RBI rates
-
ఆర్బీఐ కీలక నిర్ణయం, ఆశ్చర్యపోయిన నిర్మలా సీతారామన్!
ముంబై: పాలసీ రేట్లను పెంచాలన్న ఆర్బీఐ నిర్ణయం కన్నా..అందుకోసం ఎంచుకున్న సమయమే ఆశ్చర్యపర్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వడ్డీ రేట్ల పెంపు వల్ల నిధుల సమీకరణ వ్యయాలు పెరిగినా.. ప్రభుత్వం తలపెట్టిన ఇన్ఫ్రా పెట్టుబడుల ప్రణాళికలపై ఎటువంటి ప్రభావం ఉండబోదని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత తొలిసారిగా స్పందించిన మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘ఆర్బీఐ రేట్లను పెంచుతుంది అన్నది అందరూ ఊహిస్తున్నదే. కాకపోతే అందుకోసం ఎంచుకున్న సమయమే ఆశ్చర్యపర్చింది. రెండు ఎంపీసీ (ద్రవ్య పరపతి విధాన కమిటీ) సమావేశాలకు మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యపర్చింది‘ అని ఆమె తెలిపారు. రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ గత ఎంపీసీ సమావేశంలోనే సంకేతాలు ఇచ్చిందని, అంతర్జాతీయంగా ఇతర ప్రధాన సెంట్రల్ బ్యాంకుల తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా భాగమని మంత్రి వివరించారు. ‘ఇటీవలి కాలంలో సెంట్రల్ బ్యాంకుల మధ్య అవగాహన మరింతగా పెరిగింది. ఒక రకంగా అవన్నీ ఒకదానితో మరొకటి కలిసికట్టుగా పని చేస్తున్నాయి. ఆస్ట్రేలియా వడ్డీ రేట్లు పెంచింది. ఆర్బీఐ పెంచిన రోజు రాత్రే అమెరికా కూడా పెంచింది. అయితే, మహమ్మారి ప్రభావం నుంచి కోలుకునే ప్రక్రియను ఎలా నిర్వహించాలన్న అంశం అర్థం కావడం లేదు. ఈ సమస్య కేవలం భారత్‌కు మాత్రమే ప్రత్యేకం కాదు. అంతర్జాతీయంగా అన్ని చోట్లా ఇలాగే ఉంది‘ అని ఆమె చెప్పారు. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ తొలిసారిగా ఈ ఏడాది మే 4న పాలసీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని 50 బేసిస్ పాయింట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే. దీనితో రెపో రేటు (బ్యాంకులకు తాను ఇచ్చే నిధులపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటు) 4.40 శాతానికి చేరింది. -
యథాతథంగా ఆర్బీఐ రేట్లు!
న్యూఢిల్లీ: ముడిచమురు రేట్లు, కనీస మద్దతు ధరల పెంపు వంటి అంశాలతో ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశం ఉన్నప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఈ దఫా పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతానికి యథాతథ స్థితే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సారథ్యంలో పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల పాటు ఈ సమీక్ష జరగనుంది. ఆగస్టు 1న కీలకపాలసీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ధరల పెరుగుదల భయాల నేపథ్యంలో జూన్‌లో ఆర్బీఐ రేటును 0.25% పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది 6.25%. రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ ప్రధానంగా పరిగణనలోకి తీసుకునే రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ఏకంగా 5 నెలల గరిష్టమైన 5 శాతానికి ఎగిసింది. ఇంధన ధరలు ఎగియడమే ఇందుకు కారణం. ప్రస్తుతం క్రూడాయిల్ రేట్లు మూడేళ్ల గరిష్ట స్థాయి నుంచి కిందికి దిగి వచ్చినప్పటికీ.. ద్రవ్యోల్బణం, కరెంటు అకౌంటు లోటు పెరగొచ్చన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు శాతం అటూ, ఇటూగా ద్రవ్యోల్బణం 4% స్థాయికి పరిమితమయ్యేలా చూడటంపై రిజర్వ్ బ్యాంక్ ప్రధానంగా దృష్టి పెట్టడం తెలిసిందే. ఎస్బీఐ, ఎడెల్వీస్ అంచనాలివి.. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లను పెంచడం కన్నా యథాతథ స్థితి కొనసాగించడమే శ్రేయస్కరం కాగలదని భావిస్తున్నట్లు ఎస్బీఐ అధ్యయన నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణ రిస్కులు పెరగడం, తగ్గడానికి సమాన అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించింది. మరీ తప్పకపోతే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచిందంటే .. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేలా మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోవాలన్న అభిప్రాయం ఒక్కటే కారణం కాగలదని ఎస్బీఐ పేర్కొంది. మరోవైపు, రాబోయే పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా తటస్థ వైఖరి అవలంబించే అవకాశం ఉందని ఎడెల్వీస్ సెక్యూరిటీస్ మరో నివేదికలో అభిప్రాయపడింది. అటు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా ఆర్బీఐ యథాతథ స్థితే కొనసాగించవచ్చని తెలిపింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మరిన్ని దఫాలు వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు గణనీయంగా ఉన్నాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం డీబీఎస్ పేర్కొంది. -
బ్యాంకుల ‘వడ్డింపు’ ప్రారంభం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను పావుశాతం పెంచడం (6.25 శాతానికి)తో, వాణిజ్య బ్యాంకులు తక్షణం ఈ భారాన్ని వినియోగదారులకు బదలాయించడం ప్రారంభించాయి. దీంతో ఆటో, గృహ, వ్యాపార రుణాలకు సంబంధించి కస్టమర్లపై ఈఎంఐ భారం ప్రారంభమయినట్లయ్యింది. ఇందుకు సంబంధించిన పరిణామాలను గమనిస్తే... ► నాలుగున్నరేళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఆర్బీఐ రెపో రేటును బుధవారం పావుశాతం పెంచిన విషయం విదితమే. రేటు పెంపును ముందే అంచనావేసిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ప్రైవేటు రంగంలో అతిపెద్ద రెండు బ్యాంకులు– ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా పలు బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ (నిధుల సమీకరణకు సంబంధించి వ్యయాలు) ఆధారిత రుణ రేటును అప్పటికే కొంత పెంచేశాయి. ►ఈ పెద్ద బ్యాంకులకు తాజాగా ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌లు తోడయ్యాయి. వివిధ మెచ్యూరిటీలపై ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచినట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపాయి. ►ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ మూడు నెలల నుంచి ఐదేళ్ల కాలానికి సంబంధించిన రుణ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ►కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా 6 నెలలు, ఏడాది కాల వ్యవధి రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ► త్వరలో రుణరేటు పెంపు దిశలో నిర్ణయం తీసుకోనున్నట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పేర్కొంది. ► కాగా తక్షణం బ్యాంకింగ్ వడ్డీరేట్ల పెంపు భారీగా ఏమీ ఉండకపోవచ్చని ఎస్బీఐ చైర్మన్ రజ్నీష్ కుమార్ పేర్కొన్నారు. ఎఫ్‌ఏఎల్‌ఎల్‌సీఆర్ (ఫెసిలిటీ టూ అవీల్ లిక్విడిటీ ఫర్ లిక్విడిటీ కవరేజ్ రేషియో)లో పెంపు వల్ల బ్యాంకుల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండడమే దీనికి కారణమన్నారు. -
వచ్చే జనవరి నుంచి ఆర్బీఐ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2019 జనవరి–మార్చి) నుంచి ఆర్బీఐ కీలక రేట్లను పెంచడం మొదలు కావచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల కంపెనీ మోర్గాన్‌స్టాన్లీ అంచనా వేసింది. ఆర్థిక రికవరీ అప్పటి నుంచి నిలకడగా ఉండడంతోపాటు ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత లక్ష్య స్థాయి నుంచి మరీ పెరిగే అవకాశాల్లేకపోవడం రేట్ల పెంపునకు సానుకూలతలుగా పేర్కొంది. ఈఏడాది చివరికి ప్రైవేటు మూలధన వ్యయాలు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మరింత స్పష్టత, స్థిరమైన ఆర్థిక రికవరీ దన్నుగా ఆర్బీఐ స్వల్ప మొత్తంలో రేట్ల పెంపు చేపట్టొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ తొలి పాలసీ సమీక్ష గత వారం ముగియగా, కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు డాయిష్ బ్యాంకు కూడా ఇదే అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ‘‘75 బేసిస్ పాయింట్ల మేర రేట్ల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నాం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది కాకుండా రేట్ల పుంపు వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం కావచ్చు’’ అని పేర్కొంది. -
ఆర్బీఐ రేట్ల నిర్ణయం నేడు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెండు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభమైంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ గురువారం ప్రధాన పాలసీ విధానాన్ని ప్రకటించనుంది. 2018–19లో ఆర్బీఐ మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఇది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6 శాతం) ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తీవ్రత, దేశంలో పెట్రో ధరల పెంపు, వర్షపాతం, పంట దిగుబడులపై అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు వారు కారణంగా చూపుతున్నారు. ఆగస్టు తర్వాత ఇప్పటివరకూ రెపోను ఆర్బీఐ తగ్గించలేదు. -
పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులు
ట్రేడింగ్ మూడు రోజులే ♦ హోలీ, గుడ్‌ఫ్రైడే సందర్భంగా ♦ గురు, శుక్రవారాలు సెలవు ♦ అంతర్జాతీయ సంకేతాలే కీలకం ♦ ఆర్బీఐ రేట్ల కోత అంచనాల ప్రభావమూ ఉండొచ్చు ♦ ఈ వారం స్టాక్ మార్కెట్‌పై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఈ వారం ఒకింత ఒడిదుడుకులమయంగా సాగుతుందని విశ్లేషకులంటున్నారు. దేశీయంగా ఎలాంటి ప్రధాన సంఘటనలు లేనందున అంతర్జాతీయ సంకేతాలు, డాలర్‌తో రూపాయి కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపైననే ఈ వారం స్టాక్ మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ నెల 24(గురువారం -హోలీ), 25 (శుక్రవారం- గుడ్‌ఫ్రైడే) సెలవుల కారణంగా ఈ వారంలో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితం కానున్నది. రెండు రోజుల సెలవుల కారణంగా ట్రేడింగ్ నిస్తేజంగా ఉండొచ్చని, మూడు రోజుల పాటే ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. వచ్చేవారమే మార్చి నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నందున ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ఓవర్ చేసుకోవడం ప్రారంభిస్తారని, దాంతో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, ముడి చమురు ధరల కదలికలు తదితర అంశాలపై ఈ వారం మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా పేర్కొన్నారు. ఆర్బీఐ రేట్ల కోత అంచనాలు మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని జియోజిత్ బీఎన్పీ పారిబా హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, అమెరికా, ప్రస్తుత ఇళ్ల అమ్మకాల గణాంకాలను సోమవారం నాడు, కొత్త ఇళ్ల అమ్మకాల గణాంకాలను బుధవారం నాడు వెల్లడించనున్నది. శుక్రవారం నాడు క్యూ4 జీడీపీ గణాంకాలను విడుదల చేస్తుంది. యూరోజోన్ మార్కిట్ పీఎంఐ కాంపొజిట్ ఇండెక్స్ గణాంకాలు గురువారం వస్తాయి. కాగా గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 24,953 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 7,604 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ మార్కెట్ వరుసగా మూడో వారమూ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ రెండు నెలల గరిష్ట స్థాయికి చేరింది. సెన్సెక్స్ 25 వేల పాయింట్లకు చేరువ కాగా, నిఫ్టీ కీలకమైన 7,600 పాయింట్ల పైన ముగిసింది. క్యూ4 ఫలితాలు కీలకం..: సమీప భవిష్యత్తులో కంపెనీల క్యూ4 ఫలితాలే మార్కెట్‌కు కీలకం కానున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. వచ్చే నెల రెండో వారం నుంచి కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడించడం ప్రారంభిస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో స్టాక్మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. ఆర్బీఐ పాలసీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్లు రికవరీ కావడం వంటి కారణాల వల్ల ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెల 18 వరకూ రూ.11,166 కోట్లు పెట్టుబడులు పెట్టారు. డెట్ మార్కెట్ నుంచి రూ.1,027 కోట్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరశి నికర పెట్టుబడులు రూ.10,140 కోట్లు. ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్ల నుంచి జనవరిలో రూ.11,126 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,521 కోట్ల చొప్పున ఉపసంహరించుకున్నారు. -
జీఎస్టీ బిల్లు, రేట్ల కోత అంచనాలతో..
ఈ వారం మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ విశ్లేషకుల అంచనా ముంబై: ఆర్థిక సంస్కరణలు జరగవచ్చన్న అంచనాలు, ఆర్బీఐ రేట్లు తగ్గిస్తుందన్న ఆశలతో ఈ వారం స్టాక్ మార్కెట్ పెరగవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీఎస్టీ బిల్లును ఆమోదింపచేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని ఇన్వెస్టర్లు హర్షిస్తున్నారని, గడువు తేదీకల్లా జీఎస్టీని అమలు చేయవచ్చన్న అంచనాలు మార్కెట్లో పెరిగాయని జైఫిన్ అడ్వయిజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నావ్గి చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభల్ని సంయుక్తంగా సమావేశపర్చి ప్రభుత్వం బిల్లుకు ఆమోదముద్ర వేయిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇది జరిగితే మార్కెట్‌కు మంచి సంకేతమేనని అన్నారు. బ్యాంకింగ్ షేర్లపై ఫోకస్ గతవారం విడుదలైన ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో రిజర్వుబ్యాంక్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గింవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. టోకు ద్రవ్యోల్బణం మైనస్ 4.05 స్థాయికి తగ్గగా, రిటైల్ ద్రవ్యోల్బణం 3.78 శాతానికి పడిపోయింది. ఇవి రెండూ రికార్డు కనిష్టస్థాయిలే. పారిశ్రామికోత్పత్తి వృద్ధి 3.8 శాతానికి మెరుగుపడింది. ఒకవైపు ద్రవ్యోల్బణం తగ్గడం, మరోవైపు ఉత్పత్తి పెరగడంతో మార్కెట్లో రేట్ల కోత ఆశలు ఎగిసాయని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. దీంతో ఈ వారం బ్యాం కింగ్ షేర్లు పెరగవచ్చని ఆయన అంచనావేశారు. పీఎస్‌యూ బ్యాంకులకు తాజా మూలధనాన్ని అందించడంతో పాటు బ్యాంకింగ్ సంస్కరణలకు కేంద్రం తెరతీయడంతో వీటిపై ఇన్వెస్టర్ల ఫోకస్ వుంటుందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా చెప్పారు. కరెన్సీ కదలికల ప్రభావం... ఇదే సమయంలో కమోడిటీ ధరలు, రూపాయి, చైనా కరెన్సీ యువాన్ల కదలికలు భారత్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. గతవారం చైనా తన కరెన్సీని ఆశ్చర్యకరంగా డీవాల్యూ చేయడంతో ఆసియా అంతటా కరెన్సీ యుద్ధం జరుగుతుందన్న భయాలు నెలకొన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాల నేపథ్యంలోనే యువాన్ డీవాల్యూయేషన్ జరగడం ఇన్వెస్టర్ల ఆందోళనల్ని పెంచింది. దీంతో విదేశీ ఫండ్స్ భారత్ మార్కెట్లో అమ్మకాలు జరి పాయి. కానీ వారాంతంలో రూపాయి, యువాన్లు స్థిరపడటం ఊరటనిచ్చిందని హెమ్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ వినీత్ మహ్నోట్ అన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు ఆగస్టు నెల తొలి పక్షం రోజుల్లో భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 800 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. వాస్తవంగా తొలివారంలో ఎఫ్‌పీఐలు రూ. 2,200 కోట్ల నికర పెట్టుబడులు చేసినా, రెండోవారంలో రూ. 3,000 కోట్ల మేర వెనక్కు తీసుకోవడంతో ఆగస్టు 1-14 తేదీల మధ్య రూ. 800 కోట్ల నికర అమ్మకాలు జరిపినట్లయ్యింది. -
ఆర్బీఐ రేట్లు ఇంతకంటే తగ్గవు..!
- వచ్చే మూడేళ్లలో సగటు రెపో రేటు 7.4% - వృద్ధి-ద్రవ్యోల్బణం అంచనాల ప్రాతిపదికన నోమురా విశ్లేషణ ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రేటు- రెపో (బ్యాంకులకు స్వల్పకాలికంగా తాను అందించే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5 శాతం) ప్రస్తుతం తగిన స్థాయిలో ఉందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా ఒక డాక్యుమెంట్లో పేర్కొంది. వృద్ధి-ద్రవ్యోల్బణం అంచనాలను అన్నింటినీ ప్రాతిపదికగా తీసుకుని ఈ విశ్లేషణకు వచ్చినట్లు తెలిపింది. వచ్చే మూడేళ్లలో సగటున 7.4% కన్నా తక్కువకు పాలసీ రేటు ఉండే పరిస్థితి లేదని సైతం స్పష్టం చేసింది. ఏ సందర్భంలోనైనా ఒకవేళ పాలసీ రేటును తగ్గించినప్పటికీ, మళ్లీ 7.4%, ఆపైకి పెంచడానికే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషించింది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2017 దాకా ఇక ఆర్బీఐ రేట్ల కోత ఉండకపోవచ్చని సైతం అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల అప్‌ట్రెండ్ మళ్లీ నెలకొంటే... పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుందని, ద్రవ్యోల్బణం కట్టడీ కష్టమవుతుందని విశ్లేషించింది. ఆర్బీఐ గడచిన నెల రోజుల్లో రెండు దఫాలుగా రెపో రేటును పావు శాతం చొప్పున తగ్గించిన నేపథ్యంలో నోమురా ఈ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం, విశ్వసనీయ, అత్యంత నాణ్యతాపూర్వక ద్రవ్య స్థిరత్వ పరిస్థితులు, తగిన స్థాయిలో రూపాయి విలువ వంటి అంశాలు పాలసీ రేటు తగ్గింపునకు కారణమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. బలహీన వృద్ధి రేటు, అంతర్జాతీయంగా వడ్డీరేట్ల తగ్గింపు ధోరణి వంటివి సైతం వడ్డీ రేటు తగ్గింపునకు దారితీసిన అంశాలుగా రాజన్ తెలిపారు. ఆర్థికవేత్తల అంచనా...: ఇక వడ్డీరేట్లు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించినా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుత స్థాయి ‘బేస్ లైన్’ అని వారు అభిప్రాయపడుతున్నారు. మరి కొంత పాలసీ రేటు కోత ఇకపై ఉండకపోవచ్చనీ అభిప్రాయపడుతున్నారు. ‘అధిక వృద్ధి బాట దిశగా దేశం అడుగులు పడుతున్నాయి. మౌలిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచడం ద్వారా వృద్ధి వేగంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 5-5.5 శాతం మధ్య స్థిరపడవచ్చు. ఇంకా చెప్పాలంటే ద్రవ్యోల్బణం పెరిగేందుకే అవకాశాలే ఉన్నాయి. ఒకవేళ 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ కట్టడి చేసే పరిస్థితి లేకపోతే... పాలసీ రేటు తగ్గించినా అది దీర్ఘకాలం పాటు కొనసాగే పరిస్థితి ఉండబోదు’ అని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే- ప్రస్తుత స్థాయి కన్నా తక్కువకు వడ్డీరేట్లను తగ్గించే పరిస్థితి ఎంతమాత్రం ఉండదన్నది ఆర్థికవేత్తల విశ్లేషణ. రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మరింత కుదిస్తాం: రాజన్ ముంబై: భవిష్యత్తులో రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మరింత కుదించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఇక పరపతి విధాన రూపకల్పనలో ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఒక ఒప్పందాన్ని(ఫ్రేమ్‌వర్క్) కుదుర్చుకున్న విషయం విదితమే. దీని ప్రకారం 2016-17 నాటికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4%కి(2% అటూఇటుగా) పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రస్తుతానికి ఈ లక్ష్యం సరైనదేనని.. అయితే, వచ్చే 5-10 ఏళ్లలో దీనిలో సగానికి రిటైల్ ద్రవ్యోల్బణం దిగొచ్చేలా చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. తాజా రేట్ల కోత అనంతరం విశ్లేషకులు అడిగిన ప్రశ్నకు రాజన్ ఈ విధంగా సమాధానమిచ్చారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, బడ్జెట్లో ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉంటామన్న హామీల నేపథ్యంలో పాలసీ వడ్డీరేటు(రెపో)ను రాజన్ అకస్మాత్తుగా మరో పావు శాతం తగ్గించడం తెలిసిందే. రెండు నెలల వ్యవధిలోపే ఇది రెండో తగ్గింపు(మొత్తం అర శాతం). దీంతో రెపో రేటు 7.5%కి తగ్గింది. దీంతో బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లు తగ్గించాలన్న ఒత్తిడి పెరుగుతోంది.