
‘నోబెల్’ కవి హీనీ ఇకలేరు
సుప్రసిద్ధ ఐరిష్ కవి, నాటక రచయిత, ‘నోబెల్’ గ్రహీత సీమస్ హీనీ (74) శుక్రవారం డబ్లిన్‌లో కన్నుమూశారు.
డబ్లిన్: సుప్రసిద్ధ ఐరిష్ కవి, నాటక రచయిత, ‘నోబెల్’ గ్రహీత సీమస్ హీనీ (74) శుక్రవారం డబ్లిన్‌లో కన్నుమూశారు. కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన డబ్లిన్‌లోని బ్లాక్‌రాక్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఐరిష్ కవుల్లో డబ్ల్యూబీ యీట్స్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన హీనీకి 1995లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. 1939 ఏప్రిల్ 13న జన్మించిన హీనీ, 1960 నుంచి రచనలు ప్రారంభించారు. ‘పదకొండు కవితలు’ పేరిట తన తొలి కవితా సంపుటి విడుదల చేశారు.
1966లో విడుదల చేసిన ‘డెత్ ఆఫ్ ఏ నేచురలిస్ట్’ ఆయనకు ఇంగ్లీష్ సాహిత్యంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ‘డోర్ ఇన్‌టు ది డార్క్’, ‘స్టేషన్స్’, ‘ఫీల్డ్‌వర్క్’, ‘స్టేషన్ ఐలాండ్’, ది హా లాంటెర్న్’, ‘సీయింగ్ థింగ్స్’, ‘ది స్పిరిట్ లెవెల్’, ‘ఎలక్ట్రిక్ లైట్’, ‘డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్’, ‘హ్యూమన్ చెయిన్’ వంటి కవితా సంపుటాలు, ‘ది క్యూర్ ఎట్ ట్రాయ్’, ‘ది బరియల్ ఆఫ్ థేబ్స్’ వంటి నాటకాలు, అనువాద రచనలు హీనీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, కాలిఫోర్నియా వర్సిటీల్లో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేశారు.