‘నల్ల’ కుబేరులను శిక్షించాలి
⇒ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి
⇒ వారసుల ఆస్తులపై పన్నులు వేయటం సరికాదు
⇒ సర్కారు బలంగా ఉన్నంత మాత్రాన మేలు జరగదు
⇒ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు
పనాజీ: చట్టాలను క్రమబద్ధీకరించడం, పటిష్టంగా అమలు చేయడం ద్వారా నల్లధనం కుబేరులను శిక్షించాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు.చట్టాలను ఎవరూ కూడా దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
శుక్రవారం డీడీ కోసాంబి ఐడియాస్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సందర్భంగా ప్రజాస్వామ్యం, అభివృద్ధి అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. విదేశాల్లోనే కాదు దేశీయంగా కూడా భారీ ఎత్తున బ్లాక్ మనీ మూలుగుతోందని రాజన్ పేర్కొన్నారు. విదేశాల్లో దాచుకున్న వారినే కాకుండా ఇలా దేశీయంగా దాచుకున్న నల్ల ధనం కుబేరులను కూడా పట్టుకుని, శిక్షించాలన్నారు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా పన్నులు గణనీయంగా తగ్గాయని, ప్రస్తుతం సహేతుక స్థాయిలోనే ఉన్నాయని రాజన్ తెలిపారు.
వీటిని కూడా ఎగ్గొడితే పన్నుల వ్యవస్థను అవహేళన చేసినట్లేనన్నారు. ‘ప్రజలు పన్నులు కట్టేందుకు తగిన అవకాశం ఇవ్వాలి. అప్పటికీ కట్టకపోతే అప్పుడు శిక్షించాలి. పన్నులు ఎగ్గొడితే శిక్ష తప్పదు అన్న విషయం స్పష్టంగా తెలియాలి. ఇందుకోసం పన్నుల వ్యవస్థను పటిష్టం చేయాలి’ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడం ముఖ్యమని, ఇందుకోసం ప్రభుత్వం సరైన విధానాలను రూపొందించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వారసత్వ ఆస్తి పన్నులు సరికాదు..
వారసత్వ ఆస్తిపై పన్నుల విధానాన్ని తప్పుపడుతూ .. ప్రభుత్వం ప్రజలను సంపన్నులుగా చేయడంపైనే దృష్టి పెట్టాలే తప్ప వారసత్వంగా సంపద దక్కించుకున్న వారిని సాధారణ స్థాయికి దిగజార్చకూడదన్నారు. అసలు ఇలాంటి పన్నులు విధిస్తే సంపద సృష్టించే వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేకుండా పోతాయన్నారు. అటు ఆర్థిక రంగ చట్టాల సంస్కరణల కమిషన్ (ఎఫ్‌ఎస్‌ఎల్‌ఆర్‌సీ) చేసిన సిఫార్సులపైనా పరోక్షంగా ఆయన విమర్శలు సంధించారు. లెసైన్స్ పర్మిట్ జమానా నుంచి బైటపడిన దేశం తాజాగా అపీలేట్ జమానా బారిన పడకూడదన్నారు. ఆర్‌బీఐ సహా ఆర్థిక రంగానికి సంబంధించిన నియంత్రణ సంస్థలన్నిటీకీ ఒకే అపీలేట్ అథారిటీని ఏర్పాటు చేయాలన్న ఎఫ్‌ఎస్‌ఎల్‌ఆర్‌సీ సిఫార్సు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రభుత్వం పటిష్టంగా ఉంటే సరిపోదు..
ప్రభుత్వం పటిష్టంగా ఉన్నంత మాత్రాన సరైన దిశలోనే పాలిస్తుందని ఏమీ లేదని రాజన్ వ్యాఖ్యానించారు. దీనికి నియంత హిట్లర్ ఉదంతమే నిదర్శనమన్నారు. ‘హిట్లర్ జర్మనీలో అత్యంత సమర్ధమైన పాలనే అందించాడు. 1975-77 మధ్య ఎమర్జెన్సీ విధించినప్పుడు మన దగ్గర నడిచినట్లే.. ఆయన పాలనలో కూడా రైళ్లు సరిగ్గా సమయానికి నడిచేవి. ఆయన ప్రభుత్వం చాలా పటిష్టమైనది కూడా. కానీ చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి ఆయన జర్మనీని పతనం వైపుగా నడిపించాడు’ అని రాజన్ చెప్పారు. కాబట్టి.. చిత్తశుద్ధి, నైపుణ్యం, ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం గలవారే పటిష్టమైన ప్రభుత్వానికి సారథ్యం వహించాలని ఆయన వ్యాఖ్యానించారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం వంటివి కల్పించినప్పుడే సమ్మిళిత వృద్ధిని సాధ్యమన్నారు.