Nobel Prize in Literature
-
ఒంటరి సమూహం
సుమారు ఆరు దశాబ్దాలుగా అలుపెరగకుండా రాస్తున్న ‘అత్యంత ప్రాధాన్యం గల స్త్రీవాద రచయిత్రి’ ఆనీ ఎర్నౌను 2022 నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ఈ గౌరవం దక్కిన తొలి ఫ్రెంచ్ మహిళ ఆమె. ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారం పొందిన పదిహేడో మహిళ. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; అయినా కూడా మహిళలు, అణిచివేతకు గురైనవారి పోరాట గాథలను సజీవంగా ఉంచుతున్నానంటారు 82 ఏళ్ల ఆనీ ఎర్నౌ. శరీరం, లైంగికత; సాన్నిహిత్య సంబంధాలు; సామాజిక అసమానతలు; చదువు ద్వారా వర్గాన్ని మార్చుకునే ప్రయత్నం ఆమె రచనల్లో కనబడతాయి. ఫ్రాన్స్‌లోని చిన్న పట్టణం నార్మండీలో వారి కుటుంబం నివసించింది. బతకడానికి నాకు పుస్తకాలు అక్కర్లేదని కరాఖండీగా చెప్పే తండ్రిని కలిగిన అతి సాధారణ నేపథ్యం. ఒక కెఫే యజమానిగా అలెగ్జాండర్ డ్యూమా, ఫ్లాబర్ట్, ఆల్బర్ట్ కామూ లాంటి రచయితలను చదవడం వల్ల తనకేం ఒరుగుతుందని ఆయన నిశ్చితాభిప్రాయం. కానీ ఆనీలో అది పూర్తి విరుద్ధంగా పనిచేసింది. పుస్తకాలు మాత్రమే తనకు అత్యంత ప్రీతికరమైనవనీ, ఎంత చెడ్డ జీవితంలోనూ తనను తాను ఒక ‘అ–పాఠకురాలిగా’ ఊహించలేననీ అంటారామె. ఆరేళ్ల వయసు నుంచే అక్షరంలోని గమ్మత్తుకు ఆకర్షితురాలయ్యారు. వందలాది పుస్తకాలను ఉచితంగా చదువుకోవడం కోసమే పుస్తకాల షాపులో పనిచేయాలని కలగన్నారు. ఒక శ్రామిక కుటుంబంలో పుట్టి, బుద్ధెరిగాక మధ్యతరగతి జీవితాలతో పోల్చుకున్నప్పుడు తమ పరిస్థితి పట్ల సిగ్గుపడిన ఆనీ ఎర్నౌ చదువుకోవడం ద్వారా జీవితాలను మార్చుకోగలమన్న అభిప్రాయానికి చాలా త్వరగా వచ్చారు. దానికి అనుగుణంగానే ముందు టీచర్‌గా, అనంతరం లిటరేచర్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వర్జీనియా వూల్ఫ్ అంటే ఆనీకి పిచ్చి అభిమానం. సైమన్ ది బోవా ఆమె చైతన్యాన్ని విస్తృతపరిచారు. స్త్రీవాదం అనేది తప్పనిసరైనది అన్న అవగాహనతో ఇరవై ఏళ్ల వయసు నుంచే తన రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. తన కుటుంబానికి తెలియకుండా చేయించుకున్న అవాంఛిత గర్భస్రావం గురించి ‘క్లీన్డ్ ఔట్’ రాశారు. ఆ అనుభవంలోని జుగుప్స, భయానకాలకు వెరవకుండా, దీన్నే పునర్దర్శనంలాగా ‘హ్యాపెనింగ్’ రాశారు. ఒక స్త్రీ తన శరీరం మీద తన నియంత్రణనూ, స్వాతంత్య్రాన్నీ స్థాపించుకోవడానికి సంబంధించిన అతిముఖ్యమైన నవలగా ఇది నిలిచిపోయింది. తను దాటివచ్చిన జీవిత దశలనే ఆనీ పుస్తకాలుగా మలిచారు. ఆమె కౌమార జీవితం ఒక పుస్తకం. వైవాహిక జీవితం ఒక పుస్తకం. తూర్పు యూరోపియన్ మనిషితో ప్రేమ వ్యవహారం(ప్యాషన్ సింపుల్) ఇంకో పుస్తకం. తల్లి మరణం ఒక పుస్తకం. బ్రెస్ట్ క్యాన్సర్ అనుభవాలు మరో పుస్తకం. ఫ్రాన్స్ చరిత్రతో ముడిపడిన ‘ది ఇయర్స్’ను ఆమె మ్యాగ్నమ్ ఓపస్‌గా పరిగణిస్తారు. ఉత్తమ పురుష(నేను) కథనాలకు భిన్నంగా దీన్ని థర్డ్ పెర్సన్లో రాశారు. ఏ వ్యక్తిగత అనుభవమో ‘పొరపాటున’ సాహిత్యంలోకి వస్తే– దానికీ, తనకూ ఏ సంబంధమూ లేదని ఒక డిస్‌క్లెయిమర్ లాంటిది ఆ రచయిత తగిలించడం కొత్త సంగతేం కాదు. మరీ ముఖ్యంగా సంక్లిష్ట కుటుంబ సంబంధాలు, సన్నిహిత మానవ సంబంధాలు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు మరీ ఎక్కువ. ఇక వ్యక్తిగతం అన్నదే కొందరికి నిషిద్ధాక్షరి. వ్యక్తి నుంచి కూడా సమాజాన్ని దర్శించవచ్చునన్న అవగాహన ఉన్నవాళ్లు తక్కువ. కానీ ఆనీ ఎర్నౌ సాహిత్య సర్వస్వం ఆత్మకథాత్మకమే. ఇది కల్పన అని చెబితే రచయితకో రక్షణ కవచం ఉంటుందన్న ఆలోచన ఆమెకు లేక కాదు. కానీ అది మోసం చేయడంలా భావించారు. వ్యక్తిగత జీవితాన్ని ఒక ప్రయోగశాలలో పరీక్షించుకున్నంత కచ్చితత్వంతో తన అనుభవాలను నమోదు చేశారు. అందువల్లే ఆమె ‘గ్రేట్ ట్రూత్ టెల్లర్ ఆఫ్ ఫ్రాన్స్’గా నిలవగలిగారు. నార్మండీ లాంటి చిన్నపట్టణంలో తన జీవితాన్నీ, తండ్రితో తన సంబంధాన్నీ ‘ఎ మ్యాన్స్ ప్లేస్’గా రాస్తున్నప్పుడు తన రచనాపద్ధతిని గురించి ఆమె ఘర్షణపడ్డారు. తండ్రిని ఒక కాల్పనిక పాత్రగా మలవడంలో తన రచనా ఉద్దేశమే నెరవేరదని భావించారు. అందుకే ఉన్నది ఉన్నట్టే రాయడానికి సంకల్పించారు. అందుకే ఆమెను ఫిక్షన్ రచయిత అనాలా, నాన్–ఫిక్షన్ రచయిత అనాలా అన్న చర్చకూడా వచ్చింది. కొందరు ఆమెను ‘మెమొయిరిస్ట్’ (జ్ఞాపకాల రచయిత) అన్నారు. నవలగా, ఆత్మకథగా కాకుండా తన రచనలను ఆటోసోషియోబయోగ్రాఫికల్(సామాజిక ఆత్మకథ)గా మలవగలగడం ఆమె ప్రత్యేకత. చరిత్ర, ఆత్మకథల కలగలుపు ఆమె పద్ధతి. ఇంట్లో పుస్తకాలను చూసి, ఇవన్నీ చదువుతావా అని ఆశ్చర్యపోయిన తన కజిన్, పుస్తకాలతో మనుషులకేం పని అన్నట్టుగా బతికిన తన తండ్రిలాంటివాళ్లు నిజానికి తనకు ఎక్కువ స్ఫూర్తి కలిగించారని చెప్పే ఆనీ... మర్చిపోయి అంతర్ధానమయ్యే లోపల జ్ఞాపకాలను పదిలపరుస్తున్నానంటారు. ఫ్రాన్స్ ఉమ్మడి జ్ఞాపకాలను ఆమె తన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అనువాదాల ద్వారా అవి ప్రపంచ స్మృతులుగా కూడా మారాయి. తన ప్రపంచంగా అనిపించని పారిస్ విలాసాలకు దూరంగా ప్రకృతి, నిశ్శబ్దాల కోసం సబర్బన్ ప్రాంతంలో నివసించే ఆనీ ఎర్నౌ... ఒక దశలో ‘మహిళా విప్లవం’ చూడకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డానంటారు. కానీ అబార్షన్ హక్కులు రావడానికీ, స్త్రీ శరీరం మీద మారుతున్న పురుష ప్రపంచ ధోరణికీ ఆమె కూడా ఒక కారణం అయ్యారు. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; కానీ ప్రయోజనం లేకుండా మాత్రం ఉండదు. -
పీటర్ హండ్కేకు సాహిత్యంలో నోబెల్
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా రచయిత పీటర్ హండ్కేకు 2019 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి దక్కింది. భాషా చాతుర్యంతో ప్రభావశీలతతో కూడిన అసమాన కృషితో పాటు మానవ అనుభవం యొక్క విశిష్టతను అన్వేషించినందుకుగాను ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం యూరప్‌లో అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఒకడిగా పీటర్ హండ్కే ఎదిగారని సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటించిన స్వీడిష్ అకాడమీ పేర్కొంది. 2018 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్‌కు పోలండ్‌కు చెందిన రచయిత ఓల్గా టొకార్జక్ను ఎంపిక చేశారు. స్వీడన్ వ్యాపారవేత్త, కెమిస్ట్, ఇంజనీర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అభీష్టం మేరకు ఏర్పాటు చేసిన అయిదు అంతర్జాతీయ అవార్డుల్లో సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ఒకటి. ఇక ఈ ఏడాది వైద్యంలో నోబెల్ ప్రైజ్ శాస్త్రవేత్తలు విలియం కెలిన్, పీటర్ జే రాట్క్లిఫ్, గ్రెగ్ ఎల్ సెమెంజలకు లభించింది. విశ్వం ఆవిర్భావ గుట్టును విప్పినందుకు శాస్త్రవేత్తలు జేమ్స్ పీబల్స్, మైఖేల్ మేయర్, ఖ్వెలోజ్లను ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ వరించింది. మరోవైపు ఇథియం-ఇయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు గాను జాన్ బి గుడ్ఎనఫ్, ఎం స్టాన్లీ విటింగ్హామ్, అఖిర యొషినోలకు కెమిస్ర్టీలో నోబెల్ బహుమతి దక్కింది. నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకంటించనుండగా ఎకనమిక్స్‌లో నోబెల్ ప్రైజ్‌గా గుర్తింపు పొందిన నోబెల్ మెమోరియల్ ప్రైజ్ ఇన్ ఎకనమిక్ సైన్సెస్‌ను సోమవారం వెల్లడిస్తారు. -
సంచలనం.. నోబెల్ ప్రైజ్‌కు బ్రేక్
స్టాక్‌హోమ్ : నోబెల్ అవార్డుల విషయంలో సంచలనం. సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం ఇవ్వబోమని నోబెల్ అవార్డుల ఫౌండేషన్ ప్రకటించింది. సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారాన్ని స్వీడన్‌కు చెందిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ యూనివర్సిటీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోబెల్ అవార్డుల ఫౌండేషన్ తెలిపింది. స్వీడిష్ అకాడమీలో నోబెల్ ప్రైజ్ బోర్డులో అధ్యక్షులు, నలుగురు సభ్యులు ఉంటారు. అందులో ఓ మహిళా సభ్యురాలి భర్త మీద లైంగిక ఆరోపణలు ఉన్నాయి. 1996 నుంచి 2017 ఆయన కిరాతకాలు జరిగాయని, అకాడమీ వ్యవహారాల్లో కూడా ఆయన జోక్యం చేసుకునే వాడని పలువురు మహిళలు ఆరోపించారు. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. పురస్కారాన్ని ఇచ్చే స్థాయి ఈ అకాడమీకి లేదని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, 2018 సాహిత్య నోబెల్ పురస్కారాన్ని వచ్చే ఏడాది పురస్కారంతో కలిపి ఇస్తామని నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది. 1901 నుంచి నోబెల్పురస్కారాలు ఇస్తుండగా..1935లో సాహిత్య రంగంలో విజేతలు ఎవరూ ఎంపిక కావటంతో పురస్కారాన్ని ఇవ్వలేదు. నోబెల్‌కు ‘సెక్స్’ మరకలు -
సామాన్య మానవుల అసామాన్య కవి
ఎమర్జెన్సీ ఎత్తేసిన కొన్ని రోజులకు సి.వి.సుబ్బారావు (పౌర హక్కుల ఉద్యమ కారుడు) తెనాలిలో ఉన్న నా దగ్గరకు వచ్చాడు. వస్తూ వస్తూ ఇంగ్లిష్‌లో టైప్ చేసి ఉన్న కొన్ని కాగితాలు ఇచ్చి, ‘తర్వాత చదువుకో’ అని చాలా కబుర్లు చెప్పి వెళ్లిపోయాడు. అవి బాబ్ డిలాన్ కవితలు. ఎక్కడ సంపాదించాడో. ఐదారున్నాయి. అవి నన్ను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. అప్పట్నించీ డిలాన్ కవితల పుస్తకం కోసం కలవరిస్తున్నా. 89లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి వెళ్లినపుడు, చివరిరోజు మళ్లీ సుబ్బారావుతో కలిసి పుస్తకాల షాపుకి వెళ్లినపుడు కనిపించింది ‘బాబ్ డిలాన్ లిరిక్స్ 1962-1985’. వెంటనే కొనుక్కున్నా. హైదరాబాద్ రెలైక్కి దిగేవరకూ చదువుతూనే ఉన్నా. నవ్వుతూ. ఏడుస్తూ. కోపంతో రగులుతూ. వియత్నాంని ప్రేమించి, వియత్నాంని కలవరించి పలవరించిన తరం మాది. ఆ యుద్ధ సమయంలో యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికన్ గడ్డ మీద అత్యంత శక్తిమంతమైన పాటలు రాసిన కవి బాబ్ డిలాన్! పౌర హక్కుల ఉద్యమం నిర్మించటంలో భాగమైన తరానికి పౌరహక్కుల కోసం అమెరికాలో గొంతెత్తి పాడిన కవి చుక్కానిలానే కనపడతాడు. కమ్యూనిస్టు విప్లవకారులను కాల్చేయటాన్ని చిన్నతనం నుంచీ వింటూ, చూస్తూ, రాజ్యాన్నీ, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్నీ ద్వేషిస్తూ పెరిగిన తరానికి, అమెరికాలో అలాగే చేస్తూ, దానిని గురించి ప్రజల్ని చైతన్య పరుస్తూ పాడుతున్న వాగ్గేయకారుడిని ఇష్టపడటం ఎంత సహజం! బాబ్ డిలాన్ సామాన్య మానవుల కవిగాయకుడు. బతుకుదెరువు కోసం న్యూయార్క్ వచ్చి- ‘ప్రజలు భూమి లోపలికి పోతున్నారు భవనాలు ఆకాశంలోకి ఎదుగుతున్నాయి’ అని కనిపెట్టగలిగాడు. న్యూయార్క్ దగ్గర గ్రీన్విచ్ గ్రామంలో ఒక కాఫీ హవుస్లో పాడటానికి వెళ్తే వాళ్లు ‘‘నువ్వు హిల్బిల్లిలా పాడుతున్నావు, మాకు జానపద గాయకులు కావా’’లని పంపేశారు. రోజుకో డాలర్‌కి హార్మొనికా వాయించాడు. నెలల తరబడి పెద్ద హోటళ్ల ముందు పాడే అవకాశం కోసం పడిగాపులు కాశాడు. ‘ఎంతోమంది ప్రజలకు వాళ్ల టేబిళ్ల మీద తిండి లేదు కానీ చాలా కత్తులు, ఫోర్కులు ఉన్నాయి. వాటితో ఏదో ఒకటి కోసి తీరాలి’ అని రాశాడు. వుడీ గుత్రీ అనే కవి మహా ఇష్టం డిలాన్కి. అతని కోసం రాసిన ఒక కవితలో- ‘ఈ గమ్మత్తయిన పాత ప్రపంచం/ జబ్బు పడి, ఆకలితో అలసిపోయి చివికి చిరిగి పోయింది/ అది పుట్టిందో లేదో అప్పుడే చచ్చిపోతున్నట్టుంది’ అంటాడు. న్యూయార్క్‌లోని రాక్ ఫెల్లర్ ప్లాజా, ఎంపైర్ స్టేట్లంటే అతనికి ఏవగింపు. శ్రీశ్రీ ‘ఆః’లో రాసిన వాక్యాలు డిలాన్ కవితలో కనపడితే ఆశ్చర్యానందాలతో మనసు ఉప్పొంగుతుంది. ‘నువ్వు పైనున్నపుడు వాళ్లు మరింత పైకి తంతారు నువ్వు కింద పడుతుంటే పడేసి కొడతారు’ అంటాడు డిలాన్. న్యూయార్క్ అంటే తనకున్న కోపాన్ని చాలా కవితల్లో చెబుతాడు. ‘కాలిఫోర్నియా పొగ, ఓకహోమా మైదానాల దుమ్ము, కొండప్రాంత రాతిగనుల గుహలలోని ధూళిధూసరితము అంతా అన్నీ న్యూయార్క్ కంటే చాలా చాలా పరిశుభ్రం’ అంటాడు. ‘స్టాండింగ్ ఆన్ ద హైవే’, ‘పూర్ బాయ్ బ్లూస్’ ఎట్లాంటి కవితలవి! ‘నా రోదన వినపడటం లేదా’ అని డిలాన్ వేసిన కేకకు అమెరికన్ ప్రజానీకం ఉలిక్కిపడి లేచింది. మా తరం అన్నాను గానీ బాబ్ డిలాన్ ఈ తరానికి అత్యవసరమైన కవి. ‘పారనాయిడ్ బ్లూస్’లో రాసిన వాక్యాలు ఇప్పటి తరం అర్థం చేసుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది. ‘ఇపుడు మనందరం హిట్లర్‌తో ఏకీభవిస్తున్నాం 60 లక్షల మంది యూదులను చంపాడా ఫరవాలేదు ఫాసిస్టు అయినా అదేం పెద్ద విషయం కాదు అతను కమ్యూనిస్టయితే కాదు గదా’’ అని అప్పుడన్నాడు. కమ్యూనిస్టయితే కాదు గదా అన్న వాక్యం పక్కన మరికొన్ని పదాలు చేర్చుకుంటే ఎవరో గుర్తు రావటం లేదూ? ఇక ఆయన యుద్ధ వ్యతిరేక కవితలు ఇప్పటికీ ఎప్పటికీ పాడుకోవలసినవే. ‘నా అడుగులలోనే నన్ను మరణించనివ్వండి’ అన్న కవితలో ‘యుద్ధం ముంచుకొస్తుందనే పుకార్లు-! జీవితపు అర్థం గాలిలో కలిసిపోయింది. జీవించటమెలాగో నేర్చుకోటానికి బదులు చావటమెలాగో నేర్చుకుంటున్నారు’ అంటాడు. ‘మాస్టర్ ఆఫ్ వార్’ యుద్ధోన్మాదుల పాలిటి హెచ్చరిక. ‘జాన్ బ్రౌన్’ కథాకావ్య గీతిక చదవండి. యుద్ధం గురించిన భ్రమలన్నీ తొలగిపోతాయి. జాన్ బ్రౌన్ విదేశాలలో స్వదేశం తరఫున యుద్ధానికి వెళ్తాడు. వాళ్లమ్మ ఎంత గర్వపడుతుందో. ఆ మిలటరీ యూనిఫాం, చేతిలో తుపాకీ. నువ్వు నా కొడుకువైనందుకు సంతోషంరా అబ్బాయి, పై అధికారి చెప్పినట్లు చేసి మెడల్స్ తీసుకురా అంటుంది. అతను విదేశంలో యుద్ధం చేయటానికి వెళ్తాడు. ఉత్తరాలు వస్తుంటాయి తల్లికి. కొన్నాళ్లకు ఆగిపోతాయి. కొడుకే వస్తున్నాడని వార్త. తీరా స్టేషన్‌కెళ్తే కొడుకును గుర్తించలేకపోతుంది. గాయపడి నడుములు విరిగిన కొడుకుని. ‘అమ్మా జ్ఞాపకముందా, నేను యుద్ధానికి వెళ్లాను నేను గొప్పపని చేస్తున్నాననుకున్నావు కదూ? నేను యుద్ధరంగంలో, నువ్వు ఇంట్లో - గర్వపడుతూ. నువ్వు నా చెప్పుల్లో కాళ్లు పెట్టి నుంచోలేదమ్మా. నేనక్కడున్నపుడు ఆలోచించాను దేవుడా నే చేస్తున్నదేమిటని? నేను ఎవరినైనా చంపటానికి చూస్తున్నా; లేదా ఆ ప్రయత్నంలో చస్తున్నా. నన్ను అన్నిటికంటే భయపెట్టిందేమిటంటే నా శత్రువు నాకు అతి సమీపంగా వచ్చినపుడు అతని ముఖం అచ్చం నా ముఖం వలే కనపడింది అయ్యో! దేవుడా! సరిగ్గా నాలాగే ఉన్నాడు. అప్పుడు నాకనిపించిందమ్మా నేనీ ఆటలో ఒక తోలుబొమ్మననీ ఆ అరుపుల్లో పొగల్లో చివరికి దారం తెగిపోయింది ఒక ఫిరంగి గుండు నా కళ్లను పేల్చేసింది’. చివరికి అతను తల్లి చేతిలో పతకాలు పెట్టి వెళ్లిపోతాడు. ఎంత ధైర్యం ఉండాలి వియత్నాం యుద్ధ సమయంలో సైనికుని ఆలోచనలను ఇట్లా రాయటానికి. ఇంకో కవితలో మూడవ ప్రపంచ యుద్ధం గురించిన ఒక కల అతణ్ని రోజూ వెంటాడుతుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి ఆ కల గురించి చెప్పి అందులో చివరికి నేనూ ఇంకొకతనూ మాత్రమే మిగిలి ఉంటున్నాం అంటాడు. ఆ డాక్టరు ‘నా కలలో నేనొక్కడినే మిగిలి ఉంటున్నాను’ అంటాడు. యుద్ధంలో, మారణకాండల్లో భయంతో, మానసిక ఆందోళనల్తో బతుకుతున్న ప్రపంచ ప్రజల వేదనను, యాతనను డిలాన్ లయబద్ధంగా స్వరపరచి 60, 70 దశాబ్దాలను ఊగించి శాసించాడు. ప్రజలు అతని పాటలను శ్వాసించారు. యుద్ధ వ్యతిరేక గీతాలే కాదు, మానవ సంబంధాల గురించీ అత్యద్భుత గీతాలు రాశాడాయన. ‘రెస్ట్‌లెస్ ఫేర్వెల్’, ‘ఆల్ ఐ రియల్లీ వాంట్ టు డు’, ‘గోన్నా ఛేంజ్ మై వే ఆఫ్ థింకింగ్’- ఒకటి కాదు రెండు కాదు. మానవుల మధ్య అణచివేత పోయి ప్రేమ, స్నేహం బలపడాలని గొంతెత్తి ఆలపించాడు. ఒక్కోసారి నిరాశ పడిపోయి- ‘ఇంత అణచివేతా!/ ఇక నేను దీనిని లెక్కించలేను/ ఇంత అణచివేతా! తల్లులకు మొగుళ్లవుతున్న కొడుకులు కుమార్తెలను పడుపుగత్తెలుగా మార్చే తండ్రులు’ అని గుండలవిసేలా దుఃఖిస్తాడు. మళ్లీ ఆశ తెచ్చుకుని నిర్భయంగా విజయ గీతికను ఆలపిస్తాడు. ప్రేమ గీతాలు ఎన్ని రాశాడో! అన్నీ మానవీయమైనవే. ‘టు నైట్ ఐ విల్ బి స్టేయింగ్ విత్ యు’, ‘ఐ బిలీవ్ ఇన్ యు’, ‘వాట్ కెన్ ఐ డు ఫర్ యు’, ‘ఈజ్ యువర్ లవ్ ఇన్ వెయిన్’ ఇట్లా పదుల ప్రేమ గీతాలు. ప్రేయసీ కేవలం ప్రేయసి మాత్రమే కాదు. అతని విశ్వాసం! మానవుల జీవించే హక్కు మీద. ‘డు అన్టు అదర్స్’ కవిత తిక్కన రాసిన ‘ఒరులేయవి యొనరించిన’ పద్యాన్ని గుర్తు తెచ్చినపుడు గొప్ప కవులు మానవుల నైతిక విలువల గురించి రాసిన సారాంశం ఒకటే కదా అనిపిస్తుంది. బాబ్ డిలాన్ 1941లో పుట్టాడు. ఫలానా చోట. వీళ్లను పెళ్లాడాడు- ఇన్ని అవార్డులు వచ్చాయి అనే వివరాలు ఇంటర్నెట్లో చాలా దొరుకుతాయి. ఇది నేను డిలాన్ని అర్థం చేసుకున్న తీరు. ప్రేమించిన తీరు. ఇప్పటికీ ఆ కవిత్వం చదువుకుంటూ ప్రేరణ పొందాలని ఈ తరానికి చెప్పదల్చిన మాటలు. నోబెల్ బహుమతి ఆ మాటలు చెప్పడానికి ఒక సందర్భం అయినందుకు సంతోషంగా ఉంది. ఓల్గా -
పురస్కారం - తిరస్కారం
చరిత్ర 1964లో స్వీడిష్ అకాడమీ నోబెల్ సాహిత్య పురస్కారాన్ని సుసంపన్నమైన భావాలతో, స్వతంత్ర కాంక్షా భరితమై, సత్యశోధనతో మన యుగంపై గొప్ప ప్రభావాన్ని చూపిన రచనలు చేసినందుకు ఫ్రెంచి రచయిత జా పాల్ సార్త్రకు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా, ఈ బహుమానాన్ని స్వీకరించేందుకు సుముఖంగా లేనని సార్త్ర తెలియజేశారు. ఈ గౌరవాన్ని సార్త్ర తిరస్కరించిన కారణాన ఈ పురస్కార ప్రాధాన్యత ఏమాత్రం వికృతీకరించబడదు. ఈ పరిస్థితులలో, బహుమతి ప్రదానోత్సవం జరగదని మాత్రమే అకాడమీ పేర్కొనగలదు. LE FIGARO అక్టోబర్ 23, 1964 ప్రతిలో ప్రచురితమైన ఒక బహిరంగ ప్రకటనలో సార్త్ర తానీ పురస్కారాన్ని తిరస్కరించడం వివాదం కావడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. స్వీడిష్ అకాడమీ ఒకసారి తీసుకున్న నిర్ణయపు అనుక్రమణీయత తెలియని కారణాన, తనను ఈ బహుమానానికి ఎన్నుకోవలదని ఒక లేఖ ద్వారా స్వీడిష్ అకాడమీని కోరినట్లు సర్వులకు తెలియాలని సార్త్ర అభిలషించారు. తనకు స్వీడిష్ అకాడమీని కించపరిచే ఉద్దేశం లేదని, తన నిరాకరణ ఆత్మగత, ఇతరేతర కారణాల ప్రేరితం అని సార్త్ర ఈ లేఖలో సూచించారు. ఆత్మగత కారణాలకు సంబంధించి, రచయిత కర్తవ్యం గురించి తీసుకున్న భావన మూలంగా తానెప్పుడూ అధికారిక పురస్కారాలను తిరస్కరిస్తూనే వచ్చానని సార్త్ర పేర్కొన్నారు. అంతకుముందు కూడా సార్త్ర LEGION OF HONOUR లో సభ్యత్వాన్ని నిరాకరించి COLLEGE DE FRANCE ప్రవేశాన్ని అభిలషించలేదు. అంతేకాదు, లెనిన్ ప్రైజ్‌ను తనకివ్వజూపినా, దాన్ని కూడా తిరస్కరిస్తానని సార్త్ర అన్నారు. ఈ విధమైన గౌరవాన్ని ఆమోదించడం రచయిత తన వ్యక్తిగత పూచీలను, బాధ్యతలను బహుమతి ప్రదానం చేసిన వ్యవస్థతో సహచరితం చేయడమే. రచయిత ఎటువంటి పరిస్థితిలో కూడా తనను తాను ఒక వ్యవస్థగా పరివర్తన చెందేందుకు అనుమతించకూడదు. ఇతర కారణాలకు సంబంధించి సార్త్ర ఒక పట్టికనిచ్చారు. ఏ వ్యవస్థల జోక్యం లేకుండా ప్రాక్పశ్చిమాల ప్రజల మధ్య, సంస్కృతుల మధ్య, ఆదాన ప్రదానాలు జరగాలని తన నమ్మిక అని సార్త్ర పేర్కొన్నారు. అంతేకాదు తన అభిప్రాయంలో, గతంలో ఈ పురస్కారం అన్ని భావజాలాలకు, అన్ని జాతులకు సమాన ప్రాతినిధ్యం వహించలేదు. ఇటువంటి స్థితిలో తానీ బహుమానాన్ని ఆమోదించడం, అవాంఛనీయ, అన్యాయపూరిత విమర్శలకు తావియ్యవచ్చు అని ఆయనన్నారు. స్వీడిష్ అకాడమీకి ఒక ప్రేమపూర్వక సందేశంతో సార్త్ర తన లేఖను ముగించారు. (స్వీడిష్ అకాడమీ సభ్యుడు ఏండర్స్ ఆసర్లింగ్ ద్వారా) - మువ్వల సుబ్బరామయ్య 8978261496