సంస్కరణలకు కట్టుబడ్డాం..
♦ భూ, కార్మిక, పన్ను చట్టాల్లో సంస్కరణలు తప్పనిసరి
♦ వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తాం
♦ అమెరికా పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
శాన్‌ఫ్రాన్సిస్కో : పెట్టుబడులను ఆకర్షించేందుకు భూ, కార్మిక, పన్నులపరమైన చట్టాల సంస్కరణలు తప్పనిసరని, వీటి అమలుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. తద్వారా వ్యాపారాలకు అనుకూలంగా అంతర్జాతీయ స్థాయి పరిస్థితులను భారత్‌లో కల్పిస్తామన్నారు. అలాగే వివిధ అంశాలపై విదేశీ ఇన్వెస్టర్ల ఆందోళనలను పరిష్కరించేందుకు శాశ్వత యంత్రాంగాన్ని నెలకొల్పుతామని చెప్పారు. వారం రోజుల అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి ఈ విషయాలు వివరించారు. పర్యటనలో భాగంగా పలువురు విదేశీ ఇన్వెస్టర్లు, అమెరికా ప్రభుత్వాధికారులతో ఆయన భేటీ అయ్యారు.
ఇన్వెస్టర్లు ఇచ్చిన సలహాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఇంటర్వ్యూలో మంత్రి చెప్పారు. పన్నుల అంశానికి దేశీయంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం, ఇతరత్రా ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు మొదలైనవి ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా వృద్ధి మందగించినా, భారత్ అధిక వృద్ధి రేటుతో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. ఇన్‌ఫ్రా సహా పలు రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి సంస్కరణల కారణంగా ఇన్వెస్ట్‌మెంట్‌కి అవకాశాలు పెరిగాయని వివరించారు.
భారత్ మారింది...
కొన్నాళ్ల క్రితం దాకా భారత్‌లో పాలసీ జడత్వం నెలకొందని విమర్శలు వచ్చేవని, ప్రస్తుతం పరిస్థితి మారిందని జైట్లీ చెప్పారు. సాధ్యమైనంత వేగంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గుర్తించడం జరుగుతోందన్నారు. దివాలా చట్టాలు, కాంట్రాక్టుల వివాదాల పరిష్కారాల చట్టాలు మొదలైన వాటన్నింటిలోనూ వ్యవస్థాగతమైన సంస్కరణలు అవసరమని మంత్రి చెప్పారు. ఇన్‌ఫ్రాలోను, సాగు రంగంలోనూ... ఇలా అన్ని రంగాల్లోనూ అంతులేని స్థాయిలో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు.
క్రూడ్ రేట్ల తగ్గుదలతో దిగుమతుల భారం తగ్గనున్న నేపథ్యంలో ఆ మేరకు ఆదా అయ్యే మొత్తాన్ని సామాజిక సంక్షేమ పథకాలకు, మౌలిక వసతుల నిర్మాణానికి ఉపయోగించవచ్చన్నారు. వ్యవసాయ రంగంలో మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా రాణిస్తున్నాయని జైట్లీ వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
నల్లధనం సమస్యపై దృష్టి ..
విదేశీ నల్లధనం సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరిస్తామని జైట్లీ చెప్పారు. విదేశాల్లో అక్రమంగా ధనం దాచుకున్న వారు స్వచ్ఛందంగా వెల్లడించేందుకు త్వరలో వన్ టైమ్ విండోను ప్రకటించనున్నట్లు ఆయన వివరించారు. దీన్ని ఉపయోగించుకున్న వారు పన్నులు, పెనాల్టీలు కడితే సరిపోతుందని, అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు ఆ తర్వాత కఠిన శిక్షలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ఇక దేశీయంగా నల్లధనాన్ని కట్టడి చేసే దిశగా.. నిర్దిష్ట పరిమితికి మించిన నగదు చెల్లింపుల విషయంలో పాన్ కార్డు తప్పనిసరి చేయనున్నామని జైట్లీ వివరించారు.
మూడు అంశాలు తెలుసుకున్నా ..
అమెరికా పర్యటన సందర్భంగా తాను మూడు అంశాల గురించి తెలుసుకున్నానని జైట్లీ పేర్కొన్నారు. ప్రథమంగా ఇన్వెస్టర్లు అస్పష్టత, అనిశ్చితికి తావు లేని ప్రభుత్వ విధానాలను కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రెండో అంశంగా.. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటునివ్వక తప్పదని, మూడోదిగా అపార ఉపాధి అవకాశాలు కల్పించే టెక్నాలజీకి ఊతమివ్వాల్సి ఉంటుందని తెలుసుకున్నానని జైట్లీ వివరించారు. మిగతా దేశాలకి దీటుగా అనువైన పరిస్థితులు కల్పిస్తేనే ఇన్వెస్టర్లు వస్తారని ఆయన పేర్కొన్నారు.