మార్కెట్‌కు స్వల్ప లాభాలు
రాజన్ ఉత్సాహపర్చినా... అంతర్జాతీయ ప్రతికూల ప్రభావం!
700 పాయింట్ల ఊగిసలాట
162 పాయింట్ల లాభంతో 25,779కు సెన్సెక్స్
ఆర్‌బీఐ గవర్నర్ రఘురామరాజన్ అనూహ్యంగా రెపో రేటును అరశాతం తగ్గించినా, అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై అందోళన కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు క్షీణించడంతో మంగళవారం మన స్టాక్ మార్కెట్ ఓ మోస్తరు లాభాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. సెన్సెక్స్ 26వేల పాయింట్ల దిగువన, నిఫ్టీ 7,800 పాయింట్ల ఎగువన ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 162 పాయింట్లు లాభపడి 25,779 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 7,843 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడమూ ప్రభావం చూపింది. జీడీపీ అంచనాలను ఆర్‌బీఐ 7.6%నంచి 7.4 శాతానికి తగ్గించడం కొంత ప్రతికూలత చూపింది. వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, రియల్టీ, హౌసింగ్ ఫైనాన్స్, వాహన షేర్లు ఒక వెలుగు వెలిగాయి.
చివరలో లాభాల స్వీకరణ..
ట్రేడింగ్ చివర్లో ఫార్మా, లోహ షేర్లలో అమ్మకాల జోరు కారణంగా స్టాక్ మార్కెట్ లాభాలకు కళ్లెం పడింది. ఒక దశలో 300 పాయింట్ల వరకూ పడిపోయిన సెన్సెక్స్ ఆర్‌బీఐ రేట్ల కోత తర్వాత కోలుకొని లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే ఒక దశలో 700 పాయింట్ల లాభాన్ని కళ్లజూసింది. ఇంట్రాడేలో 400 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరిగంటలో విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా స్వల్పలాభాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, ఫెడ్ వడ్డీరేట్ల అనిశ్చితి వంటి అంశాల కారణంగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి.