రుణ రేట్ల తగ్గింపులో బ్యాంకులు బిజీబిజీ...
* పీఎన్‌బీ, బీఓబీ, ఐడీబీఐ, ఓబీసీ, పీఎస్‌బీ, యాక్సిస్ బ్యాంక్ కీలక నిర్ణయాలు
* డిపాజిట్ల రేటూ తగ్గించిన ఐడీబీఐ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించే పనిలో బ్యాంకులు నిమగ్నమయ్యాయి. పలు బ్యాంకులు తమ కనీస రుణ రేటు(బేస్)ను తగ్గిస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు మంగళవారమే ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్(పీఎస్‌బీ) సహా ప్రైవేటు రంగంలో మూడవ పెద్ద బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కూడా బుధవారం కనీస రుణ రేటు తగ్గింపు నిర్ణయాలు తీసుకున్నాయి. కనీస రుణ రేటు తగ్గింపు వల్ల దీనికి అనుసంధానమైన గృహ, వాహన, విద్యా రుణాలపై వడ్డీరేట్లు తగ్గే వీలుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను అరశాతం తగ్గించిన నేపథ్యంలో (2015లో మొత్తంగా 1.25 శాతం రెపోరేటు కోత- ప్రస్తుతం 6.75 శాతం) బ్యాంకుల తాజా నిర్ణయాలు వేర్వేరుగా చూస్తే..
పీఎన్‌బీ: ఎస్‌బీఐ తరహాలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 0.4 శాతం బేస్ రేటును తగ్గించింది. దీనితో బ్యాంక్ రేటు 9.60 శాతానికి చేరింది. అక్టోబర్ 1 నుంచీ ఈ మారిన రేటు అమలవుతుంది.
ఐడీబీఐ బ్యాంక్: బేస్‌రేటు 0.25 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.75 శాతానికి తగ్గింది. కాగా ఐడీబీఐ బ్యాంక్ కొన్ని టర్మ్ డిపాజిట్ రేట్లను కూడా పావుశాతం నుంచి అరశాతం వరకూ తగ్గించింది. తాజా రేటు అక్టోబర్ 5 నుంచీ అమల్లోకి వస్తుంది.
బీఓబీ: బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.65 శాతానికి పడింది. అక్టోబర్ 5 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్‌ఆర్)ను కూడా బ్యాంక్ పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 13.90 శాతానికి పడింది.
ఓబీసీ: ఓబీసీ 20 బేసిస్ పాయింట్లు కోసింది. దీనితో ఈ రేటు 9.70 శాతానికి దిగింది. తక్షణం ఈ రేటు అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన తెలిపింది.
పీఎస్‌బీ: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రేటు పావుశాతం తగ్గింది. 9.75 శాతానికి చేరింది. అక్టోబర్ 5 నుంచీ తాజా రేటు అమలవుతుంది.
యాక్సిస్ బ్యాంక్: రుణ రేటును 0.35 శాతం తగ్గించింది. దీనితో బ్యాంక్ రేటు 9.50 శాతానికి దిగింది.
8 పీఎస్‌యూ బ్యాంకులకు కేంద్రం రూ.13,955 కోట్లు
ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓబీ, బీఓఐ, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్‌లకు కేంద్రం తాజా మూలధనంగా రూ.13,955 కోట్లు అందించింది. ఇందుకు ప్రతిగా ఫ్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు ఆయా బ్యాంకులు బీఎస్‌ఈకి తెలిపాయి.