RBI Governor Raghuram Rajan
-
సెంట్రల్ బ్యాంకుల నుంచి ఎక్కువ ఆశించొద్దు: రాజన్
బాసెల్ (స్విట్జర్లాండ్): సెంట్రల్ బ్యాంకుల నుంచి మరీ ఎక్కువగా ఆశించడం సరికాదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. సెంట్రల్ బ్యాంకులు సైతం తమ అమ్ములపొదిలో ఇంకా ఆయుధాలున్నాయంటూ పేర్కొనడాన్ని ఆయన తప్పు బట్టారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల ప్యానల్ చర్చా కార్యక్రమంలో రాజన్ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం విషయంలో సెంట్రల్ బ్యాంకులు నేర్చుకున్న అనుభవాలను పంచుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్ మాట్లాడుతూ... అభివృద్ధి చెందిన దేశాలు సంప్రదాయ విధానాలను విడిచిపెట్టి.. అదే సమయంలో వర్థమాన దేశాలు మాత్రం పరపతి విధానం, ఆర్థిక విధానాల విషయంలో సంప్రదాయంగానే కొనసాగాలని కోరుకోవడాన్ని తప్పుబట్టారు. ప్రస్తుతం అమలుచేస్తున్న విధానాలు ఫలితాలు ఇవ్వని పరిస్థితిలో అభివృద్ధి చెందిన దేశాలు పడిపోయాయని చెప్పుకొచ్చారు. ‘సంప్రదాయ సిద్ధాంతాలకు అనుగుణంగా నడవడం మంచిదే. కానీ ప్రస్తుతమున్న వాతావరణంలో ఇది అంతగా ఆచరణయోగ్యం కాదు. కనుక కొత్త పరిష్కారాలతో ముందుకు రావాలి. వాతావరణం ఎంతో మారింది కానీ, ఆర్థికపరమైన వాతావరణం కాదు’ అని అన్నారు. -
‘మోదీ అప్పుడే స్పందిస్తే రాజన్ మరో టర్మ్ ఉండేవారు’
చెన్నై: ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై జరుగిన దుష్ర్పచారాన్ని కేంద్ర ప్రభుత్వం సకాలంలో అడ్డుకున్నట్లయితే ఆయన మరో పర్యాయం ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగే వారని ఆయన తండ్రి, భారత మాజీ బ్యూరోక్రట్ ఆర్. గోవిందరాజన్ ఓ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఓ తండ్రిగా తన కొడుకు పక్షాన తాను మాట్లాడకూడదుగానీ, ఇప్పుడు ఈ అంశం వివాదాస్పదమైనందున, ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించినందున తాను మాట్లాడాల్సి వస్తోందని ఆయన అన్నారు. రఘురామ్ రాజన్ దేశభక్తిని బీజేపీ నాయకుడు సుబ్రమణియం స్వామి శంకించడం, ఆయనపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, ఆయన్ని తక్షణం ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పించాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరడం తదితర పరిణామాలకు రాజన్ నొచ్చుకున్నారు. మరోమారు తాను గవర్నర్ పదవిని చేపట్టనంటూ కూడా ఖరాకండిగా చెప్పారు. ఆయనపై రెండు నెలల క్రితమే దుష్ర్పచారం మొదలైందని, అప్పుడే గనుక ప్రభుత్వం స్పందించి ఉన్నట్లయితే కచ్చితంగా తన కొడుకు మరో పర్యాయం ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగేవారని భారత సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారిగా రిటైర్ అయిన గోవందరాజన్ వ్యాఖ్యానించారు. సుబ్రమణియం స్వామి, రాజన్‌పై విమర్శలు చేస్తున్నంతకాలంలో మౌనం వహించిన నరేంద్ర మోదీ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మూడు రోజుల క్రితం ఇచ్చిన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రాజన్‌పై వచ్చిన విమర్శలను ఖండించిన విషయం తెల్సిందే. అదికూడా రాజన్ పేరును నేరుగా ప్రస్థావించకుండానే ఆయనపై ఎవరు ఇలాంటి విమర్శలు చేయడం సముచితం కాదని ఆ ఇంటర్వ్యూలో మోదీ వ్యాఖ్యానించారు. గోవిందరాజన్ భార్య మైథిలి కూడా రాజన్‌పై జరిగిన విషప్రచారాన్ని ఖండించారు. ముఖ్యంగా తన కుమారుడి దేశభక్తిని శంకించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్‌లోనే పుట్టి, భారత్‌లోనే ఐఐటీ చదువుకొని, భారత్‌కే సేవలందిస్తున్న నా కుమారుడి దేశభక్తిని శంకిస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. ‘ఈ విషయంలో నా కుమారుడు ఏమనుకున్నాసరే, నేను మాత్రం నా అభిప్రాయాలను స్పష్టంగా చెబుతాను. నేను మావారి ఉద్యోగం రీత్యా లండన్‌లో ఉన్నప్పుడు నా కుమారుడు భారత్‌లోనే ఉన్నారు అవసరం అనుకుంటే లండన్‌లోనే చదువుకునే అవకాశం కూడా నా కుమారుడికి ఉంది. 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల సందర్భంలో కూడా రాజన్ ఢిల్లీలోనే ఉండి వీలైనంత మంది సిక్కులకు ఆశ్రయం ఇచ్చారు. ఐఐటీలో విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసిన రాజన్ అది తన బాధ్యతని భావించి ఉండవచ్చు. ఐఐటీ కాలేజ్ సురక్షిత ప్రాంతం కావడం వల్ల కూడా అల్లర్ల నుంచి ఎంతోమంది సిక్కులను రక్షించి ఆశ్రయం కల్పించారు. అలాంటి వ్యక్తిపై నిందలు వేయడం తగదు’ అని కూడా ఆమె అన్నారు. -
స్వామికి షాకిచ్చిన నరేంద్ర మోదీ!
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌పై, కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. వారిపై ఆరోపణలు చేయడం సరికాదని తేల్చిచెప్పారు. వ్యవస్థ కంటే తామే గొప్పవారమని ఎవరైనా అనుకుంటే అది సరికాదంటూ పరోక్షంగా స్వామికి షాక్ ఇచ్చారు. రాజన్ మానసికంగా భారతీయుడు కాదన్న స్వామి ఆరోపణలనూ మోదీ తోసిపుచ్చారు. రాజన్ దేశభక్తిని ఏమాత్రం శంకించలేమని, తామందరికీ తీసిపోని స్థాయిలో ఆయనలో దేశభక్తి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆర్బీఐ డైరెక్టర్ రఘురాం రాజన్, కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ లక్ష్యంగా స్వామి ఆరోపణల దాడితో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జైట్లీపైనా పరోక్షంగా స్వామి విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ ఎంపీ చేసిన ఈ ఆరోపణలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధినాయకత్వం దూరం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వామికి గట్టిగా షాకిచ్చేరీతిలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఇది మా పార్టీలో జరింగిందా లేక వేరే పార్టీలోనా అన్నది పక్కనబెడితే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పబ్లిసిటీపై మోజుతో ఇలా చేయడం దేశానికి ఏమాత్రం మేలు చేయదు. ప్రజలు ఎంతో బాధ్యతాయుతంగా మెలుగాల్సిన అవసరముంది. ఎవరైనా తాము వ్యవస్థ కంటే గొప్పవారమని అనుకుంటే అది తప్పు’ అని మోదీ తేల్చి చెప్పారు. స్వామి వ్యాఖ్యలపై టైమ్స్ నౌ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజన్, ఇతర అధికారులపై విమర్శల గురించి అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానమిస్తూ వారిపై విశ్వాసం ప్రకటించారు. ఆర్బీఐ డైరెక్టర్ రాజన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. -
రాజన్ వ్యాఖ్యలు సరికాదు
గుడ్డివాళ్లు, ఒంటికన్ను రాజు కాకుండా మంచి పదాలు వాడాల్సింది: నిర్మలా న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ గుడ్డివాళ్ల లోకంలో ఒంటికన్ను రాజులా ఉందన్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలను కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుపట్టారు. భారత ఆర్థిక వ్యవస్థను వర్ణించడానికి రఘురామ్ రాజన్ మంచి మాటలు వాడి ఉండివుంటే బావుండేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెరుగుతున్నాయని, తయారీ రంగం పుంజుకుం టోందని, ద్రవ్యోల్బణం, కరంట్ అకౌంట్ లోటు నియంత్రణలోనే ఉన్నాయని వివరించారు. రాజన్ చెప్పాలనుకున్న భావాన్ని మంచి పదాలు, మాటలతో చెబితే బావుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ ఆశావహంగా ఉందని వర్ణించే రాజన్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుడ్డివాళ్ల లోకంలో ఒంటి కన్ను రాజులా భారత ఆర్థిక వ్యవస్థ ఉందని వ్యాఖ్యానించారు. -
ద్రవ్యలోటు ఆధారిత వృద్ధి సరికాదు
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ న్యూఢిల్లీ: ద్రవ్యలోటును పెంచుకుంటూ... అదనపు రుణాలు తీసుకునే ఆర్థిక వ్యవస్థ మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 29న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. ద్రవ్య క్రమశిక్షణ నుంచి దూరం జరగడం ఆర్థిక స్థిరత్వానికే ముప్పు తెస్తుందని రాజన్ హెచ్చరించారు. శుక్రవారమిక్కడ సీడీ దేశ్‌ముఖ్ స్మారక ఉపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలే ప్రపంచం ఆర్థిక అనిశ్చితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలు దేశాన్ని ఇబ్బందికి గురిచేయరాదన్నారు. ద్రవ్యలోటు పెరగడం వల్ల బాండ్లకు సంబంధించి ప్రభుత్వంపై రుణ భారం పెరగడమే కాకుండా... భవిష్యత్‌లో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ విషయంలో సమస్యలను సైతం తెచ్చిపెడుతుందని విశ్లేషించారు. ప్రభుత్వం, ఆర్బీఐ రెండూ కలిసి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి తగిన చర్యలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయోజనాలను పరిశీలించాలి... ప్రభుత్వ వ్యయాలు ఆర్థిక వ్యవస్థకు ఎంతమేరకు లాభిస్తాయన్న విషయాన్ని సైతం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని రాజన్ చెప్పారు. ఈ వ్యయాల వల్ల ప్రభుత్వ రుణ భారం పెరగరాదన్నారు. ‘‘కేంద్ర, రాష్ట్రాల మొత్తం ద్రవ్యలోటు 2014లో 7 శాతం ఉంటే... అది 2015లో 7.2 శాతానికి పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ అమల్లోకి రానున్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీల పునరుద్ధరణ పథకం ఉదయ్ వల్ల ఆర్థిక భారం మరింత పెరుగుతుంది’’ అన్నారాయన. నిజానికి 2015-16లో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తిలో 3.6%కి తగ్గించాల్సి ఉంది. అయితే ఈ లక్ష్యాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వాయిదా వేసింది. లక్యంలో 88 శాతానికి ద్రవ్యలోటు.. న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి (ఏప్రిల్-డిసెంబర్) లక్ష్యంలో 88 శాతానికి చేరింది. 2015-16లో ద్రవ్యలోటు లక్ష్యం రూ.5.55 లక్షల కోట్లు (స్థూల దేశీయోత్పత్తిలో 3.9 శాతం). అయితే డిసెంబర్ ముగిసే నాటికి ఈ మొత్తం రూ.4.88 లక్షల కోట్లకు చేరిందని తాజా గణాంకాలు వెల్లడించాయి. -
పెట్టుబడులు పడిపోవడం ఆందోళనకరం
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ హాంకాంగ్: ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ శుక్రవారం పేర్కొన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అంశంగా పేర్కొన్నారు. ‘‘వృద్ధికి సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశం పెట్టుబడులు. ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పెట్టుబడుల సంగతీ అంతే’’ అని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాజన్ అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మౌలిక రంగం అభివృద్ధి ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహాన్ని అందిస్తున్న అంశాలుగా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత వారం బ్రిటన్‌లో మాట్లాడుతూ, దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40 శాతం పెరిగాయని, ప్రపంచానికి భారత్ పట్ల పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను ఆర్బీఐ 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. వృద్ధికి ఊతం అందించే క్రమంలో సెప్టెంబర్‌లో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో బ్యాంకులకు తానిచ్చే (ఆర్బీఐ) స్వల్పకాలిక రుణాలపై వడ్డీరేటు రెపో 6.75 శాతానికి తగ్గింది. -
‘అసహనం’తో దేశానికి మచ్చ
ఢిల్లీ భేటీలో ప్రముఖుల వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత్‌లో ‘అసహన’ ఘటనలు దేశ సమైక్యతకు చెడ్డపేరు తెస్తాయని రచయితలు, కళాకారులు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై శనివారం ఢిల్లీ జరిగిన ఓ భేటీలో వారు మాట్లాడారు. పరిస్థితిలో మార్పు రాకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్‌లో రచయితలకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలని, దాడులు చేస్తున్న వారిని కట్టడి చేయలేకపోతే అది నియంతృత్వమే అవుతుందని సంగీత విద్వాంసుడు జుబిన్ మెహతా అన్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ, ‘మైనారిటీల్లో అభద్రత నెలకొంది. వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే’నన్నారు. ఢిల్లీ ఐఐటీలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ.. సహనం, పరస్పరం గౌరవంతో మార్పు తీసుకురాగలమన్నారు. విచ్ఛిన్నకర శక్తులతో దేశ ఐక్యతకు ప్రమాదం పొంచి ఉందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. ప్రముఖ గాంధేయవాది పీవీ రాజగోపాల్‌కు ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డును ప్రదానం చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లడారు. -
మార్కెట్‌కు స్వల్ప లాభాలు
రాజన్ ఉత్సాహపర్చినా... అంతర్జాతీయ ప్రతికూల ప్రభావం! 700 పాయింట్ల ఊగిసలాట 162 పాయింట్ల లాభంతో 25,779కు సెన్సెక్స్ ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ అనూహ్యంగా రెపో రేటును అరశాతం తగ్గించినా, అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై అందోళన కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు క్షీణించడంతో మంగళవారం మన స్టాక్ మార్కెట్ ఓ మోస్తరు లాభాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. సెన్సెక్స్ 26వేల పాయింట్ల దిగువన, నిఫ్టీ 7,800 పాయింట్ల ఎగువన ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 162 పాయింట్లు లాభపడి 25,779 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 7,843 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడమూ ప్రభావం చూపింది. జీడీపీ అంచనాలను ఆర్బీఐ 7.6%నంచి 7.4 శాతానికి తగ్గించడం కొంత ప్రతికూలత చూపింది. వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, రియల్టీ, హౌసింగ్ ఫైనాన్స్, వాహన షేర్లు ఒక వెలుగు వెలిగాయి. చివరలో లాభాల స్వీకరణ.. ట్రేడింగ్ చివర్లో ఫార్మా, లోహ షేర్లలో అమ్మకాల జోరు కారణంగా స్టాక్ మార్కెట్ లాభాలకు కళ్లెం పడింది. ఒక దశలో 300 పాయింట్ల వరకూ పడిపోయిన సెన్సెక్స్ ఆర్బీఐ రేట్ల కోత తర్వాత కోలుకొని లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే ఒక దశలో 700 పాయింట్ల లాభాన్ని కళ్లజూసింది. ఇంట్రాడేలో 400 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరిగంటలో విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా స్వల్పలాభాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, ఫెడ్ వడ్డీరేట్ల అనిశ్చితి వంటి అంశాల కారణంగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. -
మార్కెట్ హెచ్చుతగ్గులు తాత్కాలికమే
వాటిపై ఆందోళన అక్కర్లేదు - పెట్టుబడులు తక్కువగా ఉండటమే సమస్య - ఆర్థిక విధానాలే దేశాల వృద్ధికి కీలకం - బీ20 సదస్సులో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అంకారా: మార్కెట్లలో హెచ్చుతగ్గులు తాత్కాలికమేనని, వీటి గురించి భయపడక్కర్లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. ప్రజలు వ్యయాలు తగ్గించుకుని పొదుపుపై మరింతగా దృష్టి పెడుతున్నారని, దీనివల్ల వివిధ వస్తువులపై వ్యయం తగ్గుతోందని చెప్పారాయన. దీంతో పాటు పెట్టుబడులు తక్కువ స్థాయిలో ఉంటుండటం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సతమతం చేస్తోందన్నారు. గ్లోబల్ ఎకానమీ ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ... ‘‘వృద్ధి సాధించాలంటే ఆర్థికాంశాలే కీలకం. ఆయా దేశాలు పాటించే ఆర్థిక విధానాలే వాటి వృద్ధి గతిని నిర్దేశిస్తాయి’’ అని చెప్పారాయన. జీ20 దేశాలకు చెందిన బిజినెస్ లీడర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచటంపై అనిశ్చితి నెలకొటంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీన్నే ప్రస్తావిస్తూ... భవిష్యత్‌లో హెచ్చుతగ్గులపై ఆందోళనలు పరిష్కారమవ్వాలంటే ద్రవ్య విధానాలు సాధారణ స్థాయికి రావడం ఒక్కటే మార్గమని చెప్పారు. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకుల విధానాలతో వ్యవస్థ మరింత దుర్బలంగా మారిపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్‌తో పాటు ఫ్రాన్స్, టర్కీ, మెక్సికో తదితర దేశాల సెంట్రల్ బ్యాంక్‌ల గవర్నర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి.. జీ20 దేశాల నేతలు ఉపాధి కల్పనపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని లగార్డ్ చెప్పారు. ఇన్ఫ్రాలో పెట్టుబడులు, ఆర్థిక, కార్మిక రంగాల్లో సంస్కరణలు, ఉత్పత్తులకు మార్కెటింగ్ పరమైన సంస్కరణలు కీలకమైనవని ఆమె తెలియజేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ముగిసిన తర్వాత నుంచి ప్రపంచ ఎకానమీ ఒక మోస్తరు వేగంతో రికవరీ అవుతోందని వక్తలు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సంపన్న దేశాల్లో ఆర్థిక విధానాలు సాధారణ స్థాయికి వచ్చినా.. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని వారు చెప్పారు. వృద్ధి అంచనాలు, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయుల్లో ఉండటం ఇందుకు కారణమని చెప్పారు. దీంతో పాటు ఉత్పాదకత మందగిస్తుండటం, పెట్టుబడుల స్థాయి తక్కువగా ఉండటం ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులకు సవాళ్లు ఎదురవుతాయని వారు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు వడ్డీ రేట్లు పెంచాలి.. నిలకడగా వృద్ధి సాధిస్తున్న ప్రపంచ దేశాలు వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందని, అయితే ఇది ఒకేసారిగా భారీ స్థాయిలో మాత్రం ఉండకూడదని రాజన్ అభిప్రాయపడ్డారు. సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు తీసుకోవడంలో మార్కెట్ హెచ్చుతగ్గుల ఆందోళనలు ఆటంకాలు కాకూడదని ఆయన చెప్పారు. అమెరికాను, ఫెడరల్ రిజర్వ్‌ను నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తప్పక పెంచుతుందన్న అంచనాల నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఇటు దేశీయంగా ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాల నుంచి తనపై ఒత్తిడి పెరుగుతున్న సందర్భంలో ప్రపంచ దేశాలకు ఆయన ఈ సూచనలు చేయడం గమనార్హం. సెంట్రల్ బ్యాంకులు ఉదార ఆర్థిక విధానాల నుంచి క్రమంగా వైదొలగడానికి ఇదే సరైన సమయమని రాజన్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేందుకు వడ్డీ రేట్ల విధానాలొక్కటే సహాయపడలేవని, ఆర్థిక విధానాలు కూడా కీలకమన్నారు. రెండేళ్ల పదవీకాలం పూర్తి... రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. 2013 సెప్టెంబర్ 4న ఆర్బీఐ 23వ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మరో ఏడాదిపాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ద్రవ్యోల్బణమే ప్రధాన ప్రాతిపదికగా ద్రవ్య, పరపతి విధానం అవలంభిస్తున్న రాజన్‌పై ప్రస్తుతం రెపో రేటు తగ్గింపునకు అటు ప్రభుత్వం నుంచీ ఇటు పరిశ్రమల నుంచీ తీవ్ర ఒత్తిడి ఉంది. ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు రిలైట్ ద్రవ్యోల్బణం 9.8 శాతం కాగా, ఇప్పుడు 3.8 శాతానికి చేరింది. రూపాయి విలువ 70 స్థాయికి పడిపోతున్న భయాలు, తీవ్ర కరెంట్ అకౌంట్‌లోటు, 5 శాతం లోపు జీడీపీ వృద్ధి రేటు, సావరిన్ రేటింగ్‌ను జంక్ స్థాయికి దింపుతామన్న రేటింగ్ ఏజెన్సీల హెచ్చరికల నేపథ్యంలో ఆయన ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయా స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రస్తుతం భారత్ పరిస్థితి మెరుగుపడిందనే భావించవచ్చు. -
రాజన్‌కు మార్కెట్ ‘గురు’ల కితాబు!
- అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్: జిమ్ రోజర్స్ ప్రశంస - నోబెల్ ప్రైజ్‌కు అర్హుడన్న మార్క్ ఫేబర్ న్యూఢిల్లీ: ఎవరేమంటే నాకేంటి.. నా రూటే సెప‘రేటు’ అంటూ తనదైన శైలిలో ముందుకెళ్తున్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై దిగ్గజ ఫండ్ మేనేజర్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టాక్ మార్కెట్ ‘గురు’గా ప్రసిద్ధి చెందిన రోజర్స్ హోల్డింగ్స్ చీఫ్ జిమ్ రోజర్స్ తాజాగా రాజన్ పనితీరుకు కితాబిచ్చారు. ప్రపంచంలోని అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్లలో రఘురామ్ రాజన్ ఒకరని కొనియాడారు. అంతర్జాతీయంగా డాలరుతో వివిధ దేశాల కరెన్సీ విలువలు కుప్పకూలుతున్నప్పటికీ.. వర్ధమాన మార్కెట్లలో అన్నింటికంటే భారత్ మార్కెట్ పనితీరు మెరుగ్గా ఉండటానికి ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలే కారణమనేది విశ్లేషకుల అభిప్రాయం. ఒకపక్క, వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఇతర సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీరేట్లను అత్యల్పస్థాయికి తగ్గించినప్పటికీ.. భారత్ మాత్రం ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా సమర్థంగా వ్యవహరించిందని కూడా వారు చెబుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నాని పేర్కొన్నారు. ‘చురుకైన, సమర్థవంతమైన వ్యక్తులకు కొదవలేకపోవడం భారత్‌కు చాలా మేలు చేకూరుస్తోంది. మరీ ముఖ్యంగా ఆర్బీఐ గవర్నర్ రాజన్‌ను గురించి చాలా చెప్పుకోవాలి. బహుశా అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్లలో ఒకరిగా ఆయనను పేర్కొనవచ్చు’ అని రోజర్స్ తాజాగా ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన అతికొద్దిమంది ఆర్థిక వేత్తల్లో రాజన్ కూడా ఒకరు. దీంతో ఆయన పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయంగా మార్మోగాయి. రాజన్ చెప్పే విషయాలు నిక్కచ్చిగా ఉంటాయని, అందుకే ఆయనంటే తనకు అంత గౌరవమని రోజర్స్ పేర్కొన్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన భారత్ ప్రభుత్వానికి నాయకత్వం వహించడం లేదని, అందుకే దేశాన్ని కాపాడడం ఆయన చేతుల్లో లేదంటూ చలోక్తులు విసిరారు. పనితీరులో ఆయన ప్రస్తుత పంథానే అనుసరిస్తారన్న నమ్మకం మాత్రం తనకుందని రోజర్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చైనా తన కరెన్సీ యువాన్ విలువను డీవేల్యూ చేయడం, అక్కడ ఆర్థిక మందగమనం కారణంగా తాజాగా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిన సందర్భంలో కూడా రాజన్ భారత్ ఆర్థిక వ్యవస్థపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిందేమీ లేదంటూ భరోసా ఇచ్చారు. అయితే, ప్రపంచ వృద్ధి చోదకంగా చైనా స్థానాన్ని భారత్ అందిపుచ్చుకోవాలంటే ఇంకా చాలా ఏళ్లే పడుతుందని కుండబద్దలు కొట్టడం కూడా ఆయనకే చెల్లింది. 2013లో ఆర్బీఐ పగ్గాలు అందుకున్న రాజన్... రూపాయి క్షీణతకు చికిత్స చేయడమే కాకుండా, పాలసీ నిర్ణయాల్లో ధరల కట్టడికే తొలి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే: ఫేబర్ మరో స్టాక్ మార్కెట్ దిగ్గజం మార్క్ ఫేబర్ కూడా రాజన్‌ను గతంలో ప్రశంసల్లో ముంచెత్తారు. ‘సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌లను సాధారణంగా నేను నమ్మను. అయితే, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అంటే మాత్రం అపారమైన విశ్వాసం ఉంది. ఇతర సెంట్రల్ బ్యాంకులు కరెన్సీ ప్రింటింగ్ కేంద్రాలుగా మారిపోతుంటే.. రాజన్ మాత్రం మానిటరీ పాలసీలపై తనకున్న పట్టును నిరూపించారు. పరపతి విధానాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఆయన అసాధారణ వ్యక్తి. ఆర్థిక శాస్త్రంలో కచ్చితంగా రాజన్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే’ అంటూ ఫేబర్ వ్యాఖ్యానించడం విశేషం. -
మొండిబకాయిలతోనే ముప్పు!
ముంబై : స్థూలంగా చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని.. ఎలాంటి అనిశ్చితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని... కానీ బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏ) అంతకంతకూ పెరుగుతుండటం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) పేర్కొంది. పెరుగుతున్న ఎన్పీఏలు ఇటు ప్రభుత్వం, అటు నియంత్రణ సంస్థలకు కూడా సవాలుగా పరిణమిస్తున్నాయని తెలియజేసింది. గురువారం విడుదల చేసిన అర్ధ వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్)లో ఆర్బీఐ ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. ‘వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్), ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలను చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలోనే ఉంది. రానున్న రోజుల్లో మరింత పుంజుకునే అవకాశం ఉంది. అయితే, వ్యాపార విశ్వాసం పెరుగుతున్న సంకేతాలు మాత్రం అంతగా కనిపించటం లేదు. ఇది ఆందోళనకరం. మరోపక్క, బ్యాంకింగ్ వ్యవస్థ స్థూల ఎన్పీఏలు ఈ ఏడాది మార్చి నాటికి 4.6 శాతానికి ఎగబాకాయి. గతేడాది సెప్టెంబర్ చివరికి ఇవి 4.5 శాతంగా ఉన్నాయి. పునర్వ్యవస్థీకరించిన రుణాలతో కలిపితే మొత్తం మొండిబకాయిలు 10.7 శాతం నుంచి 11.1 శాతానికి ఎగబాకాయి’ అని ఆర్బీఐ వివరించింది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలోని ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉప సంఘం ఈ నివేదికను రూపొందించింది. కమిటీలో సెబీ, ఐఆర్డీఏ, ఎఫ్ఎంసీ, పీఎఫ్ఆర్డీఏ వంటి ఇతర నియంత్రణ సంస్థలకు చెందిన చీఫ్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా సభ్యులు. మరింత పెరిగే ప్రమాదం... కాగా, ఎన్పీఏల పెరుగుదలకు అడ్డుకట్టపడే పరిస్థితులు ఇంకా రాలేదని (బాటమ్డ్ అవుట్) ఆర్బీఐ హెచ్చరించింది. మరికొన్ని త్రైమాసికాల పాటు అధిక మొండిబకాయిల భారం కొనసాగే అవకాశముందని.. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడవచ్చని కూడా తేల్చిచెప్పింది. ఇక రంగాల వారీగా చూస్తే.. మైనింగ్, ఇనుము-ఉక్కు, టెక్స్టైల్స్, ఇన్ఫ్రా, విమానయానాల్లో అత్యధికంగా మొండిబకాయిలు పేరుకుపోతున్నాయి. మొత్తం ఎన్‌పీఏల్లో ఈ రంగాల వాటాయే 17.9 శాతంగా ఉంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికానికి స్థూల ఎన్పీఏలు 4.8 శాతానికి ఎగబాకి.. 2016 మార్చి క్వార్టర్‌కు 4.7 శాతానికి చేరే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. అయితే, స్థూల ఆర్థిక పరిస్థితులు దిగజారితే గనక ఈ ఎన్పీఏలు మార్చినాటికి 5.9 శాతానికి ఎగబాకే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఇక ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పీఎస్‌యూ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు మార్చి నాటికి 5.7 శాతానికి ఎగసే అవకాశం ఉందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. నివేదికలో ఇతర అంశాలివీ... ► ఈ ఏడాది తొలి 6 నెలల్లో కీలకమైన రెపో రేటును ముప్పావు శాతం తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు సానుకూల ప్రయోజనాన్ని ఆర్బీఐ అందించింది. ► అయితే, రుతుపవన వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చన్న అంచనాలు.. ఆహార, తయారీ రంగ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ► ఇక స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే.. ఆల్గోరిథమ్ ట్రేడింగ్ శరవేగంగా పెరుగుతుండటం ఆందోళనకరం. దీనిపై చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ► వ్యవసాయ రంగంలో బీమా అవసరాలపై తక్షణం దృష్టిసారించాలి. ‘భవిష్యత్తులో అంతర్జాతీయంగా ఎలాంటి ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తలెత్తినా దీటుగా ఎదుర్కొనే సత్తా మనకుంది. గత రెండేళ్లుగా స్థూల ఆర్థిక మూలాలు కూడా బాగానే మెరుగుపడ్డాయి. అయితే, అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్యాకేజీల ఉపసంహరణ, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ రానున్న కాలంలో వడ్డీరేట్ల పెంపును మొదలెడితే గ్లోబల్ మార్కెట్లు కొంత కుదుపునకు గురికావచ్చు. దేశీయంగా విధానపరమైన చర్యల కారణంగా దీన్ని కూడా మనం సమర్థంగానే ఎదుర్కోగలం’. - ఎఫ్ఎస్ఆర్ ముందుమాటలో ఆర్బీఐ గవర్నర్ రాజన్ -
ధరల కట్టడితోనే వృద్ధి సాధ్యం: రాజన్
న్యూఢిల్లీ: నిలకడైన ఆర్థిక వృద్ధి సాధించాలంటే రిజర్వ్ బ్యాంక్.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాల్సి ఉం టుందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులన్నీ కూడా ద్రవ్యోల్బణంపై దృష్టి పెడతాయని, ఆర్బీఐ ఇందుకు మినహాయింపు కాదని బుధవారం ఒక చానల్‌కిచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. తక్కువ వర్షపాతం కారణంగా ఆహారోత్పత్తుల ధరలపై ప్రతికూల ప్రభావం పడగలదన్న ఆందోళనల నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాధారణ స్థాయి కన్నా వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న ఆందోళనలతో వృద్ధి రేటు అంచనాలను 7.8 శాతం నుంచి 7.6 శాతానికి ఆర్బీఐ తగ్గించిన సంగతి తెలిసిందే. ఇటు ద్రవ్యోల్బణం, అటు వృద్ధి మధ్య సమతౌల్యం ఉండేలా ఆర్బీఐ వ్యవహరించాల్సి ఉంటుందని రాజన్ చెప్పారు. ముందుగా సౌకర్యవంతమైన స్థాయికి ద్రవ్యోల్బణం దిగివచ్చేలా చూసిన తర్వాత వడ్డీ రేట్లు సాధ్యమైనంత మేర తగ్గించవచ్చన్నది ఆర్థిక శాస్త్ర సూత్రాల్లో ఒకటని ఆయన వివరించారు. ఒకవైపు ప్రపంచమంతటా ప్రతి ద్రవ్యోల్బణం ఉండగా.. మరోవైపు భారత్‌లో అందుకు భిన్నంగా అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయని రాజన్ చెప్పారు. ఫలితంగా సాధారణ వడ్డీ రేట్లను తగ్గించే పరిస్థితులు లేవన్నారు. పాలసీ రేట్ల తగ్గింపు విషయంలో ఆర్బీఐ వెనుకబడిపోయిందన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. కీలక పాలసీ రేట్లను తగ్గించేందుకు అసలు ఆస్కారమే లేకపోయినప్పటికీ.. ఆర్బీఐ వీలు కల్పించుకుని మరీ తగ్గిస్తోందని రాజన్ తెలిపారు. -
రఘురామ్ ‘వృద్ధి’ బాణం
రెపోరేటు పావుశాతం కోత ⇒ బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణ రేటు 7.25 శాతానికి డౌన్ ⇒ 0.15 శాతం బేస్‌రేటు తగ్గించిన ఎస్బీఐ ⇒ అదే బాటలో మరికొన్ని బ్యాంకులు... ⇒ గృహ, వాహన, రిటైల్ రుణాలు చౌకయ్యే అవకాశం ⇒ భవిష్యత్తుపై ‘బలహీన రుతుపవనాల’ ఎఫెక్ట్ ముంబై: ప్రభుత్వ, పారిశ్రామిక పెద్దల కోరికకు, అంచనాకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా కీలక రెపో రేటును పావు శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 7.25 శాతానికి చేరింది. దీనికి అనుగుణంగా రివర్స్ రెపో రేటు 6.25 శాతానికి చేరుతుంది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ను 4 శాతంగానే యథాతథంగా కొనసాగించింది. కీలక పాలసీ రేటు రెపోను ఆర్బీఐ తగ్గించడం ఈ ఏడాది ఇది మూడవసారి. కాగా భవిష్యత్తుకు సంబంధించి నిరాశాజనక అంచనాలను ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెలువరించారు. బలహీన రుతుపవన అంచనాలు, క్రూడ్ ధరల అనిశ్చితి పరిస్థితి వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని సూచిస్తూ... ఇది తదుపరి రుణ రేటు కోత అవకాశాన్ని అడ్డుకునే అంశమని అన్నారు. వడ్డీలు తగ్గేది ఎలా..? బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటే రెపో. తన వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై ఆర్బీఐ చెల్లించేది రివర్స్ రెపో. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సి ఉంటుంది. ఇదే సీఆర్ఆర్. ఆర్బీఐ రెపోరేటును తగ్గిస్తే- తద్వారా తమకు లభించే ‘రుణ రేటు తగ్గే’ ప్రయోజనాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు బదలాయించే అవకాశం ఉంటుంది. తద్వారా గృహ, వాహన, వాణిజ్య రుణాల విషయంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఏడాది రెండుసార్లు (జనవరి 15, మార్చి 4) పావు శాతం చొప్పున మొత్తం అరశాతం రెపో రేటును ఆర్బీఐ తగ్గించింది. ఆ ప్రయోజనాన్ని ‘రుణాలపై వడ్డీరేట్లు తగ్గించటం’ రూపంలో కస్టమర్లకు బదలాయించాలని బ్యాంకులకు సంకేతాలిచ్చింది. అయినా బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెన్స్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించారు కూడా. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు పావు శాతం మేర రుణ రేట్ల తగ్గింపు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి పావుశాతం రెపో రేటును తగ్గిస్తూ, ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం కట్టడి, పారిశ్రామిక మందగమనం నేపథ్యంలో ఆర్బీఐ ‘అందరి అంచనాలకు అనుగుణంగా’ తాజా నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లు తగ్గితే- వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితులు మెరుగుపడతాయి. తక్కువ రేటుకు రుణ లభ్యత వల్ల కంపెనీల వ్యయాలు పెరిగి, పారిశ్రామిక ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో ఉండడం... తక్కువ వడ్డీరేట్ల ప్రయోజనాలు... వెరసి తద్వారా పొదుపు చేసుకునే కొంత డబ్బును మధ్య తరగతి ప్రజలు వినియోగ వస్తువుల కొనుగోళ్లకు వెచ్చించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ మొత్తంగా ఆర్థికాభివృద్ధికి కొంతమేర దోహదపడుతుందన్నది ఆర్థిక సిద్ధాంతం. అయితే ద్రవ్యోల్బణం పెరిగితే... డిమాండ్ తగ్గించడం ద్వారా ధరల కట్టడికి ఆర్బీఐ ‘రెపో రేటు’ పెంపు అస్త్రాన్నే ప్రయోగిస్తుంది. రెపోరేటు తగ్గింపు డిపాజిట్ రేట్ల తగ్గింపునకు కూడా దారితీసే అంశం. వృద్ధి రేటు అంచనా కోత... ఆర్బీఐ రుణ రేటు పావుశాతం తగ్గించినప్పటికీ, ఆర్బీఐ రఘురామ్ రాజన్ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి సంబంధించి పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును ఏప్రిల్‌లో 7.8 శాతంగా ఆర్బీఐ అంచనావేసింది. అయితే ఈ అంచనాను ఇప్పుడు 7.6 శాతానికి తగ్గించింది. కొన్ని ముఖ్యాంశాలు.. ⇒ 2016 జనవరి నాటికి ద్రవ్యోల్బణం 6% పెరిగే అవకాశం. ⇒ ధరల అదుపునకు పటిష్ట ఆహార విధానం, నిర్వహణ అవసరం. ⇒ ఆర్బీఐ రెపో రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలి. ⇒ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనాన్ని కేంద్రం సమకూర్చుతోంది. అయితే ఇందుకు సంబంధించి రుణ ప్రయోజనాలు ఉత్పాదక రంగాలకు బ్యాంకింగ్ అందించాలి. ⇒ 21.5 శాతంగానే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 1.5 శాతంగా అంచనా. బంగారం దిగుమతులు తగ్గినా... చమురు ధరలు దిగువస్థాయిలో ఉండడం కారణం. ⇒ ఆగస్టు 4న మూడవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష. ప్చ్.. ఇది సరిపోదు పరిశ్రమ వర్గాల అభిప్రాయం న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్ల తగ్గింపును పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. అయితే డిమాండ్ పెరగడానికి, పారిశ్రామిక వృద్ధి మరింత మెరుగుపడటానికి ఇది సరిపోదని వ్యాఖ్యానించాయి. పెట్టుబడుల ప్రక్రియ మళ్లీ మొదలవ్వాలంటే రెపో రేటును మరింత తగ్గించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాయి. కనీసం అరశాతమైనా తగ్గించాల్సిందని ఫిక్కీ ప్రెసిడెంట్ జ్యోత్స్న సూరి పేర్కొన్నారు. సీఆర్ఆర్ కూడా తగ్గించి ఉంటే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయాలు తగ్గేవని, ఆ ప్రయోజనాలను అవి కస్టమర్లకు బదలాయించగలిగి ఉండేవని అసోచాం ప్రెసిడెంట్ రాణా కపూర్ తెలిపారు. రియల్టీకి ఇది సానుకూల పరిణామమే అయినా.. బ్యాం కులు వడ్డీ రేట్లు తగ్గించినప్పుడే అసలు ప్రయోజనాలు కనిపించగలవని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ దక్షిణాసియా విభాగం ఎగ్జిక్యూటివ్ ఎండీ సంజయ్ దత్ చెప్పారు. వాహన కంపెనీలు హ్యాపీ న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించడాన్ని ఆటోమొబైల్ కంపెనీలు స్వాగతించాయి. ఇది కొనుగోలుదారుల సెంటిమెంటు మెరుగుపడటానికి ఉపయోగపడగలదని మారుతీ సుజుకీ ఈడీ ఆర్ఎస్ కల్సి తెలిపారు. అయితే, రేట్ల కోత ప్రయోజనాలను బ్యాంకులు.. కొనుగోలుదారులకు బదలాయించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే దిశగా ఆర్బీఐ స్వాగతించతగ్గ నిర్ణయం తీసుకుందని, అమ్మకాలు మెరుగయ్యేందుకు దోహదం చేస్తుందని హ్యుందాయ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ చెప్పారు. ఎస్బీఐ సహా 4 బ్యాంకుల రేట్ల ‘కోత’ తాజా ఆర్బీఐ నిర్ణయం ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించే దిశలో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తక్షణం నిర్ణయం తీసుకుంది. కనీస రుణ రేటును 0.15 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.7 శాతానికి తగ్గింది. జూన్ 8 నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఆర్బీఐ మూడు విడతలుగా 0.75 శాతం రుణ రేటు తగ్గిస్తే- ఇందులో ఎస్బీఐ 0.30 శాతాన్ని కస్టమర్లకు బదలాయించింది. 8వ తేదీ నుంచీ వర్తించే విధంగా అలహాబాద్ బ్యాంక్ కూడా 0.30 శాతం కనీస రేటును తగ్గించింది. దీనితో ఈ రేటు 9.95 శాతానికి తగ్గింది. ఇక పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కూడా 0.25% తన బేస్ రేటును తగ్గించింది. దేనా బ్యాంక్ కూడా పావుశాతం కనీస రేటును తగ్గించింది. దీనితో దేనా బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌ల కనీస రేటు 10 శాతానికి తగ్గింది. పోటీ పూర్వక మార్కెట్ నేపథ్యంలో ఇదే దారిలో పలు ఇతర బ్యాంకులూ పయనించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఐడీబీఐ బ్యాంక్ బల్క్ డిపాజిట్ రేటును తగ్గించింది. ఇది భవిష్యత్ రుణ రేటు కోతకు సంకేతం. ఆర్థిక వ్యవస్థకు దన్ను... ఆర్థిక వ్యవస్థ ధోరణికి అనుగుణంగా సానుకూల రీతిలో ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది హర్షణీయ పరిణామం. రికవరీ అవుతున్న ఆర్థిక వ్యవస్థకు రేట్ల కోత తక్షణ అవసరం. ద్రవ్యోల్బణం కట్టడికి తగిన చర్యలు ఉంటాయి. - అరవింద్ సుబ్రమణ్యన్, ప్రధాన ఆర్థిక సలహాదారు సకాల నిర్ణయం సకాలంలో తీసుకున్న నిర్ణయం. హర్షణీయం. ఈ ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయిస్తాయని భావిస్తున్నా. మౌలిక రంగంలో ప్రభుత్వం మరిన్ని పెట్టుబడుల ద్వారా సమీప భవిష్యత్తులో వృద్ధి మరింత మెరుగుపడుతుంది. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ అప్రమత్తతను సూచించింది.. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నెలకొన్న అనిశ్చితులను పాలసీ ప్రకటన వివ రించింది. ఆయా అంశాల పట్ల పాటించాల్సిన అప్రమత్తతను సూచించింది. ప్రత్యేకించి వర్షాభావ పరిస్థితులు, ద్రవ్యోల్బణం అంచనాలు ప్రస్తావనాంశం. - చందా కొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ -
ఆర్బీఐ ‘ఛీర్‌లీడర్’ కాదు..
క్షేత్రస్థాయిలో వృద్ధి కనబడటంలేదు... ⇒ వినియోగ డిమాండ్ పుంజుకుంటున్న దాఖలాల్లేవు... ⇒ పాలసీ రేటు తగ్గింపు కొంత పొరపాటేనేమో...! ⇒ సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు ముంబై: ‘మార్కెట్లను ఉత్సాహపరచడానికి ఆర్బీఐ ఛీర్‌లీడర్ కాదు.. పెట్టుబడులకు ఊతమిచ్చేందుకే పాలసీ రేటు(రెపో)ను తగ్గించాం. అయితే, క్షేత్రస్థాయిలో వృద్ధి ఫలాలు కనబడటంలేదు. అసలు రేట్ల తగ్గింపు విషయంలో మేం కొంత పొరపాటు చేశామనిపిస్తోంది’ అని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజన్ స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించారు. అంతేకాదు వృద్ధి రేటు 7.5 శాతం స్థాయిలో నమోదవుతున్నప్పుడు అసలు రేట్ల తగ్గింపు కోసం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదంటూ గణాంకాల్లోని వాస్తవికతపై వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. ‘తాజా జీడీపీ వృద్ధి గణాంకాల్లో చాలా వైరుధ్యాలు కనబడుతున్నాయి. ఒకపక్క, వినియోగ డిమాండ్ పుంజుకుంటున్న దాఖలాలేవీ లేవు. కార్పొరేట్ల లాభాలు కూడా దిగజారుతున్నాయి. ఇలాంటి తరుణంలో అధిక వృద్ధి రేటు గణాంకాలు ఎలా సాధ్యమయ్యాయన్న ప్రశ్న తలెత్తుతోంది’ అని రాజన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రేట్ల కోత నిర్ణయం అనేది ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, రుతుపవనాల గమనంపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజల్లో విశ్వాసం నింపడమే మా పని... రూపాయి విలువను స్థిరంగా ఉంచడం, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని నింపడమే తమ ప్రధాన బాధ్యతని రాజన్ స్పష్టం చేశారు. అంతేకానీ, ఎవరినో మెప్పించడం కోసం ఛీర్‌లీడర్‌గా వ్యవహరించాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. అరశాతం కాకుండా కేవలం పావు శాతం రెపో కోతకే ఎందుకు పరిమితమయ్యారన్న విలేకరుల ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ‘తాజా పాలసీ నిర్ణయం పూర్తిగా స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే తీసుకున్నాం. భవిష్యత్తులోనూ మా పాలసీ చర్యలన్నీ గణంకాల ఆధారంగానే ఉంటాయి’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఒత్తిడితోనే రేట్లను తగ్గించారన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. ‘రేట్లను తగ్గిస్తేనేమో ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవానికేనని అంటారు. తగ్గించకపోతే సర్కారుతో కొట్లాడుతున్నానని చెబుతారు’ అంటూ రాజన్ కాస్త సరదా వ్యాఖ్యలు చేశారు. వడ్డీరేట్లను తగ్గించకుండా కఠినంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలను కూడా ఆయన తోసిపుచ్చారు. ‘ఆర్థిక వ్యవస్థ అవసరాలు, పరిస్థితులను బట్టే మేం స్పందిస్తాం.. అంతేకానీ, దానికి సమాధి కట్టడానికి కాదు. అనాలోచిత నిర్ణయాలను ఆర్బీఐ తీసుకోదు’ అని స్పష్టం చేశారు. బ్యాంకులపైనా విసుర్లు... తమ పాలసీ నిర్ణయాలకు అణుగుణంగా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లను మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని రాజన్ మరోసారి హెచ్చరికలు పంపారు. ‘ఇటీవలి కాలంలో డిపాజిట్ రేటును ఒక శాతం మేర తగ్గించిన బ్యాంకులు రుణాలపై మాత్రం ఆ స్థాయిలో వడ్డీని తగ్గించలేదు. స్వల్పకాలిక మార్జిన్ల కోసం వెంపర్లాడడం వల్ల బ్యాంకులు మార్కెట్ వాటాను కోల్పోవాల్సి వస్తోంది. రుణ రేట్లు మార్కెట్‌కు అనుగుణంగా ఉండాలని ఆర్బీఐ ఆశిస్తోంది. బ్యాంకులు మాత్రం సగటు డిపాజిట్ వ్యయం ఆధారంగా రుణ రేట్లను నిర్ణయిస్తున్నాయి’ అని రాజన్ పేర్కొన్నారు. రెపో రేటు కంటే సీఆర్ఆర్ తగ్గింపు ద్వారానే రుణ రేట్లు దిగొచ్చేందుకు వీలవుతుందన్న బ్యాంకుల డిమాండ్‌ను కూడా ఆయన కొట్టిపారేశారు. -
రేటు తగ్గినా.. వరుణుడి కరుణ లేదని...
* సెన్సెక్స్ 661 పాయింట్లు నష్టంతో 27,188 పాయింట్లకు డౌన్ * 197 పాయింట్ల నష్టంతో 8,236కు నిఫ్టీ ఈ ఏడాది మరోసారి రేట్ల కోత ఉండబోదని ఆర్బీఐ సూచనప్రాయంగా వెల్లడించడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ, ఈ ఏడాది రేట్ల కోత బహుశా ఇదే చివరిసారని, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయని ఆర్బీఐ గవర్నరు రఘురామ్ రాజన్ పేర్కొనడం మార్కెట్లకు రుచించలేదు. దీనికి తోడు వర్షాలు ఆలస్యమవడమే కాకుండా, తగినంతగా కురవవనే అంచనాలు, రూపాయి 26 పైసలు క్షీణించడం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీశాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 661 పాయింట్లు క్షీణించి 27,188కు, నిఫ్టీ 197 పాయింట్లు(2.3 శాతం) నష్టంతో 8,236 వద్ద ముగిశాయి. సాధారణంగా రేట్ల కోత కారణంగా స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసేది. కానీ రేట్ల కోత కారణంగా స్టాక్ మార్కెట్ పతనమవడం ఇది వరుసగా రెండోసారి. ‘వడ్డీరేట్ల’ షేర్లు కుదేలు... వర్షాలు సాధారణం కంటే తక్కువగానే పడతాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు కరువు పరిస్థితులేర్పడుతాయోమోననే ఆందోళనను రేకెత్తించాయి. ముడి చమురు ధరలు పెరుగుతుండడం, పంట దిగుబడులు తగ్గే అవకాశాలు, తదితర కారణాలతో ద్రవ్యోల్బణం ఇక నుంచి పెరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత-రియల్టీ, బ్యాంక్, వాహన షేర్లు కుదేలయ్యాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలోనూ అమ్మకాలు జరిగాయి. కరువు మబ్బులు... ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండడం ఇప్పటికే కష్టాల్లో ఉన్న భారత కంపెనీల లాభదాయకతపై మరింతగా ప్రభావం చూపుతుందని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ధకన్ చెప్పారు. కరువు ఆందోళనలను రేకెత్తించేలా ఉన్న వాతావరణ శాఖ అంచనాలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయని, 50 బేసిస్ పాయింట్ల కంటే తక్కువ కోతను మార్కెట్లు అంగీకరించవనే అంచనాలు నిజమయ్యాయని జియోజిత్ బీఎన్పీ పారిబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. 756 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత 27,903 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించగానే నష్టాల్లోకి జారిపోయింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో 27,147 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 661 పాయింట్ల (2.37 శాతం) నష్టంతో 27,188 వద్ద ముగిసింది. మే 6 తర్వాత ఒక్క రోజులో సెన్సెక్స్ ఇంతలా క్షీణించడం ఇదే తొలిసారి. 8,445-8,226 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 197 పాయింట్లు(2.3 శాతం) నష్టంతో 8,236 వద్ద ముగిసింది. ఎదురీదిన ఎయిర్టెల్ 30 సెన్సెక్స్ షేర్లలో ఒక్క ఎయిర్టెల్ తప్ప అన్ని షేర్లూ కుదేలయ్యాయి. అన్నింటికంటే అధికంగా ఎస్బీఐ నష్టపోయింది. ఈ షేర్ 4.28% క్షీణించి రూ.266 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ 4.2%, ఐసీఐసీఐ బ్యాంక్ 3.7%, హెచ్డీఎఫ్సీ 3.55%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.6% చొప్పున క్షీణించాయి. బ్యాంక్ షేర్లు బేర్మన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 3.4 % క్షీణించింది. 1,875 షేర్లు నష్టపోగా, 804 షేర్లు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,087 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.16,983 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,93,660 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.594 కోట్ల నిర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.272 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. రూ.2.26 లక్షల కోట్లు ఆవిరి... ఇన్వెస్టర్ల సంపద మంగళవారం రోజే రూ.2.26 లక్షల కోట్లు ఆవిరైంది. మొత్తం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.101.05 లక్షల కోట్లకు తగ్గింది. ఎందుకీ పతనం..? ⇒ వర్షాలు సాధారణం కంటే తక్కువేనన్న ⇒ వాతావరణ శాఖ ⇒ ఇప్పట్లో రేట్ల కోత ఉండకపోవచ్చన్న ఆర్బీఐ ⇒ రూపాయి 26 పైసలు క్షీణించడం... -
ఆర్బీఐలో ఐటీ అనుబంధ సంస్థ!
బెనాలిమ్(గోవా): సైబర్ నేరాలు అంతకంతకూ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో ఈ సవాళ్లను ఎదుర్కోవడంపై రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) దృష్టిసారించింది. ఈ చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా ఐటీ అనుబంధ సంస్థ(సబ్సిడరీ)ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. గురువారమిక్కడ జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సైబర్ సెక్యూరిటీ విషయంలో అనేక సవాళ్లు పొంచిఉన్నాయి. బ్యాకింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పర్యవేక్షణ కోసం ఒక ఐటీ సబ్సిడరీపై దృష్టిపెట్టాలని బోర్డు సిఫార్సు చేసింది. బ్యాంకింగ్‌కు సంబంధించి ఐటీ విధానాలు, సామర్థ్యాల పెంపునకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది’ అని రాజన్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ సేవల రంగంలో ఆన్లైన్ మోసాలు తీవ్రమవుతున్నాయని.. చివరికి ఆర్బీఐ లోగోలతో ఈ-మెయిల్స్ పంపి ప్రజలను మోసగిస్తున్న సైబర్ నేరగాళ్లు కూడా ఉన్నారంటూ గవర్నర్ తాజా ఉదంతాలను ప్రస్తావించారు. -
సమస్యాత్మక బ్యాంకులకూ కేంద్రం మూలధనం: రాజన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని సమస్యాత్మక బ్యాంకులకూ అవసరమైతే కేంద్రం నుంచి తగిన మూలధనం అందుతుందని గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. పనితీరు ఆధారంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం అందజేయడం జరుగుతుందన్న విధానం నేపథ్యంలో గవర్నర్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘సమస్యాత్మకంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు అసలు కేంద్రం నుంచి మూలధనమే అందదని భావించడం తగదు. సంబంధిత నిధులను ఎందుకు వినియోగిస్తున్నారన్న విషయాన్ని సంతృప్తికరమైన రీతిలో తెలియజేస్తే, ఆ బ్యాంకులకూ (సమస్యాత్మక) ప్రభుత్వం మూలధనాన్ని అందిస్తుంది’ అని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ అన్నారు. బలహీన బ్యాంకులు మార్కెట్ నుంచి నిధులను సమీకరించుకోవడం కష్టం కనుక, తగిన ప్రణాళికను వివరిస్తే, కేంద్రం నుంచి అవసరమైన మూలధనం అందుతుందని తెలిపారు. కాగా ‘భారత్ క్రెడిట్ రేటింగ్’ అవుట్‌లుక్‌ను స్టేబుల్ నుంచి పాజిటివ్‌కు పెంచుతూ... మూడీస్ తీసుకున్న నిర్ణయాన్ని ఒక ‘సానుకూల దృక్పథం’గా రాజన్ అభివర్ణించారు. అయితే ప్రభుత్వం, నియంత్రణా సంస్థలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఈ విషయంపై దృష్టి పెట్టడం మరచిపోకూడదని అన్నారు. -
జైట్లీతో రాజన్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం సమావేశమయ్యారు. దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై ఈ సందర్భంగా ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జైట్లీతో పాటు ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, ఇతర సీనియర్ అధికారులతో రాజన్ సమావేశమయ్యారు.రైతులకు రుణ పునర్వ్యవస్థీకరణ: అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల రుణ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు తాను సూచించినట్లు రాజన్ చెప్పారు. అంతక్రితం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని (రుణ పునర్వ్యవస్థీకరణకు బ్యాంకులకు సూచన) వెల్లడించారు. అకాల వర్షాల వల్ల రబీ సాగు పరిధిలో 17% పంట నష్టం జరిగినట్లు మంగళవారంనాటి ఆర్బీఐ విధాన ప్రకటన పేర్కొంది. మరోవంక బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ బుధవారం నోటిఫై చేసింది. -
ఫెడ్ చర్యను దీటుగా ఎదుర్కొంటాం..
అమెరికాలో రేట్ల పెంపు అంచనాలపై ఆర్బీఐ గవర్నర్ రాజన్ వ్యాఖ్య - మార్కెట్లలో ఒడిదుడుకులు తట్టుకునేందుకు సిద్ధమని సంకేతం - ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేటు పెంపు సంకేతాలు ఇస్తే... తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పూర్తిగా సన్నద్ధమయినట్లు గవర్నర్ రఘురామ్ జీ రాజన్ బుధవారం తెలిపారు. మార్కెట్లలో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటామని కూడా అన్నారు. ఆయన ఇక్కడ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతికూల వాతావరణంలోనూ సాధారణ పరిస్థితులను కొనసాగించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని అన్నారు. ఫెడరల్ వడ్డీరేట్లు పెంచితే దీనిని ఎదుర్కొనేందుకు తగిన సామర్థ్యం దేశానికి ఉందని కూడా ఆయన అన్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచినట్లయితే, భారత్ వంటి వర్ధ మాన మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కు మళ్లవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న విశ్లేషణలూ ఉన్నాయి. బలాలివి... అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనడానికి భారత్ ప్రస్తుత శక్తిసామర్థ్యాలనూ ఆయన ప్రస్తావించారు. భారత్ వద్ద ప్రస్తుతం భారీగా విదేశీ మారకపు నిల్వలు ఉన్న విషయాన్నీ (338 బిలియన్ డాలర్లు) రాజన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్-క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి నిర్దిష్ట ఏడాదిలో వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) పూర్తి నియంత్రణలో (జీడీపీలో 2 శాతం దిగువన) ఉన్న విషయాన్నీ పేర్కొన్నారు. నేపథ్యం ఇదీ... ‘అమెరికా ఫెడ్ నిర్ణయ’ పరిస్థితులను ఎదుర్కొనడానికి భారత్ వంటి వర్ధమాన దేశాలు సిద్ధంగా ఉండాలని మంగళవారం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ లాగార్డ్ సైతం సూచించారు. మార్చి 22న 2015-16 బడ్జెట్‌పై ఆర్బీఐ బోర్డ్‌ను ఉద్దేశించి ఆర్థికమంత్రి ప్రసంగించాల్సి ఉంది. ఏప్రిల్ 7న 2015-16 మొదటి ద్వైమాసిక పరపతి విధాన ప్రకటన వెలువడనుంది. వీటన్నింటికీ మించి భారత్ కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రక టన వెలువడనుంది. ఆయా అంశాల నేపథ్యంలో రాజన్ ఆర్థికమంత్రితో సమావేశమయ్యారు. -
ఆర్బీఐ రేట్లు ఇంతకంటే తగ్గవు..!
- వచ్చే మూడేళ్లలో సగటు రెపో రేటు 7.4% - వృద్ధి-ద్రవ్యోల్బణం అంచనాల ప్రాతిపదికన నోమురా విశ్లేషణ ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రేటు- రెపో (బ్యాంకులకు స్వల్పకాలికంగా తాను అందించే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5 శాతం) ప్రస్తుతం తగిన స్థాయిలో ఉందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా ఒక డాక్యుమెంట్లో పేర్కొంది. వృద్ధి-ద్రవ్యోల్బణం అంచనాలను అన్నింటినీ ప్రాతిపదికగా తీసుకుని ఈ విశ్లేషణకు వచ్చినట్లు తెలిపింది. వచ్చే మూడేళ్లలో సగటున 7.4% కన్నా తక్కువకు పాలసీ రేటు ఉండే పరిస్థితి లేదని సైతం స్పష్టం చేసింది. ఏ సందర్భంలోనైనా ఒకవేళ పాలసీ రేటును తగ్గించినప్పటికీ, మళ్లీ 7.4%, ఆపైకి పెంచడానికే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషించింది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2017 దాకా ఇక ఆర్బీఐ రేట్ల కోత ఉండకపోవచ్చని సైతం అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల అప్‌ట్రెండ్ మళ్లీ నెలకొంటే... పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుందని, ద్రవ్యోల్బణం కట్టడీ కష్టమవుతుందని విశ్లేషించింది. ఆర్బీఐ గడచిన నెల రోజుల్లో రెండు దఫాలుగా రెపో రేటును పావు శాతం చొప్పున తగ్గించిన నేపథ్యంలో నోమురా ఈ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం, విశ్వసనీయ, అత్యంత నాణ్యతాపూర్వక ద్రవ్య స్థిరత్వ పరిస్థితులు, తగిన స్థాయిలో రూపాయి విలువ వంటి అంశాలు పాలసీ రేటు తగ్గింపునకు కారణమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. బలహీన వృద్ధి రేటు, అంతర్జాతీయంగా వడ్డీరేట్ల తగ్గింపు ధోరణి వంటివి సైతం వడ్డీ రేటు తగ్గింపునకు దారితీసిన అంశాలుగా రాజన్ తెలిపారు. ఆర్థికవేత్తల అంచనా...: ఇక వడ్డీరేట్లు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించినా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుత స్థాయి ‘బేస్ లైన్’ అని వారు అభిప్రాయపడుతున్నారు. మరి కొంత పాలసీ రేటు కోత ఇకపై ఉండకపోవచ్చనీ అభిప్రాయపడుతున్నారు. ‘అధిక వృద్ధి బాట దిశగా దేశం అడుగులు పడుతున్నాయి. మౌలిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచడం ద్వారా వృద్ధి వేగంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 5-5.5 శాతం మధ్య స్థిరపడవచ్చు. ఇంకా చెప్పాలంటే ద్రవ్యోల్బణం పెరిగేందుకే అవకాశాలే ఉన్నాయి. ఒకవేళ 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ కట్టడి చేసే పరిస్థితి లేకపోతే... పాలసీ రేటు తగ్గించినా అది దీర్ఘకాలం పాటు కొనసాగే పరిస్థితి ఉండబోదు’ అని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే- ప్రస్తుత స్థాయి కన్నా తక్కువకు వడ్డీరేట్లను తగ్గించే పరిస్థితి ఎంతమాత్రం ఉండదన్నది ఆర్థికవేత్తల విశ్లేషణ. రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మరింత కుదిస్తాం: రాజన్ ముంబై: భవిష్యత్తులో రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మరింత కుదించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఇక పరపతి విధాన రూపకల్పనలో ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఒక ఒప్పందాన్ని(ఫ్రేమ్‌వర్క్) కుదుర్చుకున్న విషయం విదితమే. దీని ప్రకారం 2016-17 నాటికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4%కి(2% అటూఇటుగా) పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రస్తుతానికి ఈ లక్ష్యం సరైనదేనని.. అయితే, వచ్చే 5-10 ఏళ్లలో దీనిలో సగానికి రిటైల్ ద్రవ్యోల్బణం దిగొచ్చేలా చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. తాజా రేట్ల కోత అనంతరం విశ్లేషకులు అడిగిన ప్రశ్నకు రాజన్ ఈ విధంగా సమాధానమిచ్చారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, బడ్జెట్లో ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉంటామన్న హామీల నేపథ్యంలో పాలసీ వడ్డీరేటు(రెపో)ను రాజన్ అకస్మాత్తుగా మరో పావు శాతం తగ్గించడం తెలిసిందే. రెండు నెలల వ్యవధిలోపే ఇది రెండో తగ్గింపు(మొత్తం అర శాతం). దీంతో రెపో రేటు 7.5%కి తగ్గింది. దీంతో బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లు తగ్గించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. -
రుణాలు.. ఇక చౌక
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తన రూటే సెప‘రేటు’ అని మరోసారి నిరూపించారు. అకస్మాత్తుగా రెండోసారి పాలసీ వడ్డీరేట్లను తగ్గించి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో గృహ, వాహన, రిటైల్ రుణాలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం దిగిరానుంది. పారిశ్రామిక వర్గాల్లోనూ ఈ అనూహ్య నిర్ణయం ఆనందం నింపింది. అయితే, బ్యాంకర్లు తక్షణం రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించనప్పటికీ.. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని సానుకూల సంకేతాలిచ్చారు. మొత్తంమీద తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కార్పొరేట్లకు కాస్త సానుకూలంగా వ్యవహరించగా... ఇప్పుడు రాజన్ కూడా రేట్ల కోతతో తనవంతు చేయూతనివ్వడం విశేషం. ⇒ రేట్ల కోతతో ఆశ్చర్యపరిచిన ఆర్బీఐ గవర్నర్ రాజన్ ⇒ పావు శాతం తగ్గింపుతో 7.5 శాతానికి రెపో రేటు ⇒ రెండు నెలల్లో రెండోసారి కట్.. ⇒ రివర్స్ రెపో 6.5 శాతానికి తగ్గుదల.. ⇒ సీఆర్ఆర్ యథాతథంగా 4 శాతం ⇒ గృహ, వాహన, రిటైల్ రుణాలపై దిగిరానున్న ఈఎంఐలు ⇒ వడ్డీరేట్లపై బ్యాంకర్ల సానుకూల సంకేతాలు... ⇒ పారిశ్రామిక రంగానికి బూస్ట్... ముంబై: పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా ఆర్బీఐ మళ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో ఈ రేటు 7.5 శాతానికి దిగొచ్చింది. రెపోతో ముడిపడి ఉన్న రివర్స్ రెపో రేటు కూడా పావు శాతం తగ్గి.. 6.5 శాతానికి చేరింది. అయితే, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ను మాత్రం యథాతథంగా 4 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. జనవరి 15న ఆర్బీఐ అనూహ్యంగా పావు శాతం రెపో రేటును తగ్గించడం తెలిసిందే. తాజా కోతతో రెండు నెలల వ్యవధిలో రెండోసారి తగ్గించినట్లయింది. ద్రవ్యోల్బణం దిగిరావడంతోపాటు కనిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ(ద్రవ్యలోటు కట్టడి)కు కట్టుబడి ఉంటామని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన కొద్ది రోజులకే ఆర్బీఐ రేట్ల కోత నిర్ణయం వెలువడింది. గత నెలలో(ఫిబ్రవరి 3న) జరిగిన ద్వైమాసిక పాలసీ సమీక్షలో పాలసీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించడం.. కేవలం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)ని మాత్రం అర శాతం తగ్గించడం విదితమే. దీనిద్వారా వ్యవస్థలోకి రూ.42,000 కోట్ల మేర నగదు లభ్యతను పెంచింది. కాగా, గతసారి పాలసీ రేట్ల తగ్గింపు సందర్భంగా ఆ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు అందించేందుకు వెనుకంజవేసిన బ్యాంకులు.. ఈసారి మాత్రం రుణాలపై వడ్డీరేట్లను తగ్గించే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సానుకూల సంకేతాలిస్తున్నాయి. రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక ప్రకటించిన రెండు రేట్ల తగ్గింపు నిర్ణయాలూ పాలసీ సమీక్షకు వెలుపలే తీసుకోవడం గమనార్హం. అలాగే ఈ రెండు దఫాలు తెల్లవారగానే రాజన్ రేటు తగ్గింపును ప్రకటించడం విశేషం. కాగా, వచ్చే నెలలో(ఏప్రిల్ 7న) ఆర్బీఐ తదుపరి పరపతి విధాన సమీక్షను నిర్వహించనుంది. బ్యాంకులు కూడా అనుసరించాలి...: కార్పొరేట్లు ‘వృద్ధిని ప్రోత్సహించే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొద్దిరోజుల్లోనే ఆర్బీఐ అకస్మాత్తుగా పాలసీ రేట్లను తగ్గించడం చూస్తే.. ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు ఇరు పక్షాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది’ అని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆర్బీఐ చర్యల నేపథ్యంలో వినియోగ, కార్పొరేట్ రుణాలపై ఇక బ్యాం కులు కూడా వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటిస్తాయన్న విశ్వాసం ఉం దని ఫిక్కీ ప్రెసిడెంట్ జ్యోత్స్న సూరి పేర్కొన్నారు. నిధుల లభ్య తలో సమస్యలు ఎదుర్కొంటున్న రియల్టీ రంగానికి ఆర్బీఐ రేట్ల కోత చేదోడుగా నిలుస్తుందని రియల్ ఎస్టేట్ డెవలపర్ల సం ఘం(క్రెడాయ్) చైర్మన్ లలిత్ కుమార్ జైన్ వ్యాఖ్యానించారు. బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గుతాయ్ తక్కువ రుణ రేటు వ్యవస్థ ప్రయోజనాన్ని త్వరలో బ్యాంకులు కస్టమర్లకు బదలాయిస్తాయని విశ్వసిస్తున్నా. బహుశా ఏప్రిల్ నుంచీ బ్యాంకింగ్ రుణ రేట్ల తగ్గింపు ఉంటుందని భావిస్తున్నా. మనం కొద్ది వారాల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. తక్కువ వడ్డీరేటు బదలాయింపును మనం చూడబోతున్నాం. రెండు దఫాలుగా రేట్ల కోత నిర్ణయం వినియోగదారులకు మళ్లించాల్సిన ఒత్తిడి బ్యాంకింగ్ వ్యవస్థలో తప్పనిసరిగా ఉంటుందని నేను అంచనావేస్తున్నా. ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడంలో వ్యవస్థాగత ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆయా అంశాలను సెంట్రల్ బ్యాంక్ పరిశీలిస్తుంది. - రఘురామ్ రాజన్, ఆర్బీఐ గవర్నర్ నా మాటల అర్థం అది కాదు.. వడ్డీరేట్ల విషయంలో తన తాజా వ్యాఖ్యలపై రాజన్ వివరణ ఇచ్చారు. ‘దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో వడ్డీరేట్ల కోత సాధ్యం కాదు’ అని రాజన్ ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హఠాత్తుగా మీ వైఖరి మారిపోడానికి కారణమేమిటి? అని విశ్లేషకులు మంగళవారం ప్రశ్నించారు. దీనికి రాజన్ సమాధానం ఇస్తూ... తాను చేసిన వ్యాఖ్యల అర్థం తప్పుగా మీడియాలో వచ్చిందన్నారు. పలు దేశాలు ‘జీరో’ స్థాయికి వడ్డీరేట్లు తగ్గించినా, మనం ఆ స్థాయికి తగ్గించలేమని మాత్రమే తాను పేర్కొన్నానన్నారు. దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం, డిమాండ్ పరిస్థితులే దీనికి కారణమని సైతం వివరించానని తెలిపారు. మార్కెట్‌ను ఈ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించాయన్న విమర్శలకు ఆయన స్పందిస్తూ, ‘ఇలా జరగదు. జరిగితే ఇందుకు క్షమాపణలు’ అన్నారు. వడ్డీరేట్లు దిగొచ్చే సంకేతం ఆర్బీఐ రేట్ల కోత తక్కువ రుణ రేటు వ్యవస్థకు సంకేతమేనని బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. అయితే అమలుకు కొంత సమయం పడుతుందని వారు సూచించారు. నెల రోజుల్లో ఆర్బీఐ రుణ రేటు అరశాతం తగ్గింది. అయితే డిపాజిట్ రేటు- రుణ రేటు ఆయా అంశాలను పరిగణను లోకి తీసుకోవడం, బేస్ రేట్ సమీక్ష వంటి అంశాలపై బ్యాంకింగ్‌కు కొంత సమయం పడుతుంది. వెరసి ఖాతాదారులు రుణ రేటు తగ్గింపునకు కొంత కాలం వేచిచూడాలి. - టీఎం భాసిన్, ఐబీఏ చైర్మన్, ఇండియన్ బ్యాంక్ చీఫ్ అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని బేస్ రేటు కోతపై మా బ్యాంక్ తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఆయా అంశాలు బ్యాంకింగ్ నిర్ణయ రూపకల్పనకు దోహదం చేస్తాయి. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ ఇది హర్షణీయం. వృద్ధి ఊతం లక్ష్యంగా బడ్జెట్లో పేర్కొన్న సంస్కరణలు, పాలసీ చర్యల సానుకూలతలను ఆర్బీఐ నిర్ణయం ప్రతిబింబిస్తోంది. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.5% రేట్ల కోతను నేను అంచనావేస్తున్నా. అదే జరిగితే వ్యాపారాభివృద్ధికి, పెట్టుబడులకు పునరుత్తేజం లభిస్తుంది. - రాణా కపూర్, యస్ బ్యాంక్ సీఈఓ స్వాగతిస్తున్నాం... ఆర్బీఐ పాలసీ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దీనివల్ల రుణ ఈఎంఐలు గణనీయంగా తగ్గేందుకు దోహదం చేస్తుంది. రానున్నకాలంలో వడ్డీరేట్లు మరింత తగ్గేందుకు ఆస్కారం ఉంది. దేశీయంగా ద్రవ్యోల్బణం అంచనాలు భారీగా దిగొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ద్రవ్యోల్బణం(డిఫ్లేషన్) ధోరణులు కనబడుతున్నాయి. - జయంత్ సిన్హా,ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఈ ఏడాది మరో 1% వరకూ తగ్గే చాన్స్: నిపుణులు ఈ ఏడాది మరో అర శాతం నుంచి ఒక శాతం వరకూ ఆర్బీఐ పాలసీ రేట్లను తగ్గించే ఆస్కారం ఉందని మెజారిటీ బ్యాంకర్లు, ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కొందరు బ్యాంకర్లయితే రానున్న పాలసీ సమీక్ష(ఏప్రిల్ 7న) మరోసారి రేట్ల తగ్గింపు ఉండొచ్చని కూడా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లో కొనసాగుతుండటమే దీనికి కారణమనేది వారి అభిప్రాయం. కాగా, ఆర్బీఐ తాజా రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు తమ బేస్ రేటు(రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీరేటు)ను కచ్చితంగా సమీక్షించాల్సిన పరిస్థితి నెల కొందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చైర్మన్ టీఎం భాసిన్ వ్యాఖ్యానించారు. ఏవరేమన్నారంటే... ‘ఈ ఏడాది(2015)లో మరో ఒక శాతం రెపో రేటు కోత ఉండొచ్చు. వచ్చే నెల 7న తదుపరి కోతకు అవకాశం ఉంది’. - మోర్గాన్ స్టాన్లీ ‘ఆర్బీఐ నేడు తీసుకున్న రేట్ల కోత నిర్ణయం ఊహించిందే. ఈ ఏడాది మొత్తంమీద ఒక శాతం వరకూ పాలసీ రేట్ల తగ్గింపు ఉంటుందనేది మా అంచనా. దీనిలో అర శాతం ఇప్పటికే పూర్తయింది. అయితే, మిగతా అర శాతం ఎప్పుడుంటుందనే నిర్ధిష్టంగా చెప్పలేం’. - కేకీ మిస్త్రీ, హెచ్డీఎఫ్సీ వైస్‌చైర్మన్, సీఈఓ ‘రేట్ల కోతకు ఆర్బీఐ ఎంచుకున్న సమయం ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్, జూలై మధ్య మరో అర శాతం తగ్గింపు ఉండొచ్చని భావిస్తున్నా’. - ఏఎం నాయక్, ఎల్అండ్టీ చీఫ్ -
‘నల్ల’ కుబేరులను శిక్షించాలి
-
‘నల్ల’ కుబేరులను శిక్షించాలి
⇒ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి ⇒ వారసుల ఆస్తులపై పన్నులు వేయటం సరికాదు ⇒ సర్కారు బలంగా ఉన్నంత మాత్రాన మేలు జరగదు ⇒ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు పనాజీ: చట్టాలను క్రమబద్ధీకరించడం, పటిష్టంగా అమలు చేయడం ద్వారా నల్లధనం కుబేరులను శిక్షించాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు.చట్టాలను ఎవరూ కూడా దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం డీడీ కోసాంబి ఐడియాస్ ఫెస్టివల్లో పాల్గొన్న సందర్భంగా ప్రజాస్వామ్యం, అభివృద్ధి అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. విదేశాల్లోనే కాదు దేశీయంగా కూడా భారీ ఎత్తున బ్లాక్ మనీ మూలుగుతోందని రాజన్ పేర్కొన్నారు. విదేశాల్లో దాచుకున్న వారినే కాకుండా ఇలా దేశీయంగా దాచుకున్న నల్ల ధనం కుబేరులను కూడా పట్టుకుని, శిక్షించాలన్నారు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా పన్నులు గణనీయంగా తగ్గాయని, ప్రస్తుతం సహేతుక స్థాయిలోనే ఉన్నాయని రాజన్ తెలిపారు. వీటిని కూడా ఎగ్గొడితే పన్నుల వ్యవస్థను అవహేళన చేసినట్లేనన్నారు. ‘ప్రజలు పన్నులు కట్టేందుకు తగిన అవకాశం ఇవ్వాలి. అప్పటికీ కట్టకపోతే అప్పుడు శిక్షించాలి. పన్నులు ఎగ్గొడితే శిక్ష తప్పదు అన్న విషయం స్పష్టంగా తెలియాలి. ఇందుకోసం పన్నుల వ్యవస్థను పటిష్టం చేయాలి’ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడం ముఖ్యమని, ఇందుకోసం ప్రభుత్వం సరైన విధానాలను రూపొందించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వారసత్వ ఆస్తి పన్నులు సరికాదు.. వారసత్వ ఆస్తిపై పన్నుల విధానాన్ని తప్పుపడుతూ .. ప్రభుత్వం ప్రజలను సంపన్నులుగా చేయడంపైనే దృష్టి పెట్టాలే తప్ప వారసత్వంగా సంపద దక్కించుకున్న వారిని సాధారణ స్థాయికి దిగజార్చకూడదన్నారు. అసలు ఇలాంటి పన్నులు విధిస్తే సంపద సృష్టించే వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేకుండా పోతాయన్నారు. అటు ఆర్థిక రంగ చట్టాల సంస్కరణల కమిషన్ (ఎఫ్ఎస్ఎల్ఆర్సీ) చేసిన సిఫార్సులపైనా పరోక్షంగా ఆయన విమర్శలు సంధించారు. లెసైన్స్ పర్మిట్ జమానా నుంచి బైటపడిన దేశం తాజాగా అపీలేట్ జమానా బారిన పడకూడదన్నారు. ఆర్బీఐ సహా ఆర్థిక రంగానికి సంబంధించిన నియంత్రణ సంస్థలన్నిటీకీ ఒకే అపీలేట్ అథారిటీని ఏర్పాటు చేయాలన్న ఎఫ్ఎస్ఎల్ఆర్సీ సిఫార్సు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వం పటిష్టంగా ఉంటే సరిపోదు.. ప్రభుత్వం పటిష్టంగా ఉన్నంత మాత్రాన సరైన దిశలోనే పాలిస్తుందని ఏమీ లేదని రాజన్ వ్యాఖ్యానించారు. దీనికి నియంత హిట్లర్ ఉదంతమే నిదర్శనమన్నారు. ‘హిట్లర్ జర్మనీలో అత్యంత సమర్ధమైన పాలనే అందించాడు. 1975-77 మధ్య ఎమర్జెన్సీ విధించినప్పుడు మన దగ్గర నడిచినట్లే.. ఆయన పాలనలో కూడా రైళ్లు సరిగ్గా సమయానికి నడిచేవి. ఆయన ప్రభుత్వం చాలా పటిష్టమైనది కూడా. కానీ చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి ఆయన జర్మనీని పతనం వైపుగా నడిపించాడు’ అని రాజన్ చెప్పారు. కాబట్టి.. చిత్తశుద్ధి, నైపుణ్యం, ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం గలవారే పటిష్టమైన ప్రభుత్వానికి సారథ్యం వహించాలని ఆయన వ్యాఖ్యానించారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం వంటివి కల్పించినప్పుడే సమ్మిళిత వృద్ధిని సాధ్యమన్నారు. -
గవర్నర్ ఆఫ్ ది ఇయర్... రాజన్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రతిష్టాత్మక ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘సెంట్రల్ బ్యాంకింగ్’ మేగజీన్ రాజన్‌ను ఈ అవార్డుకు ఎంపికచేసింది. దేశ ఆర్థిక ఇబ్బందుల మూలాలను కనుగొనడంలో ఉన్న శక్తి సామర్థ్యాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. మార్చి 12వ తేదీన లండన్‌లో రాజన్‌కు ఈ అవార్డు ప్రదానం జరుగుతుంది. -
కీలక వడ్డీరేట్లు యథాతథం
ముంబయి : ద్రవ్య పరపతి విధానాన్నిప్రకటించింది ఆర్బిఐ అన్ని రకల వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సిఆర్ఆర్-నగదు నిల్వల నిష్ఫత్తిని ఆర్బిఐ యథాతథంగా ఉంచింది. 2014-15 సంవత్సరానికి జిడిపి వృద్ధిరేటు 5.5 శాతంగా అంచనా వేసింది. ఆర్ధిక వృద్దిరేటు పరుగులు పెట్టాలంటే కొన్ని కట్టడినిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారమిక్కడ తెలిపారు.