Volga
-
Book Review: అనువాదం ఒక సవాలు
‘భిన్న నేపథ్యాలు, కులాలు, మతాలు, ఇతివృత్తాలు, కథ నాలు, మాండలీకాలు ఉన్న 26 కథలను ఆంగ్లంలోకి అనువాదం చేయడమెట్లా? వాటిలోని విభిన్నతను, ప్రత్యేకతను అనువాదంలోకి తీసుకురావడమెట్లా?... ఇవీ అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్‌లకు ఈ పుస్తకం అనువాదం సమయంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు. ఇంగ్లిష్ అనువాదంలో వెలువడ్డ తెలుగు కథల సంక లనం ‘తెలుగు: ద బెస్ట్ షార్ట్ స్టోరీస్ అఫ్ అవర్ టైమ్స్’కు ఓల్గా సంపాదకులు. హార్పర్ పెరెన్నియల్ వాళ్ళు ప్రచురించారు. ‘గత ముప్పై ఏళ్ళల్లో వచ్చిన ముఖ్యమయిన కథల్లోంచి ఎంపిక చేసుకున్న ఈ 26 కథలు భారతీయ పాఠకులకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిస్తే నా యత్నం, ప్రచురణకర్తల ఉద్దేశం, అనువాదకుల ప్రయత్నం నెరవేరినట్లే’ అంటారు ఓల్గా. ఈ పుస్తకంలోని రచనలనూ, రచయితలనూ తెలుగు పాఠకులకు పరిచయం చేయా ల్సిన అవసరం లేదు. ఈ కథలన్నీ మనల్ని కదిలించినవే, ఆలోచింప జేసినవే. తెలుగు కథకు సరిగ్గా నూటా ఇరవై ఏళ్ళు. వేలాది కథలు, వందలాది కథల సంపుటాలు ఈ శతాబ్ద కాలంలో వెలువడ్డాయి. ముఖ్యంగా 1990 నుండి వైవిధ్యమైన భావజాలాలు, అస్తిత్వాలు తెలుగు పాఠకులను కదిలించాయి. ఆ భిన్నత్వం అనుభవం నుండి, ప్రతిఘటన నుండి, ఉద్యమాల నుండి వచ్చింది. ఏ గొంతులు, మనుషులు, జీవితాలు, భాషలు సాహిత్యానికి వెలుపల ఉంచబడ్డాయో సరిగ్గా అవే, సాహిత్యం అంటే ఇదీ– కథ అంటే ఇదీ అంటూ ముందు కొచ్చాయి. అలాంటప్పుడు అన్ని కథల్లోంచి ఇరవై ఆరు కథలు ఎంపిక చేయాలంటే ఓల్గా తన ఉపోద్ఘాతంలో చెప్పినట్లు, కష్టమయిన పనే. ఈ సంకలనంలో సతీష్ చందర్ ‘డాగ్ ఫాదర్’, ఎండ్లూరి మానస ‘బొట్టు భోజనాలు’, పెద్దింటి అశోక్ కుమార్ ‘జుమ్మే కి రాత్’, కరుణ ‘నీళ్లు చేపలు’, పి. సత్యవతి ‘ఇట్లు స్వర్ణ’, కోట్ల వనజాత ‘ఇత్తు’, ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి ‘సముద్రపు పిల్లోడు’, వి. ప్రతిమ ‘మనిషి విత్తనం’, వి. చంద్రశేఖరరావు ‘ద్రోహ వృక్షం’, వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘బినామీ’, సన్నపురెడ్డి వెంక ట్రామిరెడ్డి ‘సేద్దెగాడు’, ఎం.ఎం.వినోదిని ‘ఒక విలన్ ఆత్మ హత్య’, కె.ఎన్. మల్లీశ్వరి ‘రెండంచుల కత్తి’, మల్లిపురం జగదీశ్ ‘ఇప్ప మొగ్గలు’, కేతు విశ్వనాథరెడ్డి ‘అమ్మవారి నవ్వు’, కొలకలూరి ఇనాక్ ‘కొలిమి’, మహమ్మద్ ఖదీర్ బాబు ‘గెట్ పబ్లిష్డ్’, జూపాక సుభద్ర ‘ఎంపీటీసీ రేణుకెల్లు’, అక్కినేని కుటుంబరావు ‘పనివాడితనం’, కె.