సాక్షి, న్యూఢిల్లీ : సైబర్ నేరాలని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్‌నెట్ సేవలు రోజురోజుకి తమ పరిధిని పెంచుకుంటుడడంతో సైబర్ నేరాలను అరికట్టడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వ వైబ్‌సైట్ల నుంచి విలువైన సమాచారాన్ని దొంగిలించడం వల్ల దేశ భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్ర హోంశాఖ నివారణ చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించింది. నేరాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీచేసింది. వీటికి అనుగుణంగా రాష్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయో హోంశాఖకు తెలియజేయాలని పేర్కొంది.
హోంశాఖ జారీచేసిన మార్గదర్శకాలు:
1. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సైబర్ నేర నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేసి, దానికి సీనియర్ ఐజీ ర్యాంకు అధికారిని కో ఆర్డినేటర్‌గా నియమించాలి. జిల్లా పోలీస్ స్టేషన్‌ల స్థాయిలో సైబర్ నేరాలను విచారించడానికి తగిన సౌకర్యాలను కల్పించేలా ఈ విభాగం బాధ్యత తీసుకోవాలి. కేసు తీవ్రతను బట్టి సమాచారమార్పిడి జరిగేట్టు చూడాలి. వివిధ క్యాటగిరీ కలిగిన పోలీసు అధికారులతోపాటు, సైబర్ సెక్యూరిటీ నిపుణులను కూడా నియమించుకోవాలి. జిల్లాలో డీఎస్పీని గానీ, అడిషనల్ ఎస్పీని గానీ కో ఆర్డినేటర్‌గా నియమించాలి. జిల్లా సైబర్ సెల్ ఆ జిల్లా ఎస్పీతో పాటు, రాష్ట్ర సైబర్ సెల్‌కి రిపోర్ట్ చేయాలి.
2. ప్రపంచంలో ఎక్కడినుంచైనా సైబర్‌దాడులు జరిగే అవకాశం ఉన్నందున్న అన్ని శాఖలను సమన్వయపరుచుకుంటూ పనిచేయాలి. పక్క రాష్ట్రాల్లో జరిగే నేరాలను పరిష్కరించేందుకు ఉమ్మడి బృందాలు ఏర్పాటు చేయడం, విదేశాలతో సంబంధం ఉండే నేరాల కోసం సీబీఐతో సంప్రదింపులు జరపాలి.
3. హోంశాఖ విడుదల చేసిన 82.8 కోట్ల రూపాయలతో రాష్ట్ర సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలి. సైబర్ సెల్‌లో పనిచేసే అధికారులకు తగిన శిక్షణ ఇవ్వాలి. వీటి ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు, నేరాలు జరిగితే త్వరితగతిన పరిష్కరించేందుకు సాధ్యపడుతుంది. అవసమైతే జిల్లా స్థాయిలో కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి.
4. సైబర్ సెల్‌లో పనిచేసే పోలీసులతో పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌కి, జడ్జీలకు సైబర్ నేరాల జరిగే తీరుపై అవగాహన పెంపొందించాలి. బాధితులకు కూడా భరోసా కల్పించడం. కేసులను విచారించడానికి తగినంత సిబ్బందిని నియమించుకోవడం. అధికారుల కూడా నేరాలను పరిష్కరించడానికి గల సులువైన మార్గాల కోసం అన్‌లైన్‌లో ఉన్న వివిధ కోర్సులు నేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.
5. ఇప్పటికే వివిధ నేర నియంత్రణ విభాగాలు సైబర్ నేర నియంత్రణకై కృషి చేస్తున్నాయి. సైబర్ సెల్స్ ద్వారా మరింత లోతుగా దృష్టి సారించాలి. సోషల్ మీడియా, ఫెక్ అకౌంట్లపై నిరంతర నిఘా ఉంచాలి. అనుమనాస్పదంగా ఉన్న వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చైల్డ్ పోర్నోగ్రఫీ, బ్లాక్‌మెలింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్‌ను ఆరికట్టడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి.
6. సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం హోం మంత్రిత్వ శాఖ సైబర్ నేరాలు నమోదు చేయడానికి cyberpolice.gov.in పేరుతో వెబ్‌సైట్‌ని సిద్ధం చేయనుంది. బాధితులు ఎవరైనా ఈ సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ ద్వారా పోలీసు అధికారులు వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వొచ్చు.
7. అవగాహన లేకపోవడంతోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నందు వల్ల కింది స్థాయి వరకు సైబర్ నేరాలపై కనీస పరిజ్ఞానాన్ని కల్పించాలి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఎటీఎం, కెడ్రిట్ కార్డుల పిన్, వన్ టైం పాస్‌వర్డ్ వివరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తరచూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment