అసంబద్ధ పన్నులు వేయం
గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధాని హామీ
వృద్ధి జోరు, ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: భారత్‌లో అసంబద్దమైన పన్నులకు ఇక తావులేదని.. సుస్థిర, ఆమోదయోగ్యమైన పన్నుల వ్యవస్థను అమలు చేస్తామని దిగ్గజ గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ హామీనిచ్చారు. అంతేకాకుండా వృద్ధికి అత్యం త ప్రాధాన్యమిచ్చేలా ఆర్థిక విధానాలపై దృష్టిపెడుతున్నామని, భారీ పెట్టుబడులతో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలోని 21 అతిపెద్ద ఫండ్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో మంగళవారమిక్కడ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఫండ్స్ 11 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి నిధులను నిర్వహిస్తున్నాయి. వీటిలో అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫ్యూచర్ ఫండ్, టెమాసెక్, కెనడియన్ పెన్షన్ ఫండ్ తదితర సావరీన్(ప్రభుత్వాలకు చెంది నవి) వెల్త్ ఫండ్స్ కూడా ఉన్నాయి. దేశ ఆర్థిక వృద్ధి ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని మోదీ ఉద్ఘాటించారు. అదేవిధంగా పాలన, పన్నుల విషయంలో పారదర్శకత.. అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతామని కూడా ఇన్వెస్టర్లకు చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్ మంగళవారమిక్కడ నిర్వహించిన ‘ఇండియా ఇన్వెస్టర్ సదస్సు’లో పాల్గొనేందుకు ఆయా గ్లోబల్ ఫండ్స్ ప్రతినిధులు భారత్‌కు వచ్చారు.
మౌలిక రంగంపై దృష్టి...
ఇన్వెస్టర్లతో సమావేశంలో మోదీ చర్చించిన విషయాలపై ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలోని మౌలిక సదృపాయాల అభివృద్ధితోనే దేశంలోని యువతకు అత్యధికంగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని మోదీ గ్లోబల్ ఇన్వెస్టర్లకు తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు వృద్ధి చోధకంగా నిలుస్తాయని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. నైపుణ్యాలను పెంపొదించడం ద్వారా యువత అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేందుకు తగిన పరిస్థితులు కల్పిస్తున్నామని చెప్పారు. 2022కల్లా అందిరికీ చౌక ఇళ్లను అందించాలన్న తమ లక్ష్యం.. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు దోహదపడుతుందని కూడా ప్రధాని వివరించారు. కాగా, ఈ సదస్సులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బొగ్గు-విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, జయంత్ సిన్హా తదితర కేంద్ర మంత్రలు హాజరయ్యారు. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, సెబీ చైర్మన్ యూకే సిన్హా, కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ... ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలుచేస్తోందని.. భారీ పెట్టుబడులతో తరలిరావాలంటూ ఆయన ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. బ్లాక్ రాక్ సీఈఓ లారెన్స్ ఫింక్ సదస్సుకు నేతృత్వం వహించారు.