ఆర్‌బీఐలో ఐటీ అనుబంధ సంస్థ!
బెనాలిమ్(గోవా): సైబర్ నేరాలు అంతకంతకూ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో ఈ సవాళ్లను ఎదుర్కోవడంపై రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) దృష్టిసారించింది. ఈ చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా ఐటీ అనుబంధ సంస్థ(సబ్సిడరీ)ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. గురువారమిక్కడ జరిగిన ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సైబర్ సెక్యూరిటీ విషయంలో అనేక సవాళ్లు పొంచిఉన్నాయి.
బ్యాకింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పర్యవేక్షణ కోసం ఒక ఐటీ సబ్సిడరీపై దృష్టిపెట్టాలని బోర్డు సిఫార్సు చేసింది. బ్యాంకింగ్‌కు సంబంధించి ఐటీ విధానాలు, సామర్థ్యాల పెంపునకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది’ అని రాజన్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ సేవల రంగంలో ఆన్‌లైన్ మోసాలు తీవ్రమవుతున్నాయని.. చివరికి ఆర్‌బీఐ లోగోలతో ఈ-మెయిల్స్ పంపి ప్రజలను మోసగిస్తున్న సైబర్ నేరగాళ్లు కూడా ఉన్నారంటూ గవర్నర్ తాజా ఉదంతాలను ప్రస్తావించారు.