ఆర్‌బీఐ రేట్లు ఇంతకంటే తగ్గవు..! | RBI's Rajan says retail inflation target band could tighten in 5-10 years | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ రేట్లు ఇంతకంటే తగ్గవు..!

Published Sat, Mar 7 2015 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

ఆర్‌బీఐ రేట్లు ఇంతకంటే తగ్గవు..!

ఆర్‌బీఐ రేట్లు ఇంతకంటే తగ్గవు..!

- వచ్చే మూడేళ్లలో సగటు రెపో రేటు 7.4%
- వృద్ధి-ద్రవ్యోల్బణం అంచనాల ప్రాతిపదికన నోమురా విశ్లేషణ

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ రేటు- రెపో (బ్యాంకులకు స్వల్పకాలికంగా తాను అందించే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5 శాతం) ప్రస్తుతం తగిన స్థాయిలో ఉందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా ఒక డాక్యుమెంట్‌లో పేర్కొంది.

వృద్ధి-ద్రవ్యోల్బణం అంచనాలను అన్నింటినీ ప్రాతిపదికగా తీసుకుని ఈ విశ్లేషణకు వచ్చినట్లు తెలిపింది. వచ్చే మూడేళ్లలో సగటున 7.4% కన్నా తక్కువకు పాలసీ రేటు ఉండే పరిస్థితి లేదని సైతం స్పష్టం చేసింది. ఏ సందర్భంలోనైనా ఒకవేళ పాలసీ రేటును తగ్గించినప్పటికీ, మళ్లీ 7.4%, ఆపైకి పెంచడానికే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషించింది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2017 దాకా ఇక ఆర్‌బీఐ రేట్ల కోత ఉండకపోవచ్చని సైతం అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల అప్‌ట్రెండ్ మళ్లీ నెలకొంటే... పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుందని, ద్రవ్యోల్బణం కట్టడీ కష్టమవుతుందని విశ్లేషించింది.  

ఆర్‌బీఐ గడచిన నెల రోజుల్లో రెండు దఫాలుగా రెపో రేటును పావు శాతం చొప్పున తగ్గించిన నేపథ్యంలో నోమురా ఈ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం, విశ్వసనీయ, అత్యంత నాణ్యతాపూర్వక ద్రవ్య స్థిరత్వ పరిస్థితులు, తగిన స్థాయిలో రూపాయి విలువ వంటి అంశాలు పాలసీ రేటు తగ్గింపునకు కారణమని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. బలహీన వృద్ధి రేటు, అంతర్జాతీయంగా వడ్డీరేట్ల తగ్గింపు ధోరణి వంటివి సైతం వడ్డీ రేటు తగ్గింపునకు దారితీసిన అంశాలుగా రాజన్ తెలిపారు.
 
ఆర్థికవేత్తల అంచనా...: ఇక వడ్డీరేట్లు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించినా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుత స్థాయి ‘బేస్ లైన్’ అని వారు అభిప్రాయపడుతున్నారు. మరి కొంత పాలసీ రేటు కోత ఇకపై ఉండకపోవచ్చనీ అభిప్రాయపడుతున్నారు. ‘అధిక వృద్ధి బాట దిశగా దేశం అడుగులు పడుతున్నాయి. మౌలిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచడం ద్వారా వృద్ధి వేగంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 5-5.5 శాతం మధ్య స్థిరపడవచ్చు. ఇంకా చెప్పాలంటే ద్రవ్యోల్బణం పెరిగేందుకే అవకాశాలే ఉన్నాయి.

ఒకవేళ 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ కట్టడి చేసే పరిస్థితి లేకపోతే... పాలసీ రేటు తగ్గించినా అది దీర్ఘకాలం పాటు కొనసాగే పరిస్థితి ఉండబోదు’ అని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే- ప్రస్తుత స్థాయి కన్నా తక్కువకు వడ్డీరేట్లను తగ్గించే పరిస్థితి ఎంతమాత్రం ఉండదన్నది ఆర్థికవేత్తల విశ్లేషణ.
 
రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మరింత కుదిస్తాం: రాజన్
ముంబై: భవిష్యత్తులో రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మరింత కుదించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఇక పరపతి విధాన రూపకల్పనలో ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ఒక ఒప్పందాన్ని(ఫ్రేమ్‌వర్క్) కుదుర్చుకున్న విషయం విదితమే. దీని ప్రకారం 2016-17 నాటికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4%కి(2% అటూఇటుగా) పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ప్రస్తుతానికి ఈ లక్ష్యం సరైనదేనని.. అయితే, వచ్చే 5-10 ఏళ్లలో దీనిలో సగానికి రిటైల్ ద్రవ్యోల్బణం దిగొచ్చేలా చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. తాజా రేట్ల కోత అనంతరం విశ్లేషకులు అడిగిన ప్రశ్నకు రాజన్ ఈ విధంగా సమాధానమిచ్చారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, బడ్జెట్‌లో ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉంటామన్న హామీల నేపథ్యంలో పాలసీ వడ్డీరేటు(రెపో)ను రాజన్ అకస్మాత్తుగా మరో పావు శాతం తగ్గించడం తెలిసిందే. రెండు నెలల వ్యవధిలోపే ఇది రెండో తగ్గింపు(మొత్తం అర శాతం). దీంతో రెపో రేటు 7.5%కి తగ్గింది. దీంతో బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లు తగ్గించాలన్న ఒత్తిడి పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement