పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులు | Sensex closes at over 2-month high, Nifty above 7600 | Sakshi
Sakshi News home page

పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులు

Published Mon, Mar 21 2016 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులు

పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులు

ట్రేడింగ్ మూడు రోజులే
హోలీ, గుడ్‌ఫ్రైడే సందర్భంగా
గురు, శుక్రవారాలు సెలవు
అంతర్జాతీయ సంకేతాలే కీలకం
ఆర్‌బీఐ రేట్ల కోత అంచనాల ప్రభావమూ ఉండొచ్చు
ఈ వారం స్టాక్ మార్కెట్‌పై నిపుణుల విశ్లేషణ

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఈ వారం ఒకింత ఒడిదుడుకులమయంగా సాగుతుందని విశ్లేషకులంటున్నారు. దేశీయంగా ఎలాంటి ప్రధాన సంఘటనలు లేనందున అంతర్జాతీయ సంకేతాలు, డాలర్‌తో రూపాయి కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపైననే ఈ వారం స్టాక్ మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని వారు భావిస్తున్నారు.  ఈ నెల 24(గురువారం -హోలీ),  25 (శుక్రవారం- గుడ్‌ఫ్రైడే) సెలవుల కారణంగా ఈ వారంలో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితం కానున్నది. రెండు రోజుల సెలవుల కారణంగా  ట్రేడింగ్ నిస్తేజంగా ఉండొచ్చని, మూడు రోజుల పాటే ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు.

వచ్చేవారమే మార్చి నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నందున ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్‌ఓవర్ చేసుకోవడం ప్రారంభిస్తారని, దాంతో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, ముడి చమురు ధరల కదలికలు తదితర అంశాలపై ఈ వారం మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా పేర్కొన్నారు. ఆర్‌బీఐ రేట్ల కోత అంచనాలు మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే,  అమెరికా, ప్రస్తుత ఇళ్ల అమ్మకాల గణాంకాలను సోమవారం నాడు, కొత్త ఇళ్ల అమ్మకాల గణాంకాలను బుధవారం నాడు వెల్లడించనున్నది. శుక్రవారం నాడు క్యూ4 జీడీపీ గణాంకాలను విడుదల చేస్తుంది.  యూరోజోన్ మార్కిట్ పీఎంఐ కాంపొజిట్ ఇండెక్స్ గణాంకాలు గురువారం వస్తాయి.

కాగా గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 24,953 పాయింట్ల వద్ద,  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 7,604 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ మార్కెట్ వరుసగా మూడో వారమూ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ రెండు నెలల గరిష్ట స్థాయికి చేరింది. సెన్సెక్స్ 25 వేల పాయింట్లకు చేరువ కాగా, నిఫ్టీ కీలకమైన 7,600 పాయింట్ల పైన ముగిసింది.

క్యూ4 ఫలితాలు కీలకం..: సమీప భవిష్యత్తులో కంపెనీల క్యూ4 ఫలితాలే మార్కెట్‌కు కీలకం కానున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.  వచ్చే నెల రెండో వారం నుంచి కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడించడం ప్రారంభిస్తాయి.

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో స్టాక్‌మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. ఆర్‌బీఐ పాలసీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్లు రికవరీ కావడం వంటి కారణాల వల్ల  ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు.   విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెల 18 వరకూ రూ.11,166 కోట్లు పెట్టుబడులు పెట్టారు. డెట్ మార్కెట్ నుంచి రూ.1,027 కోట్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరశి నికర పెట్టుబడులు రూ.10,140 కోట్లు. ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్ల నుంచి జనవరిలో రూ.11,126 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,521 కోట్ల చొప్పున ఉపసంహరించుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement