సాక్షి, అమరావతి: మొబైల్ బ్యాంకింగ్ విధానంలో సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు కేంద్రం నడుం బిగించింది. వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) విధానానికి బదులు.. ఫేస్/ఐరిస్ గుర్తింపు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు సైబర్ భద్రత విధానాన్ని రూపొందించి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఓటీపీ ఆధారంగా నిర్వహిస్తున్న మొబైల్ బ్యాంకింగ్‌లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు ఫోన్లు, బ్యాంకు అకౌంట్లను హ్యాక్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. క్షణాల్లోనే నగదును మరో ఖాతాకు బదిలీ చేస్తున్నారు. మొబైల్ బ్యాంకింగ్ ఖాతాదారులు ఈ విషయాన్ని గ్రహించే లోగానే అకౌంట్లలో నగదు మాయమైపోతోంది.
త్వరలో జాతీయ సైబర్ భద్రత విధానం
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌లో సైబర్ ఆర్థిక నేరాలను సత్వరం అరికట్టాల్సిన అవసరముందని సైబర్ పోలీస్, ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ బ్యాంకింగ్‌లో సైబర్ నేరాలను అరికట్టేందుకు కార్యాచరణకు సన్నద్ధమైంది. సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు ప్రధాన సాధనంగా చేసుకుంటున్న ఓటీపీ నంబర్ విధానాన్ని తొలగించాలని భావిస్తోంది. ఆ స్థానంలో ఖాతాదారుల ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్), ఐరిస్ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర హోంశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత ఖాతాదారుడి ముఖం/ఐరిస్ గుర్తింపును సరిచూశాకే ఖాతా నుంచి నగదు చెల్లింపు జరిగే విధానాన్ని అమలు చేయనున్నారు. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికే రూపొందించి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ విధానంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని సైబర్ పోలీసింగ్ నిపుణులు నిర్ధారించారు. దాంతో ఈ విధానాన్ని అధికారికంగా దేశమంతా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుతో చర్చించింది. మొబైల్ బ్యాంకింగ్ విధానంలో ఫేస్ /ఐరిస్ గుర్తింపు ప్రక్రియను సైబర్ భద్రత విధానంలో పొందుపరచాల్సి ఉంది.
అందుకు అవసరమైన జాతీయ సైబర్ భద్రత విధానం–2020ను కేంద్ర హోంశాఖ ఇప్పటికే రూపొందించింది. త్వరలోనే దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుందని అధికారవర్గాలు తెలిపాయి. అనంతరం బ్యాంకులతో సమావేశం నిర్వహించి ఫేస్/ఐరిస్ గుర్తింపుతోనే మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయిస్తారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఈ కొత్త విధానంతో మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించిన సైబర్ నేరాలను సమర్థంగా అరికట్టొచ్చని సైబర్ క్రైం పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఆందోళనకర స్థాయిలో ఆర్థిక నేరాల పెరుగుదల
గత ఐదేళ్లలో దేశంలో సైబర్ ఆర్థిక నేరాలు దాదాపు 300శాతం పెరగడం ఆందోళనకరంగా మారింది. ప్రధానంగా 2016 నుంచి ఈ నేరాల తీవ్రత అమాంతంగా పెరుగుతోంది. దేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, ప్రజలు మొబైల్ బ్యాంకింగ్ వైపు మొగ్గుచూపుతుండటంతో అదే స్థాయిలో సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో దేశంలో సైబర్ ఆర్థిక నేరాల గణాంకాలిలా ఉన్నాయి..
Comments
Please login to add a commentAdd a comment