ధిక్కార వాగ్గేయకారుడు!
కొందరిని చరిత్ర సృష్టిస్తుంది. కాలం వారిని తన శిఖరాగ్రంపై నిలబెడుతుంది. అటువంటివారిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనుకావడం... వివశులమై మిగిలి పోవడం మాత్రమే మనం చేయగలిగేది. చాలా కొద్దిమంది మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. కాలాన్ని తమ వెంట నడిపిస్తారు. వారి ఆగ్రహమూ, వారి ఆవేశమూ, వారి ధిక్కారమూ... సార్వకాలికమూ, సార్వజనీనమూ అవుతాయి. అదిగో...అలాంటి అత్యంత అరుదైన వ్యక్తుల్లో ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న బాబ్ డిలన్ ఒకరు. సాధారణంగా పురస్కారాలనేవి వాటి గ్రహీతలకు ఘనకీర్తిని, సంపదను తెచ్చిపెడతాయి. ప్రపంచమంతా వారివైపు తలతిప్పేలా చేస్తాయి. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆ పురస్కారాలు కీర్తిని పొందుతాయి.
ఇప్పుడు నోబెల్ సాహితీ పురస్కారం అలాంటి కీర్తిని సొంతం చేసుకున్నదని చెప్పాలి. నిజానికి సాహిత్య నోబెల్ పురస్కారం ప్రకటించే సమయం ఆగమించినప్పుడల్లా బాబ్ డిలన్ అందరి అంచనాల్లోకీ వచ్చేవాడు. తీరా అది కాస్తా వేరెవరికో దక్కేది. కొన్ని దశాబ్దాలపాటు ఈ వరస నడిచింది. ఇక ఆ మాదిరి అంచనాలను అందరూ మరిచిపోయి చాన్నాళ్లయింది. ఇన్నేళ్లకు స్వీడిష్ నోబెల్ కమిటీకి బాబ్ డిలన్ కనిపిం చాడు. వయసు తనంత తాను వస్తుంది. పరిణతి అనేది మాత్రం సాధించాల్సిన అంశం. ఆలస్యమైనా నోబెల్ కమిటీ ఆ పరిణతిని సాధించింది. డిలన్ తొలి ఆల్బమ్ వెలువడి అర్ధ శతాబ్ద కాలం దాటిపోయాక అతడి జానపదంలో కవితాత్మక భావ వ్యక్తీకరణను అది పసిగట్టింది. అమెరికా సంప్రదాయ గీతాలకు ఆయన కొత్త ఒరవడులద్దిన సంగతిని గ్రహించింది. కవి జావెద్ అఖ్తర్ అన్నట్టు సాహిత్యంలో సంగీతం విడదీయరాని భాగమని గుర్తించింది. ఈసారైనా తనకు సాహిత్య నోబెల్ రాకపోతుందా అని ఎదురుచూసిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ లాంటివాడు సైతం సమకాలీన దిగ్గజ వాగ్గేయకారులందరినీ డిలన్ మించిపోయాడని వ్యాఖ్యా నించాడు.
ఏం చేశాడు డిలన్? అనాగరిక సంగీతంగా, పిచ్చి పాటల పేలాపనగా సంప్ర దాయవాదులు తిరస్కరించిన పాప్ సంగీతాన్ని వీధి వీధినా వినిపించాడు. జనం నోళ్లల్లో నానే జానపదాల్ని తీసుకుని పదునెక్కించాడు. చిన్న చిన్న కాఫీ హోటళ్లతో మొదలు పెట్టి అనేకచోట్ల ప్రదర్శనలిచ్చాడు. పదుల సంఖ్యలో ఉన్న వీక్షకులు వందలకూ...ఆ తర్వాత వేలకూ చేరుకున్నారు. విశాల వేదికలు ఇక ఆ సంగీతాన్ని విస్మరించలేకపోయాయి. దాన్ని ఆహ్వానించడం ద్వారా తమ తప్పిదాన్ని సరిచేసు కున్నాయి. డిలన్ తన అద్వితీయమైన కవితా శక్తినీ, అపారమైన మేధనూ, బహు ముఖ ప్రజ్ఞాపాటవాలనూ రంగరించాడు. కోపాన్నీ, ఆవేశాన్నీ దట్టించాడు. పాట లుగా మార్చి తూటాలుగా విసిరాడు. ధిక్కార వాగ్గేయకారుడయ్యాడు. యువ జనంలో కవిత్వంపై ఆసక్తిని రగిల్చాడు. 60ల నాటి ‘అసహన అమెరికా’కు డిలన్ సంగీతం ప్రతీక అయింది. యువతరంలో పాలకుల పట్ల ఉన్న ఆగ్రహానికి అద్దం పట్టింది. ప్రతిదాన్నీ ప్రశ్నించే తత్వాన్ని, సరైన జవాబు కోసం లిప్తపాటైనా నిరీక్షిం చలేని తొందరనూ అది ప్రతిబింబించింది. పాలకులు ఇచ్చిన ప్రతి జవాబునూ ప్రశ్నించింది. ఒక్కమాటలో ఆ కాలానికి ఆయన ప్రతినిధి అయ్యాడు. అందుకే ధిక్కార వాగ్గేయకారుడిగా విశ్వవ్యాప్తమయ్యాడు.
