
న్యూఢిల్లీ: కోవిడ్ అనంతర పరిస్థితుల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్ అత్యుత్తమ గమ్యస్థానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ సుస్ధిరత, విధాన కొనసాగింపు భారత్‌ను పెట్టుబడిదారులకు అత్యుత్తమ కేంద్రంగా రూపొందించిందన్నారు. అమెరికా– భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని (యూఎస్– ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్) ఉద్దేశించి గురువారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. సంస్కరణల రంగంలో ఇటీవలి కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలను ఈ సందర్భంగా ప్రధాని వారికి వివరించారు. ప్రజాస్వామ్యానికి, బహుళత్వానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
సులభతర వాణిజ్యం దిశగా, అనుమతుల్లో అనవసర జాప్యం లేని విధంగా సంస్కరణలు చేపట్టామన్నారు. ప్రస్తుత కరోనా ముప్పు పరిస్థితిని ఎదుర్కొనేందుకు వినూత్నంగా, మానవ సంక్షేమం కేంద్రంగా ఆలోచించాలన్నారు. భారత్ అలాగే ఆలోచించి.. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా రికార్డు సమయంలో దేశంలో వైద్య వసతులను సమకూర్చుకోగలిగిందన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఉద్యమంలా ప్రచా రం చేసిన తొలి దేశాల్లో భారత్ ఒకటని మోదీ గుర్తు చేశారు. కరోనాతో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న దేశంలోని పేద ప్రజల కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ను ప్రారంభించామన్నారు. ఈ పథకంలో భాగంగా, దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment