాసం, ప్రదర్శన, పాటను ఉత్సవం సమయంలో అందించినా చాలని స్వీడిష్ అకాడమీ పేర్కొంది. అక్టోబరు 13న సాహిత్య నోబెల్ బహుమతి ప్రకటించాక, పలుమార్లు ఫోన్లో బాబ్డిలన్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదని స్వీడిష్ అకాడమీ సభ్యుడు గతంలో ఫిర్యాదు చేశారు. బాబ్‌డిలన్ బహుమతిని అందుకునే ఉద్దేశంతో ఉన్నారో లేదో కూడా తెలియజేయలేదనీ, ఇది ఆయన అహంకారానికి ప్రతీక అని ఆ సభ్యుడు ఆరోపించారు. -
బాబ్ డిలాన్ 'నోబెల్'ను అంగీకరించినట్లేనా?
కాలిఫోర్నియా: ప్రముఖ గాయకుడు, కవి బాబ్ డిలాన్‌కు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ప్రకటించి వారం గడుస్తున్నా దానిపై ఆయన పెదవి విప్పలేదు. దీంతో స్విడిష్ అకాడమీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. 'కనీసం గ్రహీతకు కూడా అవార్డు ఇచ్చిన సంగతి చెప్పరా?' అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం బాబ్ డిలాన్ నోబెల్‌ను తిరస్కరిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాబ్ డిలాన్ అధికారిక వెబ్సైట్లో చోటుచేసుకున్న మార్పులు స్విడిష్ అకాడమీకి ఊరటనిచ్చాయి. కెరీర్ ప్రారంభం నుంచి 2012 వరకు బాబ్ డిలాన్ రచించి, పాడిన పాటల సమాహరం 'ది లిరిక్స్ 1961-2012' పుస్తకానికి గానూ ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. కాగా, సోమవారం నుంచి ఆ పుస్తకానికి సంబంధించిన ప్రచార వాక్యాల్లో 'నోబెల్ లిటరేచర్ అవార్డు పొందిన పుస్తకం'అని బాబ్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. పురస్కారంపై ఇప్పటి వరకు పెదవి విప్పని బాబ్.. ఈ చర్యతో నోబెల్ ను అంగీకరించినట్లు ప్రకటించారని స్విడిష్ అకాడమీ వర్గాలు సంబరపడుతున్నాయి. (తప్పక చదవండి: ‘నోబెల్’కు నగుబాటు!) అవార్డు ప్రకటించిన విషయాన్ని బాబ్ డిలాన్‌కు నేరుగా చేరవేసే ప్రక్రియకు మంగళవారంతో మంగళంపాడినట్లు స్విడిష్ అకాడమీ శాశ్వత ప్రతినిధులు సారా డేనియస్ ప్రకటించారు. అయితే డిసెంబర్ 10న స్టాక్ హోంలో జరగబోయే నోబెల్ పురస్కార ప్రదాన కార్యక్రమానికి బాబ్ డిలాన్ వస్తారా? రారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఆమె చెప్పారు. గతంలోనూ కొందరు నోబెల్ సాహితీ గ్రహీతలు.. పురస్కార ప్రదాన కార్యక్రమానికి గౌర్హాజరయ్యారని, ఇద్దరు కవులు మాత్రం ఏకంగా అవార్డునే తిరస్కరించారని గుర్తుచేశారు. -
‘నోబెల్’కు నగుబాటు!
నోబెల్ సాహిత్య బహుమతిని మేటి పాటగాడు బాబ్ డిలన్‌కు ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా ఆయన నుంచి ఏ జవాబూ లేక తలకొట్టేసినట్టయిన నోబెల్ కమిటీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా రూపంలో మరో ఝలక్ తగిలింది. 2009లో తనను నోబెల్ శాంతి బహుమతికి ఎందుకు ఎంపిక చేశారో ఇప్పటికీ తెలియదని ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన సమాధానం... ఆ కమిటీ తీరు తెన్నుల గురించి ఎన్నాళ్లనుంచో వస్తున్న విమర్శలకు బలం చేకూర్చింది. ఏమాట కామాటే చెప్పుకోవాలి. పురస్కార గ్రహీతల యోగ్యతాయోగ్యతల మాట అటుంచి... అలా ఎంపికైనవారిని ఎవరైనా అభినందిస్తారు. అలాగని అత్యధికుల అంచనాలకు దీటుగా లేని సందర్భాల్లో విమర్శలు రావడం కూడా సర్వసాధారణం. కానీ ఒబామాకు శాంతి బహుమతిని ప్రకటించాక విస్తుపోతూ ప్రకటనలు చేసిన వారే అధికం! మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్, మదర్ థెరిసా, దలైలామా వంటి దిగ్గజాల సరసన ఆయనను కూర్చోబెట్టడమేమిటని కొందరు ఆగ్రహించారు కూడా! వీటన్నిటా సహేతుకత ఉంది. నోబెల్ బహుమతి ప్రకటించేనాటికి ఒబామా అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించి తొమ్మిది నెలలు మాత్రమే అయింది. నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్లు పంపడానికి గల తుది గడువునాటికైతే ఆయన అధికారంలోకొచ్చి పట్టుమని పక్షం రోజులు కూడా కాలేదు. ఆ రెండు వారాల్లో నోబెల్ కమిటీ ఆయనలో ఏం సుగుణాలు చూసిందో, ప్రపంచశాంతి స్థాపన కోసం ఆయన ఏం చేశారనుకున్నదో తెలియదు. తనను ఆ పురస్కారానికి ఎంపిక చేయ డాన్ని స్వాగతిస్తూ ‘విశ్వమానవాళి ఆకాంక్షల పరిరక్షణలో అమెరికా నిర్ణయాత్మక పాత్రను ఈ బహుమతి ధ్రువీకరిస్తున్నద’ంటూ ఒబామా అప్పట్లో గొప్పలుపో యారు. ఎనిమిదేళ్లు గడిచాకైనా ఆయన నిజం పలికారనుకోవాలి! ఒబామాకు నోబెల్ బహుమతి ఇవ్వడానికి ‘కేవలం ఆయన బుష్ కాకపోవ డమే’ కారణమని అప్పట్లో ఒకరు వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యానంలో వాస్తవం ఉంది. నోబెల్ కమిటీకి ఎందుకనో జార్జ్ బుష్ పొడగిట్టదు. పదవిలో ఉన్నప్పుడు, దిగిపోయాక కూడా ఆయనంటే తీవ్ర వ్యతిరేకత ఉండేది. ఆయన వ్యతిరేకులన్న ముద్ర ఉంటే శాంతి బహుమతి ఇచ్చేవారన్న విమర్శ ఉండేది. అందుకు కొన్ని రుజువులున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కు 2002లో శాంతి పురస్కారాన్ని ప్రకటించేనాటికి ఆయన బుష్‌కు వ్యతిరేకంగా... మరీ ముఖ్యంగా అప్పట్లో జరిగిన ఉగ్రదాడిపై బుష్ స్పందించిన తీరును దుయ్యబట్టారు. పదవీ విరమణ చేశాక ఆయన స్థాపించిన ఫౌండేషన్ హైతీ, బోస్నియా తదితర దేశాల్లో శాంతి స్థాపనకు, ఇజ్రాయెల్-పాలస్తీనాలమధ్య శాంతి చర్చలు ఫలవంతం కావడా నికి తోడ్పడిందని నోబెల్ కమిటీ చెప్పినా అసలు సంగతి ఆయనలో ఉన్న బుష్ వ్యతిరేకతే అంటారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అఫ్ఘాన్‌లో ముజాహిదీన్లకు ఆయు ధాలందించి, ఈనాటి ఉగ్రవాదానికి బీజం వేసింది కార్టరే. దేన్నయినా సాధించార నుకున్న సందర్భంలోనే ఏ బహుమతైనా ఇవ్వడం సంప్రదాయం. ఇవ్వదల్చుకున్న వారికి అలాంటి గొప్పదనం ఆపాదించడంలో నోబెల్ కమిటీ ఆరితేరింది. 1919లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌కు, 1973లో ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌కు శాంతి బహుమతి ప్రకటించినప్పుడు నోబెల్ కమిటీ వారిని ఆకాశానికెత్తింది. యుద్ధోన్మాదులుగా వారి చరిత్రను మరుగుపరచాలని చూసింది. కానీ ఒబామా విషయంలో ఆపాటి కష్టమైనా పడకుండా బహుమతిని ప్రకటించి రికార్డు సృష్టించింది. ప్రశంసా వాక్యాల్లో శాంతి సాధనకు ఒబామా చేసిన దేమిటో ప్రస్తావించకుండా, కేవలం‘ప్రయత్నాలను’ మెచ్చుకోవడంతో సరి పెట్టింది. కనీసం ఆ ప్రయత్నాలు దేనికి దారితీస్తాయో, ఒకవేళ అవి విఫలమైన పక్షంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతున్నదో తెలుసుకోవాలన్న స్పృహ కూడా నోబెల్ కమిటీకి లేకపోయింది. హడావుడి పడకుండా మరికొన్నాళ్లు ఆగి ఉంటే ఆ ‘ప్రయత్నాల’ అసలు రంగు కూడా వెల్లడయ్యేది. బుష్ ప్రారంభించిన యుద్ధాలను ఒబామా మరింత ముందుకు తీసుకెళ్లారు. కొత్త యుద్ధ రంగాలనూ తెరిచారు. ‘ఆయనకు శాంతి పురస్కారం ఇవ్వడం ఘోర తప్పిదమే’నని ఆ సమయంలో నోబెల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గీర్ లెండ్స్టెడ్ నిరుడు అంగీకరించారు. లిబియాపై బాంబుల వర్షం, సిరియాలో వరస దాడులు ఎన్ని వేలమంది ప్రాణాలు తీశాయో ఎవరూ మరిచిపోలేరు. అఫ్ఘానిస్తాన్, సోమాలియా, పాకిస్తాన్ తదితర చోట్ల ఉగ్రవాదుల్ని గురిపెట్టామనుకుని సాధారణ పౌరులను వందల్లో హతమా ర్చారు. ప్రపంచంలో ప్రశాంతత నెలకొల్పుతామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఒబామా ఆ తర్వాత సరిగ్గా అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నారు. కనీసం నోబెల్ శాంతి పురస్కారం వచ్చినందుకైనా అందుకు తగినట్టు ప్రవర్తించా లని ఆయన అనుకోలేదు. మహాత్మా గాంధీకి నోబెల్ ఇవ్వాలంటూ అయిదు దఫాలు నామినేషన్లు వెళ్లినా నోబెల్ కమిటీ పట్టనట్టు ఉన్న సంగతిని ఎవరూ మర్చిపోరు. 1948లో ఆయనకు శాంతి బహుమతి ప్రకటిద్దామనుకుంటుండగా గాంధీజీ హత్య జరిగిందని అది ఇచ్చిన సంజాయిషీలో నిజమెంతో తెలియదు. మరణానంతరం ఇచ్చే సంప్రదాయం లేదని అప్పట్లో చెప్పింది. కానీ స్వీడన్ మంత్రిగా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన దాగ్ హమర్స్కోల్డ్కు 1961లో మరణానంతరం శాంతి పురస్కారం ఇచ్చింది. ఒక్క శాంతి బహుమతి విషయంలోనే కాదు...ఇతర రంగాల్లో ఇచ్చే పురస్కారాల విషయంలో సైతం కమిటీపై ఇలాంటి విమర్శలే ఉన్నాయి. ఈసారి ప్రకటించిన పురస్కారాల్లో ఒక్కరంటే ఒక్కరైనా మహిళ లేక పోవడాన్ని చాలామంది విమర్శించారు. అర్హులు లేరని కాదు. అనేకమంది మహి ళల పేర్లు నోబెల్ కమిటీ పరిశీలనకొచ్చాయి. అయినా పట్టించుకోలేదు. ఈసారి మన శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు కనుగొన్న అంశాలకు అనుకూలంగా అత్యధిక నామినేషన్లు వెళ్లినా కమిటీ పరిగణించలేదు. భవిష్యత్తులోనైనా ఇలాంటి తడబాట్లకు నోబెల్ కమిటీ స్వస్తి చెప్పడానికి ఒబామా ‘ఒప్పుకోలు’ ప్రకటన పనికొస్తే మంచిదే! -
జన స్వరం
-
కష్టజీవికి అటూ ఇటూ ఉన్నవాడు
రెండో మాట ‘అప్పటిదాకా శూన్యంలో విహరిస్తున్న నా కళ్ల పొరలు తొలగాయి. రచయిత నడవవలసింది శూన్యంలో కాదు, సరైన రాస్తా వెంట నడవాలి. జీవితంలోకి తొంగిచూడాలి. జీవితం వైపుగా సాగిపోవాలి. రాజకీయాలకు దూరదూరంగా ఉండే రచయిత ఒక పెద్ద మోసగాడు మాత్రమే. అలాంటి మోసాన్ని సృష్టించి, వ్యాప్తి చేస్తున్నది పెట్టబడిదారీ విధానం. మహాకవి డాంటే కాలంలో అలాంటి రచయితలు లేరు. కళ కళకోసమేనన్న సిద్ధాంతం బడా వ్యాపారుల ప్రబోధగీతం’ - పాబ్లో నెరూడా (చిలీ దేశపు మహాకవి) యూదు జాతీయులలో ఒక దళితకవి.. అమెరికాలోని వర్తక వ్యాపారాల ద్వారా నిరంతరం లాభాపేక్షతో జీవిస్తున్న సంపన్న యూదుల మధ్య సొంత గొంతుతో స్వతంత్ర శక్తితో ప్రతిభా సంపన్నుడైన ఒక దళితకవి పుట్టి పెరగడమే నమ్మలేని నిజం. ఆయన తొలి జానపద కళాకారునిగా, ఆట పాటల మేల్కలయికగా, నర్తకునిగా ఈ యేటి నోబెల్ పురస్కారానికి ఎంపిక కావడం ఇంకా విశేషం. యూదులలో అణగారిన వర్గానికి చెందిన బాబ్ డిలాన్ కిశోరప్రాయం నుంచి జానపద కళాకారునిగా దూసుకురావడానికి ప్రధాన కారణం- అదిగో, నెరూడా మహాకవి ఆశించిన తోటి కష్టజీవుల కన్నీటిగాథలకూ, జానపదుల జీవన సమరానికీ రాగం, తానం, పల్లవి కట్టి ముందుకు సాగడమే. అంతకు ముందు నోబెల్ సాహిత్య పురస్కారాలు అందుకున్న యూదులు లేకపోలేదు. మిన్నిసోటా (అమెరికా)లో ఉదయిం చిన యూదు దళిత బిడ్డ మిన్ను తాకగల శక్తిని పొందడానికి సుమారు అరవై సంవత్సరాల వ్యవధి ఎందుకు పట్టింది? బడుగుల బాధలకు గొంతు ఇచ్చి... ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన బాబ్ డిలాన్ అమె రికాలోని అట్టడుగు ప్రజల బాధలతో గొంతు కలిపినవాడు. అమెరికన్ ప్రజాస్వామిక, నీగ్రో అభ్యుదయకర శక్తులతో చేతులు కలిపి ఇన్నేళ్లుగా ముందుకు నడుస్తూ ఒక యువ కెరటంలా దూసుకువచ్చిన డెబ్బయ్ ఏళ్ల వృద్ధుడు. వీధి గాయకునిగా అమెరికా సామాన్య ప్రజలను అలరించిన బాబ్, ఒకనాటి పాల్ రాబ్సన్ వంటి కొద్దిమంది కవి, కళాకారులకు వారసుడు. సీగర్ వంటి సుప్రసిద్ధ వాద్యకారుడు గిటార్‌ను తన ఆయుధంగా ప్రకటించు కున్నాడు. బాబ్ కూడా తన చేతి గిటార్‌ను ప్రగతిశీల అభ్యుదయ ఉద్యమా లకు మద్దతుగా నిలిచే శక్తిగా ప్రకటించుకున్నాడు. బాబ్‌కు స్థానిక మహా కవులలో సుప్రసిద్ధుడు డిలాన్ థామస్ ప్రోత్సాహక శక్తి. అందుకే తన అసలు పేరు రాబర్ట్ అలెన్ జిమ్మర్మాన్ను బాబ్ డిలాన్గా మార్చుకున్నాడు. ఆఫ్రికన్ నల్లజాతి కవి వోలే సోయెంకా నోబెల్ అందుకున్నప్పుడు పెదవులు విరిచిన బాపతు (వీఎస్ నైపాల్ వంటివారు) కొందరు లేకపోలేదు. ఇప్పుడు బాబ్ విషయంలో కూడా కళ్లు కుట్టిన బాపతు లేకపోలేదు. కానీ అదే సమ యంలో వాగ్గేయకారుడైన డిలాన్ వాడవాడలా గిటార్ వాద్యం మాధ్య మంగా జానపద సాహిత్యంతో ప్రేక్షకులను మత్తిల్ల చేస్తూ ఉద్యమ సందే శాలతో, సంగీత బాణీలతో అలరించిన ఘడియలని శ్రోతలు మరవలేరు. అయితే అనంతర కాలాలలో బాబ్ జానపదాలను పక్కన పెట్టి బీట్, రాక్ మ్యూజిక్ వైపు ఆకర్షితుడు కావడాన్ని శ్రోతలు జీర్ణించుకోలేకపోయారు. కానీ, బీట్ తరానికి ముందున్న జానపద కళారూపాలను, పాటలను కవి తాత్మకంగా ప్రదర్శించిన డిలాన్ గురించి సురేశ్ మీనన్ వంటి విశ్లేషకులు చేసిన వ్యాఖ్య గమనించదగినది. ‘బాబ్ డిలాన్ ఆదర్శంగా మా తరమంతా ఎదుగుతూ వచ్చింది. షేక్స్పియర్ నుంచి లేదా బైబిల్ హీరోల నుంచి వాక్యాలను ఉదహరించడం కన్నా బహు సునాయాసంగా డిలాన్ పాటలనే ఉటంకించగలం!’ అన్నారాయన. ఆయనలోని మనిషి నాటి థామస్ డిలాన్ అభ్యుదయ కవితలలో కొన్ని (వీటిలో కొన్ని శ్రీశ్రీ అనువదించారు) వింటే, నేటి బాబ్ డిలాన్ మార్గం మనకు అవగతమవు తుంది. ‘గ్రంథాల మీద పడి వాళ్లేడ్చే / కాలం ఒకటుండేది/ కాలం అయితే వాళ్ల మీదకి / కాష్టాన్నే ఉసికొల్పింది.... ఆకాశపు సౌజ్ఞల కింద/ హస్తాలు లేని వాళ్లవే/ అతి శుభ్రమైన చేతులు/ గుండెల్లేని శవానికి/ గాయాల బాధ లేనట్టు/ గుడ్డివాడు మాత్రమే జాస్తీగా చూస్తాడు’. దాదాపు ఇలాంటి చమత్కార పదాలతోనే తన గుండెలో ఉన్న సామాన్యుల ఆవేదనకు అక్షర రూపం ఇచ్చినవాడు బాబ్. 1960 నుంచి 2001 దాకా వాగ్గేయకారునిగా బాబ్ అల్లిన కవితలను సిమన్ షూస్టర్ ప్రచురణ సంస్థ సంకలనపరిచింది. 27 అధ్యాయాలలో ఒక్కో అధ్యాయానికి 15 పాటల చొప్పున లయబద్ధంగా, అంత్యప్రాసలతో 405 కవితలను 600 పేజీలలో సంపుటీకరించారు. అసమ సమాజ పరిస్థితులపై కవి హృదయంలో మరుగుతున్న రుధిరజ్వలనం గీతంగా, జానపద సంగీతంగా ఈ కవితలలో జాలువారిందని వ్యాఖ్యాతలు భావిస్తారు. ఫ్రెంచి కవి పాల్ ఎలార్డ్ ‘ద్వేషగీతం’ ప్రభావం కూడా బాబ్‌పై లేకపోలేదు. పాటలూ, గీతాలూ వేరు. శుద్ధ కవితలు వేరు. ‘ప్రధానంగా నీవు పాటగాడివా లేక కేవల కవి కుమారుడివా’ అన్న కొందరు సమకాలికుల ప్రశ్నకు బాబ్ ‘నేను ప్రధానంగా ప్రజా వాగ్గేయకారుడ్ని, నాట్యకారుణ్ణి’ అని చెప్పాడు. ఇక్కడ ‘నాది ప్రజా ఉద్యమం. ఎవరినో సంతోష పెట్టడం కోసం దాన్ని వదలుకోలేనన్న’ గురజాడ తెగింపు గుర్తుకు వస్తుంది. బహుశా ఈ దృష్ట్యానే బాబ్ డిలాన్ను జానపద వాగ్గేయకారునిగా గుర్తించిన స్వీడిష్ నోబెల్ అకాడమీ ‘అమెరికన్ జానపద గేయ సాహిత్య సంప్రదాయంలో వినూత్నమైన కవితాత్మకమైన భావనా సృష్టికర్త’ అని కీర్తించింది. ‘సేవింగ్ గ్రేస్’ అన్న గీతంలో బాబ్ ‘కుచ్చితపు మనిషికి జీవితంలో శాంతి ఉండదు/ఆ కుచ్చి తనపు మనస్సును వంచించడం కష్టం’ అంటాడు. అంతేగాదు, ‘శత్రువువల్ల ఏదైనా విధ్వంసకాండ మీదకొచ్చినప్పుడు/ఎదుటనున్నవారికి వీడ్కోలు చెప్పిరాలేను/నా సహోదరుల రక్షణ కోసం నేను నా ప్రాణాలు కోల్పోవడా నికైనా సిద్ధమవుతాను - అందుకు నేను సదా సిద్ధం, మీరూ అందుకు సిద్ధమేనా’ అని ప్రశ్నిస్తాడు బాబ్. ‘ఒక్క స్త్రీమూర్తి మాత్రమే నాలోని మానవుడ్ని, మానవతను అంచనా వేయగలదని’ చాటి చెప్పాడు. ఇంతకూ ‘నీ హృదయం రాతిగుండా లేక ప్రాణం లేని గండశిలా’ అని మరో కవితలో ప్రశ్నిస్తాడు. ‘నాలోని మనిషి’ (‘ది మాన్ ఇన్ మి’) అన్న కవితలో ‘నాలోని మనిషి ఏ కర్తవ్యాన్నయినా నెరవేర్చగలడు/కాని అందుకు పరిహారం కోరడు’ అని మానవీయ దృక్పథం ఎలా ఉండాలో చెప్పాడు. అందుకే శ్రీశ్రీ అంటాడు : ‘మాట చేతగా మారి/మనిషి మనిషితో చేరి/స్వప్నం సత్యం ఐతేనే స్వర్గం’ అని. ‘ఒక శబ్దం శక్తివల్ల/నా బతుక్కి పునర్జన్మ’ అని బాబ్‌కు మరో ఇష్టుడైన కవి పాల్ ఎలార్ ప్రకటిస్తే; డిలాన్ తన జన్మ సార్థకత కోసం తన ‘గిటార్’ వాద్య పరికరం ద్వారా జనతకు చైతన్యపు మేలుకొలుపులు పాడాడు. ఆశ యాలు సంఘర్షిస్తున్నవేళ తన గిటార్ కూడా తటస్థంగా ఉండలేక ఆయు ధంగా మారింది. శుభ సూచకం ఈ ప్రజా చైతన్యయాత్రలో భాగస్వామి కాదలచిన బాబ్‌తో పాటు తెలుగు నాట కూడా సుప్రసిద్ధ జానపద వాగ్గేయకారులను ఆటపాటల, నృత్య సంకేత కళల్లో ఆయనకు సమఉజ్జీలు లేకపోలేదు. భారతదేశ స్థాయిలో డిలాన్ను ప్రేమించే రహ్మాన్ లాంటివారుండగా, మన ఉమ్మడి తెలుగుసీమలోని అన్ని ప్రాంతాలలోనూ లెక్కకు మిక్కుటంగానే ఉన్నారని చెబితే అతిశయోక్తి కాబోదు : సుద్దాల హనుమంతు, నాజర్, గద్దర్, వంగపండు ప్రసాద్, పాణి గ్రాహి, సత్యమూర్తి, గోరటి వెంకన్న, అంద్శై అశోక్ తేజలు.. పదిమంది బాబ్డిలాన్లకు సరిజోడులు. ‘ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ’ లాంటి మోసపూరిత సుద్దులతో నెత్తురోడుతున్న పల్లెల, పట్టణ, నగర జీవి తపు ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న సగటు సామాన్యుల వ్యథాభరిత గాథలను జానపద బాణీల ద్వారా, ‘సంచార’ కవితల ద్వారా తన గుండె గొంతుకలో వినిపిస్తున్న గోరటి వెంకన్న లాంటి చేతనా స్వరాలకు ఖరీదు కట్టే షరాబులు లేరు. మన జానపద సాహిత్యంలోని తెలుగుదనాన్ని తరతరాలుగా నాలుకల మీద నర్తింపచేస్తున్నవి ఎన్నో! కోతపాటలు, కాపు పాటలు, నాటు పాటలు, మోట పాటలు, కాపరి పాటలు, ఇసుర్రాయి పాటలు, పెళ్లి పాటలు, దిష్టి పాటలు, పండుగ పబ్బాల పాటలు, రోడ్డు కూలీల పాటలు, వృత్తి పాటలు కోటి బాణీలతో జన సామాన్యంలో నేటికీ ప్రచరితమవుతూనే ఉన్నాయని మరచిపోరాదు. సామ్రాజ్య పెట్టుబడిదారీ సంస్కృతిలో పుట్టి పెరిగిన నోబెల్ అకాడమీ పెద్దలు నోబెల్ పురస్కార ప్రదానాలలో చూపే వివక్ష రాజ కక్షలకు, కార్పణ్యాలకూ అతీతం కాదని సోషలిస్టు దేశాలలో పుట్టి పెరిగి, ‘తల్లి రొమ్మునే గుద్ది’ దేశద్రోహులుగా మారిన పాస్టర్నాక్ లాంటి రచయితలకు నోబెల్ పురస్కారాలు లభించిన ఉదంతాలు కూడా మరవలేం. కొన్నేళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్న పూర్వ రంగంలో స్వీడిష్ అకాడమీలో చలనం కలుగడం, బాబ్ లాంటి వారిని ఎంపిక చేయవలసి రావటం శుభ సూచకమే. డిలాన్ మాదిరిగానే సామాన్య ప్రజాబాహుళ్యం బాధలకు ఆర్ద్రతతో బాణీలు కట్టిన ‘అలచంద్రవంక’ గోరటి వెంకన్న మాటల్లో - ‘రాములయ్య’ ‘ఇల్లు చూస్తే మూరెడంత/బాడిగేమో బాండంత/కార్పొరేటు ఊడలాయె/ గాడి కింద నీడవాయె’ లాంటి పరిస్థితులు తాండవిస్తున్నకొద్దీ... ‘అప్పులోళ్ల తిట్లకదిరి/అయ్యప్పమాలలేసు’కునే స్థితి దాపురించినంత కాలం.. విదేశీ సామ్రాజ్యవాద గుత్త పెట్టుబడులకి అంగలార్చి దేబరిస్తూ కాలక్షేపం చేసినంత కాలం.. ఆ ‘సంస్కృతి’కి పాలకులు బానిసలయినంత కాలం - రచయితలను లొంగదీసుకునే ‘పురస్కారాల’ కోసం కవి, గాయక నట, జాన పద కళాకారులు, చైతన్యంగల సంస్కృతీపరులు పురస్కారాల కోసం ఎదురు చూడకూడదు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సామాన్య మానవుల అసామాన్య కవి
ఎమర్జెన్సీ ఎత్తేసిన కొన్ని రోజులకు సి.వి.సుబ్బారావు (పౌర హక్కుల ఉద్యమ కారుడు) తెనాలిలో ఉన్న నా దగ్గరకు వచ్చాడు. వస్తూ వస్తూ ఇంగ్లిష్‌లో టైప్ చేసి ఉన్న కొన్ని కాగితాలు ఇచ్చి, ‘తర్వాత చదువుకో’ అని చాలా కబుర్లు చెప్పి వెళ్లిపోయాడు. అవి బాబ్ డిలాన్ కవితలు. ఎక్కడ సంపాదించాడో. ఐదారున్నాయి. అవి నన్ను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. అప్పట్నించీ డిలాన్ కవితల పుస్తకం కోసం కలవరిస్తున్నా. 89లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి వెళ్లినపుడు, చివరిరోజు మళ్లీ సుబ్బారావుతో కలిసి పుస్తకాల షాపుకి వెళ్లినపుడు కనిపించింది ‘బాబ్ డిలాన్ లిరిక్స్ 1962-1985’. వెంటనే కొనుక్కున్నా. హైదరాబాద్ రెలైక్కి దిగేవరకూ చదువుతూనే ఉన్నా. నవ్వుతూ. ఏడుస్తూ. కోపంతో రగులుతూ. వియత్నాంని ప్రేమించి, వియత్నాంని కలవరించి పలవరించిన తరం మాది. ఆ యుద్ధ సమయంలో యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికన్ గడ్డ మీద అత్యంత శక్తిమంతమైన పాటలు రాసిన కవి బాబ్ డిలాన్! పౌర హక్కుల ఉద్యమం నిర్మించటంలో భాగమైన తరానికి పౌరహక్కుల కోసం అమెరికాలో గొంతెత్తి పాడిన కవి చుక్కానిలానే కనపడతాడు. కమ్యూనిస్టు విప్లవకారులను కాల్చేయటాన్ని చిన్నతనం నుంచీ వింటూ, చూస్తూ, రాజ్యాన్నీ, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్నీ ద్వేషిస్తూ పెరిగిన తరానికి, అమెరికాలో అలాగే చేస్తూ, దానిని గురించి ప్రజల్ని చైతన్య పరుస్తూ పాడుతున్న వాగ్గేయకారుడిని ఇష్టపడటం ఎంత సహజం! బాబ్ డిలాన్ సామాన్య మానవుల కవిగాయకుడు. బతుకుదెరువు కోసం న్యూయార్క్ వచ్చి- ‘ప్రజలు భూమి లోపలికి పోతున్నారు భవనాలు ఆకాశంలోకి ఎదుగుతున్నాయి’ అని కనిపెట్టగలిగాడు. న్యూయార్క్ దగ్గర గ్రీన్విచ్ గ్రామంలో ఒక కాఫీ హవుస్లో పాడటానికి వెళ్తే వాళ్లు ‘‘నువ్వు హిల్బిల్లిలా పాడుతున్నావు, మాకు జానపద గాయకులు కావా’’లని పంపేశారు. రోజుకో డాలర్‌కి హార్మొనికా వాయించాడు. నెలల తరబడి పెద్ద హోటళ్ల ముందు పాడే అవకాశం కోసం పడిగాపులు కాశాడు. ‘ఎంతోమంది ప్రజలకు వాళ్ల టేబిళ్ల మీద తిండి లేదు కానీ చాలా కత్తులు, ఫోర్కులు ఉన్నాయి. వాటితో ఏదో ఒకటి కోసి తీరాలి’ అని రాశాడు. వుడీ గుత్రీ అనే కవి మహా ఇష్టం డిలాన్కి. అతని కోసం రాసిన ఒక కవితలో- ‘ఈ గమ్మత్తయిన పాత ప్రపంచం/ జబ్బు పడి, ఆకలితో అలసిపోయి చివికి చిరిగి పోయింది/ అది పుట్టిందో లేదో అప్పుడే చచ్చిపోతున్నట్టుంది’ అంటాడు. న్యూయార్క్‌లోని రాక్ ఫెల్లర్ ప్లాజా, ఎంపైర్ స్టేట్లంటే అతనికి ఏవగింపు. శ్రీశ్రీ ‘ఆః’లో రాసిన వాక్యాలు డిలాన్ కవితలో కనపడితే ఆశ్చర్యానందాలతో మనసు ఉప్పొంగుతుంది. ‘నువ్వు పైనున్నపుడు వాళ్లు మరింత పైకి తంతారు నువ్వు కింద పడుతుంటే పడేసి కొడతారు’ అంటాడు డిలాన్. న్యూయార్క్ అంటే తనకున్న కోపాన్ని చాలా కవితల్లో చెబుతాడు. ‘కాలిఫోర్నియా పొగ, ఓకహోమా మైదానాల దుమ్ము, కొండప్రాంత రాతిగనుల గుహలలోని ధూళిధూసరితము అంతా అన్నీ న్యూయార్క్ కంటే చాలా చాలా పరిశుభ్రం’ అంటాడు. ‘స్టాండింగ్ ఆన్ ద హైవే’, ‘పూర్ బాయ్ బ్లూస్’ ఎట్లాంటి కవితలవి! ‘నా రోదన వినపడటం లేదా’ అని డిలాన్ వేసిన కేకకు అమెరికన్ ప్రజానీకం ఉలిక్కిపడి లేచింది. మా తరం అన్నాను గానీ బాబ్ డిలాన్ ఈ తరానికి అత్యవసరమైన కవి. ‘పారనాయిడ్ బ్లూస్’లో రాసిన వాక్యాలు ఇప్పటి తరం అర్థం చేసుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది. ‘ఇపుడు మనందరం హిట్లర్‌తో ఏకీభవిస్తున్నాం 60 లక్షల మంది యూదులను చంపాడా ఫరవాలేదు ఫాసిస్టు అయినా అదేం పెద్ద విషయం కాదు అతను కమ్యూనిస్టయితే కాదు గదా’’ అని అప్పుడన్నాడు. కమ్యూనిస్టయితే కాదు గదా అన్న వాక్యం పక్కన మరికొన్ని పదాలు చేర్చుకుంటే ఎవరో గుర్తు రావటం లేదూ? ఇక ఆయన యుద్ధ వ్యతిరేక కవితలు ఇప్పటికీ ఎప్పటికీ పాడుకోవలసినవే. ‘నా అడుగులలోనే నన్ను మరణించనివ్వండి’ అన్న కవితలో ‘యుద్ధం ముంచుకొస్తుందనే పుకార్లు-! జీవితపు అర్థం గాలిలో కలిసిపోయింది. జీవించటమెలాగో నేర్చుకోటానికి బదులు చావటమెలాగో నేర్చుకుంటున్నారు’ అంటాడు. ‘మాస్టర్ ఆఫ్ వార్’ యుద్ధోన్మాదుల పాలిటి హెచ్చరిక. ‘జాన్ బ్రౌన్’ కథాకావ్య గీతిక చదవండి. యుద్ధం గురించిన భ్రమలన్నీ తొలగిపోతాయి. జాన్ బ్రౌన్ విదేశాలలో స్వదేశం తరఫున యుద్ధానికి వెళ్తాడు. వాళ్లమ్మ ఎంత గర్వపడుతుందో. ఆ మిలటరీ యూనిఫాం, చేతిలో తుపాకీ. నువ్వు నా కొడుకువైనందుకు సంతోషంరా అబ్బాయి, పై అధికారి చెప్పినట్లు చేసి మెడల్స్ తీసుకురా అంటుంది. అతను విదేశంలో యుద్ధం చేయటానికి వెళ్తాడు. ఉత్తరాలు వస్తుంటాయి తల్లికి. కొన్నాళ్లకు ఆగిపోతాయి. కొడుకే వస్తున్నాడని వార్త. తీరా స్టేషన్‌కెళ్తే కొడుకును గుర్తించలేకపోతుంది. గాయపడి నడుములు విరిగిన కొడుకుని. ‘అమ్మా జ్ఞాపకముందా, నేను యుద్ధానికి వెళ్లాను నేను గొప్పపని చేస్తున్నాననుకున్నావు కదూ? నేను యుద్ధరంగంలో, నువ్వు ఇంట్లో - గర్వపడుతూ. నువ్వు నా చెప్పుల్లో కాళ్లు పెట్టి నుంచోలేదమ్మా. నేనక్కడున్నపుడు ఆలోచించాను దేవుడా నే చేస్తున్నదేమిటని? నేను ఎవరినైనా చంపటానికి చూస్తున్నా; లేదా ఆ ప్రయత్నంలో చస్తున్నా. నన్ను అన్నిటికంటే భయపెట్టిందేమిటంటే నా శత్రువు నాకు అతి సమీపంగా వచ్చినపుడు అతని ముఖం అచ్చం నా ముఖం వలే కనపడింది అయ్యో! దేవుడా! సరిగ్గా నాలాగే ఉన్నాడు. అప్పుడు నాకనిపించిందమ్మా నేనీ ఆటలో ఒక తోలుబొమ్మననీ ఆ అరుపుల్లో పొగల్లో చివరికి దారం తెగిపోయింది ఒక ఫిరంగి గుండు నా కళ్లను పేల్చేసింది’. చివరికి అతను తల్లి చేతిలో పతకాలు పెట్టి వెళ్లిపోతాడు. ఎంత ధైర్యం ఉండాలి వియత్నాం యుద్ధ సమయంలో సైనికుని ఆలోచనలను ఇట్లా రాయటానికి. ఇంకో కవితలో మూడవ ప్రపంచ యుద్ధం గురించిన ఒక కల అతణ్ని రోజూ వెంటాడుతుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి ఆ కల గురించి చెప్పి అందులో చివరికి నేనూ ఇంకొకతనూ మాత్రమే మిగిలి ఉంటున్నాం అంటాడు. ఆ డాక్టరు ‘నా కలలో నేనొక్కడినే మిగిలి ఉంటున్నాను’ అంటాడు. యుద్ధంలో, మారణకాండల్లో భయంతో, మానసిక ఆందోళనల్తో బతుకుతున్న ప్రపంచ ప్రజల వేదనను, యాతనను డిలాన్ లయబద్ధంగా స్వరపరచి 60, 70 దశాబ్దాలను ఊగించి శాసించాడు. ప్రజలు అతని పాటలను శ్వాసించారు. యుద్ధ వ్యతిరేక గీతాలే కాదు, మానవ సంబంధాల గురించీ అత్యద్భుత గీతాలు రాశాడాయన. ‘రెస్ట్‌లెస్ ఫేర్వెల్’, ‘ఆల్ ఐ రియల్లీ వాంట్ టు డు’, ‘గోన్నా ఛేంజ్ మై వే ఆఫ్ థింకింగ్’- ఒకటి కాదు రెండు కాదు. మానవుల మధ్య అణచివేత పోయి ప్రేమ, స్నేహం బలపడాలని గొంతెత్తి ఆలపించాడు. ఒక్కోసారి నిరాశ పడిపోయి- ‘ఇంత అణచివేతా!/ ఇక నేను దీనిని లెక్కించలేను/ ఇంత అణచివేతా! తల్లులకు మొగుళ్లవుతున్న కొడుకులు కుమార్తెలను పడుపుగత్తెలుగా మార్చే తండ్రులు’ అని గుండలవిసేలా దుఃఖిస్తాడు. మళ్లీ ఆశ తెచ్చుకుని నిర్భయంగా విజయ గీతికను ఆలపిస్తాడు. ప్రేమ గీతాలు ఎన్ని రాశాడో! అన్నీ మానవీయమైనవే. ‘టు నైట్ ఐ విల్ బి స్టేయింగ్ విత్ యు’, ‘ఐ బిలీవ్ ఇన్ యు’, ‘వాట్ కెన్ ఐ డు ఫర్ యు’, ‘ఈజ్ యువర్ లవ్ ఇన్ వెయిన్’ ఇట్లా పదుల ప్రేమ గీతాలు. ప్రేయసీ కేవలం ప్రేయసి మాత్రమే కాదు. అతని విశ్వాసం! మానవుల జీవించే హక్కు మీద. ‘డు అన్టు అదర్స్’ కవిత తిక్కన రాసిన ‘ఒరులేయవి యొనరించిన’ పద్యాన్ని గుర్తు తెచ్చినపుడు గొప్ప కవులు మానవుల నైతిక విలువల గురించి రాసిన సారాంశం ఒకటే కదా అనిపిస్తుంది. బాబ్ డిలాన్ 1941లో పుట్టాడు. ఫలానా చోట. వీళ్లను పెళ్లాడాడు- ఇన్ని అవార్డులు వచ్చాయి అనే వివరాలు ఇంటర్నెట్లో చాలా దొరుకుతాయి. ఇది నేను డిలాన్ని అర్థం చేసుకున్న తీరు. ప్రేమించిన తీరు. ఇప్పటికీ ఆ కవిత్వం చదువుకుంటూ ప్రేరణ పొందాలని ఈ తరానికి చెప్పదల్చిన మాటలు. నోబెల్ బహుమతి ఆ మాటలు చెప్పడానికి ఒక సందర్భం అయినందుకు సంతోషంగా ఉంది. ఓల్గా -
ధిక్కార వాగ్గేయకారుడు!
కొందరిని చరిత్ర సృష్టిస్తుంది. కాలం వారిని తన శిఖరాగ్రంపై నిలబెడుతుంది. అటువంటివారిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనుకావడం... వివశులమై మిగిలి పోవడం మాత్రమే మనం చేయగలిగేది. చాలా కొద్దిమంది మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. కాలాన్ని తమ వెంట నడిపిస్తారు. వారి ఆగ్రహమూ, వారి ఆవేశమూ, వారి ధిక్కారమూ... సార్వకాలికమూ, సార్వజనీనమూ అవుతాయి. అదిగో...అలాంటి అత్యంత అరుదైన వ్యక్తుల్లో ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న బాబ్ డిలన్ ఒకరు. సాధారణంగా పురస్కారాలనేవి వాటి గ్రహీతలకు ఘనకీర్తిని, సంపదను తెచ్చిపెడతాయి. ప్రపంచమంతా వారివైపు తలతిప్పేలా చేస్తాయి. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆ పురస్కారాలు కీర్తిని పొందుతాయి. ఇప్పుడు నోబెల్ సాహితీ పురస్కారం అలాంటి కీర్తిని సొంతం చేసుకున్నదని చెప్పాలి. నిజానికి సాహిత్య నోబెల్ పురస్కారం ప్రకటించే సమయం ఆగమించినప్పుడల్లా బాబ్ డిలన్ అందరి అంచనాల్లోకీ వచ్చేవాడు. తీరా అది కాస్తా వేరెవరికో దక్కేది. కొన్ని దశాబ్దాలపాటు ఈ వరస నడిచింది. ఇక ఆ మాదిరి అంచనాలను అందరూ మరిచిపోయి చాన్నాళ్లయింది. ఇన్నేళ్లకు స్వీడిష్ నోబెల్ కమిటీకి బాబ్ డిలన్ కనిపిం చాడు. వయసు తనంత తాను వస్తుంది. పరిణతి అనేది మాత్రం సాధించాల్సిన అంశం. ఆలస్యమైనా నోబెల్ కమిటీ ఆ పరిణతిని సాధించింది. డిలన్ తొలి ఆల్బమ్ వెలువడి అర్ధ శతాబ్ద కాలం దాటిపోయాక అతడి జానపదంలో కవితాత్మక భావ వ్యక్తీకరణను అది పసిగట్టింది. అమెరికా సంప్రదాయ గీతాలకు ఆయన కొత్త ఒరవడులద్దిన సంగతిని గ్రహించింది. కవి జావెద్ అఖ్తర్ అన్నట్టు సాహిత్యంలో సంగీతం విడదీయరాని భాగమని గుర్తించింది. ఈసారైనా తనకు సాహిత్య నోబెల్ రాకపోతుందా అని ఎదురుచూసిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ లాంటివాడు సైతం సమకాలీన దిగ్గజ వాగ్గేయకారులందరినీ డిలన్ మించిపోయాడని వ్యాఖ్యా నించాడు. ఏం చేశాడు డిలన్? అనాగరిక సంగీతంగా, పిచ్చి పాటల పేలాపనగా సంప్ర దాయవాదులు తిరస్కరించిన పాప్ సంగీతాన్ని వీధి వీధినా వినిపించాడు. జనం నోళ్లల్లో నానే జానపదాల్ని తీసుకుని పదునెక్కించాడు. చిన్న చిన్న కాఫీ హోటళ్లతో మొదలు పెట్టి అనేకచోట్ల ప్రదర్శనలిచ్చాడు. పదుల సంఖ్యలో ఉన్న వీక్షకులు వందలకూ...ఆ తర్వాత వేలకూ చేరుకున్నారు. విశాల వేదికలు ఇక ఆ సంగీతాన్ని విస్మరించలేకపోయాయి. దాన్ని ఆహ్వానించడం ద్వారా తమ తప్పిదాన్ని సరిచేసు కున్నాయి. డిలన్ తన అద్వితీయమైన కవితా శక్తినీ, అపారమైన మేధనూ, బహు ముఖ ప్రజ్ఞాపాటవాలనూ రంగరించాడు. కోపాన్నీ, ఆవేశాన్నీ దట్టించాడు. పాట లుగా మార్చి తూటాలుగా విసిరాడు. ధిక్కార వాగ్గేయకారుడయ్యాడు. యువ జనంలో కవిత్వంపై ఆసక్తిని రగిల్చాడు. 60ల నాటి ‘అసహన అమెరికా’కు డిలన్ సంగీతం ప్రతీక అయింది. యువతరంలో పాలకుల పట్ల ఉన్న ఆగ్రహానికి అద్దం పట్టింది. ప్రతిదాన్నీ ప్రశ్నించే తత్వాన్ని, సరైన జవాబు కోసం లిప్తపాటైనా నిరీక్షిం చలేని తొందరనూ అది ప్రతిబింబించింది. పాలకులు ఇచ్చిన ప్రతి జవాబునూ ప్రశ్నించింది. ఒక్కమాటలో ఆ కాలానికి ఆయన ప్రతినిధి అయ్యాడు. అందుకే ధిక్కార వాగ్గేయకారుడిగా విశ్వవ్యాప్తమయ్యాడు. డిలన్‌ను సార్వజనీనం చేసిన ఈ లక్షణాన్ని మాత్రం నోబెల్ కమిటీ తన ప్రశంసా వాక్యాల్లో ప్రస్తావించలేకపోయింది. ఉవ్వెత్తున ఎగసిన నల్లజాతీయుల పౌరహక్కుల ఉద్యమం, వియత్నాంను వల్లకాడు చేస్తున్న ప్రభుత్వ నిర్వాకాన్ని నిలదీస్తూ సాగిన యుద్ధోన్మాద వ్యతిరేక ఉద్యమం అమెరికాను ఊపేస్తున్నప్పుడు వాటికి జవజీవాలనిచ్చింది డిలన్ పాటే. ‘మీరు చేసిన ఘనకార్యాలేమీ లేవు/ ధ్వంసరచన చేయడం తప్ప../నా ప్రపంచంతో ఆట లాడుకుంటున్నారు/అదేదో మీ చిన్ని బొమ్మలాగ...’ అని యుద్ధాన్ని ప్రేరేపి స్తున్నవారిని అనడమే కాదు, ‘మీ ముసుగుల నుంచే మిమ్మల్ని గుర్తించగలను’ అంటూ హెచ్చరించాడు. శ్వేత, యూదు కుటుంబంలో రాబర్ట్ అలెన్‌గా పుట్టి డిలన్గా లోకానికంతకూ తెలియడానికి ముందు ఆయన సంగీతంలో కఠోర సాధన చేశాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. కీర్తిప్రతిష్టలు రావడం కాదు... అవి ఆయనను ముంచెత్తాయి. అది భయమో, ప్రేమను తట్టుకోలేనితనమో... ఎక్కడికెళ్తే అక్కడికి వరదలా ఉప్పొంగుతున్న జనాన్ని చూసి కొన్నేళ్లు వారికి దూరంగా ఉండిపోయాడు. 80వ దశకం మధ్య నుంచి సంగీత యాత్ర ప్రారంభించాడు. ఈ ఏడాది చివరకు మరో 29 కచేరిలిస్తే ఆ ‘అనంత సంగీత యాత్ర’లో మొత్తంగా 2,812 కచేరిలు పూర్తవుతాయి. ఎవరో అన్నట్టు డిలన్ ఇప్పటికీ రోడ్డుపైనే ఉన్నాడు. ఆయన కీర్తి కిరీటంలో ఇంతవరకూ 37 ఆల్బమ్‌లు, 12 గ్రామీలు, ఒక పులిట్జర్, ఒక ఆస్కార్, ఒక గోల్డెన్ గ్లోబ్, రెండు డాక్టరేట్లు ఉన్నాయి. ఒకానొక దశలో ఆయన పాటంటే ఉలిక్కిపడి తడబాటుకు లోనైన రాజ్యం ఆ తర్వాత తేరుకుంది. డిలన్‌ను అక్కున చేర్చుకుంది. నాలుగేళ్ల క్రితం ఆయనకు ప్రెసిడెన్షియల్ స్వేచ్ఛా పతకాన్ని బహుకరించింది. తాను ఆగ్రహ పడిన కాలంనాటికీ, ఇప్పటికీ స్వభావాన్ని అణుమాత్రమైనా మార్చుకోని రాజ్యం ఇచ్చిన పురస్కారాన్ని ఎందుకు స్వీకరించాలని డిలన్పై అలిగినవారున్నారు. యుద్ధోన్మాదంపై నువ్వు ఎక్కుపెట్టిన అగ్ని గీతాలు మా చెవుల్లో ఇంకా మార్మో గుతుండగానే మమ్మల్నిలా నిస్పృహకు గురిచేయడం న్యాయమేనా అని ప్రశ్నించిన గొంతులెన్నో ఉన్నాయి. అంతకు ముందు ఏడాది ఇజ్రాయెల్‌లో సంగీత కచేరి ఇస్తున్నప్పుడు కూడా దాన్ని విరమించుకోమని చాలామంది కోరారు. వ్యక్తిగా డిలన్ అనంతరకాలంలో ఏమైనా, అందుకాయన ఎలాంటి సంజాయిషీలు చెప్పినా ఆ ధిక్కార గీతాలు జనం గుండెల నుంచి చెదిరిపోవు. ఎందుకంటే ‘హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. వాటిని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. అవి మాటలు కావు, అక్షరాలు కావు-ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు’. మహాకవి శ్రీశ్రీ నుద్దేశించి చలం అన్న మాటలివి. ఇవి డిలన్‌కు కూడా వర్తిస్తాయి. -
బాబ్ డిలన్‌కు సాహిత్య నోబెల్
-
బాబ్ డిలన్‌కు సాహిత్య నోబెల్
►అమెరికా సంగీత దిగ్గజాన్ని వరించిన విఖ్యాత పురస్కారం ► పులకించిన సంగీత ప్రపంచం అమెరికా సంగీత దిగ్గజం బాబ్ డిలన్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. జానపద గాయకునిగా, గీత రచయితగా పాపులర్ అయిన 75 ఏళ్ల బాబ్ డిలన్ ఈ విఖ్యాత అవార్డును అందుకున్న తొలి గీత రచయితగా చరిత్ర సృష్టించారు. డిలన్ అమెరికా గీత సంప్రదాయానికి కొత్త ఒరవడి నేర్పారని, కొత్త కవితాత్మక భావవ్యక్తీకరణలను ఆవిష్కరించారని, అందుకే ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేశామని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. డిలన్ రాసిన ‘బ్లోయింగ్ ఇన్ ద విండ్’, ‘ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్’ పాటలు అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాలకు ఊపిరిగా నిలిచింది. డిలన్‌కు ఈ అవార్డు రావడంతో సాహిత్య లోకం పులకించింది. కాగా, నోబెల్ పురస్కారాల ప్రదానం డిసెంబర్ 10న జరగనుంది. స్టాక్‌హోం: అమెరికా సంగీత దిగ్గజం, జానపద గాయకుడు, గీత రచయిత బాబ్ డిలన్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య అవార్డు వరించింది. 75 ఏళ్ల డిలన్ ఈ విఖ్యాత అవార్డును అందుకున్న తొలి గీత రచయితగా చరిత్ర సృష్టించారు. సాహిత్యం విభాగంలో సంగీతకారునికి, గీత రచయితకు అవార్డును ఇవ్వడం నోబెల్ అవార్డులను అనుసరించే వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరూ ఊహించని రీతిలో డిలన్ పేరును దీనిని ఎంపిక చేయడం నిపుణులను మరింత ఆశ్చర్యపరిచింది. డిలన్ అమెరికా గీత సంప్రదాయానికి కొత్త ఒరవడి నేర్పారని, కొత్త కవితాత్మక భావవ్యక్తీకరణలను ఆవిష్కరించారని, అందుకే ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేశామని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. జానపద గాయకుడైన డిలన్ పేరు చాలా ఏళ్లుగా నోబెల్ సాహిత్య పురస్కారం పోటీలో వినిపిస్తోంది. అయితే ఆయనను ఎవరూ ప్రధాన పోటీదారుగా భావించని తరుణంలో డిలన్ పేరును ప్రకటించగానే.. సభా ప్రాం గణం కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఆయన రాసిన ‘బ్లోరుుంగ్ ఇన్ ద విండ్’, ‘ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్’ పాటలు అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాలకు ఊపిరిగా నిలిచాయి. ఈ అవార్డు కింద డిలన్‌కు సుమారు రూ.6.06 కోట్లు అందనున్నాయి. మైమరిచిన సంగీత ప్రపంచం సంగీత దిగ్గజం బాబ్ డిలన్‌కు నోబెల్ పురస్కారం రావడంపై సంగీత ప్రపంచం హర్షం వ్యక్తం చేసింది. సరోద్ విద్యాంసుడు అంజాద్ అలీఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, రచయిత సల్మాన్ రష్దీ తదితరులు డిలన్‌కు నోబెల్ రావడాన్ని స్వాగతించారు. సంగీత కళాకారులంతా గర్వించదగ్గ సందర్భం ఇది అని కొనియాడారు. తన పాటలతో తనను ప్రభావితం చేసిన వ్యక్తి డిలన్ అని, ప్రజలకు తన పాటలతో కొత్త లోకం చూపించిన వ్యక్తి ఆయనని ఏఆర్ రెహ్మాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. స్వీడిష్ అకాడమీ తీసుకున్న నిర్ణయం అద్భుతమని, దీని ద్వారా సాహిత్యంలో సంగీతం కూడా ఒక భాగం అనే విషయం రుజువైందని ప్రముఖ గీత రచయిత జావెద్ అక్తర్ పేర్కొన్నారు. గాయకులు అద్నాన్ సమి, ఉషా ఊతప్, విశాల్ దద్లానీ, శిల్పారావు, సోనా మహాపాత్ర, తదితరులు డిలాన్‌కు అభినందనలు తెలిపారు. డిసెంబర్ 10న ప్రదానం సాహిత్య అవార్డును ప్రకటించడంతో ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటనకు తెరపడినట్లయ్యింది. ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, శాంతి మొదలైన విభాగాలకు అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, నోబెల్ బహుమతుల ప్రదానోత్సవం ఈ అవార్డుల సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 10న నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 10న స్టాక్‌హోమ్ వేదికగా ఈ వేడుక జరగనుంది. శాంతి పురస్కార ప్రదానం కోసం అదే రోజు ఓస్లోలో నార్వేయన్ నోబెల్ కమిటీ మరో కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా విజేతలకు నగదు పుస్కారం, గోల్డ్ మెడల్, డిప్లొమాను అందజేస్తారు. ప్రజలతో నడిచిన పాటగాడు.. ప్రఖ్యాత అమెరికన్ కవిగాయకుడు, జానపద సంస్కృతి ప్రేమికుడు హక్కుల ప్రోత్సాహకుడు బాబ్ డిలన్ (75). అమెరికా సంగీత దిగ్గజంగా గౌరవం అందుకునే బాబ్ డిలన్‌కు ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులున్నారు. ‘ది టైమ్స్ దే ఆర్ చేంజింగ్’, ‘అనదర్ సైడ్ ఆఫ్ బాబ్ డిలన్’, ‘బ్రింగింగ్ ఇట్ ఆల్ బ్యాక్ హోమ్’, ‘హైవే 61 రీవిజిటెడ్’ వంటి డిలన్ ఆల్బమ్స్ అమెరికాను ఉర్రూతలూగించాయి. అరిచి అరిచి పాడు.. డిలన్ అసలు పేరు రాబర్ట్ అలెన్ జిబర్మేన్. అమెరికాలోని మిన్నెసొటాలో 1941లో జన్మిం చాడు. సంగీతవాసనలు ఏ మాత్రంలేని కుటుం బంలో పుట్టినా.. రేడియో వింటూ ‘ఎల్విస్ ప్రెస్లీ’ ప్రభావంతో డిలన్ సంగీత ప్రపంచంలో అడుగు పెట్టాడు. హైస్కూల్లో ఉన్నప్పుడే సొంత బ్యాం డ్ ఏర్పాటు చేసుకుని స్కూల్ వేదికపై డిలన్ పాడుతుంటే ఆ సంగీత ధోరణికి, అరుపులకు కంగారుపడిన ప్రిన్సిపల్ మైక్ కట్ చేయాల్సి వచ్చిందట. డిలన్‌కు కవిత్వం అంటే ఇష్టం. ‘డిలన్ థామస్’ అనే కవి రాసిన కవిత్వాన్ని ఇష్టపడి తన పేరును ఆ కవి గుర్తుగా ‘బాబ్ డిలన్’ అని మార్చుకున్నాడు. పౌర హక్కుల గొంతుకై...: డిలన్‌ను అతడి సంగీతం కంటే అతడి సామాజిక బాధ్యతే ఎక్కువమందిని చేరువ చేసింది. 1960లలో అమెరికా అంతటా భగ్గున ఎగసిన పౌర హక్కుల ఉద్యమంలో బాబ్ డిలన్ ప్రత్యేక ఆకర్షణ. విద్య, ఉపాధి, సామాజిక రంగాల్లో నల్లవాళ్లపై అమెరికాలో బయటపడ్డ వివక్ష పట్ల బాబ్ డిలన్ గళమెత్తాడు. హక్కులకోసం పోరాడుతున్న వారందరికీ.. డిలన్ రాసిన పాటలు మరింత ఊపునిచ్చాయి. అలాగే వియత్నాంతో అమెరికా చేస్తున్న యుద్ధాన్ని కూడా గట్టిగా వ్యతిరేకిస్తూ ‘యాంటి వార్ ఉద్యమం’తో పాటుగా నడిచాడు. సమర్థమైన, భావరసస్ఫోరకమైన, చైతన్యపరిచే గీతాలను ఆలపించే డిలన్.. తనకొస్తున్న పాపులారిటీ, వెంట పడుతున్న జనం నుంచి తప్పించుకోవడానికి మోటర్ సైకిల్ ప్రమాదం మిషతో 1966 నుంచి 8ఏళ్లపాటు జనానికి దూరంగా ఉన్నాడు. తర్వాత 1980 నుంచి కొనసాగిస్తున మ్యూజికల్ టూర్ అమెరికా సంగీత చరిత్రలో సుదీర్ఘమైన టూర్‌గా ప్రత్యేకత సంపాదించుకుంది. చిత్రకారుడుగా కూడా డిలన్ ఆరు పుస్తకాలను తన బొమ్మలతో ప్రచురించాడు. పాట రచనతో అతడు ఏర్పరిచిన ప్రభావానికి 2008లో పులిట్జర్ పురస్కార కమిటీ ఒక ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసింది. లెక్కలేనన్ని అవార్డులు పొందిన డిలన్ పాటలు అన్ని కలిపి మొత్తంగా పదికోట్ల కాపీలు అమ్ముడు పోయాయి. ధోరణి మార్చుకుంటున్న అవార్డు కమిటీ.. నోబెల్ సాహిత్య పురస్కారం సాధారణంగా కవిత్వం, కథ, నవల, నాటకం ఇలాంటి సాహితీ ధోరణుల్లో ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఇటీవల అవార్డు కమిటీ తన పరిధిని విస్తరించుకుంటోంది. 2014లో అవార్డ్ పొందిన ఫ్రెంచ్ రచయిత పాట్రిక్ మొడియానో పెద్ద గొప్ప రచయిత కాదు. కానీ.. రెండో ప్రపంచయుద్ధంలో జర్మన్లు ఫ్రాన్స్ ఆక్రమణపై రాసిన కథలకు ఈ అవార్డు ప్రకటించారు. 2015లో స్వెత్లానా అలెక్సివిచ్ అనే జర్నలిస్టుకు (సోవియట్ పతనం తర్వాత పరిణామాలను ఇంటర్వ్యూల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు) నోబెల్ దక్కింది.ఈ సంవత్సరం అనూహ్యంగా ఈ కవిగాయకుడికి ప్రకటించారు. - మొహమ్మద్ ఖదీర్ బాబు కాఫీ హోటళ్ల నుంచి.. గొప్పవారి కథనాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. బాబ్ డిలన్ కథ కూడా అలాంటిదే. అతడు కూడా గిటార్ పట్టిన వెంటనే సూపర్‌స్టార్ అయిపోలేదు. అంచెలంచెలుగా ఎదిగాడు. కాఫీ హోటళ్లలో, స్థానిక క్లబుల్లో పాడుతూ క్రమంగా నలుగురికీ పరిచయమయ్యాడు. జానపదానికి ప్రాధాన్యమివ్వటంతో అందరినీ ఆకర్శించాడు. ‘ఫోక్ సింగింగ్’ నుంచి ‘రాక్ అండ్ రోల్’కు తన ధోరణి మార్చుకోవడానికి డిలన్ చాలా కాలమే తీసుకున్నాడు. -
గ్రేటెస్ట్ లివింగ్ పోయెట్కు నోబెల్ పురస్కారం!
స్టాక్‌హోమ్: 1960 నుంచి తన ప్రభావవంతమైన గీతాలతో ఒక తరానికి ప్రతినిధిగా, స్వరంగా నిలిచిన అమెరికన్ గీత రచయిత, పాటగాడు బాబ్ డిలాన్ను అత్యున్నత నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. అత్యున్నత సాహిత్య పురస్కారంగా భావించే నోబెల్ అవార్డును ఇప్పటివరకు కవులకు, రచయితలకు ఇస్తూ వస్తుండగా.. ఈసారి అనూహ్యరీతిలో సంగీత రంగానికి చెందిన గాయకుడికి ప్రకటించడం గమనార్హం. "బ్లోవిన్ ఇన్ ద విండ్', "మాస్టర్స్ ఆఫ్ వార్', "ఏ హార్డ్ రెయిన్స్ ఏ గాన్నా ఫాల్', "ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్', "సబ్టెరానియన్ హోస్సిక్ బ్లూ', "లైక్ ఏ రోలింగ్ స్టోన్' వంటి తన గీతాలతో బాబ్ డిలాన్ అసమ్మతిని, తిరుగుబాటును, స్వతంత్రకాంక్షను ప్రకటించారు. "డిలాన్లో ఒక ఐకాన్ ఉన్నారు. సమకాలీన సంగీతంపై ఆయన ప్రభావం అపారం' అని స్వీడిష్ అకాడెమీ పేర్కొంది. నోబెల్ పురస్కారం కింద డిలాన్‌కు ఎనిమిది మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (9.30లక్షల డాలర్లు.. రూ. 6.22 కోట్లు) బహుమానం లభించనుంది. 50 ఏళ్లకుపైగా కొనసాగుతున్న తన గీత ప్రస్థానంలో ఇప్పటికే డిలాన్ గీతాలు రచిస్తున్నారు. అప్పుడప్పుడు ప్రపంచ పర్యటనలు చేపడుతున్నారు. ప్రస్తుతం జీవిస్తున్న వారిలో ఆయన అత్యున్నత కవి (గ్రేటెస్ట్ లివింగ్ పోయెట్) అయి ఉంటారు’ అని అకాడెమీ సభ్యుడు పెర్ వాస్ట్బర్గ్ పేర్కొన్నారు. డిలాన్‌కు నోబెల్ ప్రకటించడంలో ప్యానెల్ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుందని అకాడెమీ శాశ్వత కార్యదర్శి సరా డెనియస్ పేర్కొన్నారు. డైనమేట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట 1901 నుంచి ప్రతి సంవత్సరం విజ్ఞానం, సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసినవారికి పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.