రేటు తగ్గినా.. వరుణుడి కరుణ లేదని...
* సెన్సెక్స్ 661 పాయింట్లు నష్టంతో 27,188 పాయింట్లకు డౌన్
* 197 పాయింట్ల నష్టంతో 8,236కు నిఫ్టీ
ఈ ఏడాది మరోసారి రేట్ల కోత ఉండబోదని ఆర్‌బీఐ సూచనప్రాయంగా వెల్లడించడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ, ఈ ఏడాది రేట్ల కోత బహుశా ఇదే చివరిసారని, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయని ఆర్‌బీఐ గవర్నరు రఘురామ్ రాజన్ పేర్కొనడం మార్కెట్లకు రుచించలేదు.
దీనికి తోడు వర్షాలు ఆలస్యమవడమే కాకుండా, తగినంతగా కురవవనే అంచనాలు, రూపాయి 26 పైసలు క్షీణించడం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీశాయి. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 661 పాయింట్లు క్షీణించి 27,188కు, నిఫ్టీ 197 పాయింట్లు(2.3 శాతం) నష్టంతో 8,236 వద్ద ముగిశాయి. సాధారణంగా రేట్ల కోత కారణంగా స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసేది. కానీ రేట్ల కోత కారణంగా స్టాక్ మార్కెట్ పతనమవడం ఇది వరుసగా రెండోసారి.
‘వడ్డీరేట్ల’ షేర్లు కుదేలు...
వర్షాలు సాధారణం కంటే తక్కువగానే పడతాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు కరువు పరిస్థితులేర్పడుతాయోమోననే ఆందోళనను రేకెత్తించాయి. ముడి చమురు ధరలు పెరుగుతుండడం, పంట దిగుబడులు తగ్గే అవకాశాలు, తదితర కారణాలతో ద్రవ్యోల్బణం ఇక నుంచి పెరుగుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత-రియల్టీ, బ్యాంక్, వాహన షేర్లు కుదేలయ్యాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలోనూ అమ్మకాలు జరిగాయి.
కరువు మబ్బులు...
ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండడం ఇప్పటికే కష్టాల్లో ఉన్న భారత కంపెనీల లాభదాయకతపై మరింతగా ప్రభావం చూపుతుందని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ధకన్ చెప్పారు. కరువు ఆందోళనలను రేకెత్తించేలా ఉన్న వాతావరణ శాఖ అంచనాలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయని, 50 బేసిస్ పాయింట్ల కంటే తక్కువ కోతను మార్కెట్లు అంగీకరించవనే అంచనాలు నిజమయ్యాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు.
756 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్
బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత 27,903 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించగానే నష్టాల్లోకి జారిపోయింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో 27,147 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 661 పాయింట్ల (2.37 శాతం) నష్టంతో 27,188 వద్ద ముగిసింది. మే 6 తర్వాత ఒక్క రోజులో సెన్సెక్స్ ఇంతలా క్షీణించడం ఇదే తొలిసారి. 8,445-8,226 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 197 పాయింట్లు(2.3 శాతం) నష్టంతో 8,236 వద్ద ముగిసింది.
ఎదురీదిన ఎయిర్‌టెల్
30 సెన్సెక్స్ షేర్లలో ఒక్క ఎయిర్‌టెల్ తప్ప అన్ని షేర్లూ కుదేలయ్యాయి. అన్నింటికంటే అధికంగా ఎస్‌బీఐ నష్టపోయింది. ఈ షేర్ 4.28% క్షీణించి రూ.266 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ 4.2%, ఐసీఐసీఐ బ్యాంక్ 3.7%, హెచ్‌డీఎఫ్‌సీ 3.55%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.6% చొప్పున క్షీణించాయి. బ్యాంక్ షేర్లు బేర్‌మన్నాయి.
బ్యాంక్ నిఫ్టీ 3.4 % క్షీణించింది. 1,875 షేర్లు నష్టపోగా, 804 షేర్లు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,087 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.16,983 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,93,660 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.594 కోట్ల నిర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.272 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
రూ.2.26 లక్షల కోట్లు ఆవిరి...
ఇన్వెస్టర్ల సంపద మంగళవారం రోజే రూ.2.26 లక్షల కోట్లు ఆవిరైంది. మొత్తం బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.101.05 లక్షల కోట్లకు తగ్గింది.
ఎందుకీ పతనం..?
⇒ వర్షాలు సాధారణం కంటే తక్కువేనన్న
⇒ వాతావరణ శాఖ
⇒ ఇప్పట్లో రేట్ల కోత ఉండకపోవచ్చన్న ఆర్‌బీఐ
⇒ రూపాయి 26 పైసలు క్షీణించడం...