Global investors
-
అదానీ- హిండెన్‌బర్గ్ వివాదం.. డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి గాధపై అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాద ప్రభావమేమీ ఉండబోదని రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక కార్పొరేట్ గ్రూప్‌నకు మాత్రమే పరిమితమైన విషయమే తప్ప, దీనితో అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌పై నమ్మకమేమీ సడలబోదని పేర్కొన్నారు. పైస్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే అదానీ గ్రూప్‌నకు బ్యాంకులు రుణాలు ఇచ్చి ఉంటాయనే అభిప్రాయాలను సింగ్ తోసిపుచ్చారు. అయితే అధిక వృద్ధి బాటలో ముందుకెళ్లాలంటే అదానీ గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకుని, పెట్టుబడిని పెంచుకోవాలని సూచించారు. భారీగా షేర్ల విక్రయాల సమయంలో కొందరు బ్లాక్‌మెయిలర్లు నివేదికలతో బైటికొస్తుంటారని చెప్పారు. -
జొమాటోకు మరిన్ని విదేశీ నిధులు
ముంబై: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తాజాగా 10 కోట్ల డాలర్లు(సుమారు రూ. 740 కోట్లు) సమీకరించనున్నట్లు తెలుస్తోంది. జొమాటోలో ఇన్వెస్ట్ చేసేందుకు ఫిడిలిటీ మేనేజ్మెంట్ రీసెర్చ్, యూఎస్ హెడ్జ్ ఫండ్ డీఐ క్యాపిటల్ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. తద్వారా తిరిగి జొమాటోపట్ల విదేశీ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు ఆకర్షితమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల ఫుడ్ డెలివరీ సేవలకు డిమాండ్ పెరుగుతుంటడం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశాయి. ఐపీవోకు ముందు వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22) తొలి అర్ధ భాగంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు జొమాటో సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. అంతకుముందు మరింతమంది ఇన్వెస్టర్లను జత చేసుకోవాలని కంపెనీ చూస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. కంపెనీ ఇటీవల 14.5 కోట్ల డాలర్ల సమీకరణకు బెయిలీ గిఫోర్డ్ తదితర సంస్థలతో చర్చలు నిర్వహించినట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన టైగర్ గ్లోబల్, కోరా మేనేజ్మెంట్ అదనంగా 15 కోట్ల డాలర్ల పెట్టుబడులు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా మిరాయి అసెట్, లగ్జర్ క్యాపిటల్ తదితర కొత్త ఇన్వెస్టర్లను సైతం కంపెనీ ఆకట్టుకుంటున్నట్లు మీడియా పేర్కొంది. కంపెనీ మొత్తం 66 కోట్ల డాలర్లు(దాదాపు రూ. 5,000 కోట్లు) సమకూర్చుకునే ప్రణాళికల్లో భాగంగా పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జొమాటోలో సీక్వోయా క్యాపిటల్, ఇన్ఫో ఎడ్జ్ సైతం వాటాదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం జొమాటో విలువను 300 కోట్ల డాలర్లు(సుమారు రూ. 22,500 కోట్లు)గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
పెట్టుబడులకు భారత్ అత్యుత్తమం: మోదీ
న్యూఢిల్లీ: కోవిడ్ అనంతర పరిస్థితుల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్ అత్యుత్తమ గమ్యస్థానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ సుస్ధిరత, విధాన కొనసాగింపు భారత్‌ను పెట్టుబడిదారులకు అత్యుత్తమ కేంద్రంగా రూపొందించిందన్నారు. అమెరికా– భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని (యూఎస్– ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్) ఉద్దేశించి గురువారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. సంస్కరణల రంగంలో ఇటీవలి కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలను ఈ సందర్భంగా ప్రధాని వారికి వివరించారు. ప్రజాస్వామ్యానికి, బహుళత్వానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సులభతర వాణిజ్యం దిశగా, అనుమతుల్లో అనవసర జాప్యం లేని విధంగా సంస్కరణలు చేపట్టామన్నారు. ప్రస్తుత కరోనా ముప్పు పరిస్థితిని ఎదుర్కొనేందుకు వినూత్నంగా, మానవ సంక్షేమం కేంద్రంగా ఆలోచించాలన్నారు. భారత్ అలాగే ఆలోచించి.. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా రికార్డు సమయంలో దేశంలో వైద్య వసతులను సమకూర్చుకోగలిగిందన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఉద్యమంలా ప్రచా రం చేసిన తొలి దేశాల్లో భారత్ ఒకటని మోదీ గుర్తు చేశారు. కరోనాతో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న దేశంలోని పేద ప్రజల కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ను ప్రారంభించామన్నారు. ఈ పథకంలో భాగంగా, దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామన్నారు. -
జాక్‌పాట్ కొట్టేసిన ఎస్ బ్యాంకు
సాక్షి, ముంబై : వివాదంలో చిక్కుకుని సంక్షోభంలో కూరుకుపోయిన ప్రయివేటు బ్యాంకు ఎస్‌బ్యాంకు జాక్ పాట్ కొట్టినట్టు తెలుస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్ ద్వారా భారీ పెట్టుబడులను సాధించనుంది. 1.2 బిలియన్ (సుమారు రూ.8400 కోట్లు) డాలర్ల పెట్టుబడి బైండింగ్ ఆఫర్ అందుకున్నట్లు ఎస్‌బ్యాంకు గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈక్విటీ వాటాల ద్వారా ఈ పెట్టుబడులనుపొందనున్నట్టు తెలిపింది. అయితే ఇది రెగ్యులేటరీ ఆమోదాలు / షరతులతో పాటు బ్యాంక్ బోర్డు, వాటాదారుల ఆమోదాలకు లోబడి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. ఈ ప్రకటన తర్వాత ఎస్ బ్యాంకు షేర్లు 35 శాతం జంప్ చేశాయి. హాంకాంగ్‌కు చెందిన ఎస్పీజీపీ హోల్డింగ్స్ ఈ భారీ పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడించింది. అలాగే ఇతర దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చలు పురోగతిలో ఉన్నాయని కూడా బ్యాంకు తెలిపింది. నవంరు 1న విడుదల చేయనున్న త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈ డీల్‌పై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కాగా నిధుల సేకరణ కోసం ఇతర ప్రపంచ, దేశీయ పెట్టుబడిదారులతో చర్చలను ముమ్మరం చేసిన నేపథ్యంలో తాజా పెట్టుబడులను సాధించింది. అదనపు మూలధనాన్ని సమీకరించడానికి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, వ్యూహాత్మక పెట్టుబడిదారులు చర్చలు జరుపుతున్నట్లు సీఈఓ రవ్నీత్ గిల్ సెప్టెంబర్ 25న ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘ఇంధన’ సూచీలో భారత్‌కు 76వ ర్యాంక్...
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) రూపొందించే అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్ ఈ ఏడాది రెండు స్థానాలు పైకి ఎగబాకి 76కు చేరుకుంది. ఇందన భద్రత, పర్యావరణ స్థిరత్వం, ఇంధన అందుబాటు వంటి అంశాలను ఏ విధంగా సమతుల్యం చేసుకుంటున్నాయన్న దాని ఆధారంగా 115 దేశాలకు ఈ ర్యాంకులను డబ్ల్యూఈఎఫ్ కేటాయిస్తుంటుంది. ఈ జాబితాలో స్వీడన్ మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్, నార్వే మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్టు సోమవారం విడుదలైన డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ఇంధన అనుసంధానత పెరిగినప్పటికీ... ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 100 కోట్ల మంది విద్యుత్ వినియోగానికి దూరంగా ఉన్నట్టు వెల్లడించింది. అధిక జనాభాతోపాటు ఇంధన వ్యవస్థలో కార్బన్ డై ఆక్సైడ్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని తెలిపింది. ‘‘భారత్ ఇటీవలి సంవత్సరాల్లో ఇంధన అందుబాటును పెంచేందుకు పెద్ద ముందడుగు వేసింది. ఇంధన పరివర్తనలో నియంత్రణ, రాజకీయ కట్టుబాటు విభాగాల్లో స్కోరు మెరుగ్గా ఉంది’’ అని నివేదిక పేర్కొంది. కాలం చెల్లిన ఇంధన వ్యవస్థలు భారత్‌లో ఉన్నప్పటికీ పరివర్తన దిశగా ఆశావహ పరిస్థితులు ఉన్నట్టు తెలిపింది. సిస్టమ్‌ల పనితీరులో భారత్ కాస్తంత వెనుకనే ఉన్నప్పటికీ, సన్నద్ధతలో మెరుగ్గా ఉంది. మొత్తం మీద భారత్ ఈ సూచీలో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 78 నుంచి 76కు చేరుకుంది. ఇక పొరుగు దేశం చైనా మన కంటే ఆరు స్థానాలు దిగువన 82లో ఉంది. -
'ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందిస్తున్నాం'
శాన్ఫ్రాన్సిస్కో: భారత్ ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతను మోదీ ప్రభుత్వం పెంపొందిస్తోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల పెట్టుబడులే ఆకర్షణగా జరుగుతున్న ఈ చర్యలు రానున్న రెండేళ్లలో మరింత ముందుకుసాగుతాయని వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులే ప్రధాన ధ్యేయంగా జైట్లీ గత బుధవారం నుంచీ 10 రోజుల అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. న్యూయార్క్, వాషింగ్టన్లలో పర్యటించిన జైట్లీ శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా ఆర్థిక అధికారులు, వాణిజ్య ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. భారత్ గురించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ... సందేహాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పాత లావాదేవీలపై కొత్త పన్ను (రెట్రాస్పెక్టివ్) ఆయన ప్రసంగాల్లో చోటుచేసుకున్న ప్రధాన అంశం. భారత్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతోందని జైట్లీ తెలిపారు. -
అసంబద్ధ పన్నులు వేయం
గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధాని హామీ వృద్ధి జోరు, ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని స్పష్టీకరణ న్యూఢిల్లీ: భారత్‌లో అసంబద్దమైన పన్నులకు ఇక తావులేదని.. సుస్థిర, ఆమోదయోగ్యమైన పన్నుల వ్యవస్థను అమలు చేస్తామని దిగ్గజ గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ హామీనిచ్చారు. అంతేకాకుండా వృద్ధికి అత్యం త ప్రాధాన్యమిచ్చేలా ఆర్థిక విధానాలపై దృష్టిపెడుతున్నామని, భారీ పెట్టుబడులతో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలోని 21 అతిపెద్ద ఫండ్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో మంగళవారమిక్కడ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఫండ్స్ 11 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి నిధులను నిర్వహిస్తున్నాయి. వీటిలో అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫ్యూచర్ ఫండ్, టెమాసెక్, కెనడియన్ పెన్షన్ ఫండ్ తదితర సావరీన్(ప్రభుత్వాలకు చెంది నవి) వెల్త్ ఫండ్స్ కూడా ఉన్నాయి. దేశ ఆర్థిక వృద్ధి ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని మోదీ ఉద్ఘాటించారు. అదేవిధంగా పాలన, పన్నుల విషయంలో పారదర్శకత.. అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతామని కూడా ఇన్వెస్టర్లకు చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్ మంగళవారమిక్కడ నిర్వహించిన ‘ఇండియా ఇన్వెస్టర్ సదస్సు’లో పాల్గొనేందుకు ఆయా గ్లోబల్ ఫండ్స్ ప్రతినిధులు భారత్‌కు వచ్చారు. మౌలిక రంగంపై దృష్టి... ఇన్వెస్టర్లతో సమావేశంలో మోదీ చర్చించిన విషయాలపై ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలోని మౌలిక సదృపాయాల అభివృద్ధితోనే దేశంలోని యువతకు అత్యధికంగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని మోదీ గ్లోబల్ ఇన్వెస్టర్లకు తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు వృద్ధి చోధకంగా నిలుస్తాయని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. నైపుణ్యాలను పెంపొదించడం ద్వారా యువత అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేందుకు తగిన పరిస్థితులు కల్పిస్తున్నామని చెప్పారు. 2022కల్లా అందిరికీ చౌక ఇళ్లను అందించాలన్న తమ లక్ష్యం.. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు దోహదపడుతుందని కూడా ప్రధాని వివరించారు. కాగా, ఈ సదస్సులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బొగ్గు-విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, జయంత్ సిన్హా తదితర కేంద్ర మంత్రలు హాజరయ్యారు. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, సెబీ చైర్మన్ యూకే సిన్హా, కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ... ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలుచేస్తోందని.. భారీ పెట్టుబడులతో తరలిరావాలంటూ ఆయన ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. బ్లాక్ రాక్ సీఈఓ లారెన్స్ ఫింక్ సదస్సుకు నేతృత్వం వహించారు.