రాజన్‌కు మార్కెట్ ‘గురు’ల కితాబు!
- అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్: జిమ్ రోజర్స్ ప్రశంస
- నోబెల్ ప్రైజ్‌కు అర్హుడన్న మార్క్ ఫేబర్
న్యూఢిల్లీ: ఎవరేమంటే నాకేంటి.. నా రూటే సెప‘రేటు’ అంటూ తనదైన శైలిలో ముందుకెళ్తున్న ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై దిగ్గజ ఫండ్ మేనేజర్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టాక్ మార్కెట్ ‘గురు’గా ప్రసిద్ధి చెందిన రోజర్స్ హోల్డింగ్స్ చీఫ్ జిమ్ రోజర్స్ తాజాగా రాజన్ పనితీరుకు కితాబిచ్చారు. ప్రపంచంలోని అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్లలో రఘురామ్ రాజన్ ఒకరని కొనియాడారు. అంతర్జాతీయంగా డాలరుతో వివిధ దేశాల కరెన్సీ విలువలు కుప్పకూలుతున్నప్పటికీ.. వర్ధమాన మార్కెట్లలో అన్నింటికంటే భారత్ మార్కెట్ పనితీరు మెరుగ్గా ఉండటానికి ఆర్‌బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలే కారణమనేది విశ్లేషకుల అభిప్రాయం.
ఒకపక్క, వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఇతర సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీరేట్లను అత్యల్పస్థాయికి తగ్గించినప్పటికీ.. భారత్ మాత్రం ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా సమర్థంగా వ్యవహరించిందని కూడా వారు చెబుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నాని పేర్కొన్నారు. ‘చురుకైన, సమర్థవంతమైన వ్యక్తులకు కొదవలేకపోవడం భారత్‌కు చాలా మేలు చేకూరుస్తోంది. మరీ ముఖ్యంగా ఆర్‌బీఐ గవర్నర్ రాజన్‌ను గురించి చాలా చెప్పుకోవాలి. బహుశా అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్లలో ఒకరిగా ఆయనను పేర్కొనవచ్చు’ అని రోజర్స్ తాజాగా ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన అతికొద్దిమంది ఆర్థిక వేత్తల్లో రాజన్ కూడా ఒకరు. దీంతో ఆయన పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయంగా మార్మోగాయి. రాజన్ చెప్పే విషయాలు నిక్కచ్చిగా ఉంటాయని, అందుకే ఆయనంటే తనకు అంత గౌరవమని రోజర్స్ పేర్కొన్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన భారత్ ప్రభుత్వానికి నాయకత్వం వహించడం లేదని, అందుకే దేశాన్ని కాపాడడం ఆయన చేతుల్లో లేదంటూ చలోక్తులు విసిరారు.
పనితీరులో ఆయన ప్రస్తుత పంథానే అనుసరిస్తారన్న నమ్మకం మాత్రం తనకుందని రోజర్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చైనా తన కరెన్సీ యువాన్ విలువను డీవేల్యూ చేయడం, అక్కడ ఆర్థిక మందగమనం కారణంగా తాజాగా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిన సందర్భంలో కూడా రాజన్ భారత్ ఆర్థిక వ్యవస్థపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిందేమీ లేదంటూ భరోసా ఇచ్చారు. అయితే, ప్రపంచ వృద్ధి చోదకంగా చైనా స్థానాన్ని భారత్ అందిపుచ్చుకోవాలంటే ఇంకా చాలా ఏళ్లే పడుతుందని కుండబద్దలు కొట్టడం కూడా ఆయనకే చెల్లింది. 2013లో ఆర్‌బీఐ పగ్గాలు అందుకున్న రాజన్... రూపాయి క్షీణతకు చికిత్స చేయడమే కాకుండా, పాలసీ నిర్ణయాల్లో ధరల కట్టడికే తొలి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే: ఫేబర్
మరో స్టాక్ మార్కెట్ దిగ్గజం మార్క్ ఫేబర్ కూడా రాజన్‌ను గతంలో ప్రశంసల్లో ముంచెత్తారు. ‘సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌లను సాధారణంగా నేను నమ్మను. అయితే, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అంటే మాత్రం అపారమైన విశ్వాసం ఉంది. ఇతర సెంట్రల్ బ్యాంకులు కరెన్సీ ప్రింటింగ్ కేంద్రాలుగా మారిపోతుంటే.. రాజన్ మాత్రం మానిటరీ పాలసీలపై తనకున్న పట్టును నిరూపించారు. పరపతి విధానాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఆయన అసాధారణ వ్యక్తి. ఆర్థిక శాస్త్రంలో కచ్చితంగా రాజన్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే’ అంటూ ఫేబర్ వ్యాఖ్యానించడం విశేషం.