డిలన్‌ను సార్వజనీనం చేసిన ఈ లక్షణాన్ని మాత్రం నోబెల్ కమిటీ తన ప్రశంసా వాక్యాల్లో ప్రస్తావించలేకపోయింది. ఉవ్వెత్తున ఎగసిన నల్లజాతీయుల పౌరహక్కుల ఉద్యమం, వియత్నాంను వల్లకాడు చేస్తున్న ప్రభుత్వ నిర్వాకాన్ని నిలదీస్తూ సాగిన యుద్ధోన్మాద వ్యతిరేక ఉద్యమం అమెరికాను ఊపేస్తున్నప్పుడు వాటికి జవజీవాలనిచ్చింది డిలన్ పాటే. ‘మీరు చేసిన ఘనకార్యాలేమీ లేవు/ ధ్వంసరచన చేయడం తప్ప../నా ప్రపంచంతో ఆట లాడుకుంటున్నారు/అదేదో మీ చిన్ని బొమ్మలాగ...’ అని యుద్ధాన్ని ప్రేరేపి స్తున్నవారిని అనడమే కాదు, ‘మీ ముసుగుల నుంచే మిమ్మల్ని గుర్తించగలను’ అంటూ హెచ్చరించాడు. శ్వేత, యూదు కుటుంబంలో రాబర్ట్ అలెన్‌గా పుట్టి డిలన్‌గా లోకానికంతకూ తెలియడానికి ముందు ఆయన సంగీతంలో కఠోర సాధన చేశాడు. అంచెలంచెలుగా ఎదిగాడు.
కీర్తిప్రతిష్టలు రావడం కాదు... అవి ఆయనను ముంచెత్తాయి. అది భయమో, ప్రేమను తట్టుకోలేనితనమో... ఎక్కడికెళ్తే అక్కడికి వరదలా ఉప్పొంగుతున్న జనాన్ని చూసి కొన్నేళ్లు వారికి దూరంగా ఉండిపోయాడు. 80వ దశకం మధ్య నుంచి సంగీత యాత్ర ప్రారంభించాడు. ఈ ఏడాది చివరకు మరో 29 కచేరిలిస్తే ఆ ‘అనంత సంగీత యాత్ర’లో మొత్తంగా 2,812 కచేరిలు పూర్తవుతాయి. ఎవరో అన్నట్టు డిలన్ ఇప్పటికీ రోడ్డుపైనే ఉన్నాడు. ఆయన కీర్తి కిరీటంలో ఇంతవరకూ 37 ఆల్బమ్‌లు, 12 గ్రామీలు, ఒక పులిట్జర్, ఒక ఆస్కార్, ఒక గోల్డెన్ గ్లోబ్, రెండు డాక్టరేట్‌లు ఉన్నాయి. ఒకానొక దశలో ఆయన పాటంటే ఉలిక్కిపడి తడబాటుకు లోనైన రాజ్యం ఆ తర్వాత తేరుకుంది. డిలన్‌ను అక్కున చేర్చుకుంది. నాలుగేళ్ల క్రితం ఆయనకు ప్రెసిడెన్షియల్ స్వేచ్ఛా పతకాన్ని బహుకరించింది. తాను ఆగ్రహ పడిన కాలంనాటికీ, ఇప్పటికీ స్వభావాన్ని అణుమాత్రమైనా మార్చుకోని రాజ్యం ఇచ్చిన పురస్కారాన్ని ఎందుకు స్వీకరించాలని డిలన్‌పై అలిగినవారున్నారు.
యుద్ధోన్మాదంపై నువ్వు ఎక్కుపెట్టిన అగ్ని గీతాలు మా చెవుల్లో ఇంకా మార్మో గుతుండగానే మమ్మల్నిలా నిస్పృహకు గురిచేయడం న్యాయమేనా అని ప్రశ్నించిన గొంతులెన్నో ఉన్నాయి. అంతకు ముందు ఏడాది ఇజ్రాయెల్‌లో సంగీత కచేరి ఇస్తున్నప్పుడు కూడా దాన్ని విరమించుకోమని చాలామంది కోరారు. వ్యక్తిగా డిలన్ అనంతరకాలంలో ఏమైనా, అందుకాయన ఎలాంటి సంజాయిషీలు చెప్పినా ఆ ధిక్కార గీతాలు జనం గుండెల నుంచి చెదిరిపోవు. ఎందుకంటే ‘హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. వాటిని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. అవి మాటలు కావు, అక్షరాలు కావు-ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు’. మహాకవి శ్రీశ్రీ నుద్దేశించి చలం అన్న మాటలివి. ఇవి డిలన్‌కు కూడా వర్తిస్తాయి.