ముంబై: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తాజాగా 10 కోట్ల డాలర్లు(సుమారు రూ. 740 కోట్లు) సమీకరించనున్నట్లు తెలుస్తోంది. జొమాటోలో ఇన్వెస్ట్ చేసేందుకు ఫిడిలిటీ మేనేజ్మెంట్ రీసెర్చ్, యూఎస్ హెడ్జ్ ఫండ్ డీఐ క్యాపిటల్ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. తద్వారా తిరిగి జొమాటోపట్ల విదేశీ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు ఆకర్షితమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల ఫుడ్ డెలివరీ సేవలకు డిమాండ్ పెరుగుతుంటడం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశాయి.
ఐపీవోకు ముందు
వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22) తొలి అర్ధ భాగంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు జొమాటో సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. అంతకుముందు మరింతమంది ఇన్వెస్టర్లను జత చేసుకోవాలని కంపెనీ చూస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. కంపెనీ ఇటీవల 14.5 కోట్ల డాలర్ల సమీకరణకు బెయిలీ గిఫోర్డ్ తదితర సంస్థలతో చర్చలు నిర్వహించినట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన టైగర్ గ్లోబల్, కోరా మేనేజ్మెంట్ అదనంగా 15 కోట్ల డాలర్ల పెట్టుబడులు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా మిరాయి అసెట్, లగ్జర్ క్యాపిటల్ తదితర కొత్త ఇన్వెస్టర్లను సైతం కంపెనీ ఆకట్టుకుంటున్నట్లు మీడియా పేర్కొంది. కంపెనీ మొత్తం 66 కోట్ల డాలర్లు(దాదాపు రూ. 5,000 కోట్లు) సమకూర్చుకునే ప్రణాళికల్లో భాగంగా పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జొమాటోలో సీక్వోయా క్యాపిటల్, ఇన్ఫో ఎడ్జ్ సైతం వాటాదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం జొమాటో విలువను 300 కోట్ల డాలర్లు(సుమారు రూ. 22,500 కోట్లు)గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment