రఘురామ్ ‘వృద్ధి’ బాణం | Story image for raghuram rajan from India Today RBI not a cheerleader for markets: Raghuram Rajan | Sakshi
Sakshi News home page

రఘురామ్ ‘వృద్ధి’ బాణం

Published Wed, Jun 3 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

రఘురామ్ ‘వృద్ధి’ బాణం

రఘురామ్ ‘వృద్ధి’ బాణం

రెపోరేటు పావుశాతం కోత
బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణ రేటు 7.25 శాతానికి డౌన్
0.15 శాతం బేస్‌రేటు తగ్గించిన ఎస్‌బీఐ
అదే బాటలో మరికొన్ని బ్యాంకులు...
గృహ, వాహన, రిటైల్ రుణాలు చౌకయ్యే అవకాశం
భవిష్యత్తుపై ‘బలహీన రుతుపవనాల’ ఎఫెక్ట్

ముంబై: ప్రభుత్వ, పారిశ్రామిక పెద్దల కోరికకు, అంచనాకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.

మంగళవారం ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా కీలక రెపో రేటును పావు శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 7.25 శాతానికి చేరింది. దీనికి అనుగుణంగా రివర్స్ రెపో రేటు 6.25 శాతానికి చేరుతుంది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ను  4 శాతంగానే యథాతథంగా కొనసాగించింది. కీలక పాలసీ రేటు రెపోను ఆర్‌బీఐ తగ్గించడం ఈ ఏడాది ఇది మూడవసారి.  కాగా భవిష్యత్తుకు సంబంధించి నిరాశాజనక అంచనాలను ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెలువరించారు. బలహీన రుతుపవన అంచనాలు, క్రూడ్ ధరల అనిశ్చితి పరిస్థితి వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని సూచిస్తూ... ఇది తదుపరి రుణ రేటు కోత అవకాశాన్ని అడ్డుకునే అంశమని అన్నారు.
 
వడ్డీలు తగ్గేది ఎలా..?
బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటే రెపో. తన వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై ఆర్‌బీఐ చెల్లించేది రివర్స్ రెపో. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సి ఉంటుంది. ఇదే సీఆర్‌ఆర్. ఆర్‌బీఐ రెపోరేటును తగ్గిస్తే- తద్వారా తమకు లభించే ‘రుణ రేటు తగ్గే’ ప్రయోజనాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు బదలాయించే అవకాశం ఉంటుంది. తద్వారా గృహ, వాహన, వాణిజ్య రుణాల విషయంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఏర్పడుతుంది.

ఈ ఏడాది రెండుసార్లు  (జనవరి 15, మార్చి 4) పావు శాతం చొప్పున మొత్తం అరశాతం రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించింది. ఆ ప్రయోజనాన్ని  ‘రుణాలపై వడ్డీరేట్లు తగ్గించటం’ రూపంలో కస్టమర్లకు బదలాయించాలని బ్యాంకులకు సంకేతాలిచ్చింది. అయినా బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెన్స్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించారు కూడా. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు పావు శాతం మేర రుణ రేట్ల తగ్గింపు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి పావుశాతం రెపో రేటును తగ్గిస్తూ, ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.  ద్రవ్యోల్బణం కట్టడి, పారిశ్రామిక మందగమనం నేపథ్యంలో ఆర్‌బీఐ ‘అందరి అంచనాలకు అనుగుణంగా’ తాజా నిర్ణయం తీసుకుంది.

వడ్డీరేట్లు తగ్గితే- వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితులు మెరుగుపడతాయి. తక్కువ రేటుకు రుణ లభ్యత వల్ల కంపెనీల వ్యయాలు పెరిగి, పారిశ్రామిక ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో ఉండడం... తక్కువ వడ్డీరేట్ల ప్రయోజనాలు... వెరసి తద్వారా పొదుపు చేసుకునే కొంత డబ్బును మధ్య తరగతి ప్రజలు వినియోగ వస్తువుల కొనుగోళ్లకు వెచ్చించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ మొత్తంగా ఆర్థికాభివృద్ధికి కొంతమేర దోహదపడుతుందన్నది ఆర్థిక సిద్ధాంతం. అయితే ద్రవ్యోల్బణం పెరిగితే... డిమాండ్ తగ్గించడం ద్వారా ధరల కట్టడికి ఆర్‌బీఐ ‘రెపో రేటు’ పెంపు అస్త్రాన్నే  ప్రయోగిస్తుంది. రెపోరేటు తగ్గింపు డిపాజిట్ రేట్ల తగ్గింపునకు కూడా దారితీసే అంశం.
 
వృద్ధి రేటు అంచనా కోత...
ఆర్‌బీఐ రుణ రేటు పావుశాతం తగ్గించినప్పటికీ, ఆర్‌బీఐ రఘురామ్ రాజన్ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి సంబంధించి పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును ఏప్రిల్‌లో 7.8 శాతంగా ఆర్‌బీఐ అంచనావేసింది. అయితే ఈ అంచనాను ఇప్పుడు 7.6 శాతానికి తగ్గించింది.
 
కొన్ని ముఖ్యాంశాలు..
2016 జనవరి నాటికి ద్రవ్యోల్బణం 6% పెరిగే అవకాశం.
ధరల అదుపునకు పటిష్ట ఆహార విధానం, నిర్వహణ అవసరం.
ఆర్‌బీఐ రెపో రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలి.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనాన్ని కేంద్రం సమకూర్చుతోంది. అయితే ఇందుకు సంబంధించి రుణ ప్రయోజనాలు ఉత్పాదక రంగాలకు బ్యాంకింగ్ అందించాలి.
21.5 శాతంగానే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 1.5 శాతంగా అంచనా. బంగారం దిగుమతులు తగ్గినా... చమురు ధరలు దిగువస్థాయిలో ఉండడం కారణం.
ఆగస్టు 4న మూడవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష.
 
 ప్చ్.. ఇది సరిపోదు
 
పరిశ్రమ వర్గాల అభిప్రాయం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్ల తగ్గింపును  పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. అయితే డిమాండ్ పెరగడానికి, పారిశ్రామిక వృద్ధి మరింత మెరుగుపడటానికి ఇది సరిపోదని వ్యాఖ్యానించాయి. పెట్టుబడుల ప్రక్రియ మళ్లీ మొదలవ్వాలంటే రెపో రేటును మరింత తగ్గించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాయి. కనీసం అరశాతమైనా తగ్గించాల్సిందని ఫిక్కీ ప్రెసిడెంట్ జ్యోత్స్న సూరి పేర్కొన్నారు.

సీఆర్‌ఆర్ కూడా తగ్గించి ఉంటే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయాలు తగ్గేవని, ఆ ప్రయోజనాలను అవి కస్టమర్లకు బదలాయించగలిగి ఉండేవని అసోచాం ప్రెసిడెంట్ రాణా కపూర్ తెలిపారు. రియల్టీకి ఇది సానుకూల పరిణామమే అయినా.. బ్యాం కులు వడ్డీ రేట్లు తగ్గించినప్పుడే అసలు ప్రయోజనాలు కనిపించగలవని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ దక్షిణాసియా విభాగం ఎగ్జిక్యూటివ్ ఎండీ సంజయ్ దత్  చెప్పారు.
 
వాహన కంపెనీలు హ్యాపీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించడాన్ని ఆటోమొబైల్ కంపెనీలు స్వాగతించాయి. ఇది కొనుగోలుదారుల సెంటిమెంటు మెరుగుపడటానికి ఉపయోగపడగలదని మారుతీ సుజుకీ ఈడీ ఆర్‌ఎస్ కల్సి తెలిపారు. అయితే, రేట్ల కోత ప్రయోజనాలను బ్యాంకులు.. కొనుగోలుదారులకు బదలాయించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే దిశగా ఆర్‌బీఐ స్వాగతించతగ్గ నిర్ణయం తీసుకుందని, అమ్మకాలు మెరుగయ్యేందుకు దోహదం చేస్తుందని హ్యుందాయ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ చెప్పారు.
 
ఎస్‌బీఐ సహా 4 బ్యాంకుల రేట్ల ‘కోత’
తాజా ఆర్‌బీఐ నిర్ణయం ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించే దిశలో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తక్షణం నిర్ణయం తీసుకుంది. కనీస రుణ రేటును 0.15 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.7 శాతానికి తగ్గింది. జూన్ 8 నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఆర్‌బీఐ మూడు విడతలుగా 0.75 శాతం రుణ రేటు తగ్గిస్తే- ఇందులో ఎస్‌బీఐ 0.30 శాతాన్ని కస్టమర్లకు బదలాయించింది. 8వ తేదీ నుంచీ వర్తించే విధంగా అలహాబాద్ బ్యాంక్ కూడా 0.30 శాతం కనీస రేటును తగ్గించింది.

దీనితో ఈ రేటు 9.95 శాతానికి తగ్గింది. ఇక  పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్  కూడా 0.25% తన బేస్ రేటును తగ్గించింది. దేనా బ్యాంక్ కూడా పావుశాతం కనీస రేటును తగ్గించింది. దీనితో దేనా బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌ల కనీస రేటు 10 శాతానికి తగ్గింది. పోటీ పూర్వక మార్కెట్ నేపథ్యంలో  ఇదే దారిలో పలు ఇతర బ్యాంకులూ పయనించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఐడీబీఐ బ్యాంక్ బల్క్ డిపాజిట్ రేటును తగ్గించింది. ఇది భవిష్యత్ రుణ రేటు కోతకు సంకేతం.
 
ఆర్థిక వ్యవస్థకు దన్ను...
ఆర్థిక వ్యవస్థ ధోరణికి అనుగుణంగా సానుకూల రీతిలో ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది హర్షణీయ పరిణామం. రికవరీ అవుతున్న ఆర్థిక వ్యవస్థకు రేట్ల కోత తక్షణ అవసరం. ద్రవ్యోల్బణం కట్టడికి తగిన చర్యలు ఉంటాయి.
 - అరవింద్ సుబ్రమణ్యన్, ప్రధాన ఆర్థిక సలహాదారు
 
 
సకాల నిర్ణయం
సకాలంలో తీసుకున్న నిర్ణయం. హర్షణీయం. ఈ ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయిస్తాయని భావిస్తున్నా. మౌలిక రంగంలో ప్రభుత్వం మరిన్ని పెట్టుబడుల ద్వారా సమీప భవిష్యత్తులో వృద్ధి మరింత మెరుగుపడుతుంది.
- అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్
 
అప్రమత్తతను సూచించింది..
ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నెలకొన్న అనిశ్చితులను పాలసీ ప్రకటన వివ రించింది. ఆయా అంశాల పట్ల పాటించాల్సిన అప్రమత్తతను సూచించింది. ప్రత్యేకించి  వర్షాభావ పరిస్థితులు, ద్రవ్యోల్బణం అంచనాలు ప్రస్తావనాంశం.
- చందా కొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement