'ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందిస్తున్నాం'
శాన్‌ఫ్రాన్సిస్కో: భారత్ ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతను మోదీ ప్రభుత్వం పెంపొందిస్తోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల పెట్టుబడులే ఆకర్షణగా జరుగుతున్న ఈ చర్యలు రానున్న రెండేళ్లలో మరింత ముందుకుసాగుతాయని వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులే ప్రధాన ధ్యేయంగా జైట్లీ గత బుధవారం నుంచీ 10 రోజుల అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. న్యూయార్క్, వాషింగ్టన్‌లలో పర్యటించిన జైట్లీ శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా ఆర్థిక అధికారులు, వాణిజ్య ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. భారత్ గురించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ... సందేహాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పాత లావాదేవీలపై కొత్త పన్ను (రెట్రాస్పెక్టివ్) ఆయన ప్రసంగాల్లో చోటుచేసుకున్న ప్రధాన అంశం. భారత్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతోందని జైట్లీ తెలిపారు.