రుణ రికవరీపై దృష్టిపెట్టండి
ముంబై: మొండిబకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో రుణ రికవరీ విధానాలను పటిష్టపరచుకోవాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజాగా సూచించింది. గత కొంతకాలంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులలో రుణాల ఎగవేత ఆందోళనకరంగా పెరుగుతూ వస్తోంది. మొండిబకాయిల నివారణ కోసం ఇటు ఆర్‌బీఐ, అటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలుచర్యలను బ్యాంకులు ఆచరణలో పెట్టడమేకాకుండా ఈ విషయంలో సాధ్యాసాధ్యాల పరిశోధన చేపట్టాలని ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థ పురోగతి, ట్రెండ్ వంటి అంశాలపై 2012-13 ఏడాదికి విడుదల చేసిన నివేదికలో ఆర్‌బీఐ ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. రుణాల మదింపు, మంజూరీ, రుణాల విడుదల తదుపరి పర్యవేక్షణ వంటివి పటిష్టంగా నిర్వహించడం ద్వారా మొండిబకాయిల పెరుగుదలకు చెక్ పెట్టవచ్చునని సలహా ఇచ్చింది.
3.6%కు జంప్
ఇటీవల దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిలు పేరుకుపోతూ వస్తున్నాయి. 2013 మార్చికల్లా వాణిజ్య బ్యాంకుల స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.6%కు చేరగా, గతేడాది 3.1%గా నమోదయ్యాయి. ఇక నికర ఎన్‌పీఏలైతే రుణాలలో 1.3% నుంచి 1.7%కు పెరిగాయి. వె రసి స్థూల ఎన్‌పీఏలు రూ. 1,94,000 కోట్లను తాకగా, వీటిలో ప్రభుత్వ బ్యాంకుల వాటా రూ. 1,65,000 కోట్లకు చేరడం గమనార్హం. ఇక ప్రైవేట్ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు రూ. 21,000 కోట్లుకాగా, విదేశీ బ్యాంకుల విషయంలో రూ. 7,900 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో ఎగవేతదారుల(డిఫాల్టర్ల) నుంచి రుణాల వసూలుకు తగిన న్యాయవ్యవస్థ కూడా ఉండాలంటూ ఆర్‌బీఐ అభిప్రాయపడింది. ఈ బాటలో రుణాల(డెట్) రికవరీ ట్రిబ్యునళ్లు, ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలను(ఏఆర్‌సీలు) మరింత పటిష్టపరచాల్సి ఉన్నదని వ్యాఖ్యానించింది.
ఎస్‌బీఐ టాప్
ప్రభుత్వ దిగ్గజం ఎస్‌బీఐ రుణాల నాణ్యత పడిపోతున్న విషయంలో ముందుంది. 2013 మార్చికల్లా ఎస్‌బీఐ ఎన్‌పీఏలు 5%కు ఎగశాయి. ప్రాధాన్యేతర రంగాల నుంచే రుణాల ఎగవేత ఎక్కువైందని ఆర్‌బీఐ పేర్కొంది. ఫలితంగా బ్యాంకులు రికవరీ వ్యవస్థను మెరుగుపరచుకోవలసి ఉన్నదని సూచించింది. రుణ రికవరీలో ఆస్తుల నాణ్యత, ఉద్యోగ సంబంధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని, నిరుపయోగం ఉన్న ఆస్తులను ప్రయోజనాత్మక విషయాలకు వినియోగించాలని నివేదికలో ఆర్‌బీఐ వివరించింది. భారీ రుణాలకు సంబంధించి బ్యాంకుల మధ్య సమన్వయం ఉండేలా కేంద్ర వ్యవస్థను రూపొందించుకోవాలంది.
కొత్త బ్యాంకులకు చాన్స్
కొత్త బ్యాంకుల ఏర్పాటుకు వీలుగా బ్యాంకింగ్ లెసైన్సింగ్ విధానాలను సరళీకరించడం మంచిదేనని ఆర్‌బీఐ తన వార్షిక నివేదిక-2012-13లో పేర్కొంది. కొత్త బ్యాంకులకు అవకాశాలను అడ్డుకుంటే ఇటు ఆర్థిక వ్యవస్థపైనా, అటు వినియోగదారులపైనా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయపడింది. కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు ఇచ్చేందుకు ఈ ఏడాది జూలైలో ఆర్‌బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.