గ్రేటెస్ట్ లివింగ్ పోయెట్‌కు నోబెల్ పురస్కారం!
స్టాక్‌హోమ్: 1960 నుంచి తన ప్రభావవంతమైన గీతాలతో ఒక తరానికి ప్రతినిధిగా, స్వరంగా నిలిచిన అమెరికన్ గీత రచయిత, పాటగాడు బాబ్ డిలాన్‌ను అత్యున్నత నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. అత్యున్నత సాహిత్య పురస్కారంగా భావించే నోబెల్ అవార్డును ఇప్పటివరకు కవులకు, రచయితలకు ఇస్తూ వస్తుండగా.. ఈసారి అనూహ్యరీతిలో సంగీత రంగానికి చెందిన గాయకుడికి ప్రకటించడం గమనార్హం.
"బ్లోవిన్ ఇన్ ద విండ్', "మాస్టర్స్ ఆఫ్ వార్', "ఏ హార్డ్ రెయిన్స్ ఏ గాన్నా ఫాల్', "ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్', "సబ్‌టెరానియన్ హోస్‌సిక్ బ్లూ', "లైక్ ఏ రోలింగ్ స్టోన్' వంటి తన గీతాలతో బాబ్ డిలాన్ అసమ్మతిని, తిరుగుబాటును, స్వతంత్రకాంక్షను ప్రకటించారు. "డిలాన్‌లో ఒక ఐకాన్ ఉన్నారు. సమకాలీన సంగీతంపై ఆయన ప్రభావం అపారం' అని స్వీడిష్ అకాడెమీ పేర్కొంది. నోబెల్ పురస్కారం కింద డిలాన్‌కు ఎనిమిది మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (9.30లక్షల డాలర్లు.. రూ. 6.22 కోట్లు) బహుమానం లభించనుంది. 50 ఏళ్లకుపైగా కొనసాగుతున్న తన గీత ప్రస్థానంలో ఇప్పటికే డిలాన్ గీతాలు రచిస్తున్నారు. అప్పుడప్పుడు ప్రపంచ పర్యటనలు చేపడుతున్నారు.
ప్రస్తుతం జీవిస్తున్న వారిలో ఆయన అత్యున్నత కవి (గ్రేటెస్ట్ లివింగ్ పోయెట్) అయి ఉంటారు’ అని అకాడెమీ సభ్యుడు పెర్ వాస్ట్‌బర్గ్ పేర్కొన్నారు. డిలాన్‌కు నోబెల్ ప్రకటించడంలో ప్యానెల్ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుందని అకాడెమీ శాశ్వత కార్యదర్శి సరా డెనియస్ పేర్కొన్నారు. డైనమేట్ సృష్టికర్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరిట 1901 నుంచి ప్రతి సంవత్సరం విజ్ఞానం, సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసినవారికి పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.