
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) రూపొందించే అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్ ఈ ఏడాది రెండు స్థానాలు పైకి ఎగబాకి 76కు చేరుకుంది. ఇందన భద్రత, పర్యావరణ స్థిరత్వం, ఇంధన అందుబాటు వంటి అంశాలను ఏ విధంగా సమతుల్యం చేసుకుంటున్నాయన్న దాని ఆధారంగా 115 దేశాలకు ఈ ర్యాంకులను డబ్ల్యూఈఎఫ్ కేటాయిస్తుంటుంది. ఈ జాబితాలో స్వీడన్ మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్, నార్వే మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్టు సోమవారం విడుదలైన డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ఇంధన అనుసంధానత పెరిగినప్పటికీ... ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 100 కోట్ల మంది విద్యుత్ వినియోగానికి దూరంగా ఉన్నట్టు వెల్లడించింది.
అధిక జనాభాతోపాటు ఇంధన వ్యవస్థలో కార్బన్ డై ఆక్సైడ్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని తెలిపింది. ‘‘భారత్ ఇటీవలి సంవత్సరాల్లో ఇంధన అందుబాటును పెంచేందుకు పెద్ద ముందడుగు వేసింది. ఇంధన పరివర్తనలో నియంత్రణ, రాజకీయ కట్టుబాటు విభాగాల్లో స్కోరు మెరుగ్గా ఉంది’’ అని నివేదిక పేర్కొంది. కాలం చెల్లిన ఇంధన వ్యవస్థలు భారత్‌లో ఉన్నప్పటికీ పరివర్తన దిశగా ఆశావహ పరిస్థితులు ఉన్నట్టు తెలిపింది. సిస్టమ్‌ల పనితీరులో భారత్ కాస్తంత వెనుకనే ఉన్నప్పటికీ, సన్నద్ధతలో మెరుగ్గా ఉంది. మొత్తం మీద భారత్ ఈ సూచీలో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 78 నుంచి 76కు చేరుకుంది. ఇక పొరుగు దేశం చైనా మన కంటే ఆరు స్థానాలు దిగువన 82లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment