బాబ్ డిలన్‌కు సాహిత్య నోబెల్ | Bob Dylan Awarded Nobel Prize in Literature | Sakshi
Sakshi News home page

బాబ్ డిలన్‌కు సాహిత్య నోబెల్

Published Fri, Oct 14 2016 2:38 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

బాబ్ డిలన్‌కు సాహిత్య నోబెల్ - Sakshi

బాబ్ డిలన్‌కు సాహిత్య నోబెల్

►అమెరికా సంగీత దిగ్గజాన్ని వరించిన విఖ్యాత పురస్కారం
►  పులకించిన సంగీత ప్రపంచం

 
అమెరికా సంగీత దిగ్గజం బాబ్ డిలన్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. జానపద గాయకునిగా, గీత రచయితగా పాపులర్ అయిన 75 ఏళ్ల బాబ్ డిలన్ ఈ విఖ్యాత అవార్డును అందుకున్న తొలి గీత రచయితగా చరిత్ర సృష్టించారు. డిలన్ అమెరికా గీత సంప్రదాయానికి కొత్త ఒరవడి నేర్పారని, కొత్త కవితాత్మక భావవ్యక్తీకరణలను ఆవిష్కరించారని, అందుకే ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేశామని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. డిలన్ రాసిన ‘బ్లోయింగ్ ఇన్ ద విండ్’, ‘ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్’ పాటలు అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాలకు ఊపిరిగా నిలిచింది. డిలన్‌కు ఈ అవార్డు రావడంతో సాహిత్య లోకం పులకించింది. కాగా, నోబెల్ పురస్కారాల ప్రదానం డిసెంబర్ 10న జరగనుంది.
 
 
స్టాక్‌హోం: అమెరికా సంగీత దిగ్గజం, జానపద గాయకుడు, గీత రచయిత బాబ్ డిలన్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య అవార్డు వరించింది. 75 ఏళ్ల డిలన్ ఈ విఖ్యాత అవార్డును అందుకున్న తొలి గీత రచయితగా చరిత్ర సృష్టించారు. సాహిత్యం విభాగంలో సంగీతకారునికి, గీత రచయితకు అవార్డును ఇవ్వడం నోబెల్ అవార్డులను అనుసరించే వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరూ ఊహించని రీతిలో డిలన్ పేరును దీనిని ఎంపిక చేయడం నిపుణులను మరింత ఆశ్చర్యపరిచింది. డిలన్ అమెరికా గీత సంప్రదాయానికి కొత్త ఒరవడి నేర్పారని, కొత్త కవితాత్మక భావవ్యక్తీకరణలను ఆవిష్కరించారని, అందుకే ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేశామని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. జానపద గాయకుడైన డిలన్ పేరు చాలా ఏళ్లుగా నోబెల్ సాహిత్య పురస్కారం పోటీలో వినిపిస్తోంది. అయితే ఆయనను ఎవరూ ప్రధాన పోటీదారుగా భావించని తరుణంలో డిలన్ పేరును ప్రకటించగానే.. సభా ప్రాం గణం కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఆయన రాసిన ‘బ్లోరుుంగ్ ఇన్ ద విండ్’, ‘ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్’ పాటలు అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాలకు ఊపిరిగా నిలిచాయి. ఈ అవార్డు కింద డిలన్‌కు సుమారు రూ.6.06 కోట్లు అందనున్నాయి.

మైమరిచిన సంగీత ప్రపంచం
సంగీత దిగ్గజం బాబ్ డిలన్‌కు నోబెల్ పురస్కారం రావడంపై సంగీత ప్రపంచం హర్షం వ్యక్తం చేసింది. సరోద్ విద్యాంసుడు అంజాద్ అలీఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, రచయిత సల్మాన్ రష్దీ తదితరులు డిలన్‌కు నోబెల్ రావడాన్ని స్వాగతించారు. సంగీత కళాకారులంతా గర్వించదగ్గ సందర్భం ఇది అని కొనియాడారు. తన పాటలతో తనను ప్రభావితం చేసిన వ్యక్తి డిలన్ అని, ప్రజలకు తన పాటలతో కొత్త లోకం చూపించిన వ్యక్తి ఆయనని ఏఆర్ రెహ్మాన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. స్వీడిష్ అకాడమీ తీసుకున్న నిర్ణయం అద్భుతమని, దీని ద్వారా సాహిత్యంలో సంగీతం కూడా ఒక భాగం అనే విషయం రుజువైందని ప్రముఖ గీత రచయిత జావెద్ అక్తర్ పేర్కొన్నారు. గాయకులు అద్నాన్ సమి, ఉషా ఊతప్, విశాల్ దద్లానీ, శిల్పారావు, సోనా మహాపాత్ర, తదితరులు డిలాన్‌కు అభినందనలు తెలిపారు.
 
డిసెంబర్ 10న ప్రదానం
 సాహిత్య అవార్డును ప్రకటించడంతో ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటనకు తెరపడినట్లయ్యింది. ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, శాంతి మొదలైన విభాగాలకు అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, నోబెల్ బహుమతుల ప్రదానోత్సవం ఈ అవార్డుల సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 10న నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 10న స్టాక్‌హోమ్ వేదికగా ఈ వేడుక జరగనుంది. శాంతి పురస్కార ప్రదానం కోసం అదే రోజు ఓస్లోలో నార్వేయన్ నోబెల్ కమిటీ మరో కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా విజేతలకు నగదు పుస్కారం, గోల్డ్ మెడల్, డిప్లొమాను అందజేస్తారు.
 
 ప్రజలతో నడిచిన పాటగాడు..
 ప్రఖ్యాత అమెరికన్ కవిగాయకుడు, జానపద సంస్కృతి ప్రేమికుడు హక్కుల ప్రోత్సాహకుడు బాబ్ డిలన్ (75). అమెరికా సంగీత దిగ్గజంగా గౌరవం అందుకునే బాబ్ డిలన్‌కు ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులున్నారు.  ‘ది టైమ్స్ దే ఆర్ చేంజింగ్’, ‘అనదర్ సైడ్ ఆఫ్ బాబ్ డిలన్’, ‘బ్రింగింగ్ ఇట్ ఆల్ బ్యాక్ హోమ్’, ‘హైవే 61 రీవిజిటెడ్’ వంటి డిలన్ ఆల్బమ్స్ అమెరికాను ఉర్రూతలూగించాయి.


అరిచి అరిచి పాడు..
డిలన్ అసలు పేరు రాబర్ట్ అలెన్ జిబర్‌మేన్. అమెరికాలోని మిన్నెసొటాలో 1941లో జన్మిం చాడు. సంగీతవాసనలు ఏ మాత్రంలేని కుటుం బంలో పుట్టినా.. రేడియో వింటూ ‘ఎల్విస్ ప్రెస్లీ’ ప్రభావంతో డిలన్ సంగీత ప్రపంచంలో అడుగు పెట్టాడు. హైస్కూల్‌లో ఉన్నప్పుడే సొంత బ్యాం డ్ ఏర్పాటు చేసుకుని స్కూల్ వేదికపై డిలన్ పాడుతుంటే ఆ సంగీత ధోరణికి, అరుపులకు కంగారుపడిన ప్రిన్సిపల్ మైక్ కట్ చేయాల్సి వచ్చిందట. డిలన్‌కు కవిత్వం అంటే ఇష్టం. ‘డిలన్ థామస్’ అనే కవి రాసిన కవిత్వాన్ని ఇష్టపడి తన పేరును ఆ కవి గుర్తుగా ‘బాబ్ డిలన్’ అని మార్చుకున్నాడు.

పౌర హక్కుల గొంతుకై...: డిలన్‌ను అతడి సంగీతం కంటే అతడి సామాజిక బాధ్యతే ఎక్కువమందిని చేరువ చేసింది. 1960లలో అమెరికా అంతటా భగ్గున ఎగసిన పౌర హక్కుల ఉద్యమంలో బాబ్ డిలన్ ప్రత్యేక ఆకర్షణ. విద్య, ఉపాధి, సామాజిక రంగాల్లో నల్లవాళ్లపై అమెరికాలో బయటపడ్డ వివక్ష పట్ల బాబ్ డిలన్ గళమెత్తాడు. హక్కులకోసం పోరాడుతున్న వారందరికీ.. డిలన్ రాసిన పాటలు మరింత ఊపునిచ్చాయి. అలాగే వియత్నాంతో అమెరికా చేస్తున్న యుద్ధాన్ని కూడా గట్టిగా వ్యతిరేకిస్తూ ‘యాంటి వార్ ఉద్యమం’తో పాటుగా నడిచాడు. సమర్థమైన, భావరసస్ఫోరకమైన, చైతన్యపరిచే గీతాలను ఆలపించే డిలన్.. తనకొస్తున్న పాపులారిటీ, వెంట పడుతున్న జనం నుంచి తప్పించుకోవడానికి మోటర్ సైకిల్ ప్రమాదం మిషతో 1966 నుంచి 8ఏళ్లపాటు జనానికి దూరంగా ఉన్నాడు.

తర్వాత 1980 నుంచి కొనసాగిస్తున మ్యూజికల్ టూర్ అమెరికా సంగీత చరిత్రలో సుదీర్ఘమైన టూర్‌గా ప్రత్యేకత సంపాదించుకుంది. చిత్రకారుడుగా కూడా డిలన్ ఆరు పుస్తకాలను తన బొమ్మలతో ప్రచురించాడు. పాట రచనతో అతడు ఏర్పరిచిన ప్రభావానికి 2008లో పులిట్జర్ పురస్కార కమిటీ ఒక ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసింది. లెక్కలేనన్ని అవార్డులు పొందిన డిలన్ పాటలు అన్ని కలిపి మొత్తంగా పదికోట్ల కాపీలు అమ్ముడు పోయాయి.

ధోరణి మార్చుకుంటున్న అవార్డు కమిటీ..
నోబెల్ సాహిత్య పురస్కారం సాధారణంగా కవిత్వం, కథ, నవల, నాటకం ఇలాంటి సాహితీ ధోరణుల్లో ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఇటీవల అవార్డు కమిటీ తన పరిధిని విస్తరించుకుంటోంది. 2014లో అవార్డ్ పొందిన ఫ్రెంచ్ రచయిత పాట్రిక్ మొడియానో పెద్ద గొప్ప రచయిత కాదు. కానీ.. రెండో ప్రపంచయుద్ధంలో జర్మన్లు ఫ్రాన్స్ ఆక్రమణపై రాసిన కథలకు ఈ అవార్డు ప్రకటించారు. 2015లో స్వెత్లానా అలెక్సివిచ్ అనే జర్నలిస్టుకు (సోవియట్ పతనం తర్వాత పరిణామాలను ఇంటర్వ్యూల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు) నోబెల్ దక్కింది.ఈ సంవత్సరం అనూహ్యంగా ఈ కవిగాయకుడికి ప్రకటించారు.
 - మొహమ్మద్ ఖదీర్ బాబు
 
కాఫీ హోటళ్ల నుంచి..
గొప్పవారి కథనాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. బాబ్ డిలన్ కథ కూడా అలాంటిదే. అతడు కూడా గిటార్ పట్టిన వెంటనే సూపర్‌స్టార్ అయిపోలేదు. అంచెలంచెలుగా ఎదిగాడు. కాఫీ హోటళ్లలో, స్థానిక క్లబుల్లో పాడుతూ క్రమంగా నలుగురికీ పరిచయమయ్యాడు. జానపదానికి ప్రాధాన్యమివ్వటంతో అందరినీ ఆకర్శించాడు. ‘ఫోక్ సింగింగ్’ నుంచి ‘రాక్ అండ్ రోల్’కు తన ధోరణి మార్చుకోవడానికి డిలన్ చాలా కాలమే తీసుకున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement