ఫెడ్ చర్యను దీటుగా ఎదుర్కొంటాం..
అమెరికాలో రేట్ల పెంపు అంచనాలపై ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ వ్యాఖ్య
- మార్కెట్లలో ఒడిదుడుకులు తట్టుకునేందుకు సిద్ధమని సంకేతం
- ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేటు పెంపు సంకేతాలు ఇస్తే... తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పూర్తిగా సన్నద్ధమయినట్లు గవర్నర్ రఘురామ్ జీ రాజన్ బుధవారం తెలిపారు.
మార్కెట్లలో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటామని కూడా అన్నారు. ఆయన ఇక్కడ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతికూల వాతావరణంలోనూ సాధారణ పరిస్థితులను కొనసాగించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని అన్నారు. ఫెడరల్ వడ్డీరేట్లు పెంచితే దీనిని ఎదుర్కొనేందుకు తగిన సామర్థ్యం దేశానికి ఉందని కూడా ఆయన అన్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచినట్లయితే, భారత్ వంటి వర్ధ మాన మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కు మళ్లవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న విశ్లేషణలూ ఉన్నాయి.
బలాలివి...
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనడానికి భారత్ ప్రస్తుత శక్తిసామర్థ్యాలనూ ఆయన ప్రస్తావించారు. భారత్ వద్ద ప్రస్తుతం భారీగా విదేశీ మారకపు నిల్వలు ఉన్న విషయాన్నీ (338 బిలియన్ డాలర్లు) రాజన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్-క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి నిర్దిష్ట ఏడాదిలో వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) పూర్తి నియంత్రణలో (జీడీపీలో 2 శాతం దిగువన) ఉన్న విషయాన్నీ పేర్కొన్నారు.
నేపథ్యం ఇదీ...
‘అమెరికా ఫెడ్ నిర్ణయ’ పరిస్థితులను ఎదుర్కొనడానికి భారత్ వంటి వర్ధమాన దేశాలు సిద్ధంగా ఉండాలని మంగళవారం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ లాగార్డ్ సైతం సూచించారు. మార్చి 22న 2015-16 బడ్జెట్‌పై ఆర్‌బీఐ బోర్డ్‌ను ఉద్దేశించి ఆర్థికమంత్రి ప్రసంగించాల్సి ఉంది. ఏప్రిల్ 7న 2015-16 మొదటి ద్వైమాసిక పరపతి విధాన ప్రకటన వెలువడనుంది. వీటన్నింటికీ మించి భారత్ కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రక టన వెలువడనుంది. ఆయా అంశాల నేపథ్యంలో రాజన్ ఆర్థికమంత్రితో సమావేశమయ్యారు.