ధరల కట్టడితోనే వృద్ధి సాధ్యం: రాజన్
న్యూఢిల్లీ: నిలకడైన ఆర్థిక వృద్ధి సాధించాలంటే రిజర్వ్ బ్యాంక్.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాల్సి ఉం టుందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులన్నీ కూడా ద్రవ్యోల్బణంపై దృష్టి పెడతాయని, ఆర్‌బీఐ ఇందుకు మినహాయింపు కాదని బుధవారం ఒక చానల్‌కిచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. తక్కువ వర్షపాతం కారణంగా ఆహారోత్పత్తుల ధరలపై ప్రతికూల ప్రభావం పడగలదన్న ఆందోళనల నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాధారణ స్థాయి కన్నా వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న ఆందోళనలతో వృద్ధి రేటు అంచనాలను 7.8 శాతం నుంచి 7.6 శాతానికి ఆర్‌బీఐ తగ్గించిన సంగతి తెలిసిందే.
ఇటు ద్రవ్యోల్బణం, అటు వృద్ధి మధ్య సమతౌల్యం ఉండేలా ఆర్‌బీఐ వ్యవహరించాల్సి ఉంటుందని రాజన్ చెప్పారు. ముందుగా సౌకర్యవంతమైన స్థాయికి ద్రవ్యోల్బణం దిగివచ్చేలా చూసిన తర్వాత వడ్డీ రేట్లు సాధ్యమైనంత మేర తగ్గించవచ్చన్నది ఆర్థిక శాస్త్ర సూత్రాల్లో ఒకటని ఆయన వివరించారు. ఒకవైపు ప్రపంచమంతటా ప్రతి ద్రవ్యోల్బణం ఉండగా.. మరోవైపు భారత్‌లో అందుకు భిన్నంగా అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయని రాజన్ చెప్పారు. ఫలితంగా సాధారణ వడ్డీ రేట్లను తగ్గించే పరిస్థితులు లేవన్నారు. పాలసీ రేట్ల తగ్గింపు విషయంలో ఆర్‌బీఐ వెనుకబడిపోయిందన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. కీలక పాలసీ రేట్లను తగ్గించేందుకు అసలు ఆస్కారమే లేకపోయినప్పటికీ.. ఆర్‌బీఐ వీలు కల్పించుకుని మరీ తగ్గిస్తోందని రాజన్ తెలిపారు.