ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మరోసారి తెలుగుతేజాన్ని వరించింది. ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. ఆమె రాసిన 'విముక్త' కథా సంపుటికి ఈ పురస్కారం లభించింది.ఈ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ తాను గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్య సృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు ప్రతి ఏడాది అందజేస్తోంది.
2015 సంవత్సరానికిగాను ఓల్గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం న్యూఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 1950 నవంబర్ 27న గుంటూరులో ఓల్గా జన్మించారు. ఓల్గాగా ప్రసిద్ధి పొందిన ఆమె పూర్తి పేరు పోపూరి లలిత కుమారి. ప్రముఖ రచయితగా స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఆమె పలు రచనలు చేశారు. 'ఆకాశంలో సగం' ఉత్తమ నవలా పురస్కారం పొందింది.