సామాన్య మానవుల అసామాన్య కవి
ఎమర్జెన్సీ ఎత్తేసిన కొన్ని రోజులకు సి.వి.సుబ్బారావు (పౌర హక్కుల ఉద్యమ కారుడు) తెనాలిలో ఉన్న నా దగ్గరకు వచ్చాడు. వస్తూ వస్తూ ఇంగ్లిష్‌లో టైప్ చేసి ఉన్న కొన్ని కాగితాలు ఇచ్చి, ‘తర్వాత చదువుకో’ అని చాలా కబుర్లు చెప్పి వెళ్లిపోయాడు. అవి బాబ్ డిలాన్ కవితలు. ఎక్కడ సంపాదించాడో. ఐదారున్నాయి. అవి నన్ను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. అప్పట్నించీ డిలాన్ కవితల పుస్తకం కోసం కలవరిస్తున్నా. 89లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి వెళ్లినపుడు, చివరిరోజు మళ్లీ సుబ్బారావుతో కలిసి పుస్తకాల షాపుకి వెళ్లినపుడు కనిపించింది ‘బాబ్ డిలాన్ లిరిక్స్ 1962-1985’. వెంటనే కొనుక్కున్నా. హైదరాబాద్ రెలైక్కి దిగేవరకూ చదువుతూనే ఉన్నా. నవ్వుతూ. ఏడుస్తూ. కోపంతో రగులుతూ.
వియత్నాంని ప్రేమించి, వియత్నాంని కలవరించి పలవరించిన తరం మాది. ఆ యుద్ధ సమయంలో యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికన్ గడ్డ మీద అత్యంత శక్తిమంతమైన పాటలు రాసిన కవి బాబ్ డిలాన్! పౌర హక్కుల ఉద్యమం నిర్మించటంలో భాగమైన తరానికి పౌరహక్కుల కోసం అమెరికాలో గొంతెత్తి పాడిన కవి చుక్కానిలానే కనపడతాడు. కమ్యూనిస్టు విప్లవకారులను కాల్చేయటాన్ని చిన్నతనం నుంచీ వింటూ, చూస్తూ, రాజ్యాన్నీ, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్నీ ద్వేషిస్తూ పెరిగిన తరానికి, అమెరికాలో అలాగే చేస్తూ, దానిని గురించి ప్రజల్ని చైతన్య పరుస్తూ పాడుతున్న వాగ్గేయకారుడిని ఇష్టపడటం ఎంత సహజం!
బాబ్ డిలాన్ సామాన్య మానవుల కవిగాయకుడు. బతుకుదెరువు కోసం న్యూయార్క్ వచ్చి- ‘ప్రజలు భూమి లోపలికి పోతున్నారు భవనాలు ఆకాశంలోకి ఎదుగుతున్నాయి’ అని కనిపెట్టగలిగాడు. న్యూయార్క్ దగ్గర గ్రీన్‌విచ్ గ్రామంలో ఒక కాఫీ హవుస్‌లో పాడటానికి వెళ్తే వాళ్లు ‘‘నువ్వు హిల్‌బిల్లిలా పాడుతున్నావు, మాకు జానపద గాయకులు కావా’’లని పంపేశారు. రోజుకో డాలర్‌కి హార్మొనికా వాయించాడు. నెలల తరబడి పెద్ద హోటళ్ల ముందు పాడే అవకాశం కోసం పడిగాపులు కాశాడు. ‘ఎంతోమంది ప్రజలకు వాళ్ల టేబిళ్ల మీద తిండి లేదు కానీ చాలా కత్తులు, ఫోర్కులు ఉన్నాయి. వాటితో ఏదో ఒకటి కోసి తీరాలి’ అని రాశాడు.
వుడీ గుత్రీ అనే కవి మహా ఇష్టం డిలాన్‌కి. అతని కోసం రాసిన ఒక కవితలో- ‘ఈ గమ్మత్తయిన పాత ప్రపంచం/ జబ్బు పడి, ఆకలితో అలసిపోయి చివికి చిరిగి పోయింది/ అది పుట్టిందో లేదో అప్పుడే చచ్చిపోతున్నట్టుంది’ అంటాడు.
న్యూయార్క్‌లోని రాక్ ఫెల్లర్ ప్లాజా, ఎంపైర్ స్టేట్‌లంటే అతనికి ఏవగింపు. శ్రీశ్రీ ‘ఆః’లో రాసిన వాక్యాలు డిలాన్ కవితలో కనపడితే ఆశ్చర్యానందాలతో మనసు ఉప్పొంగుతుంది.
‘నువ్వు పైనున్నపుడు వాళ్లు మరింత పైకి తంతారు
నువ్వు కింద పడుతుంటే పడేసి కొడతారు’ అంటాడు డిలాన్. న్యూయార్క్ అంటే తనకున్న కోపాన్ని చాలా కవితల్లో చెబుతాడు. ‘కాలిఫోర్నియా పొగ, ఓకహోమా మైదానాల దుమ్ము, కొండప్రాంత రాతిగనుల గుహలలోని ధూళిధూసరితము అంతా అన్నీ న్యూయార్క్ కంటే చాలా చాలా పరిశుభ్రం’ అంటాడు. ‘స్టాండింగ్ ఆన్ ద హైవే’, ‘పూర్ బాయ్ బ్లూస్’ ఎట్లాంటి కవితలవి! ‘నా రోదన వినపడటం లేదా’ అని డిలాన్ వేసిన కేకకు అమెరికన్ ప్రజానీకం ఉలిక్కిపడి లేచింది.
మా తరం అన్నాను గానీ బాబ్ డిలాన్ ఈ తరానికి అత్యవసరమైన కవి. ‘పారనాయిడ్ బ్లూస్’లో రాసిన వాక్యాలు ఇప్పటి తరం అర్థం చేసుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది.
‘ఇపుడు మనందరం హిట్లర్‌తో ఏకీభవిస్తున్నాం
60 లక్షల మంది యూదులను చంపాడా ఫరవాలేదు
ఫాసిస్టు అయినా అదేం పెద్ద విషయం కాదు
అతను కమ్యూనిస్టయితే కాదు గదా’’ అని అప్పుడన్నాడు. కమ్యూనిస్టయితే కాదు గదా అన్న వాక్యం పక్కన మరికొన్ని పదాలు చేర్చుకుంటే ఎవరో గుర్తు రావటం లేదూ?
ఇక ఆయన యుద్ధ వ్యతిరేక కవితలు ఇప్పటికీ ఎప్పటికీ పాడుకోవలసినవే. ‘నా అడుగులలోనే నన్ను మరణించనివ్వండి’ అన్న కవితలో
‘యుద్ధం ముంచుకొస్తుందనే పుకార్లు-!
జీవితపు అర్థం గాలిలో కలిసిపోయింది.
జీవించటమెలాగో నేర్చుకోటానికి బదులు
చావటమెలాగో నేర్చుకుంటున్నారు’ అంటాడు.
‘మాస్టర్ ఆఫ్ వార్’ యుద్ధోన్మాదుల పాలిటి హెచ్చరిక. ‘జాన్ బ్రౌన్’ కథాకావ్య గీతిక చదవండి. యుద్ధం గురించిన భ్రమలన్నీ తొలగిపోతాయి. జాన్ బ్రౌన్ విదేశాలలో స్వదేశం తరఫున యుద్ధానికి వెళ్తాడు. వాళ్లమ్మ ఎంత గర్వపడుతుందో. ఆ మిలటరీ యూనిఫాం, చేతిలో తుపాకీ. నువ్వు నా కొడుకువైనందుకు సంతోషంరా అబ్బాయి, పై అధికారి చెప్పినట్లు చేసి మెడల్స్ తీసుకురా అంటుంది. అతను విదేశంలో యుద్ధం చేయటానికి వెళ్తాడు. ఉత్తరాలు వస్తుంటాయి తల్లికి. కొన్నాళ్లకు ఆగిపోతాయి. కొడుకే వస్తున్నాడని వార్త. తీరా స్టేషన్‌కెళ్తే కొడుకును గుర్తించలేకపోతుంది. గాయపడి నడుములు విరిగిన కొడుకుని.
‘అమ్మా జ్ఞాపకముందా, నేను యుద్ధానికి వెళ్లాను
నేను గొప్పపని చేస్తున్నాననుకున్నావు కదూ?
నేను యుద్ధరంగంలో, నువ్వు ఇంట్లో - గర్వపడుతూ.
నువ్వు నా చెప్పుల్లో కాళ్లు పెట్టి నుంచోలేదమ్మా.
నేనక్కడున్నపుడు ఆలోచించాను దేవుడా నే చేస్తున్నదేమిటని?
నేను ఎవరినైనా చంపటానికి చూస్తున్నా; లేదా ఆ ప్రయత్నంలో చస్తున్నా.
నన్ను అన్నిటికంటే భయపెట్టిందేమిటంటే
నా శత్రువు నాకు అతి సమీపంగా వచ్చినపుడు
అతని ముఖం అచ్చం నా ముఖం వలే కనపడింది
అయ్యో! దేవుడా! సరిగ్గా నాలాగే ఉన్నాడు.
అప్పుడు నాకనిపించిందమ్మా
నేనీ ఆటలో ఒక తోలుబొమ్మననీ
ఆ అరుపుల్లో పొగల్లో చివరికి దారం తెగిపోయింది
ఒక ఫిరంగి గుండు నా కళ్లను పేల్చేసింది’.
చివరికి అతను తల్లి చేతిలో పతకాలు పెట్టి వెళ్లిపోతాడు.
ఎంత ధైర్యం ఉండాలి వియత్నాం యుద్ధ సమయంలో సైనికుని ఆలోచనలను ఇట్లా రాయటానికి. ఇంకో కవితలో మూడవ ప్రపంచ యుద్ధం గురించిన ఒక కల అతణ్ని రోజూ వెంటాడుతుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి ఆ కల గురించి చెప్పి అందులో చివరికి నేనూ ఇంకొకతనూ మాత్రమే మిగిలి ఉంటున్నాం అంటాడు. ఆ డాక్టరు ‘నా కలలో నేనొక్కడినే మిగిలి ఉంటున్నాను’ అంటాడు. యుద్ధంలో, మారణకాండల్లో భయంతో, మానసిక ఆందోళనల్తో బతుకుతున్న ప్రపంచ ప్రజల వేదనను, యాతనను డిలాన్ లయబద్ధంగా స్వరపరచి 60, 70 దశాబ్దాలను ఊగించి శాసించాడు. ప్రజలు అతని పాటలను శ్వాసించారు.
యుద్ధ వ్యతిరేక గీతాలే కాదు, మానవ సంబంధాల గురించీ అత్యద్భుత గీతాలు రాశాడాయన. ‘రెస్ట్‌లెస్ ఫేర్‌వెల్’, ‘ఆల్ ఐ రియల్లీ వాంట్ టు డు’, ‘గోన్నా ఛేంజ్ మై వే ఆఫ్ థింకింగ్’- ఒకటి కాదు రెండు కాదు. మానవుల మధ్య అణచివేత పోయి ప్రేమ, స్నేహం బలపడాలని గొంతెత్తి ఆలపించాడు. ఒక్కోసారి నిరాశ పడిపోయి- ‘ఇంత అణచివేతా!/ ఇక నేను దీనిని లెక్కించలేను/ ఇంత అణచివేతా!
తల్లులకు మొగుళ్లవుతున్న కొడుకులు
కుమార్తెలను పడుపుగత్తెలుగా మార్చే తండ్రులు’ అని గుండలవిసేలా దుఃఖిస్తాడు. మళ్లీ ఆశ తెచ్చుకుని నిర్భయంగా విజయ గీతికను ఆలపిస్తాడు. ప్రేమ గీతాలు ఎన్ని రాశాడో! అన్నీ మానవీయమైనవే. ‘టు నైట్ ఐ విల్ బి స్టేయింగ్ విత్ యు’, ‘ఐ బిలీవ్ ఇన్ యు’, ‘వాట్ కెన్ ఐ డు ఫర్ యు’, ‘ఈజ్ యువర్ లవ్ ఇన్ వెయిన్’ ఇట్లా పదుల ప్రేమ గీతాలు. ప్రేయసీ కేవలం ప్రేయసి మాత్రమే కాదు. అతని విశ్వాసం! మానవుల జీవించే హక్కు మీద. ‘డు అన్‌టు అదర్స్’ కవిత తిక్కన రాసిన ‘ఒరులేయవి యొనరించిన’ పద్యాన్ని గుర్తు తెచ్చినపుడు గొప్ప కవులు మానవుల నైతిక విలువల గురించి రాసిన సారాంశం ఒకటే కదా అనిపిస్తుంది.
బాబ్ డిలాన్ 1941లో పుట్టాడు. ఫలానా చోట. వీళ్లను పెళ్లాడాడు- ఇన్ని అవార్డులు వచ్చాయి అనే వివరాలు ఇంటర్‌నెట్‌లో చాలా దొరుకుతాయి. ఇది నేను డిలాన్‌ని అర్థం చేసుకున్న తీరు. ప్రేమించిన తీరు. ఇప్పటికీ ఆ కవిత్వం చదువుకుంటూ ప్రేరణ పొందాలని ఈ తరానికి చెప్పదల్చిన మాటలు. నోబెల్ బహుమతి ఆ మాటలు చెప్పడానికి ఒక సందర్భం అయినందుకు సంతోషంగా ఉంది.
ఓల్గా