వరలక్ష్మి ‘మంత్రసాని’, అట్టాడ అప్పల్నాయుడు ‘బతికి చెడ్డ దేశం’, షాజహానా ‘సిల్సిలా’, జి.ఆర్.మహర్షి ‘పురాగానం’, బి.ఎస్.రాములు ‘మెరుగు’, ఓల్గా ‘సారీ జాఫర్’, కుప్పిలి పద్మ ‘వే టు మెట్రో’ కథలు ఉన్నాయి. పలు భాషలు, పలు రాతలు, పలు రచయి తలు, పలు సందర్భాలు, పలు కాలాలు, కానీ ఒక అనువాదం! అందుకే అనువాదాన్ని పలు అంచుల కత్తి అనడం అతిశయోక్తి కాదేమో. తాము లేవనెత్తిన చర్చకు సమాధానమే అన్నట్లుగా, రచనల, రచయితల విభిన్నతను అనువాదాల్లోకి తీసుకు రావడానికి అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్ తెలుగు పదాలను, ఉర్దూ మాటలను యథాతథంగా ఆంగ్లంలోకి తీసుకొచ్చారు. ‘నా తమిళ జీవితాన్ని, అనుభవాన్ని ప్రతిఫలించే ఆంగ్లం కావాలి’ అని మీనా కందసామి అన్న మాటలు గుర్తొస్తాయిక్కడ. అనువాదం అనువాదంలాగా ఉండాలా, అసలులాగే ఉండాలా, పదకోశం ఇవ్వాలా లేదా పాఠకులే కొంత ప్రయత్నించి అర్థం చేసుకోవాలా అన్న చర్చలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అయితే మూల కథలోని పదాలను అనువాదంలో అలాగే ఉంచేయడం ఎప్పుడూ ఒకలాగే పని చేయకపోవచ్చు. రచనల్లోని విభిన్నతే వాటిలోని నిగూఢ అర్థాలకు కూడా వర్తిస్తుంది కదా. (చదవండి: కాలానికి ముందు పయనించిన కవి) – కె. సునీతారాణి -
సామాన్య మానవుల అసామాన్య కవి
ఎమర్జెన్సీ ఎత్తేసిన కొన్ని రోజులకు సి.వి.సుబ్బారావు (పౌర హక్కుల ఉద్యమ కారుడు) తెనాలిలో ఉన్న నా దగ్గరకు వచ్చాడు. వస్తూ వస్తూ ఇంగ్లిష్‌లో టైప్ చేసి ఉన్న కొన్ని కాగితాలు ఇచ్చి, ‘తర్వాత చదువుకో’ అని చాలా కబుర్లు చెప్పి వెళ్లిపోయాడు. అవి బాబ్ డిలాన్ కవితలు. ఎక్కడ సంపాదించాడో. ఐదారున్నాయి. అవి నన్ను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. అప్పట్నించీ డిలాన్ కవితల పుస్తకం కోసం కలవరిస్తున్నా. 89లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి వెళ్లినపుడు, చివరిరోజు మళ్లీ సుబ్బారావుతో కలిసి పుస్తకాల షాపుకి వెళ్లినపుడు కనిపించింది ‘బాబ్ డిలాన్ లిరిక్స్ 1962-1985’. వెంటనే కొనుక్కున్నా. హైదరాబాద్ రెలైక్కి దిగేవరకూ చదువుతూనే ఉన్నా. నవ్వుతూ. ఏడుస్తూ. కోపంతో రగులుతూ. వియత్నాంని ప్రేమించి, వియత్నాంని కలవరించి పలవరించిన తరం మాది. ఆ యుద్ధ సమయంలో యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికన్ గడ్డ మీద అత్యంత శక్తిమంతమైన పాటలు రాసిన కవి బాబ్ డిలాన్! పౌర హక్కుల ఉద్యమం నిర్మించటంలో భాగమైన తరానికి పౌరహక్కుల కోసం అమెరికాలో గొంతెత్తి పాడిన కవి చుక్కానిలానే కనపడతాడు. కమ్యూనిస్టు విప్లవకారులను కాల్చేయటాన్ని చిన్నతనం నుంచీ వింటూ, చూస్తూ, రాజ్యాన్నీ, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్నీ ద్వేషిస్తూ పెరిగిన తరానికి, అమెరికాలో అలాగే చేస్తూ, దానిని గురించి ప్రజల్ని చైతన్య పరుస్తూ పాడుతున్న వాగ్గేయకారుడిని ఇష్టపడటం ఎంత సహజం! బాబ్ డిలాన్ సామాన్య మానవుల కవిగాయకుడు. బతుకుదెరువు కోసం న్యూయార్క్ వచ్చి- ‘ప్రజలు భూమి లోపలికి పోతున్నారు భవనాలు ఆకాశంలోకి ఎదుగుతున్నాయి’ అని కనిపెట్టగలిగాడు. న్యూయార్క్ దగ్గర గ్రీన్విచ్ గ్రామంలో ఒక కాఫీ హవుస్లో పాడటానికి వెళ్తే వాళ్లు ‘‘నువ్వు హిల్బిల్లిలా పాడుతున్నావు, మాకు జానపద గాయకులు కావా’’లని పంపేశారు. రోజుకో డాలర్‌కి హార్మొనికా వాయించాడు. నెలల తరబడి పెద్ద హోటళ్ల ముందు పాడే అవకాశం కోసం పడిగాపులు కాశాడు. ‘ఎంతోమంది ప్రజలకు వాళ్ల టేబిళ్ల మీద తిండి లేదు కానీ చాలా కత్తులు, ఫోర్కులు ఉన్నాయి. వాటితో ఏదో ఒకటి కోసి తీరాలి’ అని రాశాడు. వుడీ గుత్రీ అనే కవి మహా ఇష్టం డిలాన్కి. అతని కోసం రాసిన ఒక కవితలో- ‘ఈ గమ్మత్తయిన పాత ప్రపంచం/ జబ్బు పడి, ఆకలితో అలసిపోయి చివికి చిరిగి పోయింది/ అది పుట్టిందో లేదో అప్పుడే చచ్చిపోతున్నట్టుంది’ అంటాడు. న్యూయార్క్‌లోని రాక్ ఫెల్లర్ ప్లాజా, ఎంపైర్ స్టేట్లంటే అతనికి ఏవగింపు. శ్రీశ్రీ ‘ఆః’లో రాసిన వాక్యాలు డిలాన్ కవితలో కనపడితే ఆశ్చర్యానందాలతో మనసు ఉప్పొంగుతుంది. ‘నువ్వు పైనున్నపుడు వాళ్లు మరింత పైకి తంతారు నువ్వు కింద పడుతుంటే పడేసి కొడతారు’ అంటాడు డిలాన్. న్యూయార్క్ అంటే తనకున్న కోపాన్ని చాలా కవితల్లో చెబుతాడు. ‘కాలిఫోర్నియా పొగ, ఓకహోమా మైదానాల దుమ్ము, కొండప్రాంత రాతిగనుల గుహలలోని ధూళిధూసరితము అంతా అన్నీ న్యూయార్క్ కంటే చాలా చాలా పరిశుభ్రం’ అంటాడు. ‘స్టాండింగ్ ఆన్ ద హైవే’, ‘పూర్ బాయ్ బ్లూస్’ ఎట్లాంటి కవితలవి! ‘నా రోదన వినపడటం లేదా’ అని డిలాన్ వేసిన కేకకు అమెరికన్ ప్రజానీకం ఉలిక్కిపడి లేచింది. మా తరం అన్నాను గానీ బాబ్ డిలాన్ ఈ తరానికి అత్యవసరమైన కవి. ‘పారనాయిడ్ బ్లూస్’లో రాసిన వాక్యాలు ఇప్పటి తరం అర్థం చేసుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది. ‘ఇపుడు మనందరం హిట్లర్‌తో ఏకీభవిస్తున్నాం 60 లక్షల మంది యూదులను చంపాడా ఫరవాలేదు ఫాసిస్టు అయినా అదేం పెద్ద విషయం కాదు అతను కమ్యూనిస్టయితే కాదు గదా’’ అని అప్పుడన్నాడు. కమ్యూనిస్టయితే కాదు గదా అన్న వాక్యం పక్కన మరికొన్ని పదాలు చేర్చుకుంటే ఎవరో గుర్తు రావటం లేదూ? ఇక ఆయన యుద్ధ వ్యతిరేక కవితలు ఇప్పటికీ ఎప్పటికీ పాడుకోవలసినవే. ‘నా అడుగులలోనే నన్ను మరణించనివ్వండి’ అన్న కవితలో ‘యుద్ధం ముంచుకొస్తుందనే పుకార్లు-! జీవితపు అర్థం గాలిలో కలిసిపోయింది. జీవించటమెలాగో నేర్చుకోటానికి బదులు చావటమెలాగో నేర్చుకుంటున్నారు’ అంటాడు. ‘మాస్టర్ ఆఫ్ వార్’ యుద్ధోన్మాదుల పాలిటి హెచ్చరిక. ‘జాన్ బ్రౌన్’ కథాకావ్య గీతిక చదవండి. యుద్ధం గురించిన భ్రమలన్నీ తొలగిపోతాయి. జాన్ బ్రౌన్ విదేశాలలో స్వదేశం తరఫున యుద్ధానికి వెళ్తాడు. వాళ్లమ్మ ఎంత గర్వపడుతుందో. ఆ మిలటరీ యూనిఫాం, చేతిలో తుపాకీ. నువ్వు నా కొడుకువైనందుకు సంతోషంరా అబ్బాయి, పై అధికారి చెప్పినట్లు చేసి మెడల్స్ తీసుకురా అంటుంది. అతను విదేశంలో యుద్ధం చేయటానికి వెళ్తాడు. ఉత్తరాలు వస్తుంటాయి తల్లికి. కొన్నాళ్లకు ఆగిపోతాయి. కొడుకే వస్తున్నాడని వార్త. తీరా స్టేషన్‌కెళ్తే కొడుకును గుర్తించలేకపోతుంది. గాయపడి నడుములు విరిగిన కొడుకుని. ‘అమ్మా జ్ఞాపకముందా, నేను యుద్ధానికి వెళ్లాను నేను గొప్పపని చేస్తున్నాననుకున్నావు కదూ? నేను యుద్ధరంగంలో, నువ్వు ఇంట్లో - గర్వపడుతూ. నువ్వు నా చెప్పుల్లో కాళ్లు పెట్టి నుంచోలేదమ్మా. నేనక్కడున్నపుడు ఆలోచించాను దేవుడా నే చేస్తున్నదేమిటని? నేను ఎవరినైనా చంపటానికి చూస్తున్నా; లేదా ఆ ప్రయత్నంలో చస్తున్నా. నన్ను అన్నిటికంటే భయపెట్టిందేమిటంటే నా శత్రువు నాకు అతి సమీపంగా వచ్చినపుడు అతని ముఖం అచ్చం నా ముఖం వలే కనపడింది అయ్యో! దేవుడా! సరిగ్గా నాలాగే ఉన్నాడు. అప్పుడు నాకనిపించిందమ్మా నేనీ ఆటలో ఒక తోలుబొమ్మననీ ఆ అరుపుల్లో పొగల్లో చివరికి దారం తెగిపోయింది ఒక ఫిరంగి గుండు నా కళ్లను పేల్చేసింది’. చివరికి అతను తల్లి చేతిలో పతకాలు పెట్టి వెళ్లిపోతాడు. ఎంత ధైర్యం ఉండాలి వియత్నాం యుద్ధ సమయంలో సైనికుని ఆలోచనలను ఇట్లా రాయటానికి. ఇంకో కవితలో మూడవ ప్రపంచ యుద్ధం గురించిన ఒక కల అతణ్ని రోజూ వెంటాడుతుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి ఆ కల గురించి చెప్పి అందులో చివరికి నేనూ ఇంకొకతనూ మాత్రమే మిగిలి ఉంటున్నాం అంటాడు. ఆ డాక్టరు ‘నా కలలో నేనొక్కడినే మిగిలి ఉంటున్నాను’ అంటాడు. యుద్ధంలో, మారణకాండల్లో భయంతో, మానసిక ఆందోళనల్తో బతుకుతున్న ప్రపంచ ప్రజల వేదనను, యాతనను డిలాన్ లయబద్ధంగా స్వరపరచి 60, 70 దశాబ్దాలను ఊగించి శాసించాడు. ప్రజలు అతని పాటలను శ్వాసించారు. యుద్ధ వ్యతిరేక గీతాలే కాదు, మానవ సంబంధాల గురించీ అత్యద్భుత గీతాలు రాశాడాయన. ‘రెస్ట్‌లెస్ ఫేర్వెల్’, ‘ఆల్ ఐ రియల్లీ వాంట్ టు డు’, ‘గోన్నా ఛేంజ్ మై వే ఆఫ్ థింకింగ్’- ఒకటి కాదు రెండు కాదు. మానవుల మధ్య అణచివేత పోయి ప్రేమ, స్నేహం బలపడాలని గొంతెత్తి ఆలపించాడు. ఒక్కోసారి నిరాశ పడిపోయి- ‘ఇంత అణచివేతా!/ ఇక నేను దీనిని లెక్కించలేను/ ఇంత అణచివేతా! తల్లులకు మొగుళ్లవుతున్న కొడుకులు కుమార్తెలను పడుపుగత్తెలుగా మార్చే తండ్రులు’ అని గుండలవిసేలా దుఃఖిస్తాడు. మళ్లీ ఆశ తెచ్చుకుని నిర్భయంగా విజయ గీతికను ఆలపిస్తాడు. ప్రేమ గీతాలు ఎన్ని రాశాడో! అన్నీ మానవీయమైనవే. ‘టు నైట్ ఐ విల్ బి స్టేయింగ్ విత్ యు’, ‘ఐ బిలీవ్ ఇన్ యు’, ‘వాట్ కెన్ ఐ డు ఫర్ యు’, ‘ఈజ్ యువర్ లవ్ ఇన్ వెయిన్’ ఇట్లా పదుల ప్రేమ గీతాలు. ప్రేయసీ కేవలం ప్రేయసి మాత్రమే కాదు. అతని విశ్వాసం! మానవుల జీవించే హక్కు మీద. ‘డు అన్టు అదర్స్’ కవిత తిక్కన రాసిన ‘ఒరులేయవి యొనరించిన’ పద్యాన్ని గుర్తు తెచ్చినపుడు గొప్ప కవులు మానవుల నైతిక విలువల గురించి రాసిన సారాంశం ఒకటే కదా అనిపిస్తుంది. బాబ్ డిలాన్ 1941లో పుట్టాడు. ఫలానా చోట. వీళ్లను పెళ్లాడాడు- ఇన్ని అవార్డులు వచ్చాయి అనే వివరాలు ఇంటర్నెట్లో చాలా దొరుకుతాయి. ఇది నేను డిలాన్ని అర్థం చేసుకున్న తీరు. ప్రేమించిన తీరు. ఇప్పటికీ ఆ కవిత్వం చదువుకుంటూ ప్రేరణ పొందాలని ఈ తరానికి చెప్పదల్చిన మాటలు. నోబెల్ బహుమతి ఆ మాటలు చెప్పడానికి ఒక సందర్భం అయినందుకు సంతోషంగా ఉంది. ఓల్గా -
మంచి నవలలో పంటి కింద రాళ్లు
విమర్శ ‘గమనమే గమ్యం’ మార్చ్ 2016లో ఓల్గా వెలువరించిన నాలుగు వందల పేజీల నవల. అట్ట మీద సముద్రమూ, ఇసుకా! సముద్రం మెత్తగా ఉండి, ఇసుక నిజంగా గరుగ్గానే ఉంది. ఈ స్పర్శానుభవం పాఠకుడి అనుభూతికి కొత్త సంగతిగా పరిచయం అవుతుంది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు కుమార్తె, డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ(నవలలో పేరు శారదాంబ) (6.9.1906 జననం-మరణం నవల ప్రకారం 1965 భారత -చైనా యుద్ధం తర్వాత కాలంలో) జీవితంపై ఆధారపడ్డ రచన ఈ నవల. రాయడానికి ముఖ్య కారణం ఆమె ఆధునిక స్త్రీ, తెలుగు నాట తొలి లేడి డాక్టర్-సర్జన్, సాంఘిక రంగలో రాజకీయ కార్యాచరణ కలిగిన వ్యక్తి. 1957 ఎన్నికల్లో రెండవ లోక్‌సభకు విజయవాడ నుంచి ఎన్నికయిన సభ్యురాలు. ఇటువంటి ఎన్నో కారణాలు ఓల్గాను ఈ రచనకు పురికొల్పి ఉండవచ్చు. నవలలో 1910-1965 మధ్య గల కాలం చిత్రితమయ్యింది. బ్రాహ్మణ యువతి శారదాంబ, కమ్మ వనిత అన్నపూర్ణ, దేవదాసీల కుటుంబపు మహిళ విశాలాక్షి, ముగ్గురు స్త్రీలు స్వాతంత్య్ర పూర్వపు భారతదేశపు తెలుగు సమాజ భిన్న జీవన నేపథ్యాల వారు. తమ జీవితాలకు అభివృద్ధి అనుకున్నది వారు ఎలా సాధించారో, ఈ సాధించే క్రమాన్ని, ఈ కాలపు చరిత్రతో కలగలిపి చెప్పే క్లిష్ట ప్రయత్నం ఈ రచన. కొమర్రాజు అచ్చమాంబ నిజ జీవిత పాత్రలు కథలోకి వచ్చినప్పుడు, కాల్పనిక స్వేచ్ఛ తగ్గిపోతుంది. అచ్చమాంబ పేరు శారదాంబగా మార్చినా, ఆమె చుట్టుప్రక్కల గల సజీవ సమాజంలోని వారు, కందుకూరి వీరేశలింగం, ఆయన శ్రీమతి రాజ్యలక్ష్మమ్మ, ఉన్నవ, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, కాశీనాథుని నాగేశ్వర రావు, టంగుటూరి ప్రకాశం పంతులు, దుర్గాబాయి దేశ్‌ముఖ్, ముఖ్యంగా కొమర్రాజు లక్ష్మణరావు, చలసాని శ్రీనివాసరావు, ఇలా నిజమైన వ్యక్తులను కథనంలో పాత్రలు చేసేటప్పుడు నాలుగింతలు శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. సరి చూసుకోవలసిన తేదీలు, ఆయా తేదీలకు ఒదగ వలసిన చిత్రణలు, వ్యక్తుల జననాలు, మరణాలు, వీటికి చెందిన ప్రదేశాలు, అచ్చమాంబ జీవితంపై ప్రభావం చూపిన ఘట్టాలపై సమగ్ర చిత్రణ జరిగిందా అని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాల్సి వుంటుంది. కాని అలా జరిగినట్టు లేదు. ఇంత మంచి నవలలో, చరిత్రకు సంబంధించి పంటి కింద రాళ్లు తగలడం దురదృష్టకరం. కందుకూరి వీరేశలింగం ఇంటికి, కొమర్రాజు రామారావు (కథలో కొమర్రాజు లక్ష్మణరావు పేరు), అప్పటికి కొద్ది కాలం కిందటే గతించిన తన అక్క పేరే పెట్టుకున్న తన అయిదేళ్ళ కూతురు శారదాంబను తీసుకువెళ్లడంతో కథ మొదలవుతుంది. రాజ్యలక్ష్మమ్మ, రాత్రి పాప నిద్రపోయే ముందు కథ చెప్పమంటే, పాత కథలు కాదు, కొత్త కథ, పాటలాంటిది చెప్తానని, ‘పూర్ణమ్మ’ వినిిపిస్తారు. రెండు రోజులు అక్కడ ఉన్నాక, ఈ తండ్రీకూతుళ్లు ఉన్నవ వారింటికి, గుంటూరు వెళ్తారు. రెండవ రోజునే, రాజ్యలక్ష్మమ్మ చనిపోయారన్న వార్త వస్తుంది కథలో. రాజ్యలక్ష్మమ్మ మరణం 11-8-1910న జరిగింది. అంటే ఓల్గా ఈ కథను ఆగస్టు మొదటి వారం, 1910లో ఆరంభించారన్న మాట. ఎక్కడైనా మొదలుపెట్టే స్వేచ్ఛ రచయితకు ఉన్నది. కాని గురజాడ ‘పూర్ణమ్మ’ గేయాన్ని 1912 వరకూ రాయలేదు. గేయం అచ్చులోకి 1929 వరకూ రాలేదు. 1910లో చనిపోయిన రాజ్యలక్ష్మమ్మ ఆ పాట పాడే అవకాశం లేదు. వీరేశలింగం మృతి మద్రాసులో జరిగింది. అక్కడ మరి తక్కువ విషయాన్ని పొందు పరిచారు ఓల్గా. ఆయన ఎప్పుడు మద్రాసు వెళ్లినా ఉండేది కొమర్రాజు ఇంట్లోనే. వ్యావహారిక భాషను సమర్థిస్తూ తాను కూడా పని చేస్తానని గిడుగు రామమూర్తి పంతులుతో రాజమండ్రి సభల్లో అన్న మూడు నెలల్లోనే వీరేశలింగం, 27-5-1919న, మద్రాసులో కొమర్రాజు లక్ష్మణరావు ఇంట్లో కన్నుమూశారు. ముందురోజు కూడా ‘కవుల చరిత్రలు’ ప్రూఫులు దిద్దుతూ గడిపారన్నది వారి చివరి దినాలను చూసిన వారు రాసిన, చెప్పిన భోగట్టా. అప్పటికి కుమార్తె పై తరగతి చదువులకై, మద్రాసుకు చేరుకున్న కొమర్రాజు కుటుంబం ఉండేది ఎగ్మూరులో. ఆ ఇంటి పేరు వేదవిలాస్, అని మద్రాసు ఆర్కైవ్స్ చెప్తున్నాయి. ఇవేవి ఓల్గా రచనలో కనిపించవు, పెపైచ్చు, వీరేశలింగం మృతి గురించి, ఒక్క ప్రభావశీలమైన వివరణ కూడా చేయరు. పంతులుగారు ఉన్నది మద్రాసులోనే అని స్పష్టపరచరు. ఇలా రాశారు: ‘‘ఇంకా రెండు రోజులకు మరణిస్తాడు అనగా కూడా ఆ మాటలే చెప్పి వాగ్దానం తీసుకున్నాడాయన. శారదకు ఆ వాగ్దానంతో బాధలేదు. కాని వీరేశలింగం గారి మరణం బాగా బాధించింది’’. ఎక్కడ జరిగింది మృత్యువు? పేపర్లు ఏమని రాశాయి? ఇవేవీ లేకుండానే నవలకు మూల ఘట్టం వంటిది రాయవచ్చునా? ఇక ఇంతకు మించినది ఏమిటంటే, కొమర్రాజు మరణస్థలాన్ని ఆయన స్వగ్రామానికి మార్చడం. ఆయన కూడా తన అనారోగ్యం వల్ల 12-7-1923న, ఏ గదిలో వీరేశలింగం మరణించారో, అదే గదిలో కన్నుమూశారు. దీన్ని సాహిత్య అకాడెమీ ప్రచురణలో కె.కె రంగనాథాచార్యులు తెలిపారు. కొమర్రాజు మరణం సంభవించింది తన స్వగ్రామం పెనుగంచిప్రోలులో కాదు. మరి నవలలో ఏ ప్రయోజనం ఆశించి ఓల్గా ఇలా చిత్రణ చేశారో స్పష్టం కాలేదు. సైమన్ కమిషన్ విషయం, అచ్చమాంబ జీవితంలో 1928 నాటి ప్రధానమైన రాజకీయ ఘట్టం, తగు చిత్రణ కాలేదు. నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కారణంగానే, ఆమెను, మదరాసు యూనివర్సిటీ డాక్టరీ పరీక్షకు కూచోనివ్వదు. అప్పుడు ఆమె తన పరీక్ష ఉత్తీర్ణత కోసం ఇంగ్లాండు వెళ్ళి వచ్చారని ఆమె మేనల్లుడు, విశాఖలో ఫ్రొఫెసర్ డాక్టర్ కొమర్రాజు రవి తెలిపారు. స్త్రీని తక్కువచేసి చూడటంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు తమ భావజాలంలోని ఛాందసత్వంలోంచి బయటకు రావాలని, మనుష్యుల మధ్య, స్త్రీ, పురుషుల మధ్య, వర్గాల మధ్య, నెలకొని ఉన్న ఆధిపత్య భావన నిర్మూలన జరిగే సమాజమే, మంచి సమాజమని తలపోస్తూ, 1965 ప్రాంతాల్లో కన్ను మూస్తుంది శారదాంబ. మంచి ఒడుపుతో రాసిన ఈ రచనలో, కల్పనగా అయితే, పేజీలు తిరిగి పోతాయి గబగబా. ఈ కథనం వెనకాల చరిత్ర, సమీప శతాబ్దపు నిజమైన వ్యక్తులు ఉన్నారు అని చూశామా, ఈ పంటి కింది రాళ్లు ఒక మంచి పాఠకానుభవానికి అడ్డం పడతాయి. ఏది ఏమైనా చర్చకు మిగిలే ఎన్నో అంశాలను కళారూపంలో ప్రస్తావించిన ఓల్గాను అభినందించకుండా ఉండలేము. ఆ అభినందనలో భాగమే ఈ ప్రశ్నలు కూడా. రామతీర్థ 9849200385 -
ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
-
సాహిత్య అకాడమీ అవార్డీలు వీరే..
2015 సాహిత్య అకాడమీ అవార్డులను.. సంస్థ గురువారం ప్రకటించింది. 22 భాషలకు చెందిన సుప్రసిద్ద రయయితలకు అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది అవార్డుల కోసం 6 కథల సంపుటాలు, 6 కవిత్వం గ్రంధాలు, 4 నవలలు, 2 వ్యాస సంకలనాలు, 2 విమర్శనా గ్రంధాలు, ఒక నాటకం, ఒక ఆత్మకథ పుస్తకాన్ని ఎంపిక చేశారు. దేశపు అత్యున్నత సాహిత్య పురస్కారానికి ఎంపికైన కలం వీరులు వీరే.. కుల సైకియా ( అస్సామీ), భ్రజేంద్ర కుమార్ భ్రమ్మ(బోడో), ధియన్ సింగ్(డోగ్రీ), సైరస్ మిస్రీ(ఇంగ్లీషు), రసిక్ షా( గుజరాతీ), రామ్ దర్శన్ మిశ్రా(హిందీ), కేవీ తిరుమలేష్(కన్నడ), బషీర్ బదర్వాహీ(కష్మీరీ), ఉదయ్ భీంబ్రే(కొంకణి), మన్మోహన్ ఝా(మైథిలి), కే.ఆర్. మీరా(మళయాలం), క్షేత్రీ రాజన్(మణిపురి), అరుణ్ ఖోప్కర్ (మరాఠీ), గుప్తా ప్రధాన్(నేపాలి), బిభూతీ పట్నాయక్(ఒడియా), జస్విందర్ సింగ్(పంజాబీ), మధు ఆచార్య 'అశ్వధి' (రాజస్థానీ), రాం శంకర్ అశ్వథి(సంస్కృతం), రబిలాల్ తుడు(సంథాలీ), మాయా రాహి(సింధీ), ఏ. మాధవన్(తమిళ్), ఓల్గ(తెలుగు), షమీమ్ తారిక్ (ఉర్దూ). కాగా.. బెంగాలీ భాషకు సంబంధించిన అవార్డు త్వరలోనే ప్రకటించనున్నారు. విజేతలకు జ్ఞాపికతో పాటు, లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని అందిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు పురస్కారాలను అందిచనున్నట్లు అకాడమీ ప్రకటించింది. -
ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మరోసారి తెలుగుతేజాన్ని వరించింది. ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. ఆమె రాసిన 'విముక్త' కథా సంపుటికి ఈ పురస్కారం లభించింది.ఈ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ తాను గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్య సృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు ప్రతి ఏడాది అందజేస్తోంది. 2015 సంవత్సరానికిగాను ఓల్గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం న్యూఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 1950 నవంబర్ 27న గుంటూరులో ఓల్గా జన్మించారు. ఓల్గాగా ప్రసిద్ధి పొందిన ఆమె పూర్తి పేరు పోపూరి లలిత కుమారి. ప్రముఖ రచయితగా స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఆమె పలు రచనలు చేశారు. 'ఆకాశంలో సగం' ఉత్తమ నవలా పురస్కారం పొందింది.