టెకాన్‌పూర్: పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం కారణంగా తలెత్తుతున్న సమస్యలు, సైబర్ నేరాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. వీటి పరిష్కారాన్ని ప్రాధాన్య అంశంగా గుర్తించాలన్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో జరుగుతున్న జాతీయ డీజీపీ, ఐజీపీల సదస్సు ముగింపు సందర్భంగా మోదీ మాట్లాడారు. అక్రమ ఆర్థిక వ్యవహారాల సమాచార మార్పిడిపై అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోందని.. దీంట్లో భారత్ కీలక భూమిక పోషించే అవకాశం ఉందన్నారు.
అక్రమ ఆర్థిక లావాదేవీల విషయంలో రాష్ట్రపోలీసు ఉన్నతాధికారులు పక్క రాష్ట్రాల పోలీసు అధికారులతో సమాచారాన్ని పంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ‘భారత్ సహజసిద్ధ సమాఖ్య’ అని ఆయన అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో సోషల్ మీడియా ప్రాముఖ్యతను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక భాషల్లో సందేశాలు పంపటం ప్రభావవంతంగా ఉంటుందని సూచించారు. యువత తీవ్రవాద భావాలవైపు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో సాంకేతికత ద్వారా సమస్యాత్మక అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర బలగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి
ప్రపంచవ్యాప్తంగా పలు అంశాలపై ఏకాభిప్రాయం పెరుగుతున్న సమయంలో రాష్ట్రాల మధ్య భద్రత విషయంలో ఇలాంటి బంధాలు బలపడాలన్నారు. ప్రతీ రాష్ట్రం సమాచారాన్ని మార్పిడి చేసుకోవటం ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. మార్పుకోసం ప్రయత్నిస్తున్న పోలీసు ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసుల బాధ్యతల వంటి అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు పాత్ర మరింత క్రియాశీలకంగా మారిందన్నారు. దేశ భద్రత కోసం రూపొందించిన వివిధ కార్యక్రమాల అమలులో పరస్పర సహకారం అవసరాన్ని ఈ సదస్సులు గుర్తుచేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ సదస్సును మరింత ప్రభావశీలంగా మార్చేందుకు ఏడాది వ్యాప్తంగా నిర్ణయించుకున్న కార్యక్రమాల సమీక్ష జరగాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరొ (ఐబీ) అధికారులకు రాష్ట్రపతి పోలీసు మెడల్స్‌ను కూడా మోదీ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment