ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెండు రోజుల కీలక సమావేశం మంగళవారమిక్కడ ప్రారంభమైంది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ప్రారంభమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం కీలక రెపో రేటుపై బుధవారం నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయాన్ని బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించే అవకాశముంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో ప్రస్తుతం ఆరేళ్ల కనిష్టస్థాయి 6%గా ఉంది.
ద్రవ్యోల్బణం (డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.21%) భయాల నేపథ్యంలో రేటును యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో పావుశాతం రెపో రేటు తగ్గింది. అప్పటి నుంచి అదే స్థాయిలో కొనసాగుతోంది. కీలక పాలసీ రేటును యథాతథంగా కొనసాగింపునకు ఆర్‌బీఐ మొగ్గుచూపవచ్చని బ్యాంకర్లు, నిపుణులు భావిస్తున్నారు. రేటు తగ్గింపు అవకాశాలు తక్కువేనని స్వయంగా ప్రధాన ఆర్థిక సలహాదారు కూడా అభిప్రాయపడ్డారు. రెపోతో పాటు రివర్స్ రెపో, సీఆర్‌ఆర్ వంటి కీలక రేట్లను కూడా ఈ ద్రవ్య విధాన కమిటీ సమీక్షిